Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశంలోని 14 ప్రధాన బ్యాంకులను 1969 జూలై 17న ప్రభుత్వం జాతీయం చేసింది. 52 సంవత్సరాల తర్వాత ఆనాడు జాతీయం చేయబడిన బ్యాంకులను తిరిగి ప్రయివేటీకరించాలన్న చర్చ నడుస్తోంది. దాంతో అసలా బ్యాంకులను అప్పుడు ఎందుకు జాతీయం చేశారో తెలిస్తే ఇప్పుడు ప్రయివేటీకరించాలనే వారి వాదనను అర్థం చేసుకోగలం.
ఆరోజుల్లో బ్యాంకుల జాతీయాకరణ ఒక గొప్ప సోషలిస్టు చర్యగా కాంగ్రెస్‌లోని పలువురు అభ్యుదయ వాదులు చెప్పుకున్నారు. ఇంకోవైపున అది అంతగా ప్రాధాన్యత ఏమీ లేని ఒక సాధారణ నిర్ణయం మాత్రమేనని, దానివలన పెట్టుబడిదారులకు పెద్దగా ఉపయోగం ఏమీ అనిపించలేదని, అందుకే వారు ఆ చర్యను పట్టించుకోలేదని వామపక్షాలలోని తీవ్రవాద విమర్శకులు భావించారు. ఈ రెండు ధోరణులూ సరైనవి కావు. ద్రవ్య పెట్టుబడి స్వభావాన్ని వివరిస్తూ రుడాల్ఫ్ హిల్ఫెర్డింగ్ అనే ప్రముఖ మార్క్సిస్టు ఆర్థికవేత్త ఒక గ్రంథం రాశాడు. సామ్రాజ్యవాదం గురించి లెనిన్ తన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినప్పుడు ఆ గ్రంథం నుండే ఎక్కువగా సమాచారం తీసుకున్నారు. ఆ రుడాల్ఫ్ హిల్ఫెర్డింగ్ ఒక సందర్భంలో జర్మనీలోని ప్రధానమైన ఆరు బ్యాంకులను గనుక జాతీయం చేసేస్తే దాంతో జర్మన్ పెట్టుబడిదారీ వర్గం నడ్డివిరిగిపోతుందని వాదించాడు. అది వొట్టి ఆశావాదం మాత్రమే. పెట్టుబడిదారీ వ్యవస్థలో బ్యాంకులను కేవలం జాతీయం చేసేసినంతమాత్రాన తేడా వచ్చేయదు. జాతీయం కాకమునుపు ఆ బ్యాంకులు ఏవిధంగా పెట్టుబడిదారులకు ఉపయోగపడ్డాయో, అదేవిధంగా జాతీయం అయిన తర్వాత కూడా ఉపయోగపడితే ఆ జాతీయీకరణ వలన పెట్టుబడిదారీ వ్యవస్థ నడ్డి ఏమీ విరిగిపోదు.
మన భారతదేశం వరకూ చూసుకున్నప్పుడు వలసపాలన నుండి విముక్తి పొందిన ఇతర మూడవ ప్రపంచ దేశాల మాదిరిగానే ఇక్కడ కూడా ప్రభుత్వ నియంత్రణలో పెట్టుబడిదారీ విధానాన్ని నిర్మించే వ్యూహం రూపొందించారు. ఆ వ్యూహంలోని ఒక అంతర్భాగమే ఈ బ్యాంకుల జాతీయాకరణ. పలు మూడవ ప్రపంచ దేశాలలో సాగిన సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమాల నాయకత్వం ఆ యా దేశాల పెట్టుబడిదారీ వర్గాల చేతుల్లోనే ఉండిపోయింది. అందువలన వలసపాలన నుండి బైటపడ్డాక తర్వాత కాలంలో ఆ దేశాలు అనుసరించిన అభివృద్ధి విధానపు వ్యూహం సోషలిజాన్ని నిర్మించే లక్ష్యంతో కాక, పెట్టుబడిదారీ విధానాన్ని నిర్మించే లక్ష్యంతోనే సాగింది. అయితే ఆ పెట్టుబడిదారీ విధానం సామ్రాజ్యవాదం పైన ఆధారపడకుండా స్వంతంగా కొనసాగేందుకు పూనుకుంది. ఆ కారణం చేత అది దేశీయంగా విస్తృత ప్రాతిపదికన లభించే వనరులపైన, మార్కెట్‌పైన ఆధారపడవలసివచ్చింది. అందువలన అది ఒకమేరకు వ్యవసాయాన్ని, చిన్న ఉత్పత్తిదారులు చేపట్టే ఉత్పత్తిని ప్రోత్సహించింది. మామూలుగా అయితే పెట్టుబడిదారీ విధానపు విస్తరణ అనేది చిన్న రైతులపైన, చిన్న ఉత్పత్తిదారులపైన విరుచుకుపడి, వారిని ధ్వంసం చేస్తూ ముందుకు సాగుతుంది. కాని ఇక్కడ మన దేశంలో, అందుకు కొంత భిన్నంగా వారిని కాపాడుతూ ముందుకు సాగవలసిన అగత్యం ఏర్పడింది.
