Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ మధ్యకాలంలో ప్రపంచ వ్యాప్తంగా పచ్చి మితవాద శక్తులు విజృంభిస్తున్నాయి. ఫాసిస్టు, అర్థ ఫాసిస్టు, నయా ఫాసిస్టు పార్టీలు పుట్టుకొస్తున్న తీరు 1930 దశకాన్ని గుర్తుకు తెస్తున్నది. ఫాసిస్టు ప్రభుత్వాలు తప్పనిసరిగా గుత్త పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడతాయి. ఆ గుత్త పెట్టుబడిదారులలోని అత్యంత ప్రగతి నిరోధక శక్తుల ప్రయాజనాలను మరీ ముఖ్యంగా కాపాడతాయి. ''ఫైనాన్సు పెట్టుబడికి చెందిన అత్యంత ప్రగతి నిరోధక తరగతి యొక్క ఉగ్రవాద స్వభావం కల బహిరంగ నియంతృత్వమే ఫాసిస్టు రాజ్యం'' అని కమ్యూనిస్టు ఇంటర్నేషనల్ అధ్యక్షుడు జార్జి డిమిట్రోవ్ 7వ అంతర్జాతీయ మహాసభలో ప్రకటించాడు. అయితే గతంలో ఫాసిస్టు ఉద్యమాలన్నీ ముందు బడా పెట్టుబడిని వ్యతిరేకిస్తున్నట్టే మొదలయ్యాయి. ఆ విధంగా బడా పెట్టుబడికి తాము వ్యతిరేకంగా ఉన్నామని పోజు పెట్టి ప్రజలలో మద్దతు సంపాదించుకున్నాయి. తర్వాత తమకు మద్దత్తునిచ్చిన ఆ ప్రజలకు ద్రోహం చేసి అదే బడా పెట్టుబడిదారీ వర్గంతో చేతులు కలిపి అధికారాన్ని చేజిక్కించుకున్నాయి. హిట్లర్ ఈ విధంగానే వ్యవహరించాడు. ''పొడవాటి కత్తుల రాత్రి''గా చరిత్రలో అభివర్ణించే ఆ సంఘటనలో తనకు అత్యంత సన్నిహితుడిగా ఉంటూవచ్చిన ఎర్నెస్ట్ రోహమ్ (నాజీ పార్టీకి చెందిన ఎస్.ఎ. అనే సాయుధ బృందాలకు అధినేతగా వ్యవహరించినవాడు)ను, ఇంకా పలువురు నాజీ నేతలను హిట్లర్ కుట్రపూరితంగా హత్యలు గావించాడు.
అయితే ఆనాటి ఫాసిస్టు పార్టీలకు, నేటి నయా ఫాసిస్టు, పచ్చి మితవాద పార్టీలకు ఈ విషయంలో ఒక తేడా ఉంది. వర్తమాన కాలంలోని నయా ఫాసిస్టులు బడా పెట్టుబడిదారీ వర్గానికి వ్యతిరేకంగా ఎటువంటి వైఖరినీ మొదట్లో కూడా అనుసరించడం లేదు. ప్రజలకు ఈ వ్యవస్థమీద సహజంగా ఉండే అసంతృప్తిని (తమలో అత్యధికులను నిరుద్యోగులుగా ఉంచినందువలన కలిగే అసంతృప్తి) కూడా సొమ్ము చేసుకునే ప్రయత్నం ఏదీ చేయడం లేదు. ఇందుకు ఒక కారణం ఉంది. ప్రస్తుత కాలంలో బడా పెట్టుబడిదారీ వర్గాన్ని విమర్శిస్తూ మాట్లాడడం అంటే నయా ఉదారవాద ఆర్థిక విధానాలను విమర్శిస్తూ మాట్లాడవలసివస్తుంది. ప్రపంచం మొత్తం మీద ఆధిపత్యాన్ని సాధించిన అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడితో దేశంలోని బడా పెట్టుబడిదారీ వర్గం కలగలిసిపోయింది. అందుచేత బడా పెట్టుబడిదారీ వర్గాన్ని విమర్శించడం అంటే అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ముందుకు తెచ్చిన నయా ఉదారవాద విధానాలను విమర్శించడమే అవుతుంది. ప్రస్తుత నయా ఫాసిస్టు, మితవాద పార్టీలన్నీ ఈ విషయంలో మాత్రం మౌనంగా ఉంటున్నాయి. తద్వారా పరోక్షంగా నయా ఉదారవాద విధానాలకు తమ మద్దత్తును సూచిస్తున్నాయి. నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ వ్యవహరించిన, వ్యవహరిస్తున్న తీరు దీనికి గట్టి ఉదాహరణగా నిలుస్తుంది. నిజానికి, గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ ఉన్న కాలంలో అతనికి బడా పెట్టుబడితో