Authorization
Mon Jan 19, 2015 06:51 pm
Hakuna Matata, What a Wonderful Phrase
It means no worries for the rest of your days
It’s our problem free.. Philosophy
Hakuna Matata - Hakuna Matata -
హకూన మటాటా - ఇట్ మీన్స్ నో వర్రీస్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ యువర్ డేస్. ఇట్స్ అవర్ ప్రాబ్లం ఫ్రీ ఫిలాసఫీ - హకూన మటాటా
'ద లయిన్ కింగ్' ఎనిమేటెట్ కథా చిత్రంలో టిమ్ రైస్ రాసిన ఈ పాటకు సంగీతం సమకూర్చింది ఎల్టాన్ జాన్. హకూన మటాటా - అంటే స్వాహిలీ భాషలో ఒక భావాన్ని వ్యక్తీకరించే పదం. హకూన మటాటా. ఎంత అందమైన మాటా? రాబోయే రోజుల్లో మీకు బాధలు, వ్యధలూ లేకుండా ఉండాలని అభిలషించే మాట. సమస్యలేవీ లేని ఒక ప్రశాంత తాత్త్విక చింతన. రోజువారీ కష్టనష్టాల నుండి మీరు పొందాల్సిన స్వాంతన. 'హకూన మటాటా' వాల్ట్ డిస్నీ రికార్డుగా విడుదలైన పాట (1995). సినిమాలోని కొన్ని జంతువుల పాత్రల కోసం నాథన్ లేన్, ఎర్ని సబెల్లో, జాసర్ వీవర్, జోసెఫ్ విలియమ్స్ ఇంకా కొంతమంది కలిసి పాడారు. మామూలు మాటలతో ఉన్న ఒక మామూలు గీతంలా అనిపించినా, ఎదుటి వారికి బాధలు లేకుండా ఉండాలని ఆశించే పాట. సమస్యలు లేని జీవితాన్ని ఆశించే ఒక ఉదాత్తమైన తాత్త్విక భావన. నిజాయితీగా, స్వార్థచింతన లేకుండా ఎదుటివారి మేలు కోరుకునే భావం ఇందులో ఉన్నందువల్లనేమో - ప్రపంచ వ్యాప్తంగా ఇది ఎంతో ప్రాచుర్యం పొందింది. ఆఫ్రికా దేశాల్లో నిత్య జీవితంలో భాగమైపోయింది. హకూన మటాటా - పేరుతో సూక్తులు కూడా ఆయా దేశాల్లో చాలా ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి.
ఇంతటి ఉదాత్త భావనతో ఉన్న ఈ గీతం అక్కడి ప్రజల నిత్య జీవితంలో ఎలా ప్రవేశించిందో చూడండి. పెద్ద పెద్ద రెస్టారెంట్లలో డిన్నర్ టైంలో 20-30 మంది కళాకారులు వాయిద్యాలతో హాల్లోకి వచ్చి డిన్నర్ కోసం వచ్చిన కస్టమర్లకు ఈ పాట పాడి వినిపించి ఆనందింపజేస్తారు. వాళ్ళంతా బయటి నుండి వచ్చిన కళాకారులు కాదు, హౌటల్ ఉద్యోగులే. సంగీతం, నృత్యం తెలిసినవారు. ఒక్కోసారి కస్టమర్లు కూడా గళం కలుపుతారు. కాలూ కదుపుతారు. ఈ ఆధునిక యుగంలో మానసిక ఒత్తిడులతో ఉంటున్న జనానికి ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని, ఒత్తిళ్ళు లేని జీవితం జీవిద్దామన్న సందేశాన్నీ ఇస్తుంది. అందుకే ఆ పాట ఆఫ్రికన్ సంగీత ప్రపంచంలో ఒక మైలురాయి లాగా నిలిచిపోయింది. హౌటళ్ళలోనే కాదు, ఇళ్ళలో కూడా ఇది పాడుకోవడం మామూలయిపోయింది. అతిధులు ఎవరైనా ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు ఇంటి సభ్యులు మొదట ఈ పాట పాడి ఆనందింపజేసిన తర్వాతే వారిని రాత్రి భోజనం కోసం డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళతారు. స్వాహిలీ భాషలోని ఈ మాట వారి దైనందిన జీవితంలో ప్రధానమైపోయింది.
