Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''అరే మామా నాకొక విషయం సమజైతలేదు, మనకు రోజూ ఇన్ని రకాల మనుషులను తెచ్చి ఎందుకు చూపిస్తున్నారురా!!!'' ఒక సింహం ఇంకో సింహంతో జూలో అంటున్న కార్టూను. చిన్నప్పుడెప్పుడో చూసింది, ఇప్పుడు గుర్తొస్తోంది నాకు. ఈ వర్క్ ఫ్రం హౌమ్లో జనాలు తమ పనిని ఇంటివద్దనే చేసుకుంటూ, ప్రపంచంలో ఎక్కడికైనా పంపుతూ పంజరంలోని చిలకలా, జూలోని సింహంలా ఉంటూనే అన్ని సామాజిక మాధ్యమాలలో, ఫోనులో ఎవరితోనైనా క్షణాల్లో మాట్లాడుతుంటే నిజంగా ప్రపంచం ఓ కుగ్రామమైపోయిందని తెలుస్తూనే ఉంది. ప్రపంచం ఓ కుగ్రామమేనా, ఇంకా ఇంకా కుంచించుకుపోయి ఒక ఇల్లుగా మారింది, చేతిలో ఒక సెల్లుగానూ మారిపోయింది. పంజరంలోని పక్షులను, బోనుల్లో ఉండే జంతువులను చూసినప్పుడంతా మనుషులు తమ సంతోషం కోసం ఇవన్నీ చేస్తున్నారని అనుకునేవాళ్ళం. ఇప్పుడు మనుషులు తమ బోనుల్లాంటి ఇళ్ళలో ఉండవలసి వస్తోంది. కరోన తనకు, తన ఇంట్లోని వారికి ఎక్కడ వస్తుందో అని బయటికి పోకుండా ఇంటివద్దే పని చేసుకునేవాళ్ళను దండిగా చూస్తున్నాం. బహుశా పక్షులూ, జంతువులూ ఇది చూసి ఆనందిస్తూ ఉండవచ్చు. కరోనా వైరస్ మాత్రం తన గుండ్రటి ముళ్ళముళ్ళ కాలర్ ఎగరేస్తూ ఉండవచ్చు.
బడిలో ఇచ్చే హౌం వర్క్ వేరు, ఇంటినుండి చేసే వర్క్ ఫ్రం హౌం వేరు. ఇంటిదగ్గర చేసే ఇంటి పని వేరు. ఇంట్లో అన్ని సౌకర్యాలూ ఉంటే పని చేయడం సులభమే. కానీ బయటకెళితే కాని పూట గడవని వారి పరిస్థితి ఏమిటి అన్న ఆలోచన ఎంతమందికి వస్తుంది. వాళ్ళకి వర్క్ ఫ్రం హౌమ్ ఎవరిస్తారు? అన్న ప్రశ్న వేసుకుంటె చాలా ఇబ్బంది కలుగుతుంది. ఈ ప్రపంచ దుస్థితే అది. అందుకే మహాకవి మరో ప్రపంచం పిలిచిందన్నాడు, కావాలన్నాడు.
సందట్లో సడేమియా లాగ ఒక ప్రయివేటు బ్యాంకు సెల్లు సందేశం పంపింది. అదేమంటె వర్కు ఫ్రం హౌం కోసం అంటే కంప్యూటరూ, ఇతర సామగ్రి కోసం ఆరు లక్షల లోన్ మీకు సాంక్షనైంది ఒక్క బటన్ నొక్కండి అది ఇంటినుండైనా, ఆఫీసునుండైనా, లేదా ఎక్కడ ఉంటే అక్కడినుండి అన్నట్టు తొందర పెడుతోంది. అసలా బ్యాంకు ఏమనుకుంటోంది? కరోనా ఇప్పట్లో పోదనా? లేక అందరూ కలిసి ఈ విధానమే బాగుంది మీరు కారు, బైకు బయటకు తీయ పనిలేదు, పెట్రోలు రేటు ఎంత పెరిగినా మీకు ఇబ్బంది లేదు అని చెప్పదలిచారా! ఏమైనా ఈ లోను కూడా ఇంటినుండే తీసుకోవచ్చునట, బ్యాంకుకు పోయే పనేలేదట. లోన్ ఫ్రం హౌమ్ అన్నమాట.
వర్క్ ఫ్రం హౌమంటే ఏదో సంపాదనకే అనుకోకండి. సంపాదించింది మంచి పనులకు వాడడం కూడ దానికిందికే వస్తుంది. సోనూ సూద్ చూడండి కరోనా వల్ల, ఇతర ఇబ్బందుల వల్ల కష్టాలు ఎదుర్కొంటున్న వారికి ఇంటినుండే సెల్లులో డబ్బు ట్రాన్సఫర్ చేసి సహాయం చేస్తున్నాడు. అమ్మాయి ఎడ్ల సహాయం కూడా లేకుండా పొలం దున్నడం చూడలేక వెంటనే వాళ్ళ ఇంటి ముందు ట్రాక్టరు నిలబెట్టాడు. అది అసలైన సేవా కార్యం, అందులో ఇంటిదగ్గరినుండే.