ఉన్న సన్నిహిత సంబంధాల వలన బడా పెట్టుబడి అతడిని తమ ప్రతినిధిగా ఎంపిక చేసుకుంది. కొన్ని సంవత్సరాల క్రితం గుజరాత్లో జరిగిన పెట్టుబడిదారుల శిఖరాగ్ర సమావేశంలో నరేంద్ర మోడీని ప్రధాని అభ్యర్థిగా ఈ వర్గం నిర్ణయించుకుని అతనిని అధికార పీఠం మీద కూర్చోబెట్టడానికి అన్నివిధాలా తోడ్పడింది. తాను అధికారంలోకి రావడానికి తోడ్పాటును అందించిన కార్పొరేట్లకు మోడీ ప్రధాని పదవిని చేపట్టాక అన్ని విధాలా అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు. ముఖ్యమైన కాంట్రాక్టులు కట్టబెట్టడంలో గాని (రాఫెల్ ఒప్పందం ఇటువంటి వ్యవహారాలకు ఒక మచ్చుతునక) కార్మికుల హక్కులను కాలరాసే చట్టాలను చేయడంలో గాని, రైతాంగం యెక్క స్వతంత్రతను దెబ్బ తీయడంలో గాని, ప్రభుత్వ రంగ సంస్థలను పెద్దయెత్తున ప్రయివేటీకరించడంలోగాని కార్పొరేట్లయెడల తన విధేయతను చాటుకుంటున్నాడు. దేశ సంపద సృష్టికర్తలు కార్పొరేట్లేనంటూ ప్రకటించి తన చర్యలను సమర్థించుకుంటున్నాడు. ఆ పేరుతో కార్పొరేట్లు దేశ సంపదను స్వాహా చేయడానికి సహకరిస్తున్నాడు.
కాసేపు మోడీని, ఆయన గుంపుని పక్కన పెడదాం. ప్రపంచంలో తొలుత ఏదో ఒక మేరకు నయా ఉదారవాద విధానాలను విమర్శిస్తూ మాట్లాడిన కొన్ని మితవాద పార్టీలు కూడా ఇప్పుడు తమ స్వరాన్ని మార్చాయి. ఇటలీలో మాట్టియోసాల్వినీ నాయకత్వంలోని నార్తర్న్ లీగ్ పార్టీ యూరపియన్ యూనియన్ అమలు చేస్తున్న నయా ఉదారవాద విధానాలను వ్యతిరేకించినట్టు కనిపించింది. ఆ సందర్భంగానే యూరో ఒక ఉమ్మడి కరెన్సీగా ఉండరాదని ఆ పార్టీ వాదించింది. ఇప్పుడు అదే పార్టీ మెత్తబడి యూరపియన్ యూనియన్ విధానాలను అన్నింటినీ బలపరుస్తోంది.
ఇటీవల యూరప్‌కు చెందిన పదహారు పచ్చి మితవాద పార్టీలు ఉమ్మడిగా ఒక ప్రకటన చేస్తూ నయా ఉదారవాద విధానాలకు తమ సంపూర్ణ మద్దత్తును తెలిపాయి. వాటిలో హంగేరీకి చెందిన విక్టర్ ఆర్బన్ నాయకత్వంలోని ఫైడెజ్ పార్టీ, ఫ్రాన్స్‌లో మారినే లి పెన్ నాయకత్వంలోని నేషనల్ ఫ్రంట్, ఆస్ట్రియాకు చెందిన ఫ్రీడమ్ పార్టీ, పోలండ్‌కు చెందిన లా అండ్ జస్టిస్ పార్టీ, స్పెయిన్‌కు చెందిన వోక్స్, ఇటలీకి చెందిన నార్తర్న్ లీగ్, బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీలు ఉన్నాయి. ఆ ఉమ్మడి ప్రకటనలో ఆర్థిక విధానాలకు సంబంధించి ఒక్క పదం కూడా లేదు. యూరప్‌లోని జాతుల సంస్కృతులను పరిరక్షించడం గురించి నొక్కి చెప్పారు. మైనారిటీ మతస్తులమీద దాడులను సమర్థించేందుకు తరచూ అక్కడి మితవాదులు ఉదహరించే జూడియో-క్రైస్తవ సాంప్రదాయాన్ని కాపాడుకోవలసిన అవసరం గురించి గట్టిగా చెప్పారు. ఉమ్మడి యూరో కరెన్సీ వ్యవస్థనుండి వైదొలగాలని గాని, ఆ ఉమ్మడి వ్యవస్థ సభ్య దేశాలపై రుద్దుతున్న పొదుపు చర్యలను వ్యతిరేకిస్తూ గాని ఎటువంటి ప్రస్తావననూ చేయలేదు. ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా యూరపియన్ యూనియన్ ఈ ద్రవ్య నియంత్రణ నిబంధనలను కాస్త సడలించిన మాట నిజం. అయితే ఈ పరిస్థితి తాత్కాలికమే. 