'స్వాహిలీ' భాష ఆఫ్రికాలోని ఏఏ ప్రాంతాల్లో మాట్లాడుతారు? దాని ప్రాముఖ్యమేమిటీ మొదలైన వివరాల్లోకి పోదాం.. కాంగో డెమాక్రటిక్ రిపబ్లిక్ ఉగాండాలోనూ, కొమెరోస్ ద్వీపాల్లోనూ ఎక్కువ మంది మాట్లాడేది స్వాహిలీ భాష. టాంజానియా, కెన్యాలలో అది అధికార భాష. బురిండి, ర్వాండా, ఉత్తర జాంబియా, మాల్వి, మొజాంబిక్లలోకూడా స్వాహిలీ మాట్లాడేవారున్నారు. స్వాహిలీ భాషకూ భారతదేశానికి ఏమైనా సంబంధాలున్నాయా? అని చూస్తే తప్పకుండా ఉన్నాయని తేలింది. భారతదేశంలోని సిది, బంటు, హబ్సి (అబైస్సియన్) వంటి ఇక్కడి గుజరాత్ ప్రాంతంలోని భాషలు, స్వాహిలీ భాష నుండి వచ్చినవే.. గుజరాత్‌లోని కతియావార్‌లో.. ఇటీవలి 20వ శతాబ్దం వరకు ఆ భాషలు అక్కడ చలామణిలో ఉండేవి. మానవజాతులు ఆఫ్రికా నుండి ప్రపంచంలోని వేర్వేరు దేశాలకు వలసలు పోయినట్లే.. కొన్ని జాతులు భారతదేశానికీ వచ్చాయి. అక్కడి నలుపురంగు జన్యువులతో పాటు, అక్కడి భాషలు, అభిరుచులు కూడా భారతదేశానికి వచ్చి ఉంటాయి. కతియావార్‌లోని సిది భాష పూర్వాపరాలు చూస్తే అది కాంగో ప్రాంతంలోని నిగర్ -బెంటాయిడ్ - బంటూ - సబకీ - స్వాహిలీ భాషల మీదుగా రూపాంతరం చెందుతూ భారతదేశంలో సిది భాషగా స్థిరపడిందని తెలుస్తూ ఉంది. 20వ శతాబ్దం దాకా ఆ భాష ఇక్కడ వర్దిల్లుతూ వచ్చిందన్నది రుజువైన సత్యం. ప్రాంతీయ భాషలు తమ ప్రాభవాన్ని కోల్పోతూ, ఇంగ్లీషు భాషకు ప్రాధాన్యమివ్వడమనేది ఒక్క భారతదేశంలోనే జరగలేదు. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతూ వచ్చింది. స్వాహిలీ భాషకు ప్రధాన నిలయంగా ఉన్న టాంజానియా, కెన్యా, సోమాలయా, కాంగోలలో స్వాహిలీ భాషతో పాటు, ఇంగ్లీషు, పోర్చుగ్రీసు, ఫ్రెంచ్, అరబిక్ భాషలు కూడా అక్కడ వినిపిస్తున్నాయి. ఈ పురాతన స్వాహిలీ భాషను 18వ శతాబ్దంలో అరబిక్ లిపిలో రాసేవారు. అప్పటి నుంచే ఈ భాషలో సాహిత్య రచనలున్నాయి. తర్వాత కాలంలో దీన్ని రోమన్ లిపిలో రాస్తున్నారు. ఈ ప్రాంతాల్లో ఉన్న అధిక సంఖ్యాకులు ముస్లింలు. ఇందులో సున్నీ, షియా, సుఫీయిజం శాఖల వారున్నారు. క్రైస్తవులు అల్పసంఖ్యాకులు. వీరిలో కూడా రోమన్ కేథలిక్, ప్రొటిస్టెంట్, ఈస్ట్రరన్ ఆర్థడాక్స్ వారున్నారు.