ఈ ఇంటివద్దనుండే పని అనే విషయంలో ఎక్కువ మంది మన మెదడును మాత్రమే వాడుకుంటారు తప్ప మన శరీరానికి పని తక్కువ. అఫ్ కోర్స్ మెదడూ శరీరంలో భాగమే కాని అదొక్కటే పని చేస్తే లాభముండదు. మనం ఎంతగా వళ్ళు వంచి పనిచేస్తే మెదడుకు అంత ఆక్సిజను ఎక్కువగా అంది దాని నాణ్యత పెరుగుతుంది కూడా. ఇది అందరికీ తెలిసిన సత్యం. బాగా గమనిస్తే లాక్డౌన్ కొద్దిగా సడలించాక ఆఫీసుల్లో చూస్తే ఒక్కొక్కరు ఒక రౌండు రౌండుగా అంటే బొద్దుగా తయారయ్యారని తెలిసి పోతుంటుంది. అలా శరీరం పెరిగితే మన గుండెకు వర్క్ ఫ్రం హౌం ఎక్కువవుతుంది. అంతెందుకు మన బాడీని మనమే భారంగా మోస్తున్నట్టు తెలిసిపోతుంది. కాబట్టి ఇంట్లో వాళ్ళకి పనుల్లో సాయపడితే వాళ్ళతో దోస్తీ పెరుగుతుంది. మన శరీరం ఎంత బాగా పనిచేస్తే మెదడు కూడా అంతే బాగా పని చేస్తుందని ఈ లాక్డౌన్లు గుర్తు చేశాయి.
ఇక చూసిన మొహాలే రోజూ చూస్తూ మాట్లాడిన మాటలే మాట్లాడుతూ ఉంటే మనిషికి కాస్త విసుగొస్తుంది. అప్పుడు మాటలు కాస్తా కొట్లాటలవుతాయి. తమ బలహీనతలు కనబడకూడదని జనాలు ఇతరులను బాధిస్తారు. ఈ కరోనా సమయంలో ఇవి చాలామంది గమనించే ఉంటారు. ఇది కూడా వర్క్ ఫ్రం హౌమే అనుకోవాలి. ప్రపంచంలో ఏ ఇద్దరు కొట్లాడినా ఏదో ఒక కారణముంటుంది కాని పాపం భార్యా భర్తలు కొట్లాడడానికి ఏ కారణమూ అక్కరలేదని తమాషాగా చెబుతుంటారు. అది కొంత నిజమే అనిపిస్తుంది. ఈ కరోనా సమయంలో అది ఇంకా ఇంకా నిజమయిందని నా మిత్రుడు చెబుతాడు. కరోన సమయంలో దానికంటే భయపెట్టే అంశం ఇంటిదగ్గర ఉండడమని తన అభిప్రాయం. అలా వాదులాటలకు, గహ హింసకు తమ సమయాన్ని ఖరాబు చేసుకోకుండా దీనికంతటికీ కారణమైన కరోనా పై తిరగబడి దానిపైనే కవితలు, కథలు, పద్యాలు అల్లిన వాళ్ళున్నారు. పై దానితో పోలిస్తే ఇది మంచి వర్క్ ఫ్రం హౌం. అప్పుడు ఇల్లే కద స్వర్గసీమ అని పాడుకోవచ్చు కూడా.
ఇంటి వద్దనుండే చట్టసభలు జరిపితే ఖర్చులు తగ్గుతాయి కాని స్పీకర్ పోడియం దగ్గరికి పోవడాలు, కుర్చీలు విరగ్గొట్టడాలు ఉండవనేమో వాటిని నాయకులు పెద్దగా ఆదరించలేదు. చర్చల్లో ఏదైనా కోపమొచ్చి ఇంట్లోని కుర్చీలు విరగ్గొడితే ఇంట్లోవాళ్ళు బొక్కలిరగ్గొడతారన్న సత్యమూ తెలుసు కాబట్టి ఎందుకొచ్చిన కష్టమని సెషన్స్ మాత్రం వద్దన్నారు. అయినా నాయకులు ఊరకున్నారా, ఉండరు. కరోనా సమయంలో తమకు కావలసిన బిల్లుల్ని మెల్లి మెల్లిగా ఎవరికీ అర్థం కాకుండా చక్కబెట్టేసుకున్నారు. వ్యాక్సిన్ లాంటి విషయమో ఇంకొకటో పై పైన మాట్లాడుతూ లోలోన ప్రజా సంస్థల్ని మెల్లిగా ప్రయివేటు వారికి ఇచ్చేశారు. ఇదీ ఒక వర్క్ ఫ్రం హౌం అయిపోయింది వాళ్ళకి. దీనివల్ల ఎన్ని కుటుంబాలు ఇల్లు వదిలి రోడ్డుమీద పడ్డారో లెక్కలు తీస్తే అసలు రంగులు బయటపడతాయి. ఇంటివద్దనుండే పెట్రోలు, డీజిల్ ధరలు పెంచడం మనం చూశాము కూడా. గహమే కద స్వర్గ సీమ అని ఇంట్లోనే కూచోక బయట ఎక్కువగా తిరుగుతున్నారని మేమే ఆలోచించి వాటి ధరలు పెంచామనీ చెప్పొచ్చు. నరంలేని నాలుక కదా.
అందుకే ఇంటివద్ద ఉండి ఏదో ఒక పని చేయడం కాదు, నలుగురికి ఉపయోగపడే పని చేయడం ముఖ్యం. ఆ నలుగురు ఎవ్వరు అన్నది మరో ప్రశ్న.
- జంధ్యాల రఘుబాబు
సెల్:9849753298