ఇంకో విధంగా చెప్పాలంటే ఇక్కడ జరిగినది సోషలిజం నిర్మాణమూ కాదు, అదే సమయంలో సాంప్రదాయంగా సాగే పెట్టుబడిదారీ విధాన విస్తరణా కాదు. ఒకవైపునుండి సామ్రాజ్యవాద దేశాల పెట్టుబడి పెత్తనం నుండి దూరంగా ఉంటూ సాపేక్షంగా తమ స్వతంత్రతను నిలబెట్టుకోవడం, ఇంకోవైపు పెట్టుబడిదారీ వ్యవస్థ తాలూకు విధ్వంసం నుండి చిన్న ఉత్పత్తిదారులను, రైతులను కాపాడుకుంటూ రావడం - ఇదే స్వాతంత్య్రానంతర కాలంలో మన దేశంలో అనుసరించిన అభివృద్ధి వ్యూహం. అయితే ఇందులో రైతాంగంలోని కొన్ని తరగతులను, భూస్వాములను పెట్టుబడిదారీ వ్యవసాయ విధానం వైపు తీసుకువచ్చే ధోరణి కూడా కలిసివుంది. ఈ మొత్తం వ్యూహం సక్రమంగా అమలు జరగాలంటే ఈ అభివృద్ధి క్రమంలో ప్రభుత్వం స్వయంగా పెట్టుబడులు పెట్టడం, నియంత్రించడం, అదుపు చేయడం అవసరం అవుతుంది. ఇది సాంప్రదాయంగా కొనసాగే పెట్టుబడిదారీ విధానానికి భిన్నమైనటువంటిది. ఈ వ్యూహానికి జవహర్లాల్ నెహ్రూ ''సోషలిస్టు తరహా సమాజాన్ని నిర్మించడం'' అని పేరు పెడితే, మైకేల్ కాలెక్కీ వంటి ఆర్థిక వేత్తలు ''మధ్యంతర రాజ్యవ్యవస్థ'' అన్నారు. ఈ అభివృద్ధి వ్యూహం ఎంతో కాలం కొనసాగేది కాదని, ఏదో ఒక దశలో అది సాంప్రదాయ పెట్టుబడిదారీ విధానంలోకే మళ్ళుతుందని వామపక్షాలు మొదటినుంచీ విమర్శించుతూవచ్చాయి. వాస్తవానికి ఇప్పుడు అదే జరుగుతోంది.
ఈ విధంగా సాంప్రదాయ పెట్టుబడిదారీ పంథా వైపు మళ్ళడం వెనుక మనం గమనించవలసిన కీలకాంశం ఏమంటే, ఆ విధంగా మారే క్రమంలో మన అభివృద్ధివ్యూహం తనకున్న సాపేక్ష స్వతంత్రతను కోల్పోయి సంపన్న దేశాల ఆధిపత్యానికి లోబడవలసివస్తుంది. దాని పర్యవసానంగా ఆ అభివృద్ధి క్రమంలో సమాజంలోని అసమానతలు తీవ్రంగా పెరుగుతాయి. సామ్రాజ్యవాదం గుప్పెట్లో చిక్కడం వలన దేశాభివృద్ధి జరిగే క్రమం దెబ్బతినిపోయి జాతీయోద్యమ లక్ష్యాన్నే దెబ్బతీస్తుంది.
