Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భాగ్యనగరం - హైదరాబాద్ - విశ్వనగరి.. ఎంతో గొప్ప చరిత్ర. కాని ప్రస్తుతంలో పేరుగొప్ప, ఊరుదిబ్బ.. వాతావరణ కాలుష్యం లో నైతేనేమి, పరిశుభ్రతలోనైతేనేమి ఈ నగర సౌందర్యాన్ని వర్ణించడానికి ఏ 'గాలిబ్ గజళ్ళూ' సరిపోవేమో! నాలుగు చిరుజల్లులు కురిస్తే చిత్తడే! పెద్ద వర్షం కురిస్తే ఇక అంతే సంగతులు.. ఆ మధ్య ఒక 'కార్టూన్' సోషల్ మీడియాలో 'హల్చల్' చేసింది. దాని సారాంశం.. భారీగా కురిసిన వర్షాలకు రోడ్లన్నీ జలమయ మయిపోతే, పాదచారులు పడవల్లో ప్రయాణించడం గురించి.. వాస్తవానికి హైదరాబాద్ నగర పరిస్థితి అదే.. గతంలో ప్లానింగ్ లేకుండా నిర్మాణాలు జరగటం ప్రక్కన పెడితే, చెరువులను కబ్జాచేసి నిర్మించబడిన ప్లాట్స్ దుస్థితిని వర్షాలు పడిన సమయంలో చూస్తే గుండె చెరువు అవుతుంది. సెల్లార్లలోకి నీరు చేరి, పార్కింగ్‌ల్లో ఉన్న వాహనాలు సైతం మునిగిన వైనం గురించి మీడియా సవివరంగా చిత్రీకరించిన తీరు ప్రజలందరికీ విస్మయం గొలిపింది. నిజాంపేట, తదితర పోష్ లొకాలిటీలలోనే ఇటువంటి పరిస్థితులు ఉంటే, ఇక స్లమ్ ఏరియాల గురించి చెప్పాలంటే అదొక విషాద ఝరి..
అన్నింటికంటే చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే.. 'మ్యాన్ హౌల్స్'... వీటి నిర్వహణ చాలా బాధ్యతారాహిత్యంగా ఉంటోంది. సింహభాగం 'మ్యాన్‌హౌల్స్'పైన మూతలు లేకుండా తెరుచుకునే ఉంటుంటాయి. వర్షాలకు రోడ్లమీద, వీధుల్లో నీళ్ళు నిండిపోయి, ఏ మ్యాన్హౌల్ ఎక్కడ ఉందో తెలియని దుస్థితి. అడుగుతీసి, అడుగు వేయాలంటే భయం. చాలా వరకు ప్రమాదాలు జరుగుతుంటాయి. కొందరినైనా ఈ మ్యాన్‌హౌల్స్ కబళించక మానవు.
ఎంతో ఘనంగా, ఆర్భాటంగా, కోవిడ్ నిబంధనలు అతిక్రమించి మరీ కార్పొరేషన్ ఎన్నికలు జరిపింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. విపరీతమైన వాగ్దానాల 'జడివాన'కురిసింది. విజయం సాధించాక, ఏ కార్పొరేటరూ తన ఏరియాలో పరిశుభ్రత గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. భారీగా వర్షాలు కురిస్తే, ముందుగా ఎటువంటి చర్యలు తీసుకోవాలి అని ఆలోచించిన వారూలేరు.
ప్రతి కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. చాలాకాలనీల్లో ఇటువంటి ఏర్పాట్లు లేవు. అసంఘటితశక్తుల రాకపోకలు పరిశీలించాలంటే ఈ సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరి. బయటి వ్యక్తులు ఎవరికయినా, ఖాళీ ఫ్లాట్లు 'బాడుగ'కు ఇవ్వాలంటే సంకోచం.. ఎటువంటి సంఘ విద్రోహకర కార్యకలాపాలు జరుగుతాయేమోనని వెరపు. ఎక్కడ బాంబు బ్లాస్టయినా, ఏ విద్రోహకర చర్యలు జరిగినా హైదరాబాద్ మూలాలు బయటకు వస్తున్నాయి. అలా బయటకు వచ్చినప్పుడల్లా కొద్దిగా పోలీసుశాఖ కదలికలు, తనిఖీ చర్యలు ఉంటాయి కొద్ది రోజులు.. ఆ తర్వాత అన్నీ మామూలే..