ఒకసారి ఆఫ్రికా ఆదివాసీ పిల్లలు దగ్గరికి వెళ్ళి ఇలాంటిదే మరో విషయం నేర్చుకుందాం. ఒక ఆంత్రపాలజిస్ట్ (నరశాస్త్ర పరిశోధకుడు) ఆఫ్రికా ఆదివాసీ బాలబాలికల ప్రవర్తన మీద అధ్యయనం చేయదలిచి, వారితో పిచ్చాపాటిగా కొంత సమయం గడుపుదామని వెళ్ళాడు. ఉట్టి చేతులతో వెళ్ళకుండా వారి కోసం ఓ చాక్లెట్ బాక్స్ తీసుకెళ్ళాడు. దాన్ని ఓ చెట్టు కింద పెట్టి, పిల్లలందరినీ ఓ వందమీటర్ల దూరంలో నిలబెట్టాడు. ఆయన ఏం చెపుతాడోనని పిల్లలు ఆత్రంగా చూడసాగారు. ''చూడండి పిల్లలూ.. మీరంతా ఒక వరసలో నిలబడండి. నేను గో- అనగానే ముందుకు పరిగెత్తండి. మీలో ఎవరైతే వేగంగా పరిగెత్తి ఆ చెట్టుకింద ఉన్న బాక్స్‌ను తాకుతారో.. అందులోని చాక్లెట్లన్నీ వారికే ఇచ్చేస్తాను'' అని అన్నాడు. వారిని పరుగుకు సిద్ధం చేశాడు. వారిలో పోటీతత్వం పెంచాలనుకున్నాడు. ''మేం సిద్ధం'' అన్నట్లుగా పిల్లలంతా నవ్వుతూ నిటారుగా నిలబడ్డారు. పరిశోధకుడు ''త్రీ-టూ-వన్-గో'' అన్నాడు. పిల్లలెవరూ హడావుడి పడలేదు. ఒక వరుసలో నిలబడ్డ అమ్మాయిలూ అబ్బాయిలూ అందరూ దగ్గరికి జరిగి, ఒకరి చేయి ఒకరు పట్టుకుని, అందరూ కలిసి ఒకేసారి చెట్టువైపు పరిగెత్తారు. అందరూ చాక్లెట్ బాక్స్‌ను ఒకేసారి పైకెత్తారు. అన్న ప్రకారం చాక్లెట్లు అందరికీ ఇవ్వాల్సిందే. ''అవి మీ కోసమే తెచ్చాను. అందరూ తీసుకోండి'' అని అన్నాడు పరిశోధకుడు పిల్లల పనికి ఆశ్చర్యపోయి.
పిల్లలంతా ఒకేసారి 'ఉబంటు' అని అరిచారు.
''ఉబంటునా? అంటే ఏమిటి మీ భాషలో'' అని ప్రశ్నించాడు పరిశోధకుడు ఉత్సుకతతో..
''ఉబంటు - అంటే - మేమున్నాం గనకనే నేనున్నాను'' అని అర్థం చెప్పారు పిల్లలు.
''నిజమే! ఒప్పుకుంటాను. కానీ, మీరు చేసిందేమిటీ?'' అన్నాడాయన.
''మేం చేసిందీ అదే! అందరం కలిసికట్టుగా పరిగెత్తాం. కలిసికట్టుగా గెలిచాం. దొరికిన బహుమతిని అందరం పంచుకున్నాం'' అని చెప్పారు పిల్లలు. పిల్లల్లో ఒకడు ముందుకు వచ్చి ఇంకొంచెం వివరించాడు.
