Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచ జనాభా దినోత్సవం (జులై 11) నాడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ 'యూపీ జనాభా నియంత్రణ విధానం - 2021-2022'ను విడుదల చేశాడు. ఇద్దరు పిల్లలకు మాత్రమే జన్మనివ్వాలనే నియమం పాటించిన వారికి ప్రోత్సాహకాలు, పాటించని వారికి జరిమానాలు విధించే బలవంతపు చర్యల గురించి విన్నవారంతా ఆశ్చర్యపోయారు. జనాభా నియంత్రణకు ఒక సహేతుకమైన విధానాన్ని అనుసరించడానికి బదులు, ముఖ్యమంత్రి తల్లీ పిల్లల హక్కులను నిరాకరించే చట్టాన్ని అమలుకు పూనుకున్నాడు. భారతదేశం లాంటి దేశంలో జనాభా నియంత్రణ చర్యలు నిర్హేతుకమని ఎవరూ అనరు, కానీ నియంత్రణ బిల్లులో బలవంతపు చర్యలను నేర్పుగా పొందుపరిచిన తీరు మహిళల హక్కులను కాలరాయడమే అవుతుంది. యూపీ ముఖ్యమంత్రి, కేరళలో విద్య, వైద్య రంగాల్లో ప్రభుత్వం చేపట్టిన చర్యల ద్వారా పొందిన ఫలితాల గురించి తెలుసుకోవాలి. ఉత్తమమైన సామాజిక సూచికలతో కేరళ రాష్ట్రంలో తక్కువ సంతానోత్పత్తి రేటు (అవగాహన తో స్వచ్ఛంద ఎంపికపై ఆధారపడి) నమోదైంది.
యోగీ ఆదిత్యనాథ్ ప్రపంచ వ్యాప్తంగా జనాభా గురించి జరిగిన చర్చల విషయం కూడా మాట్లాడాడు. 1994 లో 'జనాభా - అభివద్ధి'పై కైరోలో జరిగిన అంతర్జాతీయ మహాసభ, ''అభివృద్ధే ఉత్తమమైన సంతాన నియంత్రణా సాధనం'' అనే నినాదాన్ని ఇచ్చింది. ఆ నినాదాన్ని భారతదేశంతో పాటు 179 దేశాలు అంగీకరించి, సంతకాలు కూడా చేశాయి. ప్రోత్సాహకాలు, జరిమానాలు జనాభా స్థిరీకరణలో చాలా పరిమితమైన పాత్రనే పోషిస్తాయి. వాటి స్థానంలో ప్రజల్లో అవగాహన కల్పించి, వారే స్వచ్ఛందంగా సంతాన స్థిరీకరణలో భాగస్వామ్యం అయ్యే విధానాన్ని 'జాతీయ జనాభా విధానం 2000'లో ప్రభుత్వం తీసుకుంది. ఇందుకు భిన్నమైన 'ఉత్తరప్రదేశ్ జనాభా నియంత్రణ బిల్లు 2021'ని పౌరుల హక్కులపై చేసే ఒక పాశవిక దాడిగా, ఇది 'మైనారిటీ వ్యతిరేక' బిల్లుగా, రేపు యూపీలో జరగబోయే ఎన్నికల్లో ప్రజలను విభజించేందుకు చేసే కుట్రలో భాగమే ఈ బిల్లని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకసారి లోతుల్లోకి వెళ్లి పరిశీలిస్తే, పేదలు, మహిళలు, పిల్లలకు వ్యతిరేకంగా ఈ బిల్లు వారి హక్కులను నిరాకరిస్తుందని అర్థమవుతుంది.
