Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏడేండ్లలో ప్రధాని నరేంద్ర మోడీ ఏం చేశారని అడిగితే... గతంలో యూపీఏ హయాంలో చేసిన అప్పులన్నింటినీ తీర్చారని గొప్పగా ప్రచారం చేశారు. ముందుగా కేంద్రం చేసిన అప్పుల గురించి చూద్దాం. ఏడు సంవత్సరాల కాలంలో రూ.55 లక్షల కోట్ల దేశీయ అప్పును రూ.117 లక్షల కోట్లకు పెంచారు. దీనికి విదేశీ అప్పును కూడా కలిపితే 2021 మార్చి ఆఖరుకు రూ.121 లక్షల కోట్లు. వచ్చే ఏడాది అది రూ.136 లక్షల కోట్లు అవుతుందని అంచనా. ఏం చేశారని అడగొద్దు. ఈ అప్పుకు ఏటా చెల్లించే భారీ వడ్డీ భారాన్ని కూడా జనమే భరించాలి. ఇవిగాక కుటుంబాల అప్పులు కూడా పెద్ద సమస్యగా మారుతున్నాయంటే అతిశయోక్తి కాదు. 2019-20లో ప్రతి వ్యక్తికి సగటున రూ.34,304 అప్పు ఉండగా 2020-21లో రూ.52,273కు పెరిగింది. 2017-18లో మన జీడీపీలో గృహ రుణాలు 30.1శాతం ఉండగా 2020-21లో 37.3శాతానికి పెరిగాయి. కేంద్ర బడ్జెట్ పత్రాల ప్రకారం 2020-21లో జీడీపీ విలువ రూ.194.81 లక్షల కోట్లు. దీనిలో 37.3శాతం అంటే రూ.72.66 లక్షల కోట్ల అప్పు ఉన్నట్టు. దాన్ని జనాభాతో భాగిస్తే సగటు అప్పు తెలుస్తుంది. అయితే జీడీపీలో ఎగుడుదిగుళ్లు ఉన్నపుడు సంఖ్యలు మారుతుంటాయి. 2017-18లో తలసరి గృహ రుణం రూ.29,385 ఉంది. ఇప్పుడున్న దానితో పోల్చితే గత నాలుగు సంవత్సరాలలో 78శాతం భారం పెరిగింది.
హౌమ్ క్రెడిట్ ఇండియా అనే సంస్థ 7 నగరాల్లో ఒక సర్వే నిర్వహించింది. 2019లో అప్పు చేసేందుకు వంద కారణాల్లో 33 వినిమయ వస్తువుల కొనుగోలుకు, వ్యక్తిగత అవసరాలకు 23, ద్విచక్ర వాహనాల కొనుగోలుకు 20 ఉండేవి. అదే మరుసటి ఏడాది కరోనా కాలంలో 46 ఇంటి నిర్వహణకు, 27 వాయిదాల చెల్లింపు, ఉపాధి లేదా వ్యాపార నష్టాలు తీర్చేందుకు 14 ఉన్నట్లు తేలింది. అంటే ఏడాది కాలంలో జీవన విధానంలో ఎంత తేడా వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. బ్యాంకులు పది శాతం రుణాలను బలహీన వర్గాలకు ఇవ్వాలన్నది విధానపరమైన నిర్ణయం. అయితే ప్రయివేటు బ్యాంకుల్లో 52.4శాతం బ్యాంకులు అంతమేరకు ఇవ్వలేదని ఒక సర్వేలో వెల్లడైంది. అంటే ఆ మేరకు అధిక వడ్డీలకు వారు ప్రయివేటు రుణాలను తీసుకోవాల్సి వచ్చినట్టే.
