Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వర్షాకాలం వస్తుంది పోతుంది. ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు పెరిగిపోతున్నాయి కానీ, తగ్గడంలేదు. పాలకులు గతంలో సంభవించిన జల విలయం నుండైనా గుణపాఠం నేర్చుకోకపోగా, చేసిన తప్పులే చేస్తూ కాలం వెల్లదీస్తున్నారు. ప్రజాధనం మాత్రం కరి మింగిన వెలగపండోలే మాయమైపోతుంది. అభివృద్ధికి నిలయమైన మహానగరాలు, పట్టణాలు చినుకు పడిందంటే చిత్తడై దుర్గంద భరితమవుతున్నాయి. నగరాలు, పట్టణాల్లో లోతట్టు ప్రాంత ప్రజలు వారి నివాసాలపై అంతస్తుల్లో రాత్రింబవళ్లు ఊపిరి బిగపట్టుకొని నిరీక్షిస్తూ రోజుల తరబడి నీరు వెళ్ళే వరకు ఇబ్బందులు పడుతున్నారు. నీటమునిగిన ప్రాంతాలకు విద్యుత్తు సౌకర్యాలు, తాగునీటి సౌకర్యాలతోపాటు కనీస అవసరాలు తీరకపోగా, సాధారణ స్థితికి రావడానికి వారాలు, నెలలకొద్దీ పడుతున్నది. ఈలోగా అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలతో ప్రజాజీవనానికి ఆటంకం జరగడం సర్వసాధారణమై పోతున్నది. పాలకులు, ప్రతి పక్షాలు పరామర్శలు, విమర్శలు చేసి అధికారులపై విరుచుకుపడి చేతులు దులుపుకుంటున్నారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి మీడియాముందు ఒకరిని ఒకరు విమర్శించుకొంటున్నారు. ఆ తరువాత గుట్టుచాటుగా పర్సంటేజీలు పంచుకోవడం, ఓట్లను వంతుల వారీగా దండుకొని అధికార పీఠాన్ని చేజిక్కించుకోవడం వారికి మామూలైపోయింది. నాలాల ఆక్రమణ, వర్షపునీరును నిలువచేసే చెరువులు, కుంటలు, ప్రవాహయోగ్యమైన వాగులు, నదులను ఆక్రమించి నిర్మాణాలు చేయడమే ఈ దుస్థితికి ప్రధాన కారణం. నగరీకరణ, పట్టణీకరణలో నిబంధనలను తుంగలో తొక్కి భూ ఆక్రమణలు చేసి ఆకాశహార్మ్యాల నిర్మాణం, రియల్ ఎస్టేట్ దందాలతో నియమ నిబంధనలు గంగలో కలవడంతో వర్షపు నీరు, మురుగు నీరు జన నివాసాలకు వస్తున్నాయి. ఆ నీటిని ఆటంకం లేకుండా ప్రయాణించేలా చేయాలి. నగరాలు, పట్టణాలు చిన్నపాటి వర్షానికే ముంపునకు గురికావడం, పడవల్లో వెళ్లాల్సి రావడం లాంటి ప్రజల కష్టాలకు ముమ్మాటికి పాలకుల, అధికారుల, నిపుణుల నిర్వహణలోపమే కారణం. నగరపాలక, పట్టణపాలక సంస్థలు, ప్రభుత్వాలు వెంటనే నాలాల ఆక్రమణ, చెరువుల ఆక్రమణలు చేధించి మురుగునీరు, వర్షపునీరు జన నివాసాలకు రాకుండా భూమిలో ఇంకిపోయేలా చేసి భూగర్భజలం పెంచాలి. మురుగునీరుకు భూగర్బ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పరచి నిర్వహణ లోపాలను అధిగ మించేలా క్రమబద్ధీకరించాలి.
