Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆయన చాలా సేపటి నుండి హాలులో అటూ ఇటూ తిరుగుతున్నారు. కాసేపు ఆగి, ఆలోచించి మళ్ళీ ముందుకు కదులుతున్నారు. మధ్య మధ్యలో అద్దం ముందుకు కూడా వెళుతున్నారు. ఇటీవల పెంచిన తెల్లటి గడ్డాన్ని చేతో దువ్వుకుంటున్నారు. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గడ్డానికి తన గడ్డానికి పొడువులో తప్ప మరే తేడా లేదని అద్దం చూస్తూ అనుకుంటున్నారు! మరి కొద్ది కాలం ఆగితే ఆ తేడా కూడా పోతుందని తనకు తానే సమాధానం చెప్పుకుంటున్నారు. అంతా తాను అనుకుంటున్నట్టే జరుగుతున్న తరుణంలో ఈ అడ్డం వచ్చిందేమిటా అని ఆయన మధన పడుతున్నారు!
''రాజద్రోహం కేసు పెట్టకూడదా? ఎంత మాట! ఎంత మాట! అసలు ఆ మాట ఎలా అనగలిగారు? తమ ప్రభుత్వం రెండవసారి మంచి మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. అంటే ప్రజలు తమ ప్రభుత్వానికి పూర్తి అధికారాలు ఇచ్చారు! ఎలాంటి చట్టాలైనా చేయవచ్చు! పాత వాటిని రద్దు కూడా చేయవచ్చు! మరి రాజద్రోహం చట్టం తాము చేసింది కూడా కాదు! ఎప్పుడో 1850లలో చేసిన చట్టాన్ని తాము అమలు చేస్తున్నాము కదా! ఇందులో కొత్తేముంది?'' అని తెల్లగడ్డం నిమురు కుంటూ తనిని తాను ప్రశ్నించుకుంటున్నాడు.
''ఊహుు తెల్లవాడు ఎంతో తెలివైనవాడు! భావి తరాలకు కూడా ఉపయోగపడుతుందని, ముందు చూపుతో ఈ చట్టాన్ని తయారుచేశాడు. దాన్నే ఇప్పుడు వాడుకుంటున్నాము! పైగా కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా రాజద్రోహం కేసులు పెట్టారు కదా! అప్పుడు లేని తప్పు ఇప్పుడెలా వచ్చింది? అని ఆలోచించాడు.
''కాదు! తప్పుకానేకాదు! రాజద్రోహం చట్టం ఉంటేనే కదా తనను తన ప్రభుత్వాన్ని విమర్శించే వారిని నోరుమూయించి, బొక్కలో తోయవచ్చు. ఇలాంటి చట్టం ఉన్నందునే చాలామంది భయపడి నోరు మూసుకుంటున్నారు! లేకపోతే ఇంకేమైనా ఉందా! పత్రికలు, మీడియా, విమర్శకులు రోజూ తమ మీద దండయాత్ర చేయరా? అందువల్ల తమలాంటి ప్రభుత్వాలకు ఇలాంటి చట్టాలు ఉండటం ఎంతో అవసరం'' అనుకున్నాడు తనని తాను అద్దంలో చూసుకుంటూ!
మెల్లిగా నడుస్తూ! తోటలోకి వచ్చాడు. ఆయనను చూడగానే నెమళ్ళన్నీ పారిపోయాయి. ఇలాంటిప్రమాదం ముందుగానే పసిగట్టిన సెక్యూరిటీ సిబ్బంది ఒక నెమలి కాళ్ళూ, రెక్కలూ విరగ్గొట్టి ఒక చెట్టుకి కట్టేవేశారు! పెద్దాయన ఆ నెమలిని దువ్వుతూ ఫోజులిచ్చాడు. కొద్దిసేపటికి గాని గుర్తుకు రాలేదు! అక్కడ ఫొటోలు, వీడియోలు తీసేవారెవ్వరూ లేరని! దాంతో నెమలిని విడిచిపెట్టాడు. నెమలి బతికిపోయింది! ''రాజద్రోహం చట్టం ఎందుకు రద్దు చేయకూడదు?'' అది చీఫ్ జస్టిస్ ప్రశ్న. తన ఎన్నికల సభల్లో పెట్టిన వేలాది వాట్సు శబ్దాన్ని మించి గట్టిగా విన్పిస్తోంది! దాంతో చెవులు మూసుకున్నాడు. అయినా ఆ ప్రశ్న ఇంకా గట్టిగా వినబడుతోంది! దాంతోయోగా ప్రారంభించాడు! శ్వాస మీద ధ్యాస పెట్టాడు. శీర్షాసనం వేశాడు. పిల్లిమొగ్గలు వేశాడు. ఏం చేసినా అదే ప్రశ్న మళ్ళీ మళ్ళీ మరింత గట్టిగా విన్పిస్తోంది.
