Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాష్ట్రంలో 73 షెడ్యూల్డ్ ఎంప్లాయి మెంట్స్ ఉన్నాయి. వీటిలో కనీస వేతనాలు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి సవరించాల్సి ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో 2006 నుండి 2012 సంవత్సరాల మధ్య అనేక జీఓలు సవరించారు. 2014 తరువాత తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 7 సంవత్సరాలు అయినా కనీస వేతనాల జీవోలు సవరించలేదు. సుమారు 10 నుండి 15 సంవత్స రాలుగా రాష్ట్రంలో ప్రయివేటు రంగంలో పనిచేస్తున్న కోటి మంది పైగా కార్మికులకు వేతనాలు పెరగలేదు. కరోనా పరిస్థితులు, పెరిగిన ధరలు, ఇతర ఖర్చులు తట్టుకోలేక కార్మికుల బతుకులు చితికిపోయాయి.
రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల కనీస వేతనాలు సవరించకుండా, యజమానుల ప్రయోజనాలు కాపాడుతూ పక్షపాతంతో వ్యవహరిస్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన అనంతరం ప్రభుత్వ ఖజానా నుండి వేతనాలు చెల్లించే వారందరికీ 2 సార్లు వేతనాలు పెంచారు. కనీస వేతనం రూ.19,000 నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం 7వ పే కమిషన్‌లో తన ఉద్యోగులకు 2016లోనే రూ.18,000 కనీస వేతనంగా నిర్ణయించింది. మంత్రులు, ఎమ్ఎల్ఏ, ఎమ్ఎల్సి, జెడ్పిటిసి, ఎమ్పిటిసి, సర్పంచులు, ప్రజా ప్రతినిధులకు వేతనాలు పెంచారు. ప్రభుత్వ ఖజానాపై పైసా భారం లేని ప్రయివేటు రంగంలోని కార్మికుల వేతనాలు సవరించడానికి మాత్రం సిద్ధపడడంలేదు. కార్మికులు యాజమానుల వద్ద పని చేసినందుకు, వారి శ్రమ ఫలితంగా లాభాలు సంపాదిస్తున్నారు. అందులో నుండే వేతనాలు ఇస్తారు. శ్రమ దోపిడీని నిరోధించే లక్ష్యంతో 1948 కనీస చట్టం ప్రకారం వేతనాలు ప్రభుత్వాలు నిర్ణయించాలి. కానీ యాజమాను లపై ప్రేమతో వేతనాలు సవరించకుండా రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు అన్యాయం చేస్తున్నది. ఇప్పటికే 2 లేదా 3 సార్లు కనీస వేతనాలు సవరించాల్సి ఉండగా 2021లో కూడా ప్రభుత్వం కాలయాపన చేస్తున్నది. కరోనా పరిస్థితులలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయి. పెట్రోల్, డీజిల్ రేట్లు రూ.100 దాటాయి. గ్యాస్ బండ ధర రూ.900లకు చేరుకున్నది. ఇంటి అద్దెలు, విద్య, వైద్య ఖర్చులు భరించే పరిస్థితి లేదు. ప్రభుత్వాలు మాత్రం ప్రత్యక్ష, పరోక్ష పన్నుల భారం పెంచుతున్నాయి. మరోవైపు ఆర్థిక పరిస్థితి సంక్షోభం పేరిట యాజమానులు కార్మికుల ఉపాధి, వేతనాలపై కోతలు పెడుతున్నారు. 10 లక్షల మంది పారిశ్రామిక రంగంలో పనిచేసే కార్మికులతో పాటు సుమారు కోటి మంది వివిధ రంగాలలో పనిచేస్తున్న కార్మికులు కనీస వేతనాలు సవరించకపోవడంతో తీవ్రంగా నష్టపో తున్నారు.
ఈ పరిస్థితులలో సీఐటీయూ, వివిధ కార్మిక సంఘాలు గత ఆరేండ్లుగా ఆందోళనలు చేస్తున్నాయి. 2014, 2016లలో రెండుసార్లు కనీస వేతనాల సలహా మండలి ఏర్పడింది. బోర్డు సమావేశాలు కూడా తీర్మానాలు చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాయి. వీటిని ప్రభుత్వం ఆమోదించి జీవోలు విడుదల చేయాల్సి ఉంది. కానీ కాలయపనకు కారణం ప్రభుత్వంపై యాజమానుల ఒత్తిడి ఉంది. ఎందుకంటే కోట్లలో లాభాలు దండుకోడానికి ఇదొక బహిరంగ దారి.