ఎన్నెన్ని 'ఫ్లైఓవర్ల' నిర్మాణాలు జరిగినా, ట్రాఫిక్ భూతం నగరాన్ని పట్టిపీడిస్తూనే ఉంది. కాలం చెల్లిన వాహనాలు స్వైరవిహారం చేస్తూనే ఉన్నాయి. అవి వెదజల్లే రణగొణ ధ్వనులు, విరజిల్లే కాలుష్యం నగర ప్రజల మీద తీవ్ర ప్రభావం చూపుతోంది. వాస్తవానికి ఇటువంటి వాహనాలను 'తుక్కు'కు తరలించాలి. అయితే రవాణాశాఖ అధికారుల తనిఖీ నామమాత్రంగానే ఉంటుంది. ఇక నగర పరిశుభ్రత గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. ఎక్కడ పడితే అక్కడ చెత్త, ఖాళీ బాటిల్స్.. రోడ్డు ప్రక్కనే యధేచ్ఛగా మూత్రవిసర్జన..!
ఒక ఉదాహరణ తీసుకుంటే, మన హైదరాబాద్ నగర జనాభాకు కొద్దిగా అటో ఇటో ఉంటుంది శ్రీలంక జనాభా.. అక్కడ పరిశుభ్రత ఎలా ఉంటుందో, నగర ఏలికలు పరిశీలించాలి. నిరుపయోగమైనవి పడవేయడానికి చాలా చోట్ల పెద్ద పెద్ద 'డస్ట్‌బిన్'ల ఏర్పాటు ఉంటుంది. అటువంటి చర్యలు కార్పొరేషన్ పాలకులు ఎందుకు తీసుకోరో అర్థం కాదు.
నగర ప్రధాన కూడళ్ళల్లో పర్యవేక్షణ తప్పనిసరి. ముఖ్యంగా శివారు ప్రాంతాలలో 'చెడ్డీ గ్యాంగ్' చేస్తున్న దోపిడీలు, వారు జరుపుతున్న మారణహౌమాలు తలచుకుంటుంటే గగుర్పాటు కలుగుతుంది. ఏ పత్రిక టాబ్లాయిడ్ చూసినా నేరాలు-ఘోరాల వార్తల శాతమే అధికంగా ఉంటోంది. పోలీసులూ, నిఘా వ్యవస్థ ఏం చేస్తున్నట్టూ? ఇన్ని లొసుగులకు కారణం, విస్తారంగా పెరుగుతున్న నగరానికి తగినట్టుగా వ్యవస్థ రూపకల్పన జరగలేదేమోననిపిస్తోంది.
అందరికీ భాగ్యనగరం అంటే ఎంతో వ్యామోహం.. ఇక్కడ ఉపాధి అవకాశాలు ఎక్కువ కనుక, వలసలూ అధికమే. వైద్యరంగంలో అతిముఖ్యంగా కార్పొరేట్ ఆస్పత్రులలో జరుగుతున్న దోపిడీలను ప్రభుత్వం నియంత్రించాలి. ఔట్ పేషెంట్ దగ్గర ప్రస్తుతం ఫీజు రూపేణా రూ.650 వసూలు చేస్తున్నారు. అతను ఒక్కసారి ఆసుపత్రి మెట్లు ఎక్కితే అవసరం లేకపోయినా, అనవసర పరీక్షల పరిట వేలాది రూపాయలు ఫీజులు వసూలు చేస్తుంటారు. భార్యల పుస్తెలు విక్రయించి, వైద్య సౌకర్యాలు పొందుతున్న నిరుపేదల సంఖ్య ఈ హైదరాబాద్‌లోనే ఎక్కువ.
ఈ నగరం పేరుకే భాగ్యనగరం. ఏ విపత్తు జరిగినా భాగ్యం కోల్పోక తప్పదు. కొంతవరకు అన్నార్తుల కొరకు అన్నపూర్ణ క్యాంటిన్లు, సరసమైన ధరలకు చిరు అంగళ్ళు ఉండవచ్చుగాక. పరిశుభ్రత లేమివలన, అంటువ్యాధులు పెరిగే ప్రమాదాలను పసికట్టకపోతే పెనుముప్పు తప్పదు. సర్వాంగ సుందరంగా, అన్ని కాలాలలోనూ శోభల్లినప్పుడే 'విశ్వనగరి' అనే ఖ్యాతికి సార్థకత చేకూరినట్టు కాగలదు.
రోడ్లపై ఎక్కిరిస్తున్న 'గుంతలను' చూస్తుంటే భయం కలుగుతుంది. రోడ్లు వేసినా వాటి నాణ్యత ఎంతకాలం అనేది జవాబు లేని ప్రశ్న. ఈ విధంగా పన్నుల రూపేణా చెల్లించిన ప్రజాధనం వృధా అవుతోంది. రోడ్ల పక్కన నాటుతున్న మొక్కలకు ఎంతో ద్రవ్యాన్ని హెచ్చింపగానే సరిపోదు. వాటి సంరక్షణ కూడా చూడాలి కదా! అందుకే ఈ నగరం భాగ్యంలేని భాగ్యనగరి అనిపించుకోకుండా చూడాల్సిన బాధ్యత ఎన్నికైన ప్రజా ప్రతినిధులందరిమీదా ఉంది.
- పి. శ్రీనివాసరావు
సెల్: 9182203351