''గాంధీ, గోఖలే, తిలక్ లాంటి వాళ్ళ మీద కేసులు పెట్టిన రాజద్రోహం చట్టం మనకు స్వాతంత్య్రం వచ్చాక 75ఏండ్ల తర్వాత ఇంకా అవసరమా అని చీఫ్ జస్టిస్ ప్రశ్నించటం పెద్దాయనకు ఎంతో వింతగా అన్పించింది. తమ పూర్వీకులకు రాజద్రోహం చేసే అలవాటే లేదు! రాజులను ఎవరైనా సరే! ఎంతో గౌరవంగా, భయభక్తులతో చూసిన చరిత్ర తమది, తమ పార్టీది! తాము ఎంతో వీరత్వం గల యోధుడిగా చెప్పుకునే సావర్కర్, బ్రిటిష్ రాణికి జైలు నుండే విధేయుడిగా ప్రకటించుకుని, భవిష్యత్‌లో రాజద్రోహం చేయనని క్షమాపణ పత్రం రాసిచ్చి, బయటపడ్డాడు! అదే వారసత్వం దేశ ప్రజలకు అందించే ప్రయత్నంలోనే తమ ప్రభుత్వం రాత్రింబవళ్ళు కృషి చేస్తోంది కదా! మధ్యలో ఈయనొచ్చి ఏకంగా రాజద్రోహం చట్టాన్నే రద్దు చేయమంటే చేస్తామా? బ్రిటిష్ రాజరికాన్ని ఎదిరించి ముమ్మాటికీ గాంధీ రాజద్రోహం చేశాడు. అందుకే బ్రిటిష్ రాజరికం గాంధీకి జైలుశిక్ష విధించినా, అది చాలదని భారతదేశానికి స్వతంత్రం వచ్చాక గాంధీకి తమకి మార్గదర్శియైన గాడ్సే తగిన శిక్ష విధించాడు! ఇవన్నీ ఆలోచించకుండా రాజద్రోహం చట్టం రద్దు చేయమంటే ఎలా కుదురుతుంది?''
పెద్దాయన ఆలోచనలు ఎంతకీ తెగటం లేదు! చీఫ్ జస్టిస్, కోర్టులో చేసిన వ్యాఖ్యలు ఒక్కోటీ గుర్తుకొస్తున్నాయి! 124ఎ సెక్షన్ కింద పెట్టిన కేసులు నిలబడలేదని, 98శాతం శిక్షలు పడలేదని, చీఫ్ జస్టిస్ చేసిన వ్యాఖ్యలు గుర్తొకొచ్చి పెరిగిన గడ్డం చాటున పెద్దాయన నవ్వుకున్నాడు! ఈ సెక్షన్ కింద కనీసం బెయిల్కూడా ఇవ్వకుండా, మూడేండ్లపాటు జైలులో ఉంచుతున్నాము కదా! అదంతా 'శిక్ష' కాదా! ఒకవేళ బయటకి వచ్చిన తర్వాత మరో రాజద్రోహం కేసు పెడతాము! మళ్ళీ మూడేండ్లు జైలు. ప్రత్యర్థులను దెబ్బతీయటానికి ఇది చాలు కదా! అనుకున్నాడు పెద్దాయన.
రాజద్రోహం కేసులు పెట్టే అవకాశం కల్పిస్తున్న సెక్షన్ 124ఎ, రాజ్యాంగం కల్పిస్తున్న భావప్రకటనా స్వేచ్ఛకు, ప్రాథమిక హక్కులకు భంగం కల్పిస్తున్నాయన్న వ్యాఖ్యలు పెద్దాయనకు చిరాకు కల్గించాయి. ''రాజ్యాంగం, ప్రాథమిక హక్కులు ఇలాంటివి దేశంలో ఉండబట్టే కొందరు గొంతెత్తుతున్నారు. వాటిల్లోని అనేక అంశాలు తమ భావజాలానికి, బద్ధ వ్యతిరేకం! అందుకే రాజ్యాంగం మొత్తమే రద్దు చేసి, దానిస్థానంలో మనుధర్మశాస్త్రాన్ని ప్రతిష్టింపచేయాలని, తాము కంకణం కట్టుకున్నాము! అందువల్ల వెనక్కి తగ్గరాదని పెద్దాయన నిశ్చయించుకున్నాడు!