గత నాలుగు సంవత్సరాల్లో గృహ రుణాలు ఎందుకు పెరిగాయి? ఇటీవలి కాలంలో ప్రభుత్వ రంగంలో వైద్య సేవలు దిగజారి జనాలు కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లాల్సి రావటం రుణ భార కారణాల్లో ఒక ప్రధానమైనదిగా మారింది. అదే విధంగా విద్యారంగం కూడా తయారైంది. పెద్ద నోట్ల రద్దు, తగినంత కసరత్తు చేయకుండా అమల్లోకి తెచ్చిన జీఎస్టీ పర్యవసానాలు కూడా రుణభారాన్ని పెంచిన అంశాల్లో చేరాయి. 2017లో నిరుద్యోగుల 3.4 శాతం, అది 2020 మార్చి నాటికి 8.8, 2021 జూన్‌కు 9.17శాతానికి చేరింది. ఇదే విధంగా ద్రవ్యోల్బణం రేటు 2.41 నుంచి 2021 జూన్ నాటికి 7.39శాతానికి చేరింది. అంటే నిరుద్యోగం వలన ఆదాయం తగ్గటం, ఖర్చులు పెరగటం, ద్రవ్యోల్బణం వలన ధరల పెరుగుదల కుటుంబాలను అప్పుల పాలు చేస్తున్న కారణాలలో చేరాయి. సమీప భవిష్యత్‌లో మన కుటుంబాలు తీవ్ర పరిస్థితిని ఎదుర్కోనున్నాయని ఆర్థిక రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రపంచ రేటింగ్ సంస్థ ఎస్ అండ్ పి మన దేశాన్ని కనిష్ట పెట్టుబడి బిబిబి మైనస్ గ్రేడ్‌లో పెట్టింది. వృద్ధి రేటు అంచనాలను అందుకోలేకపోయినా, ద్రవ్యలోటు, రుణ భారం జోశ్యాలకు మించి పెరిగినా భారత రేటింగ్స్‌ను తగ్గించాల్సి ఉంటుందని హెచ్చరించింది. దెబ్బతిన్న భారత ఆర్థిక వ్యవస్థ స్వస్థత అసంపూర్తిగా ఉందని ఇక్రా రేటింగ్ సంస్థ పేర్కొన్నది. వర్తమాన ఆర్థిక సంవత్సరం తొలి మూడు మాసాల్లో రెండంకెల వృద్ధి నమోదైనా అది 2019 తొలి త్రైమాసికంతో పోలిస్తే తక్కువే అని చెప్పింది. కరోనాకు ముందే కుదేలైన ఆర్థిక వ్యవస్థ తరువాత మరింత దిగజారింది. ఇది తిరిగి పూర్వపు స్థాయికి అయినా ఎప్పుడు చేరుతుందో తెలియని అయోమయంలో ఉన్నాం. కొన్ని సంవత్సరాలు పట్టవచ్చని చెబుతున్నారు. ముఖ్యంగా యువత ఉపాధి గురించి కనుచూపు మేరలో దారి కనిపించటం లేదు. ఇరవై-ఇరవై నాలుగు సంవత్సరాల మధ్య వయస్కులలో 37.9శాతం మంది పని లేకుండా ఉన్నారని సి.ఎం.ఐ.ఇ తాజా విశ్లేషణ వెల్లడించింది. ఏ సర్వే వివరాలు చూసినా ఆర్థిక వ్యవస్ధ తిరిగి కోలుకోవటం కష్టం, దీర్ఘకాలం పడుతుందనే చెబుతున్నాయి. ఉద్యోగ మార్కెట్లో ఏటా చేరుతున్న కోటి మంది ఉద్యోగాల కోసం చూస్తుంటారు. నైపుణ్యం లేని వారి పరిస్థితి చెప్పనలవి కాదు.
