Authorization
Mon Jan 19, 2015 06:51 pm
(చైనా కమ్యూనిస్టు పార్టీ జూలై 6, 2021న ''ప్రజా సంక్షేమం: రాజకీయ పార్టీల బాధ్యత'' అనే అంశంపై ప్రపంచ రాజ కీయ పార్టీల సమావేశం ఆన్లైన్లో నిర్వహించింది. 160 దేశాల నుంచి దాదాపు 500 రాజకీయ పార్టీలు, సంస్థలు, సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి సమావేశాన్ని ప్రారంభిస్తూ ప్రసంగించారు. భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఈ సమావేశంలో చేసిన ప్రసంగ పాఠం ఇది)
కామ్రేడ్ జి జిన్‌పింగ్, ప్రధాన కార్యదర్శి, చైనా కమ్యూనిస్టు పార్టీ, చైనా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం, ప్రపంచ రాజకీయ పార్టీల ప్రతినిధులందరికీ శుభాకాంక్షలు.
చైనా కమ్యూనిస్టు పార్టీ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ సమావేశం ఏర్పా టైంది. ఈ చారిత్రక సందర్భంలో సీపీఐ(ఎం) మరోసారి చైనా కమ్యూనిస్టు పార్టీకి హార్ధికాభినందనలు తెలియచేస్తోంది. చైనాకు శతయంతి శుభాకాంక్షలు తెలియచేస్తూ ప్రధాన కార్యదర్శి జీ జిన్‌పింగ్‌కు ప్రత్యేక సందేశం కూడా పంపించాం.
ఒక మోస్తరు సర్వతోముఖ అభివృద్ధి చెందిన దేశంగా చైనాను తీర్చిదిద్దాలన్న లక్ష్యాన్ని చేరుకున్నందుకు భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) హర్షం వ్యక్తం చేస్తోంది. శాంతియుత జీవనం కోసం రెండున్నర వేల సంవత్సరా లకుపైగా చైనా ప్రజలు ఎదరుచూస్తున్న లక్ష్యాన్ని చైనా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో సాధించటం అభినందనీయం.
1978లో చైనా కమ్యూనిస్టు పార్టీ నిర్ణయానంతరం నాలుగు దశాబ్దాలకుపైగా దేశంలో అమలు జరుగుతున్న సంస్కరణలు అనూహ్య ఫలితాలను సాధిచాయి. 20వ శతాబ్దంలో జర్మనీ, జపాన్, దక్షిణ కొరియా వంటి పెట్టుబడిదారీ దేశాలు సాధించిన అద్భుతాల కంటే ఎన్నో రెట్లు మెరుగైన విజయాలను చైనా కమ్యూనిస్టు పార్టీ సాధించింది. జనచైనా ప్రపంచ ఆర్థిక అగ్రరాజ్యంగా ఎదిగేందుకు దగ్గర్లో ఉంది.
ఈ కాలంలో చైనా సాధించిన విజయాల్లో ముఖ్యమైనది 77 కోట్లమంది ప్రజలను పేదరికం నుంచి బయటకు తీసుకురావటం. 2010 నాటికి ఉన్న స్థూల జాతీయోత్పత్తిని 2020 నాటికి రెట్టింపు చేయాలన్న లక్ష్యాన్ని కూడా అధిగమించింది.
కోవిడ్ మహమ్మారిని నియంత్రించటంలోనూ, తగిన రక్షణల మధ్య ఆర్థిక, సామాజిక జీవన స్రవంతిని పున: ప్రారంభించి, ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించటంలో జనచైనా ప్రదర్శించిన పరిణతి, సామర్థ్యం ప్రపంచానికే ఓ పాఠం లాంటిది. పెట్టుబడిదారీ వ్యవస్థ కంటే సోషలిజం ఎన్నో రెట్లు మెరుగైనదన్న వాస్తవాన్ని మరో సారి ఈ పరిణామం రుజువు చేసింది. 1978లో ఆర్థిక సంస్కరణలు ప్రారంభించిన నాటి నుంచీ సగటు సాలుసరి వృద్ధి రేటు 9.2గా ఉంది. కోవిడ్ కాలంలో కూడా చైనా ఈ వృద్ధి రేటును సాధించింది.