ఒక పక్క ఈ చర్చ జరుగుతుండగానే హర్యానాలో 100మంది రైతులపై తమ పార్టీ ప్రభుత్వం రాజద్రోహం కేసులు పెట్టడం పెద్దాయనకు సంతోషాన్ని కలిగించింది. శేహబాష్! ''కీప్ ఇట్ అప్!'' అనుకున్నాడు మనసులో! వెంటనే ఒక ఆలోచన వచ్చింది! చప్పట్లు కొట్టాడు ''ఎవరక్కడ'' అన్నాడు. ''చిత్తం ప్రభూ!'' అంటూ వచ్చాడు సెక్యూరిటీ. ''హౌం మంత్రిని తక్షణమే రమ్మనండి!'' అన్నాడు పెద్దాయన!
ఈ లోగా హౌంమంత్రి వచ్చాడు!
''ఎవరయ్యా ఆ బంబాట్కెరే! సైన్యం అంటే ప్రభువులకి విధేయంగా ఉండాలి గాని, ప్రభుత్వంపైనే కేసు వేస్తాడా ఆరు!'' అన్నాడు పెద్దాయన.
''ఆ బంబాట్కెరే రిటైరయ్యాడు! అంతేకాక మన ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన అరుణ్‌శౌరి కూడా మనకు వ్యతిరేకంగా కేసు వేశాడు!'' అన్నాడు హౌం మంత్రి!
''మన ఉప్పు తిని వీళ్ళంతా మనకే ద్రోహం తలపెడుతున్నారు! ఇదే కదా రాజద్రోహం! బంబాట్కెరే తన చిన్న తనంలో ఏదైనా వామపక్ష విద్యార్థి సంఘంలో పనిచేశాడేమో చూడు! లేకపోతే సర్వీసులో ఉండగా ఏ చైనా, పాకిస్థాన్ ఆర్మీ ఆఫీసర్లతో కలసిన ఫొటోలు లేదా, ఫోన్ చేసిన ఆధారాలేమైనా ఉంటే వెదుకు! ఏవీ దొరక్కపోతే ఎప్పుడైనా పిడికిలి బిగించిన ఫొటోలైనా సంపాదించు! చైనా ఏజెంటని ముద్రవేసి లోపల తోరు! అన్నాడు పెద్దాయన కోపంగా!
హౌం మంత్రికి భలే సంతోషం కలిగింది! ''తనకి కావల్సిందిలాంటి ఆదేశాలే కదా! ఇక రెచ్చిపోతాను!'' అనుకున్నాడు. కాని ఆయనకు ఒక అనుమానం వచ్చింది! ''భారతదేశంలో రాజద్రోహం చట్టం చేసిన ఇంగ్లాండులోనే 2009లో రాజద్రోహం చట్టాలను రద్దుచేశారు కదా!'' అన్నాడు.
''పెద్దాయన చిన్నగా నవ్వాడు'' మనదేశంలో రాజద్రోహం చట్టం చేసింది ఇంగ్లండు వారు నిజమే! అయితే ఇంగ్లండువారు అప్పుడు ప్రభువులు! మన భారతీయులు బానిసలు! ప్రభువులకి వ్యతిరేకంగా బానిసలు ఆలోచించినా అది రాజద్రోహమే! భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లయ్యింది! ఇప్పుడు మనమే ప్రభువులం, ప్రజలేమో బానిసలు! అందువల్ల మనకు వ్యతిరేకంగా ఆలోచించిన వారంతా రాజద్రోహులే అవుతారు! కాబట్టి కేసలు పెట్టక తప్పదు! మన కౌటిల్యుడు కూడా ఇదే చెప్పాడు.న మనం ఆచరిస్తున్నాము అంతే!'' అని ఉపదేశించాడు పెద్దాయన!
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌లు ఒకరిద్దరు కొన్ని కేసులలో తాము పిటిషన్లో కోరిన మేరకు తీర్పులిచ్చారు. ఆ కృతజ్ఞతా భావంతో రిటైరైన తర్వాత వారిని తగు విధంగా గౌరవించాము! న్యాయవ్యవస్థ కూడా ప్రజలు ఎన్నుకున్న పాలకులకు లోబడి ఉండాలి! అలా ఉండకపోతే అది రాజద్రోహం కాదా! అన్న అనుమానం వచ్చింది హౌం మంత్రికి! వెంటనే పెద్దాయన మొహం చూశాడు! ఆయనకూ సరిగ్గా అదే అనుమానం వచ్చింది!
- ఉషాకిరణ్