Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచవ్యాప్తంగా కరోనా కోరల్లో చిక్కిన మధ్య తరగతి వర్గాలు ఆర్థిక చిక్కుల్లో పడి మిలియన్ల కొద్దీ (దాదాపు 3వ వంతు) అల్పాదాయ పేదరికంలోకి నెట్టబడ్డారని గణాంకాలు తెలుపుతున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన చైనా, భారత దేశాలలో కరోనా దుప్రభావం తీవ్రంగా ఉంది. కరోనా ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై అధికంగా, చైనా ఆర్థిక వ్యవస్థపై తక్కువగా పడడం గమనించారు. ప్రపంచ జనాభా 788 కోట్లు ఉండగా చైనా(141 కోట్లు), భారత్ (138 కోట్లు)ల జనాభా మొత్తం దాదాపు 279 కోట్లు ఉండడం మనకు తెలుసు. గత మార్చి 2020 నుంచి కరోనా మహమ్మారి విధించిన లాక్డౌన్, కర్ఫ్యూ, వైరస్ నిబంధనలు, ప్రభుత్వాలు అనుసరించిన విధానాలతో దేశాలు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి.
ప్రజల ఆదాయవ్యయాలను బట్టి జనాభాను ఐదు భాగాలుగా విభజించారు. పేదలు, అల్పాదాయ, మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి మరియు అధిక ఆదాయ వర్గాలుగా వర్గీకరించారు. పేదల దినసరి ఆదాయం 2 డాలర్లు లేదా అంత కన్న తక్కువ, అల్పాదాయ వర్గాల దినసరి ఆదాయం 2.01 - 10 డాలర్లు, మధ్య తరగతికి 10.01-20 డాలర్లు, ఎగువ మధ్య తరగతికి 20.01-50 డాలర్లు, అధిక ఆదాయ వర్గాలకు దినసరి ఆదాయం 50 డాలర్ల కన్న అధికంగా ఉంటుంది.
భారత ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం
కరోనాకు పూర్వం భారతదేశంలో 99 మిలియన్ల మధ్య తరగతి వర్గాలు ఉండగా, కరోనా అనంతరం 66 మిలియన్లు మాత్రమే మిగిలారని తెలుస్తున్నది. కరోనా మహమ్మారి దెబ్బకు భారత మధ్య తరగతి, 3వ వంతు అనగా 33 శాతం తగ్గిందని గమనించారు. కరోనాకు ముందు పేదలు 59 మిలియన్లు ఉండగా నేడు 134 మిలియన్లకు పెరగడం ప్రమాదకర పరిణామంగా గమనించాలి. అల్పఆదాయ వర్గాల ప్రజలు నాడు 1,197 మిలియన్లు ఉన్నారని, నేడు కరోనా అనంతరం 1,162 మిలియన్ల ఉన్నారని అంచనా వేశారు. ఎగువ మధ్య తరగతి ప్రజలు కరోనాకు పూర్వం 22 మిలియన్లు, నేడు 16 మిలియన్లు మాత్రమే మిగిలారు. అధిక ఆదాయ వర్గాల ప్రజలు నాడు 3 మిలియన్లు, నేడు 2 మిలియన్లు ఉన్నారని తెలుస్తున్నది. భారత్లో పేదరిక రేటు జనవరి 2020లో 4.3 శాతం ఉండగా, 2020 చివరన 9.7 శాతానికి పెరగడం పెద్ద సమస్యగా పరిణమించింది. ప్రపంచంలోని పేద, అల్పాదాయ వర్గాలలో 30 శాతం (120 కోట్లు) మంది ఇండియాలోనే ఉన్నారని అంచనా. కరోనా ప్రభావంతో పేదలు 75 మిలియన్లు పెరగడం విచారకరం. 2011 నుంచి 2019 వరకు మధ్య తరగతి వర్గాలు 57 మిలియన్లు పెరగారని, కాని కోవిడ్-19 దెబ్బకు అదే మధ్య తరగతి ప్రజలు 32 మిలియన్లు తగ్గడంతో దేశ ఆర్థిక వ్యవస్థపై దుష్ప్రభావం పడనుంది. జనవరి 2020తో పోల్చితే జనవరి 2021లో ఇండియాలో 9.6 శాతం అభివద్ధి పడిపోయిందని, చైనాలో మాత్రం 2 శాతం అభివద్ది పెరిగిందని గణాంకాలు వివరిస్తున్నాయి.