భారతదేశానికి సంబంధించిన అభివృద్ధివ్యూహం రూపొందిన కొంత కాలం తర్వాతనే బ్యాంకుల జాతీయాకరణ జరిగింది. అయినప్పటికీ, ఆ వ్యూహం సక్రమంగా అమలు జరగడానికి ఈ చర్య చాలా కీలకమైనదిగా ఉంది. ఒక దేశం ఏ విధమైన అభివృద్ధి పంధాను చేపడుతుందో, దానికి అనుగుణంగానే ఆయా సామాజిక, భౌగోళిక, రంగాలవారీ రుణ పంపిణీ జరగాలి. రుణం అనేది పెట్టుబడి మీద అదుపును ప్రతిబింబిస్తుంది. అందువలన అభివృద్ధి వ్యూహానికి అనుగుణంగా రుణపంపిణీ జరిగేటట్టు గ్యారంటీ చేయవలసివుంటుంది. సాంప్రదాయ పెట్టుబడిదారీ విధానానికి భిన్నంగా, ప్రభుత్వ నియంత్రణ కింద అమలు జరిగే పెట్టుబడిదారీ అభివృద్ధి విధానంలో పెట్టుబడిదారీ విధానాన్ని ప్రభుత్వం నియంత్రిస్తుంది. చిన్న తరహా ఉత్పత్తిని, చిన్న రైతాంగాన్ని కాపాడుకుంటూ, ఇంకోపక్కన సంపన్న దేశాలనుండి మన దేశ ఆర్థిక స్వయం ప్రతిపత్తిని కాపాడుకుంటూ ఉండాలంటే రుణ పంపిణీ మీద ప్రభుత్వం అదుపు కలిగివుండడం చాలా కీలకం అవుతుంది. ఈ అదుపు బ్యాంకుల జాతీయాకరణ ద్వారా మాత్రమే సాద్యం అవుతుంది. వాస్తవానికి మొదట్లో ప్రభుత్వం ప్రయివేటు బ్యాంకులపై ''సామాజిక నియంత్రణ''ను అమలు చేయడానికి ప్రయత్నించింది. తద్వారా ఆ బ్యాంకులు ఇచ్చే రుణాలను నియంత్రించ జూసింది. అయితే అటువంటి ''సామాజిక నియంత్రణ'' ఆచరణలో నిష్ఫలం కావడంతో ఆ బ్యాంకులను జాతీయం చేయడం వినా రుణ పంపిణీ ని నియంత్రించడానికి వేరే దారి లేకపోయింది.
1969లో జరిగిన బ్యాంకుల జాతీయీకరణ తర్వాత కొంత కాలానికి మరికొన్ని చిన్న ప్రయివేటు బ్యాంకులను మరొక విడతలో జాతీయం చేయడం జరిగింది. ఇదంతా బలమైన ప్రభావం కలిగించింది. వ్యవసాయానికి, చిన్న ఉత్పత్తిరంగానికి సంస్థాపరమైన రుణసౌకర్యాన్ని అది అందుబాటులోకి తెచ్చింది. వడ్డీ వ్యాపారుల గుప్పెట్లో చాలా కాలంగా చిక్కుకునిపోయిన రైతాంగానికి అది వెసులుబాటు కల్పించింది. దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ వ్యవస్థ విస్తరించడానికి దోహదపడింది. సాంప్రదాయ పెట్టుబడిదారీ విధానంలో రుణాలను పొంది ఆ సొమ్మును స్పెక్యులేటివ్ కార్యకలాపాలకు ఉపయోగించడం పరిపాటి. అటువంటి స్పెక్యులేటివ్ కార్యకలాపాలకు అవకాశం లేకుండా జాతీయం చేయబడిన బ్యాంకింగ్ వ్యవస్థ ఒక అడ్డుగోడ మాదిరిగా నిలబడగలిగింది. ఈ బ్యాంకు రుణాలలో అధిక భాగం రైతాంగంలో పలుకుబడి కలిగిన సెక్షన్లకే దక్కిందన్నది నిజం. అయితే, అంతకు ముందు కాలంతో పోల్చితే జాతీయాకరణ తర్వాత సంస్థాగత రుణాల పంపిణీ ఎక్కువ సెక్షన్లకు అందింది. తక్కిన పెట్టుబడిదారీ దేశాలతో పోల్చితే నిస్సందేహంగా ఎక్కువ విస్తారమైన తరగతులకు ఈ రుణాలు అందాయి. దీనికి హరిత విప్లవం తోడైంది. ఈ హరిత విప్లవం వలన పర్యావరణానికి కలిగిన పర్యవసానాల విషయంలో అభ్యంతరాలెన్ని ఉన్నప్పటికీ, సామ్రాజ్యవాదులు చెలాయించిన ''ఆహార సామ్రాజ్యవాదపు'' బంధనాలనుండి మన దేశం బైట పడగలిగిందన్నది వాస్తవం. అటువంటి హరిత విప్లవం లేకుంటే మన దేశం ఇప్పటికీ సామ్రాజ్యవాదులపైనే ఆధారపడవలసివుండేది.
