Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెెలంగాణ రాష్ట్రంలో 10 లక్షల మంది రజక వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. సేవావృత్తుల్లో ప్రధానమైన రజకవృత్తి దారులు సామాజికంగా, ఆర్ధికంగా, రాజకీయంగా తీవ్రంగా వెనుకబాటుకు గురవు తున్నారు. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారితో ప్రజల జీవితాలు అతలాకుతల మయ్యాయి. రజక వృత్తిమీద కూడా ప్రత్యక్ష ప్రభావం పడింది. ఈ రెండు సంవత్సరాల కాలంలో వృత్తిపనులు సాగక రజకుల ఆదాయం తగ్గి, జీవన స్థితిగతులపై పెనుభారం పడింది. లాక్డౌన్ సమయంలో రజక వృత్తిదారులను ఇండ్లల్లోకి రానీయకపోవడం, ఇస్త్రీ చేసుకోవడానికి ఎవ్వరూ రాకపోవడం, శుభకార్యాలు పూర్తిగా నిలిచిపోవడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో కుటుంబాలను పోషించుకోలేక ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వృత్తిదారులను ఆదుకోవడంలో ఘోరంగా విఫలమయ్యాయి. ఇప్పుడు కరోనా థర్డ్‌వేవ్ ఏ రూపంలో విజృంభిస్తుందోనని వృత్తిదారులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. మరోపక్కన రజక వృత్తి దారులపై కులవివక్షత, దాడులు, దౌర్జన్యాలు, హత్యాచారాలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి.
ఇటీవల ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం, పెరిక సింగారం గ్రామంలో రజకుల ఇంటిస్థలాన్ని పెత్తందారులు కబ్జాకు గురిచేయడాన్ని అడ్డుకున్నందుకు శిరీష, అనితలపై కర్రలతో దాడి చేశారు. చింతకాని మండలం, నరసింహాపురం గ్రామంలో అకారణంగా రజకులకు కరోనా సోకిందనే నెపంమోపి రజక కుటుంబాలపై దాడులు చేశారు. అనేకమంది మహిళలు, యువకులకు కాళ్ళు, చేతులు విరిగాయి. నారాయణ పేట జిల్లా ఉట్కూరు మండలం, ఎర్రగడ్డపల్లి గ్రామానికి చెందిన 16 సంవత్సరాలల అలివేలుపై అదే గ్రామానికి చెందిన పెత్తందారి యువకుడు అత్యాచారయత్నం చేశాడు. ఆ అమ్మాయి అవమానంగా భావించి పురుగుల మందు తీసుకుని ఆత్మహత్య చేసుకుంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తరువాత 8మంది రజక మహిళలు అత్యాచారాలకు గురయ్యారు. మరో 11 మంది హత్యలకు గురయ్యారు. 40గ్రామాల్లో దాడులకు గురయ్యారు. 7 గ్రామాల్లో సాంఘిక బహిష్కరణలు జరిగాయి. ఇలా రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల్లో రజకులపై దాడులు నిత్యకృత్యంగా కొనసాగు తున్నాయి. వీటిని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఈ ఏడేండ్ల కాలంలో సంక్షేమం, అభివృద్ధి రంగాల్లో తీవ్రమైన వివక్షత కొనసాగుతోంది. 2018-19లో కేటాయించిన రూ.450 కోట్ల నిధులు విడుదల చేయకుండా తీవ్రమైన కాలయాపనకు గురిచేశారు. జీ.వో.190 ప్రకారం 50వేల మంది రజకులు రుణాలకోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగా 7వేల మందికి మాత్రమే రూ.50,000 చొప్పున రుణాలు అందించి, మిగతావారికి ఉత్తి చేతులే చూపించారు. రాష్ట్రవ్యాప్తంగా 17 చోట్ల మెకనైజ్డ్ (ఆధునిక దోభీఘాట్లు) లాండ్రీలు నిర్మిస్తామని చెప్పిన ప్రభుత్వం కొన్నిచోట్ల భూమి పూజ కూడా చేసింది. కానీ ఒక్క సిద్ధిపేటలో మాత్రమే పూర్తి నిర్మాణం జరిగింది. మిగిలిన చోట నిర్మాణాలు ఆగిపోయాయి.
