Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మన్మోహన్ సింగ్ నూతన ఆర్ధిక విధానాలను ప్రవేశపెట్టి మూడు దశాబ్దాలు గడచింది. 1991 జూలై 24న పివి నరసింహారావు ప్రధాన మంత్రిగా ఉండగా మన్మోహన్సింగ్ సంస్కరణలతో కూడిన తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వాటికి ఆద్యులం మేమే అని గతంలో ఛాతీలు విరుచుకున్న కాంగ్రెస్‌లో గానీ, అదే సంస్కరణలను మరింత గట్టిగా అమలు చేస్తున్న బీజేపీలోగానీ ఎక్కడా సంతోషం కాదు గదా కనీస చిరు హాసం కూడా కనిపించటం లేదు. ఎందుకు?
మూడు దశాబ్దాల క్రితం మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా సంస్కరణల బడ్జెట్‌ను ప్రతిపాదిస్తూ పదిహేను రోజులకు సరిపడా మాత్రమే విదేశీ మారక ద్రవ్యం ఉందని చెప్పారు. ఇప్పుడు మన దేశం దగ్గర పదిహేను నెలలకు సరిపడా ఉన్నది. చిత్రం ఏమిటంటే అప్పుడు పెట్టుబడిదారీ విధానాన్ని సమర్ధించేవారే సంస్కరణలు కావాలని కోరారు. మూడు దశాబ్దాల తరువాత ఇప్పుడూ మరిన్ని సంస్కరణలు కావాలని కోరుతున్నదీ వారే. సామాన్య జనంలో నాడున్నంత మోజు, క్రేజు ఇప్పుడు లేదు. ఎందుకని? ''స్వాతంత్య్రం వచ్చెనని సభలే చేసి సంబరపడగానే సరిపోదోయీ, సాధించిన దానికి సంతృప్తిని పొంది అదే విజయమనుకుంటే పొరపాటోయి.. ఆకాశం అందుకొనే ధరలొకవైపు అదుపులేని నిరుద్యోగమింకొకవైపు, అవినీతి బంధుప్రీతి చీకటి బజారూ అలుముకున్న నీ దేశమెటు దిగజారూ, కాంచవోయి నేటి దుస్ధితీ ఎదిరించవోయి ఈ పరిస్థితి'' అంటూ ఆరుదశాబ్దాల క్రితమే పరిస్థితిని ఎదిరించమని సందేశమిచ్చాడు శ్రీశ్రీ. మూడు దశాబ్దాల సంస్కరణల తరువాత అవన్నీ మరింత పెరిగాయి.
1991నాటి సంస్కరణలకు విదేశీ చెల్లింపుల సమస్య తలెత్తటం ఒక ప్రధాన కారణం. నరేంద్రమోడీ హయాంలో విదేశీమారక ద్య్రవ్యం పెరుగుదలను ఒక ఘన విజయంగా ఊరూ వాడా ఊదరగొడుతున్నారు. ఇది నాణానికి ఒకవైపు మాత్రమే. మొత్తం మీద మన దేశ ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా ఉన్నాయి. అంటే మనకు అవసరమైన విదేశీమారక ద్రవ్యం లోటులోనే ఉంది. ఎవరి ఘనత అయినా మిగులు సాధించినపుడే. ఇప్పుడు 612 బిలియన్ డాలర్లు (జూలై 16నాటి ఆర్బిఐ సమాచారం) దాటినప్పటికీ ప్రముఖ ఆర్థికవేత్తలు హెచ్చరికలు చేస్తున్నారు. మరోసారి చెల్లింపుల సంక్షోభం తలెత్తవచ్చని, జాగ్రత్తపడాలని కొందరు, ఐఎంఎఫ్‌ను ఆశ్రయించవచ్చని కొందరు హెచ్చరిస్తున్నారు. ''ఊహించని విదేశీ అఘాతాల (షాక్‌లు)లను తట్టుకొనే శక్తిని విదేశీమారక ద్రవ్య స్ధాయిలు కల్పిస్తాయని చెప్పటం మోసకారితనం'' అని రిజర్వు బ్యాంకు డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేవవ్రత పాత్ర రిజర్వుబ్యాంకు బులిటెన్‌లో రాశారు. పదిహేను నెలలు దిగుమతులు చేసుకోవడానికి సరిపడా ఉన్నందున మన పరిస్థితి మెరుగ్గా ఉందని కొందరు నమ్మబలుకుతున్నారు. కానీ మన దేశ అంతర్జాతీయ నిఖర పెట్టుబడులను విశ్లేషిస్తే సంపదలకంటే అప్పులు 12.9శాతం ఎక్కువగా ఉన్నాయి. అందువలన ఆచరణాత్మక విశ్లేషణలు చేయటం అవసరం.
