Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''క్విట్ ఇండియా!'' మా దేశం వదిలి వెళ్ళిపోండి 1942 ఆగస్టు 9 ''క్విట్ ఇండియా'' ప్రకటించాల్సిన రోజు. కోట్లాది భారతీయులు తెల్లోడిపై మరోసారి తిరగబడ్డరోజు. వాస్తవానికి ఆగస్టు 8న కాంగ్రెస్ వర్కింగ్ కమిటి 'క్విట్ ఇండియా' తీర్మానం ఆమోదించింది. మర్నాడు జరిగే విస్తృత ఏఐసీసీలో దాన్ని ఆమోదించవల్సి ఉండే. ఆగస్టు 8 రాత్రే గాంధీ, నెహ్రూ, పటేల్, సరోజినీ నాయుడు వంటి వారందర్నీ నిర్బంధంలోకి తీసుకుంది అంగ్రేజి సర్కార్. జైళ్ళు నోళ్లు తెరుచుకున్నాయి. పోలీసు కాల్పుల్లో జనం పిట్టల్లా రాలిపడ్డారు. ''కొన్ని వారాల వ్యవధిలోనే పదివేల మందిని కాల్చి చంపినట్టు'' సుకోమల్సేన్ భారత కార్మికోద్యమ చరిత్రలో రాశారు. ప్రజల్లో కసి రాజుకుంది. గాంధీజీ ఇచ్చిన ''డూ ఆర్ డై'' పిలుపును భారతీయులు ''దేశాన్ని విముక్తి చేసుకుందాం! లేదా ఆ పోరులో అమరులౌదాం!'' అనే భావంలో తీసుకున్నారు. దీనికో ప్రత్యేక కారణముంది. జలియన్‌వాలాబాగ్ మారణకాండకు ప్రతిగా 1920లో ఇచ్చిన సహాయ నిరాకరణోద్యమంలో ప్రజలు వెల్లువలా పాల్గొన్నారు. 'చౌరీ చౌరా' ఘటన సాకులో 1922లో గాంధీజీ ఆ పిలుపును ఉపసంహరించారు.1930లో శాసనోల్లంఘన పిలుపులోను, దాన్లో భాగమైన ఉప్పు సత్యాగ్రహంలోనూ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రెండవ శాసనోల్లంఘన పిలుపుకి ప్రజల స్పందన కరువైంది. ఆ తర్వాత పన్నెండేండ్లకివ్వబడ్డ పిలుపు ''క్విట్ ఇండియా''. బ్రిటిష్ వ్యతిరేక ఆగ్రహజ్వాలల్లో రగిలిపోయే భారతీయులు మరో సారి ఉప్పెనై కదిలారు. మరో ఐదేండ్లు భళ్లున తెల్లారేసరికి (47లో) స్వాతంత్య్రం మనకు దఖలు పడింది.
ఆ 'క్విట్ ఇండియా' స్ఫూర్తి మనల్ని మరోసారి ఆవహించాల్సిన సమయం వచ్చింది. వాస్తవానికి మోడీ సర్కార్ నడకని, నడతని పరిశీలించిన సీఐటీయూ (సిటు) 2018లోనే తన కోజికోడ్ జనరల్ కౌన్సిల్లో ఆగస్టు 9 క్విట్ ఇండియా దినం నుండి ఆగస్టు 15 వరకు వివిధ అంశాలను కార్మికులకు వివరించాలని నిర్ణయించింది. వందల జిల్లాల్లో వేలాది కేంద్రాల్లో కార్మికులను ఈ దశలో చైతన్యపరిచింది సిటు. ఆ తర్వాత ఎన్ని మార్పులు చేసింది మోడీ సర్కార్? 29 కార్మిక చట్టాలు 4 కోడ్లైపోయాయి. అంటే వాటి కోరలు అంబానీ, అదానీల కోసం, వారి విదేశీ యజమానుల కోసం, వారి మిత్రుల కోసం పీకేశాడు మోడీసాబ్. 2014లో మోడీ గద్దెనెక్కిన తర్వాత ధ్వంసం చేయబడ్డ చట్టాలతో కలిపి మొత్తం 44 కార్మిక చట్టాలు ఈ నాలుగు కోడ్లలో ఇమిడి పోయాయి. మన దేశ వ్యవసాయం కార్పొరేట్లకి నైవేద్యమయ్యింది.
