Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అప్పుడెప్పుడో తుగ్లక్... తన రాజధానిని ఢిల్లీ నుంచి దౌలతాబాద్కు మార్చాడట. దాంతోపాటు పరిపాలనా యంత్రాంగం మొత్తం దౌలతాబాద్కు రావాలంటూ ఆదేశించాడాయన. ఈ క్రమంలో సరైన రవాణా సదుపాయాల్లేని ఆ రోజుల్లో అనేక మంది నూతన రాజధానికి రావటానికి నానా ఇక్కట్లూ పడ్డారు. దారిలో అనేక మంది ఆకలిదప్పులతో మరణించారు. అంతలోనే మనసు మార్చుకున్న తుగ్లక్... మళ్లీ తన రాజధానిని ఢిల్లీకి మారుస్తూ ఆదేశాలు జారీ చేశారు. అందుకే ఆయనకు 'పిచ్చి తుగ్లక్...' అనే బిరుదునిచ్చి మనం గౌరవించుకున్నాం. అప్పటి మాదిరిగా తీవ్రస్థాయిలో తాము ఇబ్బందులు పడటం లేదు గానీ.. సర్కారు, అధికారులు ఇష్టారీతిన తమను స్థానభ్రంశానికి గురి చేస్తుండటంతో పట్టుమని రెండు, మూడేండ్లు కూడా ఎక్కడా కుదురుగా కొలువులు చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులు. ముఖ్యంగా విద్యాశాఖలోని ఉపాధ్యాయులు ఇలా ఏడాదికో ఊరు, రెండేండ్లకో స్కూలు అన్నట్టుగా అదే పనిగా చక్కర్లు కొడుతున్నారు. పాలకుల పుణ్యమానీ గత ముప్పై ఏండ్ల నుంచి ప్రభుత్వ విద్యారంగం క్రమక్రమంగా మంచాన పడుతూ వస్తున్నది. దీంతో మారుమూల పల్లెటూరు నుంచి హైదరాబాద్ మహానగరం దాకా ప్రయివేటు, కార్పొరేట్ పాఠశాలలు వేల సంఖ్యలో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఈ క్రమంలో ఒకప్పుడు వందల మంది పిల్లలతో కళకళలాడిన సర్కారు బళ్లు... ఇప్పుడు కేవలం వేళ్ల మీద లెక్కపెట్టగలిగేంత మంది విద్యార్థులతో... దీనస్థితికి చేరాయి. 'కాటికి కాళ్లు చాచిన ముసలోళ్ల లాగా... మూసివేత ఈరోజో, రేపో...' అన్నట్టుగా భారంగా రోజుల్ని నెట్టుకొస్తున్నాయి. ఇదే సమయంలో స్కూళ్లలో పంతుళ్లెక్కువ... పిల్లలు తక్కువ అన్నటుగా పరిస్థితి తయారైంది. దీంతో ప్రభుత్వం టీచర్లను... 'పిల్లి తన పిల్లలను వారానికో ఇంటికి మార్చినట్టుగా...' అవసరాల రీత్యా సంవత్సరానికో బడికి, రెండేండ్లకో మండలానికి తిప్పుతూ... వారి సహనాన్ని పరీక్షిస్తున్నది ప్రభుత్వం. ఈ క్రమంలో 'మూడేండ్ల నుంచి మా మండలంలోని మూడు స్కూళ్లు మారిన... వాస్తవానికి నా ఉద్యోగం ఒక బడిలో, డిప్యూటేషన్ మీద మరో బడికొచ్చా... ఇప్పుడు అదే డిప్యూటేషన్ మీద ఇంకో బళ్లో జీతం తీసుకుంటున్నా...అందుకే నేను మండలాధీశురాలిని...' అంటూ వాపోయింది ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఓ ఉపాధ్యాయురాలు...
-బి.వి.యన్.పద్మరాజు