Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారత రాజ్యాంగ రచనా కమిటీలో హన్సా మెహతా, రాజ్ కుమారి అమృత్ కౌర్ అనే ఇద్దరు మహిళా సభ్యులు కూడా ఉన్నారు. ప్రతి మహిళ తన జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే హక్కును, లేదా కనీసం వివాహమాడే వ్యక్తిపై తన ఇష్టాయిష్టాలను తెలిపే హక్కును రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులలో చేర్చాలని వారు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు కమిటీలోని మిగతా సభ్యులు మద్దతు తెల్పలేదు. అందువల్ల రాజ్యాంగ పరిషత్తు ముందుంచిన తుది రాజ్యాంగ ప్రతిలో ఈ హక్కును చేర్చలేదు.
ఏడు దశాబ్దాల తర్వాత కూడా, మహిళలు తమకు నచ్చిన ఇతర కుల, మతాలకు చెందిన వ్యక్తులను ఎంపిక చేసుకోలేని పరిస్థితులను వారి కుటుంబాలే కల్పిస్తూ, పోలీసులు, కోర్టులు, రాజకీయ నాయకుల అండతో సంకుచితమైన ఆజ్ఞలను జారీ చేస్తున్నాయి.వారి జీవిత భాగస్వాములపైన కిడ్నాప్, అత్యాచారం, 'లవ్ జీహాద్' కేసులు మోపి జైలులో నిర్బంధిస్తున్నారు. ఒకవేళ ప్రేమ జంట ప్రతిఘటిస్తే, స్వంత కుటుంబ సభ్యుల చేతిలో, లేక ఆగ్రహంతో ఉన్న గుంపు దాడులలో హత్యకు గురవుతున్నారు. మన రాజ్యాంగ పరిషత్ మహిళా సభ్యులు ఒక భిన్నమైన భారతదేశాన్ని నిర్మించాలని కోరుకున్నారు.
ఇటీవలి కాలంలో కాశ్మీర్‌కు చెందిన సిక్కు యువతులు కొందరు ముస్లిం యువకులను వివాహం చేసుకొని, ఇస్లాం మతంలోకి మారాలనుకోవడంతో కాశ్మీర్ లోయలో ఒక ప్రమాదం ముంచుకొచ్చింది. పంజాబ్‌కు చెందిన శిరోమణి అకాలీదళ్ సిక్కు నాయకులు ఇవన్నీ ''లవ్ జీహాద్'' నేరపూరిత చర్యలని ఆగ్రహించారు. అమాయకులైన, నిష్కపటులైన హిందూ, సిక్కు బాలికలను లైంగికంగా వెంబడిస్తున్నారని ముస్లింలపై ద్వేషపూరితంగా నిందించడం కొత్తేమీ కాదు. ముస్లిం యువకులు గల్ఫ్‌లో సంపాదించిన డబ్బుతో దురదృష్టవంతులైన క్రైస్తవ బాలికలను వంచించి ఇస్లాం మతంలోకి మార్చే ఉద్దేశంతో పెళ్లి చేసుకున్నారని ఆరోపిస్తూ కేరళ క్యాథలిక్ బిషప్ కౌన్సిల్ మొదట 'లవ్ జీహాద్' అనే పదాన్ని ఉపయోగించింది.
ఈ భావావేశ ద్వేష భావాన్ని మొత్తం హిందూత్వ సంస్థలు వెంటనే స్వీకరించాయి. పైకి బాగా కనిపించే ముస్లిం యువకులను ఇలాంటి లవ్ జీహాద్ కోసం ఇస్లాం మత విశ్వాసాలను బోధించే కళాశాలల్లో జాగ్రత్తగా ఎంపిక చేశారని, హిందూ యువతులను ప్రేమ సంబంధాల్లోకి లాగి, ప్రలోభపెట్టే శిక్షణను వారికిస్తారనీ, వారికి అమ్మాయిలను ఆకర్షించడానికి మోటారు వాహనాలు, స్మార్ట్ ఫోన్లు, తేలికగా డబ్బు సంపాదించే ఏర్పాట్లు చేస్తారని హిందూత్వ సంస్థల వాదన. హిందూ యువతులతో సంబంధాలు ఏర్పరచుకునే ముస్లిం పురుషుల హృదయాల్లో ప్రేమ లేదని, కేవలం ఇస్లాం మతంలోకి మార్చేందుకే వారిని మభ్యపెట్టి పెళ్ళిళ్ళు చేసుకుంటారని హిందూత్వ వాదులు చెబుతున్నారు.
ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల చట్టసభలు ''బలవంతపు'' మతాంతర వివాహాలకు, మత మార్పిడులకు వ్యతిరేకంగా చట్టాలు చేసిన తర్వాత, ఇది ముస్లిం పురుషులకు, హిందూ మహిళల మధ్య ఉన్న ప్రేమ సంబంధాలను, పెళ్ళిళ్ళను నిందించే ఈ భావావేశ ద్వేష భావం నేరపూరిత చర్యగా పరిగణిస్తున్నాయి. కానీ అమలులో మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. ఒకవేళ ఒక హిందూ యువకుడు ఒక ముస్లిం మహిళను ప్రేమించి పెళ్లి చేసుకుంటే, అది నిషిద్ధం కాదు. ముఖ్యమంత్రి, సీనియర్ పోలీస్ అధికారుల ప్రోత్సాహం ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో హిందూత్వ శక్తులతో కలిసి పోలీసులు ముస్లిం యువకులు, హిందూ యువతుల మధ్య ఉన్న ప్రేమ సంబంధాలను, పెళ్ళిళ్ళను తీవ్రమైన నేరంగా పరిగణిస్తూ, అది రుజువైతే కఠిన జైలు శిక్ష విధించేందుకు విచారణ జరుపుతున్నారు. కానీ ఒక హిందూ యువకుడు, ముస్లిం యువతిని పెళ్లి చేసుకుంటే, ఆ ప్రేమ జంటకు రక్షణ కల్పిస్తున్నారు.
ఇటీవల కాశ్మీర్ రాజకీయ తుఫాను సిక్కు మహిళలను, (కేరళలో వారి క్రైస్తవ సోదరీమణులు, దేశంలో అనేక ప్రాంతాల్లో హిందూ సోదరీమణుల తరువాత)లవ్ జీహాదీలుగా ఆరోపణలు ఉన్న వారి మతప్రచారంలోకి లాగింది. సిక్కు మహిళలల్లో ''లవ్ జీహాదీ''ల బాధితులుగా గుర్తించిన వారిలో, 18ఏండ్ల మన్ మీత్ కౌర్ అనే సిక్కు మహిళ ఇస్లాం మతంలోకి మారి, 29ఏండ్ల ముస్లిం యువకుడైన షాహీద్ భట్‌కు దగ్గరైంది. వారు రహస్యంగా పెళ్లి చేసుకున్నారని రుజువు చేసే నిఖా ధ్రువపత్రాలు ఉన్నప్పటికీ, పోలీసులు వారిని గుర్తించి, వారు చెప్పే విషయాలను నమోదు చేయడానికి శ్రీనగర్ జిల్లా కోర్టుకు తీసుకొని వెళ్ళారు.
ఆగ్రహావేశాలతో ఉన్న సిక్కులు, బుడ్గామ్, శ్రీనగర్ జిల్లాల గురుద్వారా కమిటీ అధ్యక్షులైన సంత్ పాల్ సింగ్, జస్పాల్ సింగ్‌లతో పాటు సిక్కు మతస్థులు కోర్టు బయట గుమిగూడారు. ఆ యువతి ''మానసిక అస్థిరత''తో ఉందని, ఇది మత మార్పిడిని చేపట్టిన లవ్ జీహాదీ పద్ధతి అని సంత్పాల్ అన్నాడు. అక్కడ కూడిన జన సమూహం కొన్ని గంటల పాటు కోర్టులోకి రాకపోకలు లేకుండా అడ్డంగా ఉన్నారు. ఆ మహిళను కనీసం ఒక వారం పాటు సిక్కులకు అప్పగించాలని డిమాండ్ చేశారు.