ఇక మన రాష్ట్రంలో దాదాపు 289ఏజెన్సీ ప్రాంత గ్రామాల ప్రజలు వర్షాకాలంలో పొంగిపొర్లుతున్న వాగులు, వంకల వలన ఊరుదాటి బయటకు వెళ్లలేని దుస్థితి. అలాగే బయటవారూ ఆ గ్రామాలకు రాలేని పరిస్థితి. ధైర్యంచేసి తాళ్ళను ఆ చివరకు, ఈ చివరకు బండరాళ్ళకు కట్టి నడవటంతో ప్రమాదవశాత్తు మరణాలు సంభవిస్తున్నాయి. వ్యవసాయ పనులకు, కనీస అవసరాలకు గ్రామస్తులు ఎన్నో ఏండ్లుగా ఇలానే సాహసం చేయక తప్పడం లేదు. కాన్పు కోసం గర్భిణులను, అనారోగ్యంపాలైన వారిని ప్రధాన రహదారి దాకా కట్టెలకు కావడి కట్టుకొనో, ఎడ్లబండ్లపైననో తీసుకువెలుతున్నారు. ఈ గ్రామాల ప్రజలు వానాకాలం వచ్చిందంటే సీజన్ జబ్బులకు తోడు రవాణా సౌకర్యాలులేక కంటిమీద కునుకు లేకుండా జీవితం గడుపుతున్నారు. ఇలా ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆదిలాబాద్, జిల్లాల్లో ప్రతి వర్షాకాలంలో 137 గ్రామాలు జలదిగ్బంధానికి లోనవుతున్నాయి. మహబూబ్నగర్, వనపర్తి, నాగర్కర్నూల్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో 32గ్రామాల వాగులు ప్రజలకు ప్రాణసంకటంగా మారుతున్నాయి. వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలకు 55గ్రామలలో ఏటా రాకపోకలు నిలిచిపోతున్నాయి. ఖమ్మం, భధ్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని ఏజెన్సీ పరిధిలో 65గ్రామాలు జలదిగ్బందంలో చిక్కుకొని వైద్యానికి, నిత్యావసరాలకు గిరిజనులు అవస్థలు పడుతున్నారు. ఐటీడీఏలు, పంచాయతీరాజ్, రహదారులు, భవనాల శాఖలు ఆయా ప్రాంతాల్లో వంతెనల నిర్మాణం, మరమ్మత్తులు, రోడ్లను బాగు చేసేందుకు ప్రతి ఏటా ప్రతిపాదనలు పంపినా! ఫలితం లేదు. కొన్నింటికి నిధులు వచ్చినా పనులు సాగడం లేదు. ఈ పరిస్థితికి పాలకుల బాధ్యత లేదా! వెనువెంటనే ప్రస్తుత పరిస్థితులను గుర్తించి యుద్ధప్రాతిపదికన అటు మహానగరాలు, నగరాలు, పట్టణాలు, మరోవైపు సుమారు 300లకు పైగా ఏజెన్సీ గ్రామాల రహదారులు, వంతెనలు, కాజ్వేలు, బండ్లబాటల నిర్మాణాలు, మరమ్మతులు చేస్తూ కనీస సౌకర్యాలను కల్పించాలి. శాస్త్ర సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెంది రోదసీ యాత్రలు చేసివస్తున్నాం. ఉపగ్రహాలను ప్రయోగిస్తున్నాం. భూమండలంపై అణువణువు చూడగలుగుతున్న ఈ వేళ... అభివృద్ధి చెందని ఏజెన్సీ గ్రామాల్లో వర్షాకాలంలో కనీస అవసరాలు తీర్చుకోలేక ఊర్లకు ఊర్ల ప్రజలు నానా ఇబ్బందులు పడుతుండటం విచారకరం. ఇప్పటికైనా పాలకులు వెంటనే స్పందించి ప్రతి వర్షాకాలంలో ఇదే పరిస్థితి పునరావృతం కాకుండా ప్రణాళిక బద్ధంగా చిత్తశుద్ధితో కృషి చేసి ఈ బాధలనుండి విముక్తి కల్పించాలి.
- మేకిరి దామోదర్
సెల్: 9573666650