Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మోడీ ప్రభుత్వం తొలుత ప్రకటించిన వ్యాక్సిన్ విధానంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో జూన్ 7న ఆ విధానాన్ని కొంతమేరకు మారుస్తూ మోడీ మరో విధాన ప్రకటన చేశారు. అయితే ఆ సందర్భంలోనే ప్రధాని మన దేశ వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యం, చరిత్రపై చేసిన వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి. ఇన్నాళ్ళూ తన ప్రజలకు సరిపడా వ్యాక్సినేషన్ చేయగల సామర్థ్యం మన దేశానికిలేదని, తన ప్రభుత్వ హయాంలో మాత్రమే మొదటిసారి రెండు వ్యాక్సిన్లను స్వంతంగా తయారు చేయగలిగామని మోడీ ప్రకటించారు. వాస్తవం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సిన్ ఉత్పత్తిదారుగా ఉన్న మన దేశం మోడీ హయాంలో మన దేశ ప్రజల వరకైనా సరిపడా వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయలేని దుస్థితిలో పడిపోయింది. ఈ చేదు వాస్తవం నుండి ప్రజల దృష్టిని మళ్ళించడానికి మోడీ తాపత్రయ పడుతున్నారు.
మన స్వంత టెక్నాలజీతో వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయగల దేశంగా భారతదేశం ఎప్పటినుండో ముందుంది. ముంబైలోని హాఫ్కిన్ ఇన్స్టిట్యూట్, కసౌలీలోని సెంట్రల్ రీసెర్చి ఇన్స్టిట్యూట్, కూనూర్‌లోని పాశ్చర్ ఇన్స్టిట్యూట్, చెన్నైలోని బిసిజి వ్యాక్సిన్ లాబొరేటరీ వంటి సంస్థలు ఇందులో కీలక పాత్ర పోషించాయి. మశూచి, పోలియో వంటి వ్యాధులను నిరోధించే వ్యాక్సిన్లను విజయవంతంగా ఉత్పత్తి చేయగలిగింది మన దేశం. 1970 పేటెంట్ చట్టాన్ని ఉపయోగించుకుని ప్రపంచంలోకెల్లా అతి పెద్ద వ్యాక్సిన్ ఉత్పత్తిదారుగా, జెనెరిక్ మందుల ఉత్పత్తిదారుగా భారతదేశం నిలిచింది. ఈ పరిస్థితి 2014లో మోడీ ప్రధాని అయ్యేవరకూ కొనసాగింది.
ఇప్పుడు మోడీ 'ఆత్మనిర్భర భారత్' అనే నినాదాన్ని కొత్తగా ముందుకు తెచ్చారు. అంతకుముందు 'దేశ స్వావలంబన' అన్న నినాదం ఉండేది. రెండిటికీ మధ్య తేడా ఏమిటి? స్వావలంబన అంటే మనం స్వంతంగా టెక్నాలజీని పెంపొందించుకుని మనకు అవసరమైన ఉత్పత్తినంతటినీ మనమే చేయగలగడం. కానీ, ఆత్మనిర్భరత అంటే అది కాదు. టెక్నాలజీ ఎవరిదైనా సరే, ఉత్పత్తి మాత్రం భారతదేశంలో జరిగితే చాలు. అందుకే కోవిషీల్డ్ తయారీకి సీరం ఇన్స్టిట్యూట్ ఉపయోగిస్తున్న టెక్నాలజీ బ్రిటన్ దేశపు ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా సంస్థదైనప్పటికీ, ఉత్పత్తి ఇండియాలో జరుగుతోంది గనుక అదంతా కూడా మన ఘనత కిందే చెప్పుకోవడం జరుగుతోంది. రాఫెల్ యుద్ధ విమానాలను ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసినా, వాటిని సమకూర్చుకోవడం మన ఘనత అని, అదే ఆత్మనిర్భరత అని మోడీ చెప్పుకుంటున్నారు.
ఇప్పుడు వ్యాక్సిన్ల మీద పేటెంటు హక్కులున్న బడా ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్ ఉత్పత్తి లైసెన్సులను ఏయే సంస్థలకు ఇవ్వాలి, ఎంతకాలం పాటు ఇవ్వాలి, ఏ రేటుకు ఇవ్వాలి వగైరా అంశాలను నిర్ణయిస్తున్నాయి. ప్రపంచ ప్రజలకు ఎంత త్వరగా వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసి అందించాలి అన్నది వాటికి ముఖ్యం కాదు. వాటికి లాభం ఎంత ఎక్కువ వస్తుంది అన్నదే ముఖ్యం. అందుకే ప్రపంచవ్యాప్తంగా పేటెంటు హక్కులను వ్యాక్సిన్ల విషయంలో సడలించాలన్న డిమాండ్ బలంగా ముందుకి వచ్చింది.
