Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒక ఊళ్ళో ఒక కుటుంబం తప్ప, మిగతా వాళ్ళందరూ శాఖాహారులు. అప్పుడప్పుడు ఆ మాంసాహారి ఇంటి నుండి వచ్చే వాసనలు శాఖాహారులు భరించలేకపోయేవారు. ఇక లాభం లేదని శాఖాహారులంతా మూకుమ్మడిగా వెళ్ళి గ్రామ పెద్దకు ఫిర్యాదు చేశారు. మాంసాహారిని ఊళ్ళో నుంచి వెళ్ళగొట్టమన్నారు. గ్రామ పెద్ద విశాల హృదయంతో ఆలోచించి నిర్ణయం తీసుకున్నాడు. మాంసాహారిని శాఖాహారిగా మారిస్తే సమస్య తీరిపోతుందని భావించాడు. మాంసాహారిని బలవంతంగా గుళ్ళోని అయ్యవారి దగ్గరికి లాక్కెళ్ళాడు. అతణ్ణి శాఖాహారిగా మార్చమన్నాడు. ఆ దేవదేవుని సన్నిధిలో పూజాకార్యక్రమం ముగించి, సంప్రోక్షణ చేసి ఇలా అన్నాడు..
''నువ్వు పుట్టుకతో మాంసాహారివి. ఇక నుండి శాఖాహారివి అయిపో'' అని మంత్రజలం చల్లాడు. అంతే.. అయిపోయిందని పంపించేశాడు. వేదకాలం నుండి మాంసభక్షణ ఎవరెవరు ఎన్ని రకాలుగా చేసేవారో ఈ మాంసాహారికి తెలుసు. కానీ అక్కడ మాట్లాడడానికి వీలులేదు. చుట్టూ అంత మంది పండితులు, అర్చకులు ఉంటే.. వాళ్ళ పూర్వీకులంతా మాంసాహారులేనని పాపం ఈ ఒంటరి మాంసాహారి ఏమని పెదవి విప్పగలడూ? 'అనువుగాని చోట అధికుల మనరాదు' అన్న విషయం గుర్తుకొచ్చి.. తల వంచి, అందరికీ నమస్కరించి నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు. హమ్మయ్య సమస్య తీరిపోయిందని అందరూ తేలికగా ఊపిరి పీల్చుకున్నారు. కొన్ని రోజులు గడిచాయి. మాంసాహారి ఇంటి నుండి మళ్ళీ మసాలల ఘాటు రాసాగింది. ఏమై ఉంటుందీ అని కొందరు శాఖాహారులు పైకెక్కి వెంటిలేటర్ గుండా మాంసాహారి వంటింట్లోకి తొంగిచూశారు.
అతను స్నానం చేసి తడి గుడ్డతో సంప్రోక్షణ చేస్తున్నాడు. స్టౌ పక్కన కోసిపెట్టిన కోడి మీద గంగాజలం చల్లుతూ కనిపించాడు.. ''నువ్వు పుట్టుకతో కోడివి. ఇక నుండి బంగాళాదుంపవైపో'' అని అరుస్తూ నీళ్ళు చిలకరిస్తున్నాడు.. శాఖాహార పండితులకు ఏమీ అనడానికి లేదు. అయ్యగారు ఆ రోజు మాంసాహారిని శాఖాహారిగా మార్చిన విధంగానే ఇతను మాంసాన్ని బంగాళా దుంపగా మార్చి తింటున్నాడు. అందులో తప్పులు తీయడానికి వీలు లేకుండా అయ్యిందే.. అని వాపోయారు.