ప్రధానిగా తొలి ప్రసంగంలోనే ''ప్రపంచ వ్యాపితంగా ఉన్న వారికి నేనొక విజ్ఞప్తి చేయదలచాను. మీరు రండి భారత్‌లో తయారు చేయండి, ప్రపంచంలో వాటిని ఎక్కడైనా అమ్ముకోండి కానీ తయారీ ఇక్కడ మాత్రం చేయండి'' అన్నారు మోడీ. సులభతర వాణిజ్య వాతావరణం సృష్టించాలన్నారు. విదేశీ పెట్టుబడుల వరద పారనుంది గేట్లు ఎత్తివేయాలన్నారు. ఇంకా ఎన్నో ఊసులు చెప్పారు. ఐదు సంవత్సరాల తరువాత చూస్తే పరిస్థితి ఏమిటి? ప్రపంచ జీడీపీలో మన దేశ తయారీ రంగం వాటా 2019లో ఇరవై ఏండ్ల కనిష్టానికి పడిపోయింది. వచ్చిన విదేశీ పెట్టుబడులు స్టాక్మార్కెట్లో వాటాలు కొనుగోలు చేయటానికి, టెలికాం, చిల్లర వాణిజ్యం వంటి సేవా రంగంలోకి వెళ్లాయి. ఇంతవరకు ఎప్పుడైనా మేక్ ఇండియా లేదా మేకిన్ ఇండియా పిలుపులు విఫలమైనట్టు అంగీకరించారా? దాని బదులు స్థానిక వస్తువులను కొనండి వంటి కొత్త నినాదాలు ఇచ్చారు.
కరోనా వచ్చి జనం నానా యాతనలు పడుతున్నా అరకొర సాయం తప్ప ఆదుకున్నదే లేదు. అయితే పరిశ్రమలకు రూ.2 లక్షల కోట్ల మేరకు సబ్సిడీలు ఇచ్చినట్టు కొందరి అంచనా. అందుకే ఆర్థిక వ్యవస్థ దిగజారినా కంపెనీల వాటాలను కొనుగోలు చేసి డివిడెండ్లు, ఇతరంగా లాభాలను తరలించుకుపోయేందుకు విదేశీ సంస్థలు ముందుకు వచ్చాయి. ఈ సబ్సిడీలు, ఉత్పాదకత, ఎగుమతులతో ముడిపడిన ప్రోత్సాహక రాయితీలు ఎక్కువ భాగం ఉపాధి కల్పించే రంగాలు, పరిశ్రమలకు ఇవ్వలేదు. ఉపాధి పడిపోవటానికి ఇదొక కారణం. చైనాకు పోటీగా మన దేశాన్ని తయారు చేయాలనటంలో తప్పు లేదు. దాని అర్ధం జనానికి ఉపాధి కల్పించటం. మన విధానాలు ఆ దిశలో లేవు. నీకిది నాకది అన్నట్లుగా కొన్ని రంగాలు, కొన్ని గ్రూపుల కార్పొరేట్ సంస్థల మీదనే మన పాలకులు, యంత్రాంగ దృష్టి ఉందనే విమర్శ ఉంది. ఉత్పత్తి, ఎగుమతి ఆధారిత ప్రోత్సాహకాలకు విధించిన నిబంధనలను సడలించి గడువు పొడిగించటం దానిలో భాగమే. చైనాలో స్ధానిక పరిశ్రమలకు సబ్సిడీలు ఇచ్చారు. మనం కూడా సబ్సిడీలు ఇవ్వకుండా ఎలా అనేవారు కొందరు. చైనా సబ్సిడీలు ఇచ్చింది-ప్రపంచానికి ఎగుమతులు చేస్తోంది, తన జనానికి ఉపాధి కల్పిస్తోంది, ఆదాయాలు, జీవన ప్రమాణాలను పెంచుతోంది. మన దేశంలో సబ్సిడీలు ఇస్తున్నా మిగతావి ఎందుకు జరగటం లేదు? పన్ను చెల్లించే జనానికి చమురు వదలటం తప్ప మేకిన్ ఇండియా ఎందుకు విఫలమైంది? ఏడేండ్లలో జనానికి మిగిలింది ఏమిటి? తిప్పలు-అప్పులు కాదంటారా?
- ఎం. కోటేశ్వరరావు
సెల్:8331013288