Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బయటకు వెళ్ళిన బాలికలు, మహిళలు, పిల్లలు, యువకులు ఇంటికి రాలేదనీ, ''మిస్సింగ్'' అయ్యారనీ తరచూ వింటూ, చూస్తూనే ఉంటాం. ఇలా మిస్సింగ్ అయిన వారిలో చాలా మంది అక్రమ రవాణాకు గురవుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఎవరినైనా వెట్టిచాకిరి చేయిం చేందుకు డబ్బు ఆశ చూపి బలవంతంగా, మోసపూరితంగా శారీరక ప్రయోజనాలు కోసం వాడు కోవడాన్ని మానవ అక్రమ రవాణాగా పరిగణించాలని ఐక్య రాజ్య సమితి తెలిపింది. ఇలా అక్రమ రవాణా బారిన పడుతున్న వారిలో ఎక్కువ మంది మహిళలు, బాలికలు, పిల్లలే.
మన దేశంలో 2018లో 5264 మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 64శాతం స్త్రీలు, 18 సంవత్సరాల వయస్సు నిండనివారు అధికం. ఎక్కువగా బీహార్, మహారాష్ట్ర, తెలంగాణ, జార్ఖండ్, ఏపీ, ఒడిషా తదితర రాష్ట్రాల నుంచి అధిక శాతం ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన వర్గాలకు చెందినవారిగా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తెలిపింది. పేదరికం, బతుకు తెరువు కోసం, వలసలు వెళ్ళటం అక్కడ మధ్యవర్తులు మోసం చేయబడినవారు, యుద్ధాలు, కరువు కాటకాలు, పకృతి వైపరిత్యాల శరణార్థులు ఈ అక్రమ రవాణా బారిన పడుతున్నారు. సులభంగా డబ్బు సంపాదించాలని, త్వరగా డబ్బు సంపాదించి ధనికులుగా మారాలని, రంగుల కలలు కంటూ కొంతమంది ముక్కుపచ్చలారని బాలికలు , ప్రేమ పెళ్ళిళ్ళ పేరుతో కొంతమంది మోసగాళ్ళ చేతికి చిక్కి, వ్యభిచార కూపంలోకి నెట్టవేయుబడుతూ భవిష్యత్తు అంధకారం చేసుకుంటున్నారు. పురుషులు, బాలురు గనులు, ప్రమాదకరమైన పరిశ్రమల్లో పనిచేసేలా బలవంతంగా నెట్టబడుతున్నారు.
ముఖ్యంగా ఈ కోవిడ్ సమయంలో మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అధికారుల అవినీతి, చట్టాలు పటిష్టంగా అమలు కాకపోవడంతో మానవ అక్రమ రవాణా అంతకంతకూ పెరిగిపోతోంది. ఇలాంటి వారిపై లైంగిక దోపిడీ, వ్యభిచారం, భిక్షాటన, బలవంతపు వివాహాలు, దత్తతలు, వెట్టిచాకిరి మరియు అవయవాల దోపిడీలతో ప్రపంచంలో పెద్ద వ్యాపారం కొనసాగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా అక్రమ రవాణా బాధితుల్లో 28 శాతం పిల్లలు వున్నట్లు ''యునిసెఫ్'' తెలిపింది. సబ్-సహారా ఆఫ్రికా, మధ్య ఆసియా, సౌత్ ఆసియా, మధ్య అమెరికా, కరేబియన్ దీవుల నుంచి ఈ అక్రమ రవాణా ఎక్కువగా ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి. మానవ అక్రమ రవాణాలో దక్షిణ ఆసియా ప్రాంతం 2వ స్థానంలో ఉండడం ఆందోళన కలిగిస్తుంది. అక్రమ రవాణాకు గురైన మహిళలు మానసిక, శారీరక అనారోగ్యాలకు గురవుతూ ముఖ్యంగా పి.టి.యస్.డి వ్యాధి, డిప్రెషన్, ఆందోళన, హెచ్.ఐ.వి, టి.బి, యస్.టి.డి.తో బాధపడు తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న మూత్రపిండాల మార్పిడిలో 5శాతం నుండి10 శాతం ఈ అక్రమ రవాణా బాధితల నుండి గ్రహిస్తున్నట్లు తెలియవచ్చింది.
అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐ.యల్.ఓ) నివేదిక ప్రకారం 21 మిలియన్ల మంది నిర్భంధ కార్మికులుగా పనిచేస్తున్నారు. భారతదేశం నుంచి అక్రమ రవాణాకు గురైన మహిళలను మస్కట్, గల్ఫ్, అరబ్ దేశాలకు ఎగుమతి చేసి, వేశ్యావృత్తి లోకి దించుతున్నారు. వీరిలో 20 శాతం మంది 16-18 వయస్కులు, 16 శాతం మంది 14 సంవత్సరాలు లోపు వారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ సంవత్సరం 150 బిలియన్ల డాలర్లు మేర వ్యాపారం జరుగుతున్నట్లు ఐ.యల్.ఓ చెప్తున్న వివరాలు విస్మయానికి గురిచేస్తున్నాయి.