మూడు వ్యవసాయ చట్టాలు పార్లమెంటుని బుల్డోజ్ చేసి ఉనికిలోకి తెచ్చారు. 1996లో రెండు రాష్ట్రాల్లో చేయబడ్డ విద్యుత్ పంపిణీ ప్రయివేటీకరణ చేదు అనుభవాల్నే మిగిల్చింది. ప్రజా ఉద్యమాలకు వెరసి మిగిలిన రాష్ట్రాలు వెనక్కి తగ్గాయి. ఇప్పుడు హోల్‌సేల్‌గా విద్యుత్ పంపిణీని ప్రయివేటీకరించేందుకు మోడీ సర్కార్ తెరతీసింది. విద్యుత్‌రంగం కార్పొరేట్ల చేతికి పోనుంది. వ్యవసాయం చట్టుబండలు కావడానికి దారులు పరిచింది మోడీ ప్రభుత్వం. అత్యంత 'నిష్టగా' ఇన్సూరెన్స్, బ్యాకింగ్, రక్షణ రంగాల్ని కార్పొరేట్ల నోటికి అందిస్తోంది. తాజాగా 2021-22 బడ్జెట్లో 1.75లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వరంగ సంస్థల వాటాల అమ్మకానికి లక్ష్యం నిర్ణయించుకుని సాగుతోంది. నిర్మలాసీతారామన్ మాటల్లో చెప్పాలంటే ''2020-21లో రూ.2.10లక్షల కోట్ల లక్ష్యం నిర్ణయించుకున్నా, కోవిడ్ వల్ల చేరుకోలేపోయాం. అందుకే 21-22కి తక్కువే నిర్ణయించాం'' అన్నారు. ఒక్క ఎల్ఐసీ ఐపీఓ ద్వారానే లక్షకోట్లు రాబట్టాలని మరో కార్పొరేట్ పెద్దమనిషి ఆకాంక్షిస్తున్నాడు. వెరసి, దేశంలోని కార్మికులు, రైతులు, మధ్య తరగతి ఉద్యోగుల ఉసురు తీస్తున్నదీ ప్రభుత్వం. ఈనగాచి నక్కల పాలైనట్టు 75సంవత్సరాల స్వాతంత్రం కార్పొరేట్ల పరమవడాన్ని సహిద్దామా?
భారతీయులు దోపిడీని, అది విదేశీ దోపిడీనా, స్వదేశీ దోపిడీనా అని ఏనాడూ చూడలేదు. ఈ విషయాన్ని భారత కార్మికోద్యమం స్పష్టంగా రుజువు చేసింది అప్పటికి దాదాపు 50ఏండ్లు బ్రిటిష్, భారత పెట్టుబడిదార్లతో పోరాడి 1920లో దేశవ్యాపిత కార్మిక సంఘం ఆవిర్భవించింది. ఆ సదస్సుకి ఆనాటి భారత పెట్టుబడిదార్ల ''నక్షత్ర మండలమంతా'' హాజరైనారని సుకోమల్సేన్ రాశారు. దాన్లో వారంతా ఏకోన్ముఖంగా చేసిన విజ్ఞప్తి ఒక్కటే! ''బ్రిటిష్ వారి కంపెనీల్లో బాగా యూనియన్లు పెట్టండి!'' ఆ విధంగా వారికి నష్టాలోస్తే తొందరగా దేశం వదిలిపోతారని వీరి ఆశ. మొట్టమొదటి కార్మిక సంఘం ఏఐటీయూసీ ప్రథమ అధ్యక్షుడైన లాలా లజపతిరారు ''కార్మికులకు కూడు, గూడు, బట్ట లేకుండా చేసి వారి లాభాలు మాత్రమే చూసుకునే పెట్టుబడి దారులు దేశభక్తి గురించి మాట్లాడితే చెల్లుబాటు కాద''న్నారు.
ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన దివాన్ చమన్‌లాల్
మరింత స్పష్టంగా కార్మికులనుద్దేశించి ''మీ జాతీయ నాయకులు స్వరాజ్యమంటారు. మిమ్మల్ని గాలికొదిలేస్తే స్వరాజ్యం అనే మాటకు అర్థంలేనిదన్నారు. మీకు ఆర్థిక స్వాతంత్రం లేకుండా వారు చెప్పే రాజకీయ స్వాతంత్రం నిరర్థకం'' అన్నారు.