భారీ అసమానతలు పెరిగిన నయా ఉదారవాద సంస్కరణల కాలంలో, రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా కల్పించిన హక్కులను ఈ బిల్లు నిరాకరించిన ఫలితంగా సంతానోత్పత్తిపై ఆధారపడి ఈ బిల్లు రెండు రకాల పౌరులను సృష్టిస్తుంది. సామాజిక, ఆర్థిక సూచికలైన పేదరికం, ఆరోగ్యం, అక్షరాస్యత, శిశు మరణాలకు ముడిపడి సంతానోత్పత్తి రేటు ఉండడం అనేది చాలా కాలంగా ఉంటుంది. 'జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే'(నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే) ప్రకారం, సంతానోత్పత్తి రేటు షెడ్యూల్డ్ తెగలు, దళితులు, ముస్లింలు, ఓబీసీల లాంటి సామాజిక వర్గాల్లోనే అధికంగా ఉంది. జనాభాలో, ఆ వర్గాలకు చెందిన తక్కువ ఆదాయం కలిగిన మహిళల్లో సంతానోత్పత్తి రేటు అధికంగా ఉంది. సామాజికంగా అణచివేతకు గురవుతున్న ఈ పేదలనే, ఈ జనాభా నియంత్రణ బిల్లు శిక్షిస్తుంది.
ఈ బిల్లులోని 8వ క్లాజ్, దానిలో ఉన్న అనేక సబ్ క్లాజ్లు, ఇద్దరు పిల్లలకు మాత్రమే జన్మనివ్వాలనే నియమాన్ని పాటించని వారికి అన్ని రకాల ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ది పొందే అవకాశం లేకుండా, ప్రభుత్వ ఉద్యోగాలు, ఉద్యోగాల్లో పదోన్నతులను కూడా నిరాకరించడం ద్వారా కార్మిక హక్కులను ఉల్లంఘిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో ఎస్సీ, ఎస్టీలలో సంతానోత్పత్తి రేటు అధికంగా ఉంటుంది కాబట్టి ఈ బిల్లు రిజర్వేషన్లపై కూడా ప్రభావం చూపుతుంది. ఈ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత, ఒకవేళ మూడవ బిడ్డకు జన్మనిచ్చిన వారికి ఇళ్ళు, విద్య, అనేక సామాజిక భద్రతా పథకాలు నిరాకరించబడతాయి. అంటే మూడవ బిడ్డకు అంగన్వాడీ కేంద్రానికి, లేక మధ్యాహ్న భోజన పథకంలో కూడా ప్రవేశం ఉండదు. కేవలం నలుగురు సభ్యులకు మాత్రమే సబ్సిడీ రేషన్ ఇవ్వాలనే ఒక ప్రత్యేక సబ్ క్లాజ్ వలన ఎటువంటి నియమనిబంధనలు లేని ఆహార భద్రతా చట్టం ఉల్లంఘనకు గురవుతుంది. ఈ బిల్లులో ప్రస్తుతం అమలులో ఉన్న ఏ ఇతర చట్టాన్నైనా తిరస్కరించే ఒక క్లాజ్ ఉంది. పార్లమెంట్ ఆమోదించిన ఒక జాతీయ చట్టం ద్వారా లబ్దిపొందే స్థితిలో ఉన్న పౌరులను ఒక రాష్ట్ర ప్రభుత్వం అనర్హులను చేయవచ్చా? ఈ మధ్యే ఢిల్లీ ప్రభుత్వం రేషన్‌ను ఇంటింటికి వెళ్ళి ఇచ్చే ఒక పథకాన్ని ప్రతిపాదించినప్పుడు, ఇది ఆహార భద్రతా చట్టానికి వ్యతిరేకం అని కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. మరి ఇప్పుడు ఆహార భద్రతా చట్టానికి వ్యతిరేకంగా పిల్లల రేషన్‌లో కోత విధించే ఈ 'జనాభా నియంత్రణ బిల్లు ప్రతిపాదన' విషయంలో కేంద్రం ఎందుకు మౌనం వహిస్తున్నట్టూ? ఇలాంటి విధానాలు ఆకలి, పౌష్టికాహార లోపం, శిశు మరణాల రేటును దారుణంగా పెంచడానికి దారి తీస్తాయి. పుట్టిన బిడ్డను ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఎలా శిక్షిస్తుంది?
