Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇరిగేషన్ అంశం కొంతమేర కష్టమైన సబ్జెక్టే. సాధారణంగా అవగతమయ్యేది కాదు. ఆ టీఎంసీలు, క్యూసెక్కులు, బ్యారేజీ, డ్యాం, ఎఫ్ఆర్ఎల్ ఇలా అర్థం కాని పదాలుంటాయన్నది అందరికీ తెలిసిందే. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కష్ణా నదీ జలాలపై వివాదం నెలకొనడంతో ఈ సబ్జెక్టుపై మరింత చర్చ సాగుతోంది. ఇదే విషయంపై ఇటీవల సోమాజిగూడలో ఒక రౌండ్‌టేబుల్ మీటింగ్ జరిగింది. ఆ సమావేశానికి అన్ని పార్టీల నేతలు హాజరయ్యారు. కేసీఆర్ అలా చేస్తున్నాడు... జగన్ ఇలా చేస్తున్నాడు అంటూ నాయకులంతా ప్రసంగాలతో దంచికొడుతున్నారు. ఒకరికి మించి మరొకరు పదాలతో ప్రభుత్వంపై దండయాత్రే చేశారు. అందులో ఒక నేత లేచి బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి రాష్ట్రానికి 811 క్యూసెక్కులు కేటాయిస్తే, ఏండ్లుగా ఆంధ్రా పాలకులే నీటిని దోచుకెళుతున్నారని ఉద్ఘాటించారు. అక్కడ అందరూ రాజకీయ పార్టీల నేతలే అధికంగా ఉండటంతో ఆయన చెప్పింది తప్పు అని ఎవ్వరూ చెప్పలేదు. ఇంతలో ఒక రిటైర్డు ఇంజినీర్ కలుగజేసుకొని సార్, బచావత్ ట్రిబ్యునల్ కేటాయించింది 811 క్యూసెక్కులు కాదు... టీఎంసీలు అని సరిదిద్దబోయారు. దీంతో నాలుక కరుచుకున్న సదరు నాయకుడు ఏమో బ్రదర్ ఏదో ఒకటిలే... కేసీఆర్ అయితే కృష్ణా నదిపై ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు అసలే పట్టించుకుంటలేడన్నదే నా వాదన అంటూ ముగించాడు. వెంటనే ఒక నీటి పారుదల నిపుణుడితో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ పెట్టించారు నిర్వాహకులు. ఆయన లేచి కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్ సాగర్, సంగమేశ్వరం, ఎస్ఎల్బీసీ అంటూ ఎక్కడెక్కడ ఎన్ని టీఎంసీలున్నాయో, ఆ ప్రాజెక్టుల కెపాసిటీ ఏంటో నోటి మీద చెప్పడం షురూ చేశారు. ఇదంతా వింటున్న సదరు క్యూసెక్కు నేత అబ్బ, ఈ సబ్జెక్టే ఇరిటేషన్ అసలు అంటూ నిర్వేదంతో స్పందించారు. ఈ మాట పీపీ చెబుతున్న నిపుణుడికి వినపడటంతో ఇరిటేషన్ కాదు సార్ ఇరిగేషన్ అనడంతో సభికులంతా నవ్వుల్లో మునిగి తేలారు. అదండి ఇరిగేషన్... ఇరిటేషన్ కాదంట. హహ!
- సాగర్ వనపర్తి.