Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఛందోబద్ధ కవిత్వం
తమకే సాధ్యమని విర్రవీగే
సంప్రదాయ కుపండితుల
కోరలు విరిచి తనదైన జెండాను
రెప రెపలాడిస్తూ తెలుగు సాహితీ
జగాన ధ్వజ స్తంభమై నిలిచిన
కవిచక్రవర్తి జాషువా !
మనిషికికావల్సింది మానవత్వమని
అంతరాలులేని, వర్ణతేడాలు కనని
అందమైన సమాజం రావాలని
కలాన్ని కత్తిగా ఝళిపిస్తూ
కులపు దుర్గంధాన్ని చెండాడిన
'ఫిరదౌసి' యోధుడవు నీవే!
అంటరాని తనం గబ్బును
ఉతికి ఆరేసి 'గబ్బిలం' కవనంతో
సాహితీ క్షేత్రాన్ని సుసంపన్నం
చేసిన మహాకవివి, మా కవివి!
కవి సామ్రాట్ల సరసన
సహపంక్తిలో నీదైన గళాన్ని
ఎలుగెత్తి పలికిన కళారవి
కళా ప్రపూర్ణ, పద్మ విభూషణా
ప్రజాకవీ నీకు బిరుదులు లెక్కా?
అలనాడు అన్నమయ్య అన్నట్టు
నిండార రాజు నిద్రించు నిద్రయు
అండనే బంటు నిద్రయూ ఒకటే...
ఇచ్చోటనే రాజులు, సత్కవులు పోయాక
దహనంకోసం చేరే మహాప్రస్థానం
అందరికీ ఒకటే
అంటూ జీవన సత్యాన్ని చాటి
శ్మశాన వైరాగ్యాన్ని తెలుగువాడి
నోటి పాటగా నిలిపిన సత్కవీ!
తెలుగు కవిత్వపు తోటలో
కారునలుపు కమ్మిన రోజుల్లో
కవి కోకిలవై పలికిన
నీ వెలుగు పద్యాలు
పాడుకోని నాటకరంగం
పాటలు పాడని పాటగాడు
నీ మాటలు తలచుకోని
పాఠకులు లేరనేది సత్యం!
హేతువాదం, సమానత్వం
కలలు కన్న నీ సుందర స్వప్నం
ఆవిష్కరించబడే వరకు...
అణచివేత, అంటరాని తనం
కులవివక్షత కూలిపోయే దాకా
నీ కవిత్వం నిలిచే ఉంటుంది!
- డాక్టర్ కె దివాకరా చారి