ఆ తర్వాతి దశాబ్దాల్లో భారత పెట్టుబడికి కేంద్రమైన బొంబాయిలో మహత్తర సమ్మె పోరాటాలు జరిగాయి. 1928లో బొంబాయి బట్టల మిల్లుల్లో దాదాపు సంవత్సరం సాగిన కార్మికుల సమ్మె వంటివి ఎన్నో ఉన్నాయి. అటువంటి సమ్మెలే బి.టి.రణదివే వంటి నాయకులను కార్మికోద్యమానికి ప్రసాదించినాయి. 1936-37లో షోలాపూర్ పట్టణాన్ని కార్మికులు హస్తగతం చేసుకుని వారం రోజులు సివిల్ అడ్మినిస్ట్రేషన్ కూడా చూడగలిగారు (రజనీపామిదత్ రాసిన ''ఇండియా టుడే''). ఇదంతా భారతీయ పెట్టుబడిపై పోరాటమే. ఈ చైతన్యమే 1946లో రాయల్ ఇండియన్ నేవి తిరుగుబాటుకు బొంబాయి కార్మిక వర్గానికి బాసటగా వీధి పోరాటాల్లో నిలిపింది.
కార్మికుల ఈ పోరాటాలే 1926లో ట్రేడ్ యూనియన్ చట్టాన్ని దాని కంటే ముందే, 1923లో వర్క్‌మెన్ కాంపెన్సేషన్ చట్టాన్ని బ్రిటిష్ సామ్రాజ్యవాదుల నుండి సాధించుకునేలా చేసింది. ఆ కార్మికుల పోరాట ఉధృతే 1929లో బాంబే ట్రేడ్ డిస్ప్యూట్ చట్టం చేసేలా బ్రిటిష్ ప్రభుత్వాన్ని ప్రేరేపించింది. సమ్మెల ఉధృతిని నియంత్రించేందుకు ఈ ట్రేడ్ డిస్ప్యూట్ చట్టం వినియోగించబడింది. 1948లో చేసిన పారిశ్రామిక వివాదాల చట్టానికి ఇది మాతృక వంటిది. ఇవన్నీ పెట్టుబడిదారుడు మనవాడా, పరాయివాడా అనే విషయాన్ని భారత కార్మికవర్గం చూడలేదనేందుకు కొన్ని శాంపుల్స్ మాత్రమే.
బ్రిటిష్ సామ్రాజ్య విధానాలను, వారి దోపిడీని ఏమాత్రం ఖాతరు చేయని తనం నరనరాన జీర్ణించుకుపోయిన రైతాంగం తిరగబడటం ఆనాడే చూస్తాం. ''ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం'గా కార్ల్‌మార్క్స్ కీర్తించిన 'సిపాయిల' తిరుగుబాటు (1857)ను దారుణంగా అణిచివేయడానికి బ్రిటన్ ప్రభుత్వానికి రెండేండ్లు పట్టిందంటేనే దాని విస్తృతి అర్థమవుతుంది. దీనికి ముందూ, వెనుకా జరిగిన తిరుగుబాట్లు, పోరాటాలు భారత ప్రజల ఆలోచనకు, మనస్తత్వానికి నిదర్శనం. సామ్రాజ్యవాద దోపిడీని ఎదిరించి నిండు జీవితాల్ని తృణప్రాయంగా వదిలేసిన టిపుసుల్తాన్ (49 సంవత్సరాలు), ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి (41సంవత్సరాలు), అల్లూరి సీతారామరాజు (27సంవత్సరాలు), కొమరం భీం (39సంవత్సరాలు) వంటి ఎందర్నో ఆదర్శంగా తీసుకోవల్సిన సందర్భం ఇదే కదా! చితికిపోయిన రైతాంగం ఆనాడే బ్రిటిష్ వారిని ఎదిరించేందుకు సాయుధులై సన్యాసులుగా, ఫకీర్లుగా అవతారమెత్తి తిరగబడ్డ చరిత్ర 1770-1820మధ్య 50 సంవత్సరాలు నడిచింది. 1855లో సంతాల్ తెగవారు చేసిన తిరుగుబాట్లున్నాయి. దాదాపు పాతికేండ్లపాటు 1875-1900 మధ్య బిర్సాముండా నాయకత్వంలో సాగిన తిరుగుబాట్లున్నాయి. 1959, 60లలో రెండేండ్లపాటు బెంగాల్ నీలిమందు రైతుల తిరుగుబాట్లున్నాయి.