మన దేశంలో 95 శాతం మంది మైనర్లు, మైనార్టీలు ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన వర్గాల వారు బలవుతున్నారు. తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడం, 13-16 సంవత్సరాల మధ్య వచ్చే శారీరక మార్పులు, తగిన అవగాహన లేకపోవడం, సామాజిక మాధ్యమాల ప్రభావం, చెడు స్నేహాలు, బాలికలు ఆకర్షణలకు గురవటం, ఒంటరి మహిళలు ఆదరణ కోసం వేల సంఖ్యలో మోసం పోతుంటే, పదులు సంఖ్యలోనే కేసులు నమోదు చేస్తున్నారు. ''ఇమ్మోరల్ ట్రాఫికింగ్ ప్రివెన్షన్'' చట్టం కింద కేసులు నమోదు చేయకుండా, ఎక్కువ కేసులు సి.ఆర్.పి.సి ఐ.పి.సి 366 ఏ తదితర సెక్షన్ల కిందే అక్రమార్కులపై నమోదు చేయటం వల్ల వీరి వెనుక ఉన్న అసలు నేరగాళ్లు తప్పించు కుంటూ, తక్కువ శిక్షలతో బయటపడు తున్నారు.
అక్రమ రవాణా అరికట్టేందుకు మరింత కఠినం చట్టాలు చేయాలని 2017లో ''బచపన్ బచావో ఆందోళన్ (బి.బి.ఎ)'' సంస్థ, ఇతర పౌర సమాజ సేవ సంస్థలు పది లక్షల మందితో (1.2మిలియన్లు) 12000 కి.మీ ''మేము అమ్మబడటానికి కానీ, మోసపోవడానికీ కానీ సిద్ధంగా లేం'' అనే నినాదంతో పాదయాత్ర చేసి చైతన్యం కలిగించారు. కోవిడ్ సమయంలో ఈ సంస్థ, ఇతరుల సహకారంతో 9000 మందిని అక్రమ రవాణా ఊబిలో చిక్కుకోకుండా కాపాడింది. కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ (డబ్య్లూ.సి.డి) అక్రమ రవాణాను అరికట్టేందుకు ''మానవ అక్రమ రవాణా బిల్లు-2021'' ప్రవేశపెట్టింది. ఇది ఏమేరకు ఉపయోగ పడుతుందో చూడాలి.
భారత రాజ్యాంగం ఆర్టికల్ 23 ప్రకారం అక్రమ రవాణా నేరం. ఆర్టికల్ 24 ప్రకారం వెట్టిచాకిరి చేయించరాదు. అంతేకాకుండా 1956 నుండి 2021లో భారత ప్రభుత్వం అనేక చట్టాలు చేసింది. అయితే అమలులో అలసత్వం వల్ల అనుకున్న లక్ష్యాన్ని చేరటంలేదు. బాధితులకు సరైన న్యాయం జరగక, మురికి కూపంలోనే చీకటి జీవితాన్ని అనుభవిస్తున్నారు. మానవ హక్కులు కనుచూపుమేరలో కనపడటంలేదు. సరైన బడ్జెట్ కేటాయింపులు లేకపోవడం వల్ల బాధితులకు పునరావాసం, రక్షణ కరువవుతోంది.
సి.బి.ఐ నివేదిక ప్రకారం ఒక కోటి ఇరవై లక్షల మంది బిక్షగాళ్ళు, వ్యభిచారులు, బాలకార్మికులు, మాదకద్రవ్యాల మాఫియాగా మారారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కరీంనగర్, మహబూబ్నగర్, ఆదిలాబాద్, రాయలసీమ నాలుగు జిల్లాలు, ప్రకాశం నుంచి అక్రమ రవాణా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కోవిడ్ కాలంలో ఉపాధి అవకాశాలు లేక, మధ్యవర్తుల మాటలు నమ్మి మోసపోతున్నారు. కుటుంబ కలహాలు, అధిక వడ్డీలు కట్టలేక జీవితం దుర్భరం అవుతున్న కారణంగా వలస బాటపట్టి కొన్ని సందర్భాల్లో మోసాలకు గురవుతున్నారు.
కుటుంబ సభ్యులు తమ పిల్లల ఆలోచనలు, దైనందిన కార్యక్రమాలుపై నిఘా ఉంచాలి. 1098 చైల్డ్ లైన్, 100 పోలీసు హెల్ప్ లైన్, దిశ యాప్, దిశ, నిర్భయ చట్టాల ద్వారా రక్షణ, భద్రత పొందాలి. జువైనల్ జస్టిస్ చట్టం, ఐ.టి, ఇమ్మోరల్ ట్రాఫికింగ్, బాల కార్మిక నిర్మూలన చట్టాలు పక్డబందీగా అమలు చేయాలి. జాతీయ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ ''యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ కమిటీ''లు ఏర్పాటు చేశారు. ఇవన్నీ మరింత చురుకుగా పనిచేయాలి. ముఖ్యంగా బాలికలు చదువు కోవాలి. ప్రలోభాలకు గురి కాకూడదు. పోలీసు, న్యాయ సలహాలు తీసుకుని విదేశాలకు ఉపాధి, ఉద్యోగం, చదువుల కోసం వెళ్ళాలి. షాహీన్, ప్రజ్వల, మై ఛాయిస్, రెడ్స్ వంటి స్వచ్ఛంద సంస్థలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సేవలు అందిస్తున్నాయి. ఈ అక్రమ రవాణా బాధితుల కన్నీటి వెతలు, శారీరక మానసిక గాయాలు చివరికి వారిని జీవచ్ఛవంలా మారుస్తూ... జీవితాన్ని, భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయి. అప్రమత్తత, చట్టాలే రక్ష.
- ఐ.ప్రసాదరావు
సెల్: 9948272919