కాల క్రమంలో మాంసాహారులు శాఖాహారులైనారు. శాఖాహార కుటుంబాల్లోంచి కొందరు మాంసాహారులయ్యారు. తినే ఆహారాన్ని బట్టి, వేసుకునే దుస్తుల్ని బట్టి, వారి విశ్వాసాలను బట్టి మనుషుల్ని విడదీయడం బుద్దిలేనిపని. ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛ వారికి ఉండాలి. ఒక ప్రజాస్వామ్య దేశంలో అది వీలుకాకపోతే ఎలా? భారతదేశంలో పెరుగుతున్న అసహనాన్ని నిరసిస్తూ తన పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రభుత్వానికి తిప్పి పంపిన ప్రఖ్యాత శాస్త్రవేత్త పి.యం. భార్గవ. అంటే డాక్టర్ పుష్ప మిత్ర భార్గవ - హైదరాబాద్లోని సి.సి.యం.బి. వ్యవస్థాపకుడు. అంతే కాదు గొప్ప సైన్యు కార్యకర్త. ప్రజా సైన్సు ఉద్యమ కారుడు. హేతువాది. పురాతన భారత గ్రంథాల్లో మాంస భక్షణపై పూర్తి సమాచారం ఉందనీ, దాని వినియోగంపై ఎలాంటి నిషేధం ఎప్పుడూ లేదని ఆయన అన్నారు. కొన్ని రోగాలకు బీఫ్ తినాలన్న సూచన ఉందని, ఆయుర్వేదంలో జ్వరానికి, దగ్గుకూ, ఆయసానికి దాన్ని వినియోగిస్తారని భార్గవ వెల్లడించారు.
ప్రస్తుతమున్న భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి, మనుస్మృతిని అమలు చేయాలనుకుంటున్న దేశ భక్తులు - ఎవరో ఇతర మతస్థుడి ఫ్రిజ్లో మాంసం కనిపించిందని, అతణ్ణి బయటికి లాగి ఎందుకు కొట్టి చంపినట్టూ? అసలు వారి మనుస్మృతిలో మాంసభక్షణ గురించి ఏముందో ఏమి లేదో తెలుసు కున్నారా? మాంసా హారులు శాఖాహారులుగా ఎందుకు మారాల్సి వచ్చిందో అవగతం చేసుకున్నారా? బ్రాహ్మణుల మాంసాహార భక్షణ గురించి మనుస్మృతి ఏం చెపుతుందో ఒకసారి చూడండి. ఇలాంటి విషయాల గూర్చి ప్రవచనకారులు నోరెత్తరు.. గమనించండి.
ఉల్లిపాయలు, గోంగూర, మునగ, ఇంగువల్ని బ్రాహ్మడు తినగూడదు. (15వ అధ్యాయం: 19వ శ్లోకం) అన్ని వర్ణాల వారూ ఎద్దు, పంది, తాబేలు మాంసాలు తినవచ్చు (5వ అధ్యాయం: 18వ శ్లోకం) శ్రార్దమందు అంటే తద్దినం సమయంలో, మధుపర్కాదులందు మాంసం తినని బ్రాహ్మడు 21సార్లు పశువుకు జన్మిస్తాడు (మనుస్మృతిలోని బూతుమాట ఇక్కడ వాడలేదు 4వ అధ్యాయం: 35వ శ్లోకం). శాఖాహారం వల్ల మొదటి నెల, చేపల వల్ల రెండో నెల, జింక మాంసం వల్ల మూడోనెల, గొర్రె మాంసం వల్ల నాలుగో నెల, పక్షి మాంసం వల్ల అయిదో నెల, మేక మాంసం వల్ల ఆరో నెల, చారల లేడి మాంసం వల్ల ఏడోనెల, గొడ్డు మాంసం వల్ల ఎనిమిదో నెల, దున్నపోతు మాంసం వల్ల తొమ్మిదో నెల, కొమ్ములేని మేక మాంసం వల్ల పదోనెల, ఆవుపాల ద్వారా పదకొండో నెల, ఖడ్గమృగ మాంసం ద్వారా పన్నెండోనెల - పరలోకంలో ఉన్న పితరులు తృప్తిపొందుతారు (మనుస్మృతి 3వ అధ్యాయం: 267-272 శ్లోకాలు). ఇక్కడ గమనించాల్సిన విషయమేమంటే పరలోకంలోని పితరులెవరూ వచ్చి ఆయా మాంసాహారాలు తినరు. తినేది ఈ లోకంలో ఉన్నవారే!