కొత్త దోభీఘాట్ల నిర్మాణానికి నిధులు కేటాయించడం లేదు. ఎన్నో ఉద్యమాల ఫలితంగా ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రవేశపెట్టారు. నేటివరకు 10,400 దరఖాస్తులు ఆన్‌లైన్‌ద్వారా చేయడం జరిగింది. ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రణాళిక ప్రకారం అమలు చేయాలి. ఆత్మగౌరవ భవన నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలి. రజక ఫెడరేషన్‌కు అనుబంధంగా ఏర్పడ్డ 2,700 సహకార సంఘాలకు రుణాలు మంజూరు చేయలేదు. రజక ఫెడరేషన్ పేరుకే ఉంది. పాలకవర్గం ఏర్పాటు చేయకపోవడం, నిధులు కేటాయించకపోవడం రజకుల సంక్షేమం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం.
రాష్ట్రవ్యాప్తంగా అనేక గ్రామాల్లో రజకులు ఎన్నో సంవత్సరాల నుండి పోరాడి సాధించుకున్న అసైన్డ్ భూములు, ఇనాం భూములు, చాకిరేవు స్థలాలను ప్రభుత్వం, భూ కబ్జాదారులు వైకుంఠధామాలు, ప్రభుత్వ కార్యాలయాల పేరుతో అక్రమంగా లాక్కుంటున్నారు. ఆ భూములన్నింటినీ కాపాడి రజకులకు స్వాధీనం చేయాలి.
2018-19లో కేటాయించిన రూ.450 కోట్ల నిధుల బడ్జెట్ విడుదల చేయాలి. జీ.వో. 190 ప్రకారం రజక ఫెడరేషన్ రుణాలు అందించాలి. ఆధునాతన దోభీఘాట్లు నిర్మాంచాలి. రజకులపై దాడులు, దౌర్జన్యాలు, అత్యాచారాలు అరికట్టేందుకు ప్రత్యేక ''రక్షణ చట్టం'' ఏర్పాటుచేయాలి. రజకుల ఇనాం, అసైన్డ్, చాకిరేవుల భూములను కాపాడాలి. బీసీ (ఎ) రిజర్వేషన్స్ విద్యా, ఉద్యోగ రంగాల్లో సమగ్రంగా అమలు పర్చాలి. బీసీ స్థానిక సంస్థల రాజకీయ రిజర్వేషన్లను వర్గీకరించాలి. రజక ఫెడరేషన్‌ను కార్పొరేషన్‌గా మార్చి పాలకమండలి ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ ఆసుపత్రులు, హాస్టల్స్‌లో దోభీఘాట్ పనులు, కాంట్రాక్టులు రజకులకే ఇవ్వాలి. వృత్తి ఆధునిక నైపుణ్య శిక్షణ ఏర్పాటు చేయాలి. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపులో రజకులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. పోలీస్, రైల్వే, విమానయాన, లాడ్జీలు, ప్రభుత్వ తదితర సంస్థల్లోని దోభీపోస్టులను వెంటనే భర్తీ చేయాలి. రజక వృత్తిదారులకు 50 సంవత్సరాల వృద్ధాప్య పింఛన్ ఇవ్వాలి. భూమిలేని రజక వృత్తిదారులకు 3 ఎకరాల భూమి ఇవ్వాలి. బీసీ కార్పొరేషన్ నుండి ప్రతియేటా రుణాలు మంజూరు చేయాలి. కరోనా కాలమంతా ప్రతి రజక వృత్తిదారుడికి నెలకు రూ.7,500 చొప్పున ఇవ్వాలి. వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాలి. రజకుల అభివృద్ధికి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నిటినీ నెరవేర్చి, తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి.
- పి. ఆశయ్య
సెల్:9490098052