Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పెగాసస్ స్పైవేర్ కుంభకోణం కేవలం గోప్యతా హక్కును ఉల్లంఘించడం, అక్రమంగా నిఘా పెట్టడం, భద్రతా సంస్థల స్నూపింగ్‌కి సంబంధించినది మాత్రమే కాదు. అంతకంటే చాలా ఎక్కువే ఉంది. పెగాసస్ మిలటరీ గ్రేడ్ స్పైవేర్‌తో నిఘా విధించడం, హ్యాకింగ్ చేయడమనేది సరికొత్త స్థాయిలో ఉంటుంది. దీనికి సంబంధించిన విస్తృతమైన దృశ్యం అస్పష్టంగా ఉండకూడదు.
గత ఏడేండ్లుగా నిర్మించుకుంటూ వచ్చిన విస్తృతమైన నిరంకుశవాద నిర్మాణంలో భాగమే ఈ పెగాసస్ ప్రాజెక్టు. నిరంకుశ హిందూత్వ పాలనను స్థాపించి, సుస్థిరం చేసేందుకు ఎటువంటి మార్గాలనైనా అనుసరిస్తామనే సందేశం దీని ద్వారా ఇస్తోంది. యు.ఎ.పి.ఎ మాదిరిగా, బీమా కోరెగావ్ కేసులోని నిందితుల కంప్యూటర్లను హ్యాక్ చేసి అందులో మాల్వేర్ను పెట్టేందుకు... బెదిరించ డానికి, జైలు శిక్ష విధించడానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఇతర కేంద్ర సంస్థలను ఉపయోగించి నట్లుగా... ప్రత్యర్థులపై పెగాసస్‌ను సైబర్ ఆయుధంగా ఉపయోగిస్తున్నారు.
ఇజ్రాయిల్ కంపెనీ ఎన్.ఎస్.ఓ తయారు చేసిన పెగాసస్ స్పైవేర్ వాడకం... భారత్‌లో ఏం వెల్లడిచేస్తోంది? ఎన్.ఎస్.ఓ డేటా బేస్ నుండి ఫ్రెంచి ఎన్జిఓకు లీకైన ప్రపంచవ్యాప్తంగా వున్న 50 వేల ఫోన్ నెంబర్లలో దాదాపు వెయ్యి నెంబర్లు భారత్‌కి చెందినవే. పెగాసస్ స్పైవేర్‌కు నిఘా లక్ష్యాలుగా వీరు మారనున్నారు. వీరిలో 300 నెంబర్లను పరిశీలించి నిర్థారించారు. ఈ జాబితాలో... ప్రతిపక్ష నేతలు రాహుల్ గాంధీ, టి.ఎం.సి నేత అభిషేక్ బెనర్జీ ఉన్నారు. కర్నాటకలో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వ అప్పటి ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి సహాయకుల నెంబర్లు ఉన్నాయి. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వంలోని ఇద్దరు మంత్రులు, వారిలో ఒకరు 2017లో కనీసం ఎం.పి కూడా కాదు. 40మంది జర్నలిస్టులు, ఎన్నికల కమిషన్ సభ్యుడు ఒకరు, ఉమర్ ఖలీద్ వంటి విద్యార్థి కార్యకర్తలు, రైల్వే కార్మిక సంఘ నేత... ఇలా చాలా మంది ఉన్నారు. ఈ స్పైవేర్‌ను ఉపయోగిం చడం వల్ల కలిగే ప్రయోజనాలు, వాటి ధోరణి స్పష్టమవుతోంది. అధికారంలో వున్న వారిని రక్షించేందుకు, ప్రతిపక్షాలను అస్థిరపరిచేందుకు, మీడియాలో పరిశోధనాత్మక గళాలను పర్యవేక్షించ డానికి ఇది రూపొందించబడింది.
అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తిపై లైంగిక వేధింపుల గురించి ఫిర్యాదు చేసిన మహిళ, ఆమె బంధువుల ఫోన్ నెంబర్లను ఈ స్పైవేర్తోనే లక్ష్యంగా చేసుకున్నారు. కీలకమైన స్థానంలో ఉన్నవారిని రక్షించేందుకు ఇది ఉద్దేశించ బడింది. ఇలా సేకరించిన సమాచారాన్ని న్యాయ వ్యవస్థ పరపతి కోసం ఉపయోగించవచ్చు.