ఏయే జంతువుల మాంసం ఎంత రుచిగా ఉంటుందో మనుస్మృతి కర్తలు పూర్తిగా రుచి చూసి, ఆస్వాదించి, ఆనందించిన తర్వాతనే తమ ధర్మ శాస్త్రాల్లో నమోదు చేసి ఉంటారు కదా? ఇలాంటి విషయాలు మనుస్మృతిలోనే కాక, విష్ణుస్మృతి, వశిష్ట స్మృతి, బోధాయ స్మృతి వంటి స్మృతుల్లో బ్రాహ్మణులు మాంసం తినేవారని స్పష్టంగా రాశారు. అంతే కాదు, రుగ్వేద కాలం నుండి రామాయణ రచనా కాలమూ - ఆ తర్వాత మనుస్మృతి రచనా కాలం వరకు బ్రాహ్మణులు గొడ్డు మాంసంతో పాటు అన్ని రకాల మాంసాల్ని తృప్తిగా భుజించేవారని తిరుగులేని సాక్ష్యాలు, ఆధారాలూ ఉన్నాయి. వారు వారి పితృ దేవతలకు ఆ మాంసాల్నే నైవేద్యంగా సమర్పించేవారు. ఆ తర్వాత నైవేద్యాల్ని ఎవరు ఆరగిస్తారో మనకు తెలుసు.
రుగ్వేదం (తెలుగు: యలమంచిలి) మొదటి మండలంలోని కొన్ని విషయాలు గమనించండి. సురాపానం, మాంసాహార భక్షణ గూర్చిన అంశాలు ఎలా ఉన్నాయో.. ''ఓ చూడదగిన వాయుదేవుడా! మేము నిన్న సోమరసం త్రాగడానికే పిలుస్తున్నాము. మా మొరాలకించుము (1-2-1). ఓ ఇంద్రుడా! ఓ వాయుదేవుడా! మీరిద్దరూ మాకు యివ్వటానికి ధాన్యాదులను తీసుకురండి. మా వద్ద సోమరసం సిద్ధంగా ఉంది. అది మీ ఇద్దర్నీ ప్రేమిస్తున్నది (1-2-4). తేజస్సు గల ఓ ఇంద్రుడా! గౌతమ వంశీయులమైన మేము నీకు గుర్రం మాంసంతో నైవేద్యాన్ని సమర్పించి నమస్కరిస్తూ నిన్ను స్తుతించాము. ఇక నీవు రకరకాలైన ధన-ధాన్యాలను మాకు ప్రసాదించుము (1-63-9). ఓ అగ్నిదేవుడా! మాకు ఉపయోగపడే ఆవులు మొదలైన పశువులను పొగడదగినవిగా చేయుము. జనులందరూ మాకు కానుకల రూపములో ధనం ఇచ్చెదరు గాక! ఏ విధంగానైతే ముసలి తండ్రి నుండి కొడుకు సంపత్తిని పొందుతున్నాడో, అదే విధంగా ''యజ్ఞం చేసేవారు'' నిన్ను సేవిస్తూ యజ్ఞ స్థలాలలో ధనాన్ని పొందుతున్నారు (1-70.5)'' దేవతలను సేవిస్తున్నామన్న నెపంతో సామాన్య జనం నుండి ధనం సంపాదించడం ఇందులో స్పష్టంగా ఉంది. గౌతమ వంశీయులెవరో, యజ్ఞయాగాలు నిర్వహించేదెవరో, కనపడని వాయుదేవుడి పేరు, ఇంద్రుడి పేరు చెప్పి నైవేద్యాలు సమర్పించే దెవరో, అంతంత మాంసాలు ఆరగించిందెవరో ఇప్పుడు అందరికీ తెలుసు. తండ్రి నుండి కొడుకు వారసత్వంగా సంపత్తిని పొందినంత సులభంగా జనం తమకు ధనాన్ని సమర్పించాలని బహిరంగానే చెప్పుకున్నారు. అందులో రహస్యమేమీ లేదు.