మన్మోహన్సింగ్ చెప్పినట్టు పదిహేను రోజులకు సరిపడా విదేశీమారక ద్రవ్య నిల్వలున్నపుడు ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఆదేశాల మేరకు సంస్కరణలు తీసుకువచ్చారు. అందువలన సహజంగానే అవి కొన్ని తరగతులను సంతృప్తి పరచాయి, సంపదలను పెంచాయి. వాటిని చూసి అనేక మంది తాము కూడా ఆ జాబితాలో చేరేందుకు మహదావకాశం వచ్చిందనే ఆశతో వెనుకా ముందూ చూడకుండా వాటిని సమర్ధించారు. యూపీఏ పాలనలో దేశంలో ఆర్ధిక పరిస్థితి దిగజారటం, కొత్త పద్ధతుల్లో దేశ సంపదలను దోచుకొనే క్రమంలో జరిగిన అక్రమాల కారణంగా జనంలో అసంతృప్తి తలెత్తింది. దాన్ని ఉపయోగిం చుకొని నరేంద్రమోడీ రంగంలోకి వచ్చారు.
ఏడు సంవత్సరాల తరువాత ఇప్పుడు ఆయన పాలనలోనూ అనేక వైఫల్యాలు కళ్లెదుట కనిపిస్తున్నా ప్రధాని మోడీ పలుకుబడి తగ్గలేదని కొందరు చెబుతున్నారు. అంగీకరిద్దాం. ఐదులక్షల కోట్ల డాలర్ల జీడీపీ లక్ష్యం గురించి ఎవరూ ఇప్పుడు మాట్లాడటం లేదు. నాడు పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్‌లు చేసిన మాదిరి కరోనాతో కుదేలైన ఆర్థిక వ్యవస్ధను గాడిలో పెట్టేందుకు నరేంద్రమోడీ అద్భుతాలు చేయగలరా లేదా అని కొందరు పోల్చి చూస్తున్నారు. కొందరు పండితులు, విధాన నిర్ణేతలు ఆశపడుతున్నారు గానీ అంత సీన్ లేదు, ఆశాభంగం చెందుతారు అని హెచ్చరిస్తున్నారు. వారు చెబుతున్న కారణాల సారాంశం ఇలా ఉంది. 1991 నాటి ఏకీభావం ఇప్పుడు లేదు. అవి ఆకస్మికంగా ఆకాశం నుంచి ఊడిపడలేదు. సంస్కరణలతో చైనా పురోగమనం, ఆసియాలో మరికొన్ని దేశాల పురోగమన ప్రభావం, అన్నింటికీ మించి సోవియట్ యూనియన్ పతనం వంటి అంశాలన్నీ ప్రభావితం చేశాయి. సంస్కరణల్లో భాగంగా ప్రభుత్వరంగ విస్తరణ, పెట్టుబడుల విధానాన్ని పక్కన పెట్టి సర్వం ప్రయివేటుకే అప్పగించారు. అయినా సేవారంగంలో వచ్చిన మార్పులు తప్ప పారిశ్రామిక, వ్యవసాయ రంగాలలో సాధారణ పెరుగుదల తప్ప సంస్కరణల ప్రభావం ప్రత్యేకంగా కనిపించటం లేదు. మన దిగుమతులు తప్ప ఎగుమతులు పెరగటం లేదు. సంస్కరణలను మరింతగా అమలు జరపాలని అందుకు కఠిన నిర్ణయాలు తీసుకోవాలనే వాదనలు, వత్తిళ్ళు మన్మోహన్ సింగ్ హయాంలోనే ఇంటా బయటా ప్రారంభమయ్యాయి. యూపీఏ ఒకటి హయాంలో వామపక్షాల మద్దతుతో ప్రభుత్వం నడవటం వలన కార్పొరేట్ల కోరికలు తీర్చటం సాధ్యం కాలేదు. యూపీఏ 2 హయాంలో వామపక్షాలతో నిమిత్తం లేకుండానే పాలన సాగినా ధరల పెరుగుదల, అవినీతి అక్రమాల కుంభకోణాలతో పరువు పోయిన సమయంలో వెనకడుగు వేయక తప్పలేదు. ఈ సమయంలో గుజరాత్-గోద్రా- మారణకాండ నేపథ్యంలో అవసరమైతే జనాన్ని అణచి తమ అజెండాను అమలు జరిపే సాహసవంతుడు కార్పొరేట్లకు నరేంద్రమోడీలో కనిపించారు.