మోడీ ప్రభుత్వ హయాంలో రాజ్యాంగ సంస్థలు దెబ్బ తింటున్నాయన్న మాటలు నిరంతరం వినిపిస్తున్నాయి. మోడీకి అనుకూలంగా ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్దిష్ట నిర్ణయాలపై అసమ్మతి వ్యక్తం చేసిన ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసాను లక్ష్యంగా చేసుకోవడం చూస్తే, రాజ్యాంగ సంస్థల నిర్వాహకులను బెదిరించడానికి, నిరోధించడానికి అవసరం అనుకుంటే బ్లాక్మెయిల్ చేయడానికి ఈ స్పైవేర్‌ను ఎలా ఉపయోగిస్తున్నారో అర్ధమవుతోంది.
ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి, మన ప్రజాస్వామ్యాన్ని మసకబార్చేందుకు చేసిన కుట్రగా మోడీ ప్రభుత్వం ఈ పెగాసస్ డేటాబేస్ వెల్లడిని కొట్టిపారేస్తోంది. పార్లమెంట్లో కేంద్ర సమాచార సాంకేతికశాఖ మంత్రి వైష్ణవ్ మాట్లాడుతూ, ఆ జాబితా నిరాధారమైనదని ఎన్.ఎస్.ఓ చేసిన ప్రకటనను తమ వాదనకు సమర్థింపుగా ప్రస్తావించారు. అయితే పెగాసస్ స్పైవేర్‌ను కొనుగోలు చేసేందుకు ఏ ప్రభుత్వ సంస్థ అయినా ఎన్.ఎస్.ఓను సంప్రదించిందా లేదా అనేది వెల్లడించలేదు. దేశంలో అనధికారికంగా నిఘా విధించడం సాధ్యం కాదని మాత్రమే పునరుద్ఘాటించారు. ఎన్.ఎస్.ఓ నుండి స్పైవేర్‌ను ఉపయోగించడం గురించి తమకేమీ తెలియదని ప్రభుత్వం బూకరిస్తోంది. వాస్తవానికి, 2019లో కూడా ఇలాగే తిరస్కరించింది. పెగాసస్‌ను ఉపయోగించి భారత్‌లో 121 మంది ఫోన్లు హ్యాక్ అయ్యాయని ఆనాడు వాట్సప్ పేర్కొంది. ఆ జాబితాలో బీమా కోరెగావ్ కేసు నిందితుల్లో కొంతమంది ఉన్నారు. తీవ్రవాద కార్యకలాపాలు, తీవ్రమైన నేరాలను నివారించాలనే ఏకైక లక్ష్యం, ప్రయోజనంతోనే ప్రభుత్వ నిఘా సంస్థలు, లా ఎన్ఫోర్స్మెంట్ సంస్థలకు తమ ఉత్పత్తులను, సేవలను అందిస్తున్నామని ఎన్.ఎస్.ఓ తన అధికార వెబ్సైట్లో పేర్కొంది. ఇజ్రాయిల్ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన రక్షణ ఎగుమతుల నియంత్రణ సంస్థ పర్యవేక్షణ కింద ఈ లైసెన్సులు ఇవ్వబడతాయని తెలుస్తోంది.
అంటే, భారత్‌లో ఏ ప్రయివేటు సంస్థ కూడా వీటిని సమకూర్చుకోవడం అసాధ్యం. పైగా, హెచ్.డి. కుమారస్వామి సహాయకుడి ఫోన్ నెంబర్ పట్ల ఏ విదేశీ ప్రభుత్వానికి లేదా సంస్థకు ఆసక్తి ఉంటుంది? లేదా జార్ఖండ్‌లో ఆదివాసీలను తమ భూముల నుండి వెళ్ళగొడుతున్న కార్యకలాపాలను వెలికి తీస్తున్న జర్నలిస్టు గురించి ఎవరికి కావాలి?
