Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''పోడు భూముల సమస్య ఎక్కడ లేకుండా ఉంది? ఖమ్మంలో ఉంది. వరంగల్‌లో ఉంది. నిజామాబాద్‌లో ఉంది. 60 ఏండ్లుగా ఈ పెద్ద మనుషులు దీనికి పరిష్కారం చూపలేదు. మేము కొంత వరకు చేశాం. కానీ వచ్చే టర్మ్‌లో ఈ పోడు భూములు, గిరిజన భూముల స్టోరీ ఎక్కడోకాడ అయిపోవాలి. అడవుల నరికివేత ఆగాలి. సాగుచేసుకున్న వాటికి హక్కులు రావాలి. తప్పకుండా ఈ పోడు భూములు దున్నుకునే వారికి పట్టాలిప్పించి వారి హక్కులు కాపాడతాం. నేనే వచ్చి ఆ పని చేయిస్తా''. ఇది 2018 డిసెంబర్లో కుమ్రం భీం-ఆసిఫాబాద్ జిల్లా సిర్పూరు నియోజకవర్గానికి ఎన్నికల ప్రచారానికి వచ్చిన సందర్బంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ. కానీ జరుగుతున్నదేమిటి?
మోసమంటే తెలియని అమాయక గిరిజనులకు సొంత ఆస్తి అంటూ ఉందంటే అవి పోడు భూములు మాత్రమే. కానీ ఇప్పుడు ఈ భూములపై పాలకుల కన్ను పడింది. మోకాలికి బోడు గుండుకు ముడిపెట్టినట్టు అటవీ విస్తీర్ణం తగ్గిపోయిందని, దాన్ని పెంచడానికి పోడు భూముల్లో మొక్కలు నాటడానికి అటవీ శాఖాధికారులు ప్రణాళికలు తయారు చేసుకుంటున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి టీఆర్ఎస్ అధికారంలోకొచ్చాక ప్రభుత్వం హరితహారం పేరుతో పోడు భూముల్లో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అటవీ భూముల చుట్టూ కందకాలు తవ్వి గిరిజనులకు వెళ్లనీయకుండా చేస్తోంది. ఐదారేండ్లుగా పోడు భూముల వివాదం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. ప్రతి ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో అటవీ అధికారులు పోడు భూముల్లో సాగును అడ్డుకోవడం, గిరిజనులు ప్రతిఘటించడం జరుగుతోంది. కానీ రెండేండ్లుగా పోడు భూముల వ్యవహారం తారా స్థాయికి చేరింది. తమ భూముల్లోకి వచ్చిన అటవీ శాఖాధికారులను గిరిజనులు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు.
పోడుతోనే అటవీ విస్తీర్ణం తగ్గుతోందా?
గిరిజనులు పోడు వ్యవసాయం చేయడంతో అడవులు తగ్గిపోతున్నాయని ప్రచారం ఉంది. కానీ ఇందులో ఏమాత్రమూ వాస్తవం లేదు. విసిరేసినట్టు ఉండే గిరిజన గూడాల్లో పదుల సంఖ్యలోనే ఆవాసాలుంటాయి. వారు మహా అయితే పది ఇరవై ఎకరాల్లో పోడు సాగు చేస్తుంటారు. కానీ వారు ఆ ప్రాంతంలో ఉండడం చేత అటవీ సంరక్షణకు ఎంతగానో తోడ్పడుతుంటారు. కానీ పాలకులు గిరిజనులతోనే అడవంతా నాశనమవుతున్నట్టు వారిపై నిందలు మోపుతుంటారు. అనాదిగా అటవీ సంపదపై ఆధారపడి జీవనం సాగిస్తున్న గిరిజనులు అటవీ ఫలాలు అనుభవిస్తూనే అడవులను సంరక్షిస్తున్నారనేది ముమ్మాటికీ వాస్తవం.
కలప స్మగ్లర్ల సంగతేంటి?
అడవుల విస్తీర్ణం నానాటికీ తగ్గిపోతోందన్నది జగమెరిగిన సత్యం. అయితే దీనికి ప్రధాన కారణం కలప రవాణానే అనేది అందరికీ తెలిసిందే. కానీ ప్రభుత్వం అసలు విషయాన్ని పక్కనబెట్టి పోడే కారణమని అసత్య ప్రచారం చేస్తోంది. అటవీ విస్తీర్ణం పెంచడానికి పోడు భూముల్లో మొక్కలు నాటడానికి యత్నిస్తోంది. వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కలప రవాణా చేస్తూ పట్టుబడిన ఘటనలు రోజూ ఎక్కడోచోట జరుగుతూనే ఉంటాయి. ఈ వార్తలు లేకుండా దినపత్రికలు వెలువడవని రోజుండదంటే అతిశయోక్తి కాదు. దీనికి రాజకీయ అండదండలు, ఇంటిదొంగల సహకారం పుష్కలంగా ఉంటోంది. ఇలా వాస్తవాలను మరుగునపడేసి ప్రభుత్వాలు అటవీ విస్తీర్ణం పెంచడానికి గిరిజనులనే సమిధులుగా చేయడం ఆక్షేపణీయం. ఇప్పటికైనా గిరిజనులు కొండాకోనల్లో ఉండడంతోనే అడవులు రక్షింపబడతాయని తెలుసుకోవాలి. వారికి న్యాయం బద్ధంగా పోడు భూములకు హక్కు పత్రాలిచ్చి బతుక్కు భరోసా కల్పించాలి. ఈ విషయంలో వామపక్షాలు నిరంతరంగా పోరాడుతూనే ఉన్నాయి.
- రాపర్తి దత్తాత్రి
సెల్: 9490099400