ప్రపంచ జనాభా మొత్తానికి వ్యాక్సిన్ వేయించడానికి 5000 కోట్ల డాలర్లు అవసరమవుతాయని, ఆ మొత్తాన్ని గనుక సంపన్న దేశాలు ఖర్చు చేయగలిగితే 2022 చివరికల్లా ప్రపంచానికి కోవిడ్-19 నుంచి విముక్తి కలిగించవచ్చునని డబ్ల్యుహెచ్వో చెప్తోంది. ఒకవేళ ఈ కోవిడ్ గనుక 2025 దాకా కొనసాగితే ప్రపంచ సంపద 9 లక్షల కోట్ల డాలర్ల మేరకు ఆవిరవుతుందని మరోపక్క ఐఎంఎఫ్ అంచనా వేసింది. 5000 కోట్ల డాలర్ల ఖర్చుకు వెనకాడితే అంతకు 200 రెట్లు నష్టపోతామన్నమాట. అందుచేత త్వరగా ఈ మహమ్మారిని అంతమొందించడం వెనుక సంపన్న దేశాల ప్రయోజనాలు సైతం ఉన్నాయని గుర్తించాలి.
ఇప్పటిదాకా ఆఫ్రికాలో వ్యాక్సిన్ పొందినవారు ఒక శాతం కన్నా తక్కువే ఉన్నారు. ఆసియాలో 2.5శాతం దాటలేదు. అదే అమెరికా, బ్రిటన్ దేశాలలో 42శాతానికి అందింది. ఈ లెక్కన సంపన్న దేశాలలో రాబోయే 3-6 నెలల్లో అందరికీ వ్యాక్సిన్ అందుతుంది. కాని తక్కిన ప్రపంచానికి అందడానికి మరో మూడేండ్లు పడుతుంది. ఇప్పుడు జి-7 దేశాలు ఇస్తామన్న 100 కోట్ల డోసులూ మొత్తం అవసరంలో ఎనిమిదో వంతు మాత్రమే. అంటే, తక్షణమే వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచకపోతే ఈ కరోనా మహమ్మారి దీర్ఘకాలం మనల్ని పీడించడం ఖాయం. మరి అమెరికా, తదితర సంపన్న దేశాలు ఈ ముప్పును ఎందుకు ఉపేక్షిస్తున్నాయి?
ప్రపంచానికంతటికీ అవసరమైన వ్యాక్సిన్లను ప్రపంచంలో అన్ని చోట్లా ఉత్పత్తి చేయడానికి ఉన్న ఆటంకాలేమిటి? 130 కోట్ల జనాభా ఉన్న ఆఫ్రికా ఖండం వ్యాక్సిన్ అవసరాల్లో 99శాతం దిగుమతుల ద్వారానే తీరుతుంది. ఆ ఖండంలోనే ఉత్పత్తి ఎందుకు జరగదు? ప్రస్తుతం వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రధానంగా అమెరికా, ఇండియా వంటి దేశాలలో కేంద్రీకృతమై ఉంది. అందుచేత ఆ దేశాల అవసరాలకే ముందు ప్రాధాన్యతనిస్తారు. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్‌ను అందించడానికి ఇది ఆటంకంగా ఉంటుంది. మే 2020లో జరిగిన వరల్డ్ హెల్త్ అసెంబ్లీ వ్యాక్సిన్ తయారీ టెక్నాలజీని, మందుల ఉత్పత్తి, పరీక్ష కిట్ల ఉత్పత్తి టెక్నాలజీలను ప్రపంచ దేశాలన్నింటితోనూ పంచుకోవాలని తీర్మానించింది. అంటే వీటికి సంబంధించిన పేటెంటు హక్కులను పక్కన పెట్టాల్సి ఉంటుంది. అందుకు అమెరికా ససేమిరా అంది.
ఇప్పుడు బడా ఫార్మా కంపెనీలకి కరోనా మందులు, వ్యాక్సిన్లు ఒక కొత్త మార్కెట్‌గా ఉన్నాయి. అందుకే ఆ కంపెనీలు పేటెంటు సడలింపును గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. వీటికి సంపన్న దేశాలు వత్తాసు పలుకుతున్నాయి. మొన్నటిదాకా మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద పేటెంటు హక్కులతో విపరీతంగా లాభాలు గడించిన బిల్‌గేట్స్ ఇప్పుడు ఫార్మా రంగంలో కొత్త చక్రవర్తిగా అవతరించాడు. బడా ఫార్మా కంపెనీల వద్ద పేటెంటు హక్కులను ఉంచుకుంటూనే లోకల్‌గా ఉత్పత్తికి లైసెన్సులివ్వాలన్న వాదనను ముందుకు తెచ్చాడు. అంటే వ్యాక్సిన్ ఉత్పత్తి ఎక్కడైనా చేసుకోవచ్చు. కాని ఎంతకాలంపాటు చేయాలి, ఏ రేటు పేటెంటు హక్కుదారులకు చెల్లించాలి అన్నది బడా ఫార్మా కంపెనీలే నిర్ణయిస్తాయి. దేశ స్వావలంబనకు, ఆత్మనిర్భరతకు ముందు చెప్పుకున్నట్టు ఎంత తేడా ఉందో, పేటెంటు చట్టాల సడలింపునకు, బడా ఫార్మా కంపెనీల ప్రతిపాదనకు అంత తేడా ఉంది.