అందరి వేళ్ళు మోడీ ప్రభుత్వం, దాని భద్రతా సంస్థల వైపే చూపిస్తున్నాయి. ఇతర దేశాల్లో సాక్ష్యాధారాల విచారణ చూస్తే ఇది మనకు మరింత స్పష్టమవుతోంది. మెక్సికోలో మొత్తంగా 15 వేల మంది నెంబర్లు లక్ష్యంగా మారాయి. అందులో 50మంది ప్రస్తుత అధ్యక్షుడు మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడర్కు అత్యంత సన్నిహితులు. అధ్యక్షుని భార్య, పిల్లలు, సహాయకులు, డాక్టర్ అందరి నెంబర్లూ నిఘా నీడలోనే వున్నాయి. కానీ, 2017లో ఒబ్రాడర్ ప్రతిపక్ష నేతగా ఉన్నపుడు ఇదంతా జరిగింది.
మొదటిసారిగా 2011లో రక్షణ మంత్రిత్వ శాఖ, తర్వాత జాతీయ భద్రతా నిఘా సర్వీసు, ఇతర ప్రభుత్వ భద్రతా బలగాలు ఈ పెగాసస్ స్పైవేర్‌ను తీసుకున్నారని మెక్సికన్ ప్రభుత్వం ధృవీకరించింది. పెగాసస్ స్పైవేర్‌ను సమకూర్చుకున్నామని మెక్సికో అంగీకరించినట్లు తెలుస్తోంది. కానీ భారత ప్రభుత్వం అలా చేయడానికి తిరస్కరిస్తోంది. అయితే జరిగిన పరిణామాల వరుస క్రమం చూస్తే విషయం తేటతెల్లమవుతోంది. 2017 జులైలో ప్రధాని నరేంద్ర మోడీ ఇజ్రాయిల్‌లో పర్యటించారని కొన్ని మీడియా సంస్థలు తెలిపాయి. ఇజ్రాయిల్‌లో పర్యటించిన తొలి భారత ప్రధాని మోడీనే. ఆ సమయంలోనే అంటే జులైలోనే భారత్‌లో స్పైవేర్‌ను ఉపయోగించారని తెలుస్తోంది. అయితే, మోడీ పర్యటనకు ముందుగా, ఆయన పర్యటనకు అవసరమైన సన్నాహాలు చేయడానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మార్చిలో ఇజ్రాయిల్ వెళ్ళారు. మీడియాలో వచ్చిన అధికార సమాచారం ప్రకారం, భద్రతా సహకారానికి తీసుకోవాల్సిన కొత్త చర్యలపై చర్చించారని తెలిసింది. తీవ్రవాదం, భద్రతా రంగాల్లో మరింత బలమైన సంబంధాలు కోసం ఈ పర్యటనా సమయంలో కసరత్తు చేశారని తెలిసింది.
ఇజ్రాయిల్ ఆయుధాలకు భారత్ అతి పెద్ద వినియోగదారు. అంతర్గత భద్రతా ప్రయోజనాలకు అవసరమైన పరికరాలు, సాంకేతికతను అందించడంలో కూడా ఇజ్రాయిల్ కీలకం. భారత్‌లో నిఘా, భద్రతా సంస్థలు ఉపయోగిస్తున్న పెగాసస్ స్పైవేర్ కూడా చాలా ఖరీదైనది. చట్టాలను ఉల్లంఘించినవారు, అన్ని చట్టపరమైన హద్దులను అతిక్రమించినవారి జవాబుదారీతనాన్ని నిర్ధారిం చడమనేది ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణకు, ప్రజల హక్కులను కాపాడేందుకు అత్యవసరం. మోడీ ప్రభుత్వం దీనికి తిరస్కరిస్తూ, దోషులను కాపాడాలని చూస్తున్నందున, ఉన్నత స్థాయిలో దర్యాప్తు జరపడం అనివార్యం. సుప్రీంకోర్టు ఇటువంటి విచారణపై చొరవ తీసుకుని, పర్యవేక్షించాలి.
'పీపుల్స్ డెమోక్రసీ' సంపాదకీయం