ఈ విధంగా ప్రభుత్వ నియంత్రణలో అమలు జరిగిన పెట్టుబడిదారీ అభివృద్ధి వ్యూహాన్ని ప్రపంచవ్యాప్తంగా బలపడిన అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి దెబ్బతీసింది. ఈ అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడితో అత్యంత సన్నిహితంగా కలిసిపోయిన భారత బడా బూర్జువా వర్గం అంతవరకూ అమలు జరిగిన వ్యూహాన్ని కాస్తా మధ్యలోనే విడిచిపెట్టింది. నయా ఉదారవాద విధానాలను బలపరిచేవారి గొంతుక పెరిగింది. జాతీయ బ్యాంకులను ప్రయివేటీకరించాలన్న డిమాండు ముందుకొచ్చింది. అమెరికన్ సామ్రాజ్యవాదం తన దూతలు నారీ సమ్మర్స్, టిమ్ గీత్నర్ వంటివారి ద్వారా వత్తిడి పెంచింది. దానిని స్థానికంగా బలపరిచిన వారు జాతీయ బ్యాంకులు లాభసాటిగా నడవడంలేదన్న వాదనను ముందుకు తెచ్చారు. అసలు ఈ వాదనే పూర్తిగా అసమంజసమైనది. బ్యాంకులు లాభాలకోసం కాకుండా దేశ ప్రయోజనాలకోసం పని చేయాలన్న లక్ష్యంతో వాటిని జాతీయం చేశారన్న వాస్తవాన్ని ఈ వాదన పూర్తిగా విస్మరించింది.
సాంప్రదాయ పెట్టుబడిదారీ విధానాన్ని ప్రోత్సహించడమే నయా ఉదారవాదం అసలు లక్ష్యం. ఆ విధానంలో ఎటువంటి అదుపూ లేని విధంగా పెట్టుబడి వ్యవహరించడం వలన అనివార్యమైన పరిణామాలు సంభవిస్తాయి. చిన్న ఉత్పత్తిదారులమీద విరుచుకుపడి వారిని దెబ్బతీయడం జరుగుతుంది. చిన్న రైతులు వ్యవసాయంలో నిలదొక్కుకోలేని పరిస్థితులు ఏర్పడతాయి. మార్కెట్‌ను అదుపు చేయడం గాని, నియంత్రించడం కాని చేయలేని స్థితిలో ప్రభుత్వం ఉంటుంది. ఆదాయాలలో, సంపదలో వ్యత్యాసాలు విపరీతంగా పెరుగుతాయి. రైతాంగ ఆత్మహత్యలు విపరీతంగా పెరిగింది ఇందువల్లనే. ప్రభుత్వం విద్య, వైద్యం వంటి అత్యవసర సేవలను అందించే బాధ్యతనుండి వెనక్కు తగ్గింది. దేశంలో అత్యంత సంపన్నులుగా ఉన్న ఒక్క శాతం వ్యక్తులకు దేశ సంపదలో 6శాతం వాటా 1982 నాటికి ఉండేది. అది కాస్తా 2013-14 వచ్చేసరికి ఏకంగా 22శాతానికి పెరిగిపోయింది. ఈ శతాబ్దంలోనే ఇది అత్యంత అధిక పెరుగుదల. ఈ పర్యవసానాలన్నీ సాంప్రదాయ పెట్టుబడిదారీ విధానం వైపు మళ్ళడం వలన వస్తున్నవే. బ్యాంకులను ప్రయివేటీకరించాలన్న డిమాండ్ కూడా దాని ఎజండాలో ఒక భాగమే.