''ఒక్కడే గెలుచుకుని, ఒక్కడే చాక్లెట్లన్నీ తినేస్తే మిగతా వాళ్ళంతా ఎలా సంతోషంగా ఉండగలరూ? అందరినీ బాధపెట్టి ఆ ఒక్కడు మాత్రం సంతోషంగా ఎలా తినగలడూ? అయినా అలా తినడం న్యాయం కాదు కదండీ! అందుకే ఉబంటు'' అని అన్నాడు ఆ కుర్రాడు. ''మేం ఉన్నాం గనకనే నేనున్నాను.. అన్నది మా సూత్రం! అదే మా లక్ష్యం'' అని చెప్పారు పిల్లలంతా ఏకకంఠంతో.. పరిశోధకుడికి కళ్ళు చెమ్మగిల్లాయి.
మిలియనీర్లు, బిలియనీర్లు... అభివృద్ధి చెందిన గొప్ప గొప్ప దేశాలు ఈ ఉబంటు సూత్రాన్ని పాటిస్తే ప్రపంచం ఎంత ఆనందంగా ఎంత శాంతియుతంగా ఉండేదో కదా? - అన్న ఆలోచనతో ఒక్క క్షణం పరిశోధకుడి ఒళ్ళు పులకరించిపోయిది.. అభివృద్ధి కాని దేశాల్లో నాగరికత ఇంకా సరిగా తెలియని ఆదివాసీల్లో ఎంతటి మానవత్వముందో తెలుసుకోవాలి. అర్థం చేసుకోవాలి. ఎదుటివారు బావుండా లన్న భావన (హకూన మటాటా) గానీ, అందరూ ఉన్నారు కాబట్టే నేనున్నాననే (ఉబంటు) ఆలోచన గానీ ఎంతటి మానవీయ విలువలతో కూడుకున్నవో కదా? మరీ ముఖ్యంగా ఇన్ని వందల వేల ఏండ్లుగా ఏ మత ప్రబోధకులూ ఇలాంటి విషయాలు చెప్పలేదు. మత గురువులూ చెప్పలేదు. మత విశ్వాసకులూ ఆలోచించలేదు. ఆదివాసీ బాలబాలికలు మాత్రం విషయాన్ని ఎంత సరళంగా చెప్పారూ, చెప్పింది ఎంత చక్కగా ఆచరించి చూపారూ? జాతి, మత, వర్ణ, వర్గ, లింగ బేధాల్ని త్యజించి మానవ సమానత్వం కోసం హుందాగా ఆలోచించినప్పుడే ప్రపంచ మానవులంతా సుఖ సంతోషాలతో ఉంటారు.
ఇక మనదేశానికి సంబంధించిన విషయాల్లోకి వస్తే, ఇక్కడ లోగడ జరిగిందేమిటి? ఇప్పుడు జరుగుతున్నదేమిటి? సమైక్య భావనని, సమానత్వ భావనని ముక్కలు ముక్కలుగా నరికిన మనువాదులు, వారిని స్ఫూర్తిగా తీసుకుని నేడు అధికారం చలాయిస్తున్న రాజకీయ నాయకులు, అసలు ఇలాంటి విషయాలపై దృష్టిపెడుతున్నారా? మనుషుల్లో ద్వేష భావాన్ని రెచ్చగొట్టే పనులు ఎవరు చేసినా, సామాన్య పౌరులు గమనిస్తూ ఉండాలి. అరికట్టే ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. దేశంలో 136.64 కోట్ల జనం ఉన్నారు. గనుకనే ఈ దేశానికి ఓ ప్రధాని ఉన్నాడు. ప్రధాని ఉన్నాడు కాబట్టి జనం లేరు. ఆ తేడా తెలుసుకోవాలి. ఉబంటు సూత్రం అదే. ''నేనున్నాను కాబట్టే వీళ్ళంతా ఉన్నారు'' అనే భావన ''నేను తప్ప ఇతరులెవరూ బాగుండకూడదు'' అనే కుత్సితపు బుద్ది నశించాలి! మనుషులంతా ఒక్కటే.. అన్నది గ్రహిస్తే మానవవాద మొక్కటే శరణ్యమవుతుంది! హకూన మటాటా! హకూన మటాటా!! ఉబంటు..
- వ్యాసకర్త: సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త.
- డాక్టర్ దేవరాజు మహారాజు