పారిశ్రామికరంగంతో పాటు రాష్ట్రంలో లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న రంగాలు ఉన్నాయి. బీడీ, చేనేత, ప్రయివేట్ ట్రాన్స్‌పోర్టు, భవన నిర్మాణ, సెక్యూరిటీగార్డ్స్, మిల్లులు, హాస్పిటల్స్, హాస్టల్స్, హౌటల్స్, సఫాయి కర్మచారి, పెట్రోల్ బంకులు, వుడ్ వర్క్స్, హ్యాండ్లూం, షాప్స్, వ్యాపార సంస్థలు, సినిమా, విద్యా సంస్థలు తదితరాలు షెడ్యూల్డ్ ఎంప్లాయీమెంట్స్ క్రింద ఉన్నాయి. వీటన్నింటిలో అతి తక్కువ వేతనాలతో కార్మికులు వెట్టి చాకిరి చేస్తున్నారు. ఇటీవల జూన్ నెలలో ప్రభుత్వం 5 రంగాలకు ఫైనల్ నోటిఫికేషన్స్ ఇచ్చింది. 1. జీఓ 21 ద్వారా సెక్యూరిటీ సర్వీసెస్ 2. జీఓ 22 కన్స్ట్రక్షన్ లేదా మెయిన్టెన్స్ ఆఫ్ రోడ్స్ Ê బిల్డింగ్ ఆపరేషన్స్ 3. జీఓ 23 స్టోన్ బ్రేకింగ్ Ê స్టోన్ క్రషింగ్ ఆపరేషన్స్ 4. జీఓ 24 కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్రాజెక్ట్ ఇన్క్లూడింగ్ డ్యామ్స్ Ê మల్టీపర్పస్ ప్రాజెక్టులు వచ్చాయి. వీటిలో కనీస వేతనం రూ.18,019 లు నిర్ణయించారు. విడిఏ పాయింట్ రేటు రూ.12లు ఉంది. అత్యధికంగా రూ.39,837లు బేసిక్ విడిఏ రేటు రూ.26.53 ఉంది. వీటిలో ఎక్కువ వేతనాలు నిర్ణయించారని యాజ మాన్యాలు గెజిట్ కాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి. పైగా ఇప్పటికే పక్క రాష్ట్రాల కన్నా తెలంగాణలో ఎక్కువ వేతనాలు ఉన్నాయని వాదిస్తున్నాయి. మరి వాస్తవం ఏమిటీ?
మన రాష్ట్రంలో వివిధ రంగాలలో అన్‌స్కిల్డ్ వర్కర్స్ కనీస బేసిక్ పరిశీలిద్దాం. (కరువుభత్యం కాకుండా) వ్యాపార సంస్థలు, షాప్స్‌లో రూ.3,757లు, రైస్‌మిల్లులు రూ.3,523లు, హౌటల్స్ రూ.3,317లు, హెవీ మోటార్ డ్రైవర్స్ రూ.4,319, బీడి వర్కర్స్ రూ.130, హాస్పిటల్స్ రూ.6,209, కాంట్రాక్ట్ లేబర్‌కు రూ.5,579లు, గార్మెంట్ రూ.3,995లు, సినిమా రూ.4,236లు, సఫాయి కర్మచారీ రూ.5,000లు, మెస్తా ఉపయోగించే పరిశ్రమలో రూ.1,716లు మాత్రమే ఉన్నాయి. అన్ని రంగాలలో ఇదే పరిస్థితి. ఇతర రాష్ట్రాల్లో ముఖ్యంగా కేరళలో 2016లో రోజు రూ.600లకు తగ్గకుండా రూ.18,000లు ప్రభుత్వం నిర్ణయించింది. మన రాష్ట్ర ప్రభుత్వమే కాంట్రాక్టు ఉద్యోగుల జీ.వో 60 ద్వారా రూ.15,600 కనీస వేతనం నిర్ణయించింది. ప్రయివేట్ యాజమానుల వాదనలను కొట్టివేసి తక్షణమే కాలపరిమితి ముగిసిన అన్ని రంగాల జీవోలు విడుదల చేయడం అవసరం. ఫైనల్ నోటిఫికేషన్స్‌లో నిర్ణయించిన వేతనాలు 15ఏండ్ల తర్వాత 2, 3 సార్లు సవరణలు చేయకుండా యజమానులకు లాభం చేకూర్చి అనంతరం వచ్చినవి కొంత ఊరట కలిగిస్తున్నాయి. వాటిని వెంటనే గెజిట్ చేసి పకడ్బందీగా అమలు చేయాలని సీఐటీయూ డిమాండ్ చేస్తున్నది.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తెచ్చింది. ఇందులో కనీస వేతనాలు నిర్ణయించే పూర్తి అధికారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నాయి. పారిశ్రామికవేత్తల కోసం పనిచేస్తున్న ప్రభుత్వాలు కనీస వేతనాలపై దాడి చేస్తున్నాయి. లేబర్ కోడ్లను తీవ్రంగా వ్యతిరేకిస్తూ కార్మికవర్గం పోరాడుతున్నది. యజమానుల సేవకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంకితమైతే రానున్న రోజుల్లో కార్మికుల క్రోధాగ్న్రికి గురికావల్సి ఉంటుంది.
- భూపాల్
సెల్:9490098034