చారిత్రకంగా అన్ని జనాభా నియంత్రణ విధానాలు, మహిళల శారీరక నియంత్రణ, వారి పునరుత్పత్తి హక్కుల నిరాకరణ పైనే కేంద్రీకరించాయనే విషయం మనకు తెలిసిందే. మగ పిల్లల ప్రాధాన్యతా సంస్కృతికి తోడు లింగ నిర్ధారణ పరీక్షలు, ఆడపిల్లలు పుట్టకుండా గర్భస్రావాలు చేయించడం ద్వారా భారతదేశంలో పితృస్వామిక విశ్వాసాలు బలపడతాయి. ఉత్తరప్రదేశ్‌లో లింగ నిష్పత్తి ప్రతీ 1000 మంది పురుషులకు, కేవలం 903 మంది స్త్రీలు ఉండగా, కేరళలో 1047, తమిళనాడులో 954 మంది స్త్రీలు ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇద్దరు పిల్లలకు మాత్రమే జన్మనివ్వాలనే నియమాన్ని విధించడం అంటే, గర్భిణీ స్త్రీలు లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకొని, అమ్మాయి అని తేలితే, అబ్బాయి కోసం గర్భ స్రావం చేయించుకునే పరిస్థితికి దారి తీస్తుంది. నియంత్రించవలసింది మహిళల సంతానోత్పత్తిని కాబట్టి, 'జనాభా నియంత్రణా చర్యలు' మహిళలపై అసమానమైన ప్రభావాన్ని కలిగి ఉంటాయి.
గతంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హతగా 'ఇద్దరు పిల్లల' నియమాన్ని విధిస్తూ చట్టాలను అమలు చేసినప్పుడు ప్రతికూల ఫలితాలను చవిచూడాల్సి వచ్చింది. ఆ సమయంలో ముగ్గురు పిల్లలు ఉన్నారనే కారణంతో అనేక మందిని ఎన్నికల్లో అనర్హులుగా పోటీ నుంచి తప్పించాయి. అనర్హులలో 78శాతం మంది, జనాభాలో సామాజికంగా బలహీన వర్గాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు ఉన్నారు. వారిలో సగం మందికి పైగా 20వేల రూపాయల కన్నా తక్కువ సంవత్సరాదాయాన్ని కలిగి ఉన్నారు. మహిళలపై ప్రభావం చూపుతుందన్న కారణంగా, మహిళా సంఘాలు ఇటువంటి చట్టాలను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టుకు వెళ్తే, కోర్టు కూడా ఆ చట్టాలను సమర్థించింది.
ప్రభుత్వోద్యోగులకు పదోన్నతులు, వడ్డీలేని రుణాల లాంటి ప్రోత్సాహకాలు ('ఉద్యోగి లేదా అతని భార్య/ ఆమె భర్త') ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత గర్భ నిరోధక ఆపరేషన్ చేయించుకునే నిబంధనతో మాత్రమే అందజేస్తారు, ఒక బిడ్డ పుట్టిన తర్వాత అయితే ప్రోత్సాహకాలను పెంచుతారు. అంటే దీనివల్ల మహిళలు మాత్రమే గర్భనిరోధక ఆపరేషన్ చేయించుకునే విధంగా వారిపై ఒత్తిడి పెరుగుతుంది. నేషనల్ హెల్త్ మిషన్ 2017-18 నివేదిక ప్రకారం భారతదేశంలో 93.1శాతం మహిళలు గర్భ నిరోధక ఆపరేషన్లు చేయించుకున్నారంటే మహిళలపై ఎంత ఒత్తిడి ఉందో అర్థం చేసుకోవచ్చు. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-5 నివేదిక దాదాపు అన్ని రాష్ట్రాల్లో సంతానోత్పత్తి రేటు గణనీయంగా తగ్గినట్టు తెలియజేస్తుంది. 