చైనా ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం
చైనాలో మాత్రం కరోనా ప్రభావం ఆదాయ వర్గాలపై పెద్ద మార్పులు చూపలేదని తెలుస్తున్నది. కరోనాకు ముందు చైనా మధ్య తరగతి వర్గాల ప్రజలు 504 మిలియన్ల ఉన్నారని, కరోనా అనంతరం 493 మిలియన్లు ఉన్నారని గమనించారు. చైనాలో కరోనాకు ముందు పేదలు 3 మిలియన్లు, తరువాత 4 మిలియన్లు ఉన్నారు. అల్పాదాయ వర్గాలు నాడు 611 మిలియన్లు, నేడు 641 మిలియన్లు ఉన్నారు. అధిక ఆదాయ వర్గాలు చైనాలో కరోనాకు పూర్వం 26 మిలియన్లు ఉన్నారని, కరోనా అనంతరం 23 మిలియన్లకు తగ్గారని తెలుస్తున్నది. ప్రపంచ మధ్య తరగతి జనాభాలో 37 శాతం చైనీయులే ఉన్నారు. ఈ గణాంకాలను బట్టి చైనా ప్రజలపై కరోనా ప్రభావం చాలా తక్కువగానే పడిందని అర్థం అవుతున్నది.
త్రిశంకు స్వర్గంలో మధ్య తరగతి వర్గాలు
దేశ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టికి మధ్య తరగతి ప్రజల పాత్ర అద్వితీయమని తెలుసుకోవాలి. మధ్య తరగతి వర్గాలు వత్తి ఉద్యోగాలు, వ్యాపారాలు, స్వంత గహాలు, రిటైర్మెంట్ భద్రత, ఆరోగ్య పరిరక్షణ, పిల్లల విద్య కోసం ఖర్చులతో తరువాత తరం బాగుండాలనే తపన కోసం జీవితాలను దారపోస్తారని తెలుస్తున్నది. ఆర్థిక వ్యవస్థ దిగజారకుండా చూస్తూనే అసమానతలు పెరగకుండా మధ్య తరగతి వర్గం దోహదపడుతున్నది. పేదలకు, ధనికులకు మధ్య అంతరాలతో వెలువడే అస్థిరత్వాన్ని మధ్య తరగతి తగ్గిస్తున్నది. బలమైన మధ్య తరగతి అధికంగా ఉన్న దేశాలన్నీ అగ్రరాజ్యాలుగా కొనసాగుతున్నాయని, మధ్య తరగతి వర్గాలు నైపుణ్య మానవ వనరులు, పబ్లిక్ సేవల నాణ్యత - పారిదర్శకతలను అందించడమే కాకుండా మదుపు - పొదుపుతో దేశ ఆర్థికాన్ని బలోపేతం చేస్తున్నాయి. ఆర్థికంగా, రాజకీయంగా బలమైన మధ్య తరగతి ప్రజలు ఆస్తి పరిరక్షణ హక్కులు, పారదర్శక పాలనలను కోరుకుంటున్నారు. దేశంలో కరోనా విపత్తుతో చితికి పోయిన మధ్య తరగతి వర్గాల అసహనానికి ముఖ్య కారణాలుగా పన్నుల పెరుగుదల, పెట్రోల్ డిజిల్ ధరలు, యల్పిజీ గ్యాస్ బండ భారం కావడమే అని అర్థం అవుతున్నది. గహ నిర్మాణ రుణాల వెసులుబాటు, ఉచిత ఆరోగ్య పథకాలు, చవకైన ఉన్నత విద్య, సరళ పన్ను విధానం, ఉద్యోగ కల్పన, నైపుణ్యాభివద్ధి కావాలని మిడిల్ క్లాస్ ప్రజలు కోరుకుంటున్నారు. సాధారణంగా ప్రభుత్వ విధానాలు ధనిక వర్గాలకు మాత్రమే అనుకూలంగా ఉంటాయి. నేటి విశ్వ మహమ్మారి విళయ కాలంలో మధ్య తరగతి మరింత చితికిపోవడం దేశ ఆర్థిక వ్యవస్థకు తీరని లోటు.
- డా|| బుర్ర మధుసూదనరెడ్డి
సెల్: 9949700037