పోలీసుల చర్యలు
మన్ మీత్ కౌర్ కోర్టులో చెప్పిన విషయాలను నిర్థారించడం కష్టమే అయినప్పటికీ, ఆమె ఇస్లాం మతంలోకి మారడం, భట్‌ను పెళ్లి చేసుకోవడం స్వచ్ఛందంగానే జరిగాయని ఉన్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. దీనికి సంబంధించి ఆమె సంతకాలు చేసిన అఫిడవిట్లు భట్ కుటుంబం వద్ద ఉన్నాయి. చివరికి ఆమె కోర్టు నుండి బయటకు వచ్చేటప్పుడు, ఆమెను భట్ కుటుంబంతో వెళ్ళనివ్వకుండా, లాక్కెళ్లి ఒక వాహనంలో పడేసి, భట్‌ను పోలీసు కస్టడీలోకి తీసుకున్నారు. మతాంతర వివాహాలకు వ్యతిరేకంగా స్థానికంగా చెలరేగిన దౌర్జన్యాలను పురిగొల్పింది ఢిల్లీ సిక్కు గురుద్వారా యాజమాన్యం పెద్ద, శిరోమణి అకాలీదళ్‌కు చెందిన మంజీందర్ సింగ్ సిర్షా అని చాలా నివేదికలు తెలియజేస్తున్నాయి. గతంలో బీజేపీలో ఉన్న సిర్షా, మన్ మీత్ కౌర్ వ్యవహారం లవ్ జీహాద్‌కు ఒక ఉదాహరణ అని, ఆమెను తుపాకీతో బెదిరించి, కిడ్నాప్ చేసి 60ఏండ్ల ముస్లిం వృద్ధునితో పెళ్లి చేశారని ఆరోపించాడు. మూడు రోజుల తరువాత, మన్ మీత్ కౌర్‌కు తన మొదటి భర్తతో విడాకులు కాకుండానే ఒక సిక్కు యువకునితో దక్షిణ కాశ్మీర్‌లోని పుల్వామా గురుద్వారాలో పునర్వివాహం చేశారు. గురుద్వారాలో కూడిన సిక్కు మత పెద్దల నిర్ణయమని సిర్షా, ముందుండి ఈ పెళ్ళి జరిపించినట్లు వార్తలందాయి.
హైకోర్టులో మన్ మీత్ కౌర్ ఆ ముస్లిం యువకునితో తనకున్న అనుబంధాన్ని గురించి ఏమి చెప్పిందో అధికారికంగా నిర్థారణ కానప్పటికీ, రెండవ మహిళ దన్ మీత్ కౌర్ అలాంటి సమస్యతోనే ఒక సెల్ఫీ వీడియోను బయట పెట్టింది. ఆమె తల్లిదండ్రులు, 30ఏండ్ల ఆమె భర్త ముజఫర్ తనను బెదిరించి కిడ్నాప్ చేశాడని ఆరోపణలు చేస్తూ పోలీస్ కేసు పెట్టారు.
కానీ ఆమె ప్రచారంలో పెట్టిన వీడియోలో దానిని ఖండిస్తూ, తాను అన్నీ తెలిసిన విద్యావంతురాలునని తెలిపింది. ఇంకా ఆమె ''నా హక్కులు నాకు తెలిసు, మంచి చెడుల మధ్య ఉన్న తేడా తెలుసని'' తెలిపింది. ఆమె తన తల్లిదండ్రులను జూన్ 6న వదిలి, తన కోసం వెతకొద్దని తెలిపింది. కానీ ఆరు గంటల వ్యవధిలోనే వారు పోలీసు ఫిర్యాదు చేయడంతో ఆమెను పట్టుకొని వారికి అప్పగించారు. ఆమె 2012 లోనే స్వచ్ఛందంగా ఇస్లాం మతంలోకి మారి, 2014లో తన తోటి విద్యార్థి అయిన ముజఫర్‌ను పెళ్లి చేసుకున్నానని రుజువు చేసే పత్రాలు కూడా ఉన్నాయి. అయినా ఇప్పటికీ ఆమె భర్త శ్రీనగర్ సెంట్రల్ జైలులోనే ఉన్నాడు. ఈ క్రమంలో జమ్మూ, కాశ్మీర్, ఢిల్లీ, పంజాబ్‌లోని అన్ని రాజకీయ పార్టీలు తమ వాదనలను వినిపించాయి. శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్, తన ''సిక్కు బిడ్డలను'' కిడ్నాప్ చేసి, బలవంతంగా ఇతర మతాలకు చెందిన వారితో పెళ్ళి జరిపించడం విస్మయానికి గురి చేసిందని