2006 నుండి 2016 మధ్య కాలంలో హిందూ కుటుంబాల్లో సంతానోత్పత్తి రేటు 2.6 నుండి 2.1కు, ముస్లిం కుటుంబాల్లో 3.4 నుండి 2.6కు తగ్గిందని ఒక నివేదిక తెలిపింది. అస్సాం లో ముస్లిం మహిళల సంతానోత్పత్తి రేటు 3.7 నుండి 2.4కు పడిపోగా, ఇప్పుడు ఆ రాష్ట్రంలో ముస్లింల జనాభా పెరుగుతుందని, దానిని నియంత్రించడానికి ప్రజలకు అవగాహన కల్పించడం కోసం జనాభా నియంత్రణ సైన్యాన్ని వినియోగిస్తున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ బిస్వా శర్మ అన్నాడు. దేశంలో జనాభా పెరుగుదలకు మూలకారణం ముస్లింలనీ, సంఫ్‌ు పరివార్ శక్తులు ముస్లింలకు వ్యతిరేకంగా తమ రాజకీయ ప్రచారాన్ని ప్రారంభించాయి. దేశ ప్రగతికి ముస్లింలు అవరోధంగా ఉన్నారనీ, వారు అవకాశం ఉన్న ప్రతీ చోటా విషం కక్కుతున్నారు .
భారతదేశానికి మొదటి అంతర్గత శత్రువులు ముస్లింలని గోల్వాల్కర్ తన 'బంచ్ ఆఫ్ థాట్స్'లో పేర్కొన్నాడు. హిట్లర్ ఆర్య జాతి ఆధిపత్యం, బీజేపీ హిందూత్వ తాత్వికతల మధ్య ఉన్న సైద్ధాంతిక సారూప్యత మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. హిట్లర్‌కు విశ్వాసంగా ఉన్న తన అనుచరులు, తక్కువ జాతిగా పరిగణించబడే వారి సంతానోత్పత్తిని పరిమితం చేయడం ద్వారా తమ జాతిని మెరుగు పరచడానికి చాలా కష్టపడ్డారు. 1933లో నాజీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు, తమ 'జాతి స్వచ్ఛతను' కాపాడేందుకు వారు తహతహలాడారు. అలాంటి సంతానోత్పత్తి నియంత్రణ చర్యలు చేపట్టిన తర్వాత జరిగిన భయంకరమైన వినాశనం ఇంకా మనకు చరిత్రలో కనపడుతుంది. భారతదేశాన్ని మింగుతున్న అభివృద్ధి సంక్షోభానికి మూల కారణం జనాభాలో కాకుండా, పేదరికంలో దాగి ఉంది. మన పాలక వర్గాలు అనుసరిస్తున్న రాజకీయ ఆర్థిక వ్యవస్థ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉంది. ప్రజా శ్రేయస్సు, ప్రజల సంక్షేమం లాంటివేవీ ప్రభుత్వ ఎజెండాలో లేవు. అక్షరాస్యతా స్థాయి, సామాజిక స్పృహ, జనాభా పెరుగుదలలు అన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. ప్రజలు విద్యా వంతులై, సాధికారతతో వారి అవగాహన మెరుగుపడితే ఎటువంటి బలవంతపు చర్యలు లేకుండానే సంతానోత్పత్తి నియంత్రణను సాధించవచ్చు.
కేరళ లాంటి రాష్ట్రాలు విద్యా, వైద్య, ఆరోగ్య రంగాల్లో చేసిన అభివృద్ధి ఫలితాలను ఈ విషయంలో పరిగణనలోకి తీసుకోవాలి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రజల జీవన పరిస్థితులను ఏనాడూ పట్టించుకోలేదు. కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వ విధానాల వల్ల హిందూ ముస్లింలు ఇరువురూ బాధితులుగా మారుతున్నారు.
- బోడపట్ల రవీందర్
సెల్: 9848412451