Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పెట్రోలుపై పన్నులు పెంచడం వలన కేంద్రం కన్నా రాష్ట్రాలే ఎక్కువగా లాభపడుతున్నాయన్న తప్పుడు లెక్కల యొక్క పోస్టర్‌ను మోడీ భజనపరులు వాట్సాప్‌లో పెట్టడమే గాక ఈ పోస్టర్‌ను పెట్రోల్ బంకులు అన్నింటిలో పెట్టాలని అలాగైతేనే పబ్లిక్కు కూడా పెట్రోల్ ధరల వలన లాభ పడ్డది ఎవరన్నది తెలుస్తుందన్న మెసేజ్ సర్క్యులేట్ చేస్తున్నారు. దాదాపు ఇటువంటి మెసేజ్‌నే బెంగాల్ రాష్ట్రానికి వర్తింపజేస్తూ త్రిపుర మాజీ గవర్నర్ తథాగత్ రారు వాట్సాప్‌లో పెట్టాడు. బీజేపీ కొమ్ముగాసే ఒక టివి ఛానల్ మరో అడుగు ముందుకేసి పెట్రోల్ ధరల పెరుగుదల వల్ల వచ్చే ఆదాయంలో రాష్ట్రాల వాటా చాలా ఎక్కువని, పెరుగుతున్న పెట్రోల్ ధర పాపం గతంలో ఆయిల్ బాండ్లు జారీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానిదని, ఇప్పుడు మోడీ చెమటోడ్చి ఆ బాండ్లకు సంబంధించిన అసలు, వడ్డీని చెల్లిస్తున్నారని, కాంగ్రెస్ చేసిన పాపాన్ని కడుగుకోవాలంటే 2026 వరకు పెట్రోల్ ధరలు పెంచక తప్పదని అర్థ సత్యాలు, అసత్యాలతో ఒక కథనాన్ని వండి వార్చింది.
15వ ఫైనాన్స్ కమిషన్ సిఫార్సు ప్రకారం కేంద్రం వసూలు చేసే పన్నులలో 41శాతం తిరిగి రాష్ట్రాలకు ఇవ్వాలి. దీనికి అనుగుణంగా కేంద్రం పెట్రోల్ డీజిల్‌పై వేస్తున్న పన్నులో 41శాతం తిరిగి రాష్ట్రాలకు ఇస్తోంది. అందువలన కేంద్రం పన్నులు పెంచడం వలన రాష్ట్రాలకు ఎక్కువ వాటా దక్కి గణనీయంగా లాభపడుతున్నాయన్నది వీరి వాదనల సారాంశం!
కేంద్రం వసూలు చేసే పన్నుల్లో తిరిగి రాష్ట్రాలకు ఎంత శాతం వాటా ఇవ్వాలన్నది ఫైనాన్స్ కమిషన్లు సిఫార్సు చేస్తాయి. ఈ సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించవచ్చు. ఆమోదయోగ్యం కాని వాటిని తిరస్కరించవచ్చు. అలా 15వ కమిషన్ రాష్ట్రాలకు 41శాతం వాటా ఇవ్వాలని చేసిన సిఫార్సును మోడీ ప్రభుత్వం ఆమోదించింది. అంతవరకూ భజన గాళ్లు చెప్పింది కరెక్ట్! కానీ 15వ ఫైనాన్స్ కమిషన్ - స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీలు, సర్ చార్జీలు, సెస్సులలో కూడా రాష్ట్రాలకు వాటా ఇవ్వాలని - చేసిన సిఫార్సును మాత్రం మోడీ ప్రభుత్వం తిరస్కరించింది.
ప్రస్తుతం పెట్రోలు డీజిల్ పై కేంద్రం విధించే పన్నులోని భాగాలు :1. బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ 2. స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ (SAED) 3. అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ (రోడ్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ AED) 4. ఏగ్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సెస్. ఇందులో బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ నుండి తప్ప మిగిలినSAED, AED, AID సెస్‌ల నుండి రాష్ట్రాలకు ఒక్క రూపాయి కూడా రాదు! పెట్రోల్ డీజిల్ పై విధించే పన్నులో బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ వాటా నామమాత్రం! అందువల్ల రాష్ట్రాలకు వచ్చేది ఆవగింజంత మాత్రమే! క్రింది గణాంకాలను పరిశీలిస్తే మనకే అర్థమవుతుంది.
జూలై 29 నాటికి అంతర్జాతీయ ముడి చమురు ధర బ్యారెల్ ఒక్కంటికి 76.05 డాలర్లు. డాలరు రూపాయి మారకం రేటు 74.40 రూపాయలు, రూపాయల్లో బేరల్ రేటు 5658 రూపాయలు. ఒక బ్యారెల్ =159 లీటర్లు ఒక బేరెల్ ఖరీదు 5658 రూపాయలు కాబట్టి 1 లీటర్ పెట్రోల్ రేటు 35.58 రూపాయలు అవుతుంది. దీనికి, ముడి పెట్రోల్ శుద్ధి చేయడానికి అయ్యే ఖర్చు, డీలర్ కమీషన్, ప్రభుత్వాల పన్నులూ కలిపితే పెట్రోల్ బంక్‌లో మనకు అమ్ముతున్న లీటర్ పెట్రోల్ రేటు వస్తుంది. ఇందులో బేసిక్ ఎక్సైజ్ డ్యూటీలో మాత్రమే రాష్ట్రాలకు వాటా దక్కుతుంది. (దీనినే డివిజబుల్ పూల్ అంటారు) కాబట్టి రూ.1.40పైసలను అన్ని రాష్ట్రాలకు దామాషా పద్ధతిలో కేంద్రం పంచుతుంది. దామాషా పద్ధతిలో మన రాష్ట్రం వాటా 2.13శాతం! బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ రూ.1.40 పైసలలో 2.13శాతం అంటే 0.010 పైసలు మాత్రమే మన రాష్ట్ర వాటా అన్నమాట! అలాగే డివిజబుల్ పూల్‌లో ఆంధ్రప్రదేశ్ వాటా 4.11శాతం కాబట్టి ఆ రాష్ట్రానికి కేంద్రపన్ను ద్వారా వచ్చేది 0.05 పైసలు. ఇచ్చేది ఆవగింజంత కూడా లేక పోయినా మోడీ భజనపరులు, బీజేపీ బాకా ఛానళ్ళు కేంద్రం విధించే మొత్తం పన్ను 41శాతంలో ఎక్కువ భాగం రాష్ట్రాలకు ఇచ్చేస్తున్నట్లు తప్పుడు లెక్కలు చెప్పి ప్రజల్ని ప్రక్కదోవ పట్టించడానికి, ప్రజలలో పెరుగుతున్న అగ్రహాన్ని రాష్ట్రాలపైకి ఎగదొయ్యడానికి ప్రయత్నిస్తున్నాయి. ''తిలాపాపం తలాపిడికెడు'' అన్నట్లు కేంద్రంతో పాటు రాష్ట్రాలు కూడా దండిగానే పెట్రోల్ డీజిల్ పై వ్యాట్, సెస్‌ల రూపంలో వడ్డిస్తున్నాయన్నది వాస్తవమైనా ఇలా పెట్రోల్ ధరలు ప్రజలకు భారమవడానికి రాష్ట్రాలే కారణం అన్నట్లు వీరు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు అర్థం చేసుకుని వారిని నిలదీయాలి.!!
- జి.ఎస్.రాజేశ్వరరావు
సెల్:9490098794