2023 నాటికల్లా మళ్ళీ ఈ ద్రవ్య నియంత్రణ చర్యలన్నీ యధాతథంగా అమలు కావలసిందేనని యూరపియన్ కమిషన్ ఇప్పటికే హెచ్చరించింది. కాని ఈ పదహారు మితవాద పార్టీల ప్రకటనలో ఆ నియంత్రణ చర్యలను కనీసం మరికొన్నాళ్ళు వాయిదా వేయాలన్న డిమాండ్ కూడా లేదు. అధికారంలోకి రాక మునుపే ఈ పచ్చి మితవాద పార్టీలన్నీ ఈ విధంగా పలు దేశాల్లో అక్కడి బడా పెట్టుబడిదారీ వర్గం ముందు ఈ విధంగా తోకముడిచాయెందుకు? అన్నది మనముందున్న ప్రశ్న. 1930ల నాటి తమ పూర్వీకులకు, నేటి నయా ఫాసిస్టు పార్టీలకు నడుమ ఇటువంటి తేడా ఎందుకు వచ్చింది? 1930 నాటి ద్రవ్య పెట్టుబడి అంతర్జాతీయంగా విస్తరించివున్నా, ప్రధానంగా ఆ యా దేశాల ప్రభుత్వాల తోడ్పాటు మీద, అండదండలమీద ప్రధానంగా ఆధారపడివుండేవి. అదే ప్రస్తుత కాలంలో ద్రవ్య పెట్టుబడి అంతర్జాతీయ స్వభావాన్ని పూర్తిగా సంతరించుకుంది. ఇది ఆయా జాతీయ ప్రభుత్వాలని ధిక్కరించగల, శాసించగల శక్తి కలిగివుంది. ఏదైనా ఒక దేశంలో ఒక ప్రభుత్వం గనుక ఈ అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి పెత్తనాన్ని సవాలు చేయాలనుకుంటే ముందు ఆ దేశం ప్రపంచీకరణ వల నుండి బైట పడవలసివుంటుంది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సాగుతున్న ద్రవ్య పెట్టుబడుల ప్రవాహం ఏ ఒక్క దేశపు నియంత్రణలోనూ లేదు. ఆ యా దేశాల ఆర్థిక స్వయంనిర్ణయాధికారాన్ని తోసిరాజంటూ అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి వ్యవహరిస్తోంది. యూరప్ ఖండం వరకూ చూసుకుంటే అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడిని సవాలు చేయడం అంటే యూరపియన్ యూనియన్ నుండి బైటకు రావలసివుంటుంది. ఈయూ ద్వారానే ఆ ద్రవ్య పెట్టుబడి తన పెత్తనాన్ని చెలాయిస్తోంది. ఇటువంటి అంతర్జాతీయ ద్రవ్య వ్యవస్థలో కలగలిసిపోయిన నేపథ్యంలో ఏ ఒక్క దేశమైనా స్వతంత్రించి ఆ అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడిని ధిక్కరించి బైట పడాలంటే అందుకు ఆ దేశంలోని ఇతర వర్గాల మద్దత్తు - ముఖ్యంగా కార్మిక వర్గ మద్దత్తు చాలా అవసరం. కాని ఈ మితవాద పార్టీలు కార్మికవర్గానికి పూర్తి వ్యతిరేకంగా వ్యవహరిస్తాయి. మహా అయితే కార్మికవర్గాన్ని అప్పుడప్పుడూ తీయని మాటలతో మోసపుచ్చుతాయి. అందుకే ఈ మితవాద పార్టీలు ధైర్యం చేసి అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడికి వ్యతిరేకంగా నిలబడలేవు.
అందుకే యూరపియన్ యూనియన్‌లోని మితవాద పార్టీలన్నీ తమ అభ్యంతరాలను సాంస్కృతిక పరమైన అంశాలకే పరిమితం చేశాయి. అటువంటి అభ్యంతరాలెన్ని పెట్టినా, వాటివలన అంతర్జాతీయ వ్రవ్య పెట్టుబడి పెత్తనానికొచ్చిన ప్రమాదం ఏమీ లేదు. నిజానికి అటువంటి అంశాలు చర్చకు రావడం వలన దానికి మేలే జరుగుతుంది. ఉపాధి, ఆర్థిక దుస్థితి వంటి అంశాలనుండి చర్చ సాంస్కృతిక అంశాలవైపు మళ్ళితే... జాతీయత గురించి, జూడియో క్రిస్టియానిటీ గురించి జనం చర్చించుకుంటూ వుంటే శ్రామికవర్గ దైనందిన సమస్యలపై చర్చ ముందుకు రాదు. దానివలన అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి పెత్తనం సాఫీగా సాగిపోతుంది.