అనేక సంస్థానాల్లో జమిందార్ల దోపిడీకి వ్యతిరేకంగా సాగిన పోరాటాలన్నీ, అది ఆజంఘడ్ అయినా, ట్రావన్కూర్ అయినా, కాశ్మీర్లో హిందురాజు హరిసింగ్ దోపిడీపై షేక్ అబ్దుల్లా నాయకత్వంలో తిరగబడ్డ ముస్లిం రైతాంగమైనా, అస్సాంలోని సుర్మా లోయ పోరాటమైన, త్రిపుర రాజుపై ఆదివాసి తెగలు చేసిన పోరాటమైనా, వీటన్నిటికి మొనగాడుగా సాగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటమైనా వివిధ రూపాల్లో రైతాంగంపై సాగిన దోపిడీని ప్రతిఘటించిన పోరాటాలే. దాదాపు ఇవన్నీ 'క్విట్ ఇండియా' పిలుపు తర్వాతివే. సారాంశంలో, దోపిడీ చేసేవాడు పెట్టుబడిదారుడా, జమీందారా, విదేశస్తుడా, స్వదేశస్తుడా అనేది కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు ఏనాడూ చూసుకోలేదు. చూడరు కూడ!
భారతీయ సమాజ మూలమూలల్లోకి జొరబడ్డ బహుళజాతి సంస్థల దోపిడీపై యుద్ధం ప్రకటించారు మనదేశ కార్మికులు, వ్యవసాయ కార్మికులు, రైతాంగం. సరళీకృత ఆర్థిక విధానాలను ఉధృతం చేసేందుకే మోడీ పగ్గాలు చేపట్టాడు 2014లో. అప్పుడు చెప్పిన 'అభివృద్ధి' మంత్రం బోగస్ అని తేలిపోయింది. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు హుళక్కిగా మిగిలింది. గుజరాత్ మోడలే డొల్లని పటేళ్ల ఉద్యమం బహిర్గతం చేయగా కరోనా మరింత స్పష్టంగా ప్రపంచానికి ఎక్స్పోజ్ చేసింది. రైతాంగానికి ఒకటిన్నర రెట్ల ఆదాయం అందిస్తానన్న 2014 ఎన్నికల మేనిఫెస్టోపై సుప్రీంకోర్టు ప్రశ్నిస్తే అదిసాధ్యం కాదని అఫిడవిట్ దాఖలు చేసిందీ ప్రభుత్వం. రైతుల, నిరుద్యోగుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి.
అందుకే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కార్మికవర్గం సమైక్యంగా నడుం బిగించింది. 2015, 2016, 2019, 2020ల్లో 5రోజుల పాటు 4 సార్వత్రిక సమ్మెలు జరిగాయి. 2017లో ఢిల్లీలో అనేక కార్మిక సంఘాలతో 3రోజుల మహాధర్నా జరిగింది. 2018లో కార్మిక, కర్షక సంఘర్ష్ యాత్ర జరిగింది. కోటాను కోట్ల మంది కార్మికులు, ఏ సంఘాల వెనుక లేనివారు సైతం వీటిలో పాల్గొన్నారు. ఇప్పుడు కోడ్లు, రైతు చట్టాలు ఉనికిలోకి వచ్చాయి. మరో దశ పోరాటాలకు సిద్ధమవుతున్న వేళ ఈ 'క్విట్ ఇండియా' ఉద్యమ స్ఫూర్తితో రంగంలోకి దూకాలి. ప్రస్తుతం కార్మిక కర్షక మైత్రి రూపుదిద్దుకుంటోంది. మరో దశ పోరాటాలకు సిద్ధమవుతున్న వేళ క్విట్ ఇండియా స్ఫూర్తితో రంగంలోకి దూకాలి.
(నేటి నుండి ఆగస్టు 9 వరకు సీటూ, రైతు, వ్యకాసాల పిలుపు సందర్భంగా)
- ఆర్ సుధా భాస్కర్