ఈ సమావేశంలో చర్చకు ఎంపిక చేసిన అంశం ''ప్రజా సంక్షేమం- రాజకీయ పార్టీల బాధ్యత'' సమకాలీన ప్రాధాన్యత కలిగిన అంశం. విలువైనది. ఈ లక్ష్యాన్ని సాధించాలంటే సమకాలీన ప్రపంచంలోని చేదు నిజాలను ముందు గమనించాలి. కోవిడ్ అనంతర ప్రపంచంలో అమెరికా తన ఆధిపత్యాన్ని నిలుపుకోవటానికి సాగిస్తున్న ప్రయత్నాల పట్ల అమ్రత్తంగా ఉండాలి.
యావత్ మానవాళి పంచుకోవాల్సిన విలువలైన శాంతి, అభివృద్ధి, పారదర్శకత, ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ వంటి విలువల విషయంలో ఎవ్వరికీ భిన్నాభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదు. ఈ విలువలను, ఉమ్మడి లక్ష్యాలను సాకారం చేసుకోవాలంటే సమకాలీన సార్వత్రిక భద్రత, పర్యావరణ పరిరక్షణ, శాంతి, ఉమ్మడి అభివృద్ధి, అంతర్జాతీయ సంబంధాల్లో బహుళత్వం వంటివి ఆచరణసాధ్యం చేసుకోవాలి. దీనికి గాను రాజకీయ నిబద్ధత, బలం ఉండాలి.
పై లక్ష్యాలు సాధించుకోవాలంటే ప్రభుత్వాలు అనుసరించే విధానాలు, సంస్కరణలకు ప్రజా ప్రయోజనాలే కేంద్రంగా ఉండాలి. కానీ నేడు ప్రపంచవ్యాప్తంగా అమలు జరుగుతున్న సంస్కరణలకు లాభాలే పరమార్థంగా ఉన్నాయి. వర్గదోపిడీ కేంద్రంగా ఈ సంస్కరణలు అమలు జరుగుతున్నాయి. కోవిడ్‌తో పాటు తెరమీదకు వచ్చిన లాక్డౌన్లు, నిర్బంధాల సమయంలో కోట్లాదిమంది ప్రజలు ఆకలి దప్పులతో అలమటిస్తుంటే అమెరికాలోని 16మంది శతకోటీశ్వరుల సంపద 2020 మార్చి నాటికంటే 2021 మార్చి నాటికి రెట్టింపైంది. 2008 ప్రపంచ ద్రవ్య సంక్షోభం తర్వాత కూడా మూడేండ్లల్లో శతకోటీశ్వరులందరూ తమ సంపదను తిరిగి పొందారు. 2018 నాటికి వాళ్ల సంపద రెట్టింపైంది. కానీ ప్రపంచవ్యాప్తంగా 80శాతం ప్రజల దినసరి ఆదాయాలు మాత్రం 2008 నాటికి ఆదాయాల స్థాయికి చేరుకోలేదు.
ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది ప్రజలు తమ రోజువారీ అవసరాల కోసం, తమ హక్కులు కాపాడుకోవటం కోసం, ప్రజాతంత్ర వ్యవస్థలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా, పౌరహక్కుల కోసం పోరాడుతున్నారు. భారతదేశంలో మేము జాతీయ సంపదను కొద్దిమంది ప్రయివేటు పెట్టుబడిదారులకు ఊడ్చిపెట్టే ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సంక్లిష్ట పోరాటం సాగిస్తున్నాం. భారతీయ వ్యవసాయరంగాన్ని అంతర్జాతీయ బహుళజాతి సంస్థలు కబ్జా చేయకుండా ఉండేందుకు పోరాడుతున్నాం. కార్మికవర్గం, శ్రామిక ప్రజానీకపు హక్కుల కోసం పోరాడుతున్నాం.
మెరుగైన ప్రపంచాన్ని కాంక్షిస్తూనే, ప్రపంచ వ్యాప్తంగా మెరుగైన ఆరోగ్యం, మెరుగైన విద్య, మెరుగైన జీవితం, పోషకాహారం అందించాలన్న లక్ష్యాన్ని స్వాగతిస్తూనే భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ప్రపంచ వ్యాప్తంగా గౌరవంగా జీవించే హక్కును, జీవనోపాధి అవకాశాలను కాపాడుకునేందుకు అహర్నిశలు పోరాడుతున్న కోట్లాదిమంది శ్రామికవర్గం పట్ల సంఘీభావం వ్యక్తం చేస్తుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నిర్వాహకులకు ధన్యవాదులు తెలిచేస్తున్నాను.