ఈ విధంగా పచ్చి మితవాద శక్తులు అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ఆధిపత్యానికి దాసోహమని తలవొగ్గినప్పటికీ, ఇంకొక అంశం ముందుకు వస్తోంది. ప్రస్తుతం సంపన్న దేశాలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు ఆర్ధిక మాంద్యంలో, తీవ్ర సంక్షోభంలో చిక్కుకుని ఉన్నాయి. దీనినుండి బైట పడడానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మళ్ళీ కీన్స్ సూచించిన విధానాలను అమలు చేయడమే పరిష్కారం అని ప్రతిపాదిస్తున్నాడు. దానికి అనుగుణంగా ప్రభుత్వ వ్యయాన్ని పెంచే కొన్ని చర్యలను చేపట్టాడు. ఆ అదనపు వ్యయాన్ని భరించడానికి ఒకవైపు ద్రవ్యలోటును పెంచేలా, ఇంకోవైపున కార్పొరేట్లపై పన్నులను అదనంగా విధించేలా చర్యలను ప్రతిపాదిస్తున్నాడు. ఇందులో భాగంగా అంతర్జాతీయంగా కార్పొరేట్లపై కనీస పన్నును నియంత్రించాలన్న ప్రతిపాదనను కూడా ముందుకు తెచ్చాడు. తక్కిన పెట్టుబడిదారీ దేశాలు కూడా ఇటువంటి విధానాలను అనుసరించినప్పుడే బైడెన్ విధానాలకు ఫలితం కొంతమేరకైనా వస్తుంది. సంపన్న దేశాలు ఒకే విధమైన విధానాలను అనుసరించడం ఒక్కటే చాలదు. మూడవ ప్రపంచ దేశాలకు కొంత ఆర్థిక స్వాతంత్య్రాన్ని ఇచ్చి, మరింత ఎక్కువ ద్రవ్యలోటును అనుమతించడం కూడా అవసరం. అటువంటి సడలింపు మూడవ ప్రపంచ దేశాలకు ఇవ్వకుండా కేవలం సంపన్న దేశాలు తమ వ్యయాన్ని పెంచినంత మాత్రాన వాటికి ప్రయోజనం కలగదు. అదేవిధంగా కేవలం ఒక్క అమెరికాలో మాత్రమే ఇటువంటి కీన్స్ విధానాలను అమలు చేసినా దానివలన ప్రయోజనం రాదు. అమెరికా ఒక్కటే కీన్స్ విధానాలను అనుసరించాలంటే అది తన దేశానికి వచ్చే దిగుమతులను పూర్తిగా నిరోధించాలి. అలా చేయకపోతే అక్కడ పెరిగిన ప్రజల కొనుగోలుశక్తిని ఆకర్షించడానికి ఇతర దేశాల నుండి వచ్చే దిగుమతుల ప్రవాహం వేగం పెరుగుతుంది. అందువలన అమెరికా వ్యాపార లోటు బాగా పెరిగిపోతుంది. ఆ విధంగా అమెరికా చేసే అదనపు వ్యయం వలన ఇతర దేశాలలో ఉపాధికల్పన పెరుగుతుంది. పైగా ఆ దేశాలకు అమెరికా బాకీ పడిపోతుంది. అంతే తప్ప అమెరికా ఆర్థికంగా కోలుకోదు. యూరప్‌లోని పచ్చి మితవాద పార్టీలన్నీ యూరపియన్ యూనియన్ ప్రతిపాదిస్తున్న పొదుపు చర్యలను బలపరుస్తున్నాయి. అందువలన యూరపియన్ దేశాలు అమెరికా అధ్యక్షుడు ప్రతిపాదిస్తున్న విధానాలను ఆమోదించకపోవచ్చును. పైగా ఈ పొదుపు చర్యలను ప్రతిఘటించేటంత బలంగా యూరప్‌లోని వామపక్ష శక్తులులేవు. అటువంటప్పుడు బైడెన్ ఒంటరిగా తన విధానాలను ఎంతమేరకు అమలు జరపగలడన్నది ప్రశ్నార్థకమే. ఇదంతా చూసినప్పుడు రానున్న రోజుల్లో ప్రపంచ పెట్టుబడిదారీ విధానం మరింతగా ఆర్థిక మాంద్యంలో, సంక్షోభంలో మునిగిపోక తప్పదని భావించవచ్చు.
(స్వేచ్ఛానుసరణ)
- ప్రభాత్ పట్నాయక్