''కర్మ నిర్వహించని వాడు, స్తోత్రజ్ఞుడు కానివాడు, సోమయజ్ఞం చేయనివాడు పాపాత్మకమగు ఐహిక భాష నేర్చును. మూర్ఖుడగును. నాగలి పట్టువాడగును'' అని రుగ్వేదంలో (10-71-9) ఉంది. నాగలి పట్టడం నీచమైన పనిగా చెప్పడం ఏమిటి? సంభావనలు స్వీకరించడం (అడుక్కోవడం) ఉన్నతమైందిగా భావించడమేమిటీ? ''దేవతలమీద నమ్మకంతో ఉండాలి. ఈ లోకంలో బ్రాహ్మణులతో కర్మ నిర్వహించాలి. అంటే రకరకాల పూజలు చేయిస్తూ వారికి దానాలు ఇస్తూ ఉండాలి. అలా చేయకపోతే వాడు నాగలిపట్టు వాడగును'' అని జనాన్ని భయపెట్టడం దేనికీ? గింజ ప్రాధాన్యత, మొక్క ప్రాధాన్యత, వ్యవసాయం ప్రాధాన్యత, రైతు ప్రాధాన్యత తెలుసుకోని వేద రచయితల అవగాహన ఏ పాటిదో ఇంకా వివరంగా చెప్పుకోనక్కరలేదు. విశ్వం ఏర్పడిందెట్లాగో తెలియదు. కనీసం నీరు ఎలా ఏర్పడిందో తెలియదు. జీవం ఎలా ఏర్పడిందో తెలియదు. పరిణామ వాదం ఒప్పుకోరు. ఎప్పుడో తెలివిలేని కాలంలో రాయబడ్డ రచనలు ఇప్పుడు ఈ సమాజానికి అక్కరలేదంటే ఒప్పుకోరు. అందుకు ఉదాహరణలు కోకొల్లలు. అజ్ఞానం పంచే ఇలాంటి గ్రంథాలకు పైగా భాష్యాలు చెపుతారు. అందుకే చూడండి అజ్ఞానం పెంచే మనువాద గ్రంథాలకే భాష్యాలు, వివరాలూ ఉంటాయి. ప్రవచన కారులు ఇప్పటికీ వాటినే పట్టుకుని వదలరు. అక్కడక్కడ కొంత ఆధునిక ఆలోచనా ధోరణిని జోప్పిస్తున్నట్టు భ్రమింపజేస్తూ.. మళ్ళీ జనాన్ని పాత రాతియుగంలోకి లాక్కెళుతుంటారు. ఎక్కడికక్కడ జాగ్రత్తగా గమనించుకుంటూ, ఎప్పటికప్పుడు నిరసిస్తూ రాకపోతే... ముందుకు సాగలేం! జ్ఞానాన్ని పెంచే గ్రంథాలకు భాష్యాలు, వివరణలూ ఉండవు. ఆ జ్ఞానాన్ని అందుకోగల నేపథ్యం సమకూర్చుకుని, సిద్ధపడి, దాన్ని అందుకుని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అందుకు ఉపాధ్యాయులు సహాయపడతారు. ఏ విషయ పరిజ్ఞానమూ లేని ప్రవచనకారులు, మత బోధకులు తమ అజ్ఞానాన్ని జనం మీద ధారాళంగా గుప్పిస్తుంటారు. తేడా తెలుసుకో గలిగిన వారే జ్ఞానవంతులవుతారు. చివరగా, మాంస భక్షణ గురించి జాతిపిత మహాత్మాగాంధీ ఏమన్నారో చూడండి.. ''వాస్తవంగా మాంసం తినే వ్యక్తి కంటే, మరొకరిని మాంసం తినొద్దని బలవంత పెట్టి నిర్బడంధాలు విధించే వ్యక్తే ఎక్కువ హింసకు పాల్పడినట్టు.''
వ్యాసకర్త: సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త.
- డాక్టర్ దేవరాజు మహారాజు