నయా ఉదారవాదం తన ఎజండాను ముందుకు తెచ్చి అమలు జరుపుతున్న కొద్దీ దాని దారుణ స్వభావం మరింత బాహాటంగా వ్యక్తం ఔతున్నది. కరోనా మహమ్మారి విస్తరించివున్న కాలంలో కార్మికహక్కులను కాలరాసే చట్టాలను తేవడం, వ్యవసాయంలో కార్పొరేట్ పెట్టుబడి స్వైరవిహారానికి అవకాశం కల్పించే విధంగా మూడు నల్ల వ్యవసాయ చట్టాలను తీసుకురావడం ఈ ధోరణికి సూచికలు. నిజానికి మోడీ ప్రభుత్వం తీసుకున్న ప్రతీ ప్రధాన ఆర్థిక చర్యా- జీఎస్టీ మొదలుకొని, పెద్దనోట్లరద్దు, వ్యవసాయ చట్టాలు వంటివి- దేశంలోని చిన్న ఉత్పత్తిదారులను దెబ్బతీసే లక్ష్యంతోనే వచ్చాయి. నయా ఉదారవాద ఎజండాలో భాగంగా కొల్లగొట్టి పోగేసుకునే పెట్టుబడిదారీ విధానాన్ని ప్రోత్సహిస్తున్నాయి. బ్యాంకుల ప్రయివేటీకరణ కూడా సరిగ్గా ఇటువంటి విధానాన్నే బలపరుస్తుంది. ఇప్పటిదాకా ఏకాస్త అయినా చిన్న రైతులకు అందుతున్న సంస్థాగత రుణాలను వారికి దక్కకుండా చేస్తుంది. (వాస్తవానికి ఈ సయా ఉదారవాద రాజ్యంలో ఇప్పటికే చాలామంది చిన్న రైతులకు ఈ విధమైన రుణాలు దక్కకుండాపోతున్నమాట వాస్తవం) దానివలన చిన్న రైతులు పూర్తిగా చితికిపోయే పరిస్థితి దాపురిస్తుంది.
ఆ విధంగా చిన్న రైతులు చితికిపోవడం వలన కలిగే పర్యవసానాలు కేవలం ఆర్థిక వ్యవస్థకే పరిమితం కావు. సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాట ఫలితంగా పుట్టుకొచ్చిన ప్రభుత్వ నియంత్రణ విధానం దేశం స్వంతకాళ్ళపై నిలవడానికి ఏవిధంగా దోహదం చేసిందో మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. మనవంటి దేశాలలో సాంప్రదాయ పెట్టుబడిదారీ విధానం గనుక అమలు జరిగితే, కొల్లగొట్టి పోగేసుకునే పెట్టుబడిదారీ విధానం అమలు కొనసాగితే దాని వలన దెబ్బ తినిపోయే చిన్న ఉత్పత్తిదారులను, చిన్న రైతులను కార్మిక వర్గంలోకి ఇముడ్చుకోగలిగే శక్తి ఈ సాంప్రదాయ పెట్టుబడిదారీ విధానానికి ఏమాత్రమూ లేదు. యూరప్ ఖండంలో గతంలో దెబ్బతినిపోెయిన చిన్న ఉత్పత్తిదారులంతా కార్మిక వర్గంలోకి ప్రవేశించగలిగారంటే అందుకు కారణం వారంతా ఆనాటికి కొత్తగా కనుగొన్న అమెరికా ఖండంలో కల్పించబడిన అవకాశాలను ఉపయోగించుకోగలగడమే. అటువంటి అవకాశమే గనుక ఆనాడు లేకపోయినట్లైతే, సాంప్రదాయ పెట్టుబడిదారీ విధానం వారిని ఎన్నటికీ కార్మికవర్గంలోకి ఇముడ్చుకోగలిగి ఉండేది కాదు. మన వంటి దేశాలలో దెబ్బ తినిపోతున్న చిన్న ఉత్పత్తిదారులకు అటువంటి అవకాశాలేవీ లేవు. కనుక ఈ కొల్లగొట్టి పోగేసుకునే పెట్టుబడిదారీ విధానం ఒక సామాజిక సంక్షోభానికి దారి తీయకమానదు. మన దేశం కూడా దెబ్బతినిపోయిన ఇతర మాజీ వలసదేశాల గుంపులో కలిసిపోయి సామ్రాజ్యవాదులముందు దేహీ అంటూ సహాయం కోసం దేబిరించే దుస్థితి రాకుండా ఉండాలంటే ఈ కొల్లగొట్టి పోగేసుకునే పెట్టుబడిదారీ విధానాన్ని వ్యతిరేకించాలి. అందులో భాగంగా ఈ మూడు నల్ల వ్యవసాయ చట్టాలను, బ్యాంకుల ప్రయివేటీకరణను కూడా వ్యతిరేకించడం చాలా ముఖ్యం.
-స్వేచ్ఛానుసరణ
- ప్రభాత్‌పట్నాయక్