అన్నాడు. బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లలో చట్టాలను అమలు చేస్తున్న విధంగా బలవంతపు మత మార్పిడులకు వ్యతిరేకంగా చట్టాలు చేసి, అమలు చేయాలని బీజేపీ అభిప్రాయపడింది. కానీ, సిక్కు కుటుంబాలకు చెందిన మహిళలు తమకు నచ్చిన వ్యక్తిని ఎంపిక చేసుకునే విధానంపై వారి కుటుంబ సభ్యులు, మత, రాజకీయ సంస్థలు, కోర్టులు, పోలీసులు వ్యవహరించిన తీరు పట్ల జమ్మూ, కాశ్మీర్లో అనేక మంది మహిళలు విచారాన్ని బహిరంగంగా వ్యక్తం చేశారు. నవనీత్ కౌర్ ''నేను జమ్మూ, కాశ్మీర్‌కు చెందిన సిక్కు మహిళగా, మన్ మీత్ కౌర్ తల్లిదండ్రులు తొందరపడి ఒక సిక్కు వ్యక్తితో పెళ్లి జరిపించడాన్ని హర్షించడం లేదని, ఆ అమ్మాయికి ఉపశమనం కలిగించడానికి బదులుగా ఆమెను ఒక పశువు లాగా మరొక సంబంధంలోకి నెట్టేసారని, మహిళలు కూడా మనుషులే, వారు ఎవరి ఆస్తి కాదని'' అభిప్రాయపడింది.
మతానికి చెందిన ఆస్తి
మహిళలను ఒక ''మతానికి చెందిన ఆస్తిగా'' పరిగణిస్తున్నారని, పితృస్వామిక వ్యవస్థ చెప్పిన విధంగా మహిళలను మారకానికి ఉపయోగించే ఒక సరుకుగా చూస్తున్నారని, జమ్మూ, కాశ్మీర్‌కు చెందిన ఒక ముస్లిం మహిళ ఇఫ్రా జాన్ పేర్కొంది. పోలీసులు, కోర్టులు మహిళల ప్రాథమిక హక్కులను కాపాడే పరిస్థితిలో లేవు, మగవారు కోరుకున్న విధంగానే ఆ వ్యవస్థలు పని చేస్తాయి.
ఇటీవల కాలంలో సిక్కు మత పెద్దల మార్గదర్శకత్వంలో జరిగిన చర్యలను ఖండిస్తూ, రచయితలు, స్కాలర్స్, కవులు, కళాకారులు, సాంస్కృతిక కార్యకర్తలు ఒక ప్రకటన విడుదల చేశారు. వారు ''ఒక వ్యక్తికి స్నేహం చేసే, ప్రేమించే, పెళ్లి చేసుకునే హక్కు, ఒక మత విశ్వాసాలను ఆచరించే హక్కులు విడదీయరానివి, ఇవి మహిళలకు కూడా సమానంగా చెందుతాయి. తప్పుడు వార్తలపై ఆధారపడే, మతాల మధ్య ద్వేష భావాన్ని, అనుమానాన్ని పెంచే 'లవ్ జీహాద్' లాంటి కుట్రపూరిత సిద్ధాంతాలను తాము తిరస్కరిస్తున్నట్లు, దేశంలో ఏ ప్రాంతంలోనైనా మత మార్పిడి వ్యతిరేక చట్టాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని'' అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ''వాస్తవానికి మత మార్పిడి వ్యతిరేక చట్టాన్ని ఇతర మతాలకు చెందిన మహిళలను పెళ్లాడిన ముస్లిం యువకులను నేరస్తులను చేసేందుకు మాత్రమే ఉపయోగిస్తున్నారు, కానీ అటువంటి చట్టాలకు నిజమైన బాధితులు మహిళలే, ఎందుకంటే ఆ చట్టం వారి జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే హక్కును ఉల్లంఘిస్తుందని'' వారు అన్నారు. ఈ ప్రకటన విడుదల చేసిన వారంతా, తమ జీవిత భాగస్వాములను ఎంపిక చేసుకునే వ్యక్తులకు తమ సంఘీభావాన్ని ప్రకటించి, మత పెద్దల వలన బాధితులైన వ్యక్తులకు, కుటుంబాలకు మద్దతుగా నిలుస్తామని ప్రతిన బూనారు.
మహిళలందరూ తమ జీవిత భాగస్వాములను ఎంపిక చేసుకునే ప్రాథమిక హక్కును