అంతకంటే కావాల్సింది ఏముంది. అవసరమైన ప్రచారం, హంగు, అర్భాటాలతో కొత్త దేవుడు వచ్చాడన్నట్లుగా పరిస్థితిని తయారు చేశారు. ఒక అజెండాను కూడా రూపొందించారు. పారిశ్రామికవేత్తలు కోరిన విధంగా భూమి పొందేట్లు నిర్ణయాలు తీసుకోవాలి, కార్మిక చట్టాలను నీరు గార్చాలి, పన్ను సంస్కరణలను అమలు జరపాలి, బ్యాంకులు, బీమా రంగం నుంచి తప్పు కోవాలి. మిగిలిన ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరించాలి, వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పగించాలి. ఇందుకు అవసరమైన ఇతర అనుబంధ చర్యలు తీసుకోవాలి. దీనిలో భాగంగానే అంతకు ముందు తాము వ్యతిరేకించిన జిఎస్టిని మోడీ అమలు చేశారు. మిగతావాటికీ రంగం సిద్దం చేశారు. అయితే పెద్ద నోట్ల రద్దు వంటి పిచ్చిపనితో తలెత్తిన ఇబ్బందులు, జీఎస్టీతో వచ్చిన సమస్యలు, ఆర్థిక రంగంలో వృద్ధి రేటు ఎనిమిది నుంచి నాలుగుశాతానికి పడిపోవటం, దాదాపు అన్ని రంగాలలో వైఫల్యం కారణంగా మిగతా అంశాల అమలును వేగం చేస్తే జనం నుంచి ప్రతిఘటన ఎదురవుతుందనే భయమే ఇప్పుడు నరేంద్రమోడీని పీడిస్తోంది. మొరటుగా ముందుకు పోతే అధికారానికే మోసం వస్తుందనే బెరుకు మొదలైంది. అన్ని వ్యవస్థలూ దిగజారుతున్నట్టే. మోడీ హయాంలో ఏకాభిప్రాయ సాధన, భిన్నాభిప్రాయాల వెల్లడి లేదా చర్చకు అవకాశాలు ఇవ్వని నిరంకుశ ధోరణీ పెరుగుతోంది. గతంలో పార్లమెంటులో ప్రవేశ పెట్టిన బిల్లుల్లో 60-70శాతం కమిటీల చర్చకు పంపేవారు, ఇప్పుడు అవి పదిశాతానికి పడిపోయాయి. ప్రవేశపెట్టే బిల్లుల గురించి ముందుగా చర్చించటం కూడా తగ్గిపోయింది. తొలి ఐదు సంవత్సరాలలో 186 బిల్లులను ప్రవేశపెడితే వాటిలో 44 మీదే ముందుగా సంప్రదింపులు జరిపారు. కరోనా సమయంలో వ్యవసాయ సంస్కరణల్లో భాగంగా సరైన సంప్రదింపులు, చర్చలు లేకుండా మూడు బిల్లులను ఆమోదించుకున్న తీరు, వాటికి వ్యతిరేకంగా రైతాంగం ఎనిమిది నెలలుగా జరుపుతున్న ఉద్యమం గురించి తెలిసిందే. ఆ చట్టాల అమలును సుప్రీం కోర్టు తాత్కాలికంగా పక్కన పెట్టింది. వ్యవసాయ చట్టాల తరువాత కార్మిక చట్టాలకు రంగం సిద్దం చేశారు. అయితే అనూహ్యంగా కరోనా వచ్చింది. సహాయక చర్యలు, దాన్ని గుర్తించటంలో నిర్లక్ష్యం, వైఫల్యం ఒకటైతే ఆర్థికంగా దేశం కుదేలు కావటం వలన సంస్కరణ ల కిక్కు జనానికి ఎక్కించటం సాధ్యం కాదు. ఏ చమురు ధరలైతే మోడీ అధికారానికి రాగానే గణనీయంగా పడిపోయి ప్రభుత్వం మీద భారం తగ్గించటంతో పాటు ఆమేరకు జనం మీద భారం మోపి అదనపు వనరులను సమకూర్చు కొనేందుకు దోహదం చేశాయో ఇప్పుడు అవే రాబోయే రోజుల్లో మెడకు చుట్టుకోనున్నాయి. ఇప్పుడు మోడీ తలపెట్టిన సంస్కరణల అజెండా యూపీఏ హయాంలోనే ఉంది. వాటి అమలు, తటపటాయింపు మన్మోహనసింగు ఇష్ట అయిష్టాల కారణంగా వాయిదా పడలేదు. ధరల పెరుగుదల వంటి అంశాలతో పాటు అవినీతి అక్రమాలు ఆ ప్రభుత్వాన్ని కుదిపివేసిన కారణంగా తగ్గారు. అందుకే కార్పొరేట్లు సింగును పక్కన పెట్టి మోడీకి జై కొట్టారు.
ఏడు సంవత్సరాల తరువాత ఆర్థిక వ్యవస్థ కుదేలు కావటం, పన్నుల కారణంగా చమురు ధరలు రికార్డు స్ధాయికి చేరటం, వాక్సిన్‌పై పిల్లిమొగ్గలు, ఆక్సిజను కూడా అందించలేని కరోనా వైఫ్యల్యం అన్నింటికీ మించి రైతుల ప్రతిఘటన వంటి అంశాల నేపథ్యంలో మోడీ సంస్కరణల గురించి కబుర్లు చెబితే నమ్మే స్థితిలో జనం లేరు. అదే మోడీకి ముందు నుయ్యి వెనుక గొయ్యిగా ఉంది. మొరటుగా ముందుకు పోతే జనంలో ప్రతిఘటన, కోరిక తీర్చకపోతే కార్పొరేట్లు చేయాల్సింది చేస్తారు.
- సత్య
సెల్:8331013288