Authorization
Mon Jan 19, 2015 06:51 pm
1213లో నిర్మితమైన రామప్ప దేవాలయ శిల్పకళా వైభవానికి ముగ్దులైన యునెస్కో ప్రతినిధుల బృందం తెలంగాణలోని ప్రఖ్యాత రామప్ప ఆలయానికి 'యునెస్కో వారసత్వ స్థలం'గా అంతర్జాతీయ గుర్తింపుకు ఎంపిక కావడం తెలంగాణ ప్రజలకు, దేశవాసులకు గర్వకారణంగా నిలిచింది. నీటిలో తేలియాడే ఇటుకలతో దాదాపు 800 ఏండ్ల క్రితం కాకతీయ రాజులు నిర్మించిన రామప్ప శిల్పకళా సంపదకు ఎనలేని గుర్తింపు రావడం హర్షదాయకం. 2019లో యునెస్కో ప్రతినిధులు రామప్పను సందర్శించి నిశితంగా పరిశీలంచడం, 2020లో తుది జాబితాకు రామప్పను నామినేట్ చేయడం కూడా జరిగిన విషయం మనకు తెలుసు. ప్రపంచవ్యాప్తంగా జాబితాలో 42 వారసత్వ కట్టడాలను పరిశీలనకు ఎంపిక చేయగా, నేడు చైనా వేదికగా నిర్వహించిన వర్చువల్ సమావేశంలో 'రామప్పకు యునెస్కో వారసత్వ కట్టడం'గా ఎంపిక చేశామని యునెస్కో ప్రతినిధులు ప్రకటించారు. భారత్ నుంచి ఎంపికైన ఏకైక వారసత్వ కట్టడంగా రామప్పకు అరుదైన గుర్తింపు రావడం విశేషంగా చెప్పవచ్చు.
ప్రశాంత ప్రకతి ఒడిలో వెలసిన రామప్ప గుడిని రామలింగేశ్వర శివాలయంగా పిలుచుకుంటాం. ఇది ములుగు నగరానికి 19 కిమీ, వరంగల్‌కు 77 కిమీ, హాదరాబాద్?కు 209 కిమీ దూరంలో దక్షిణ భారత తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట్ గ్రామ సమీపాన 1213లో కాకతీయ గణపతి దేవా రాజు పాలనలో జనరల్ రాచర్ల రుద్రా రెడ్డి నేతృత్వంలో నిర్మితమైన రామప్ప దేవాలయ కట్టడం నాటి శిల్పుల నైపుణ్యానికి ప్రతీకలుగా నిలుస్తున్నది. శిల్పి రామప్ప నేతృత్వంలో భూమిజ శైలిలో 40ఏండ్ల శ్రమతో నిర్మితమైన రామప్ప నాటి శిల్పకళా వైభవానికి ప్రతీకగా నిలుస్తున్నది. కాకతీయ పాలనలో 'మార్కో పోలో' రామప్పను సందర్శించి మంత్ర ముగ్దుడై 'దేవాలయాల పాలపుంతలో అత్యంత ప్రకాశవంతంగా వెలిగే ధృవ తార రామప్ప' అని కొనియాడారని గుర్తు చేసుకోవాలి. రామప్ప ఆలయం 6 అడుగుల ఎత్తైన నక్షత్ర ఆకారంలో అత్యద్భుత సాండ్స్టోన్ శిల్పకళతో స్తంభాలు, గర్భాలయపై భాగాన నీటిలో తేలే ఇటుకల శిల్పకళా సంపదలు చూపరులను కట్టి పడేస్తాయి.
డా|| బి.ఎం.రెడ్డి
సెల్:949700037