ఆయా దేశాలు స్వంతంగా వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసే సామర్ధ్యం పెంచుకోడానికి వీలు లేకుండా చేయడమే బడా ఫార్మా కంపెనీల వ్యూహం. గతంలో ఆఫ్రికా దేశాలు ఇండియా నుండి జెనెరిక్ ఎయిడ్స్ మందులను మార్కెట్ ధరలో పదో వంతుకే కొనుగోలు చేశాయి. మన దేశంలో అప్పుడున్న పేటెంటు చట్టాల వలన చవకగా ఉత్పత్తి చేయగలిగాం. అప్పుడు ఆ కొనుగోలును నిరోధించడానికి ప్రయత్నించి బడా ఫార్మా కంపెనీలు భంగపడ్డాయి. అందుకే మరో మారు అలా జరగకుండా జాగ్రత్త పడుతున్నాయి. పేద దేశాలు ఎక్కువ రేటుకు వ్యాక్సిన్ కొనుగోలు చేయలేవు గనుక సంపన్న దేశాల నుండి సహాయం అందించి ఆ కొరవను భర్తీ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. తమ లాభాలకు మాత్రం ఏ లోటూ రాకుండా, పేటెంటు చట్టాల సడలింపు జరగకుండా గట్టిగా పట్టుబడుతున్నాయి. అదే సమయంలో మూడవ ప్రపంచ దేశాలలో తమకు పోటీగా కంపెనీలు తయారవకుండా చూసుకుంటున్నాయి.
పేద, మధ్యతరహా దేశాలకు వ్యాక్సిన్ సరఫరా చేయడానికి భారత దేశాన్ని సరఫరా కేంద్రంగా వాడుకోవాలన్నది అమెరికా వ్యూహం. అందుకే బిల్‌గేట్స్ సీరం ఇన్స్టిట్యూట్ మీద దృష్టి పెట్టాడు. ఈ సీరం ఇన్స్టిట్యూట్ ప్రపంచంలోనే అత్యధిక మొత్తంలో వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయగల సామర్ధ్యం ఉన్న సంస్థ. దీని ద్వారా చౌకగా లభించే వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయించి సరఫరా చేయాలని చూస్తున్నారు. ఎక్కువ ధర లభించే ఎం.ఆర్.ఎన్.ఎ తరహా వ్యాక్సిన్ల ఉత్పత్తి మాత్రం తమ వద్దే అట్టిపెట్టుకుంటున్నారు. ఈ చౌక రకాల వ్యాక్సిన్లను వెంటవెంటనే ఉత్పత్తి చేయడం కాకుండా నిదానంగా చేసి ప్రపంచంలో వ్యాక్సిన్ల కొరత ఉండేలా చూసుకుంటున్నారు. అయితే ఈ పథకం పారడంలేదు. రెండో విడత కరోనా విజృంభించిన తర్వాత ఇండియా ఇతర దేశాలకు సరఫరా చేసేందుకు అంగీకరించిన వ్యాక్సిన్ లను అందించడంలో విఫలమైంది.
వ్యాక్సిన్ అందించడం ఆలస్యం అవుతున్నకొద్దీ వైరస్‌లో వచ్చే పరివర్తనల వలన ఆ వ్యాక్సిన్ల ప్రభావం తగ్గిపోతూ ఉంటుంది. కరోనా మళ్ళీ, మళ్ళీ విజృంభిస్తూనే ఉంటుంది. ఆ విధంగా బడా ఫార్మా కంపెనీలకు నిరంతరం లాభాలు వచ్చి పడుతూనే ఉంటాయి. మనకు మాత్రం పదేపదే విధంచే లాక్డౌన్లు, ఆర్థిక కార్యకలాపాలకు ఏర్పడే ఆటంకాలు, సామాజిక దూరం పాటించాల్సిన ఆవశ్యకత వంటివి ప్రాణ సంకటంగా తయారవుతాయి. కాని బడా ఫార్మా కంపెనీలకు మాత్రం లాభాల వర్షం కురుస్తూనే ఉంటుంది.
ఇలా రాబోయే రెండు, మూడేండ్లలో మూడవ ప్రపంచ దేశాలలో ఆర్థిక కార్యకలాపాలు దెబ్బ తిని, సంపన్న దేశాలు సాపేక్షంగా మెరుగైన స్థితిలో కొనసాగితే అప్పుడు ప్రపంచ వ్యాప్త అసమానతలు మరింత పెరుగుతాయి. ఇప్పటికే కరోనా వలన ప్రపంచంలో పేదలు బాగా దెబ్బతిన్నారు. మరోపక్కన సంపన్నుల సంపద 4లక్షల కోట్ల డాలర్ల మేరకు అదనంగా పెరిగింది. అంటే కరోనా మహమ్మారి కాలం నయా ఉదారవాద దోపిడీ మరింత వేగంగా కొనసాగడానికి ఇంకొక రూపంలో తోడ్పడిందన్నమాట. (స్వేచ్ఛానుసరణ)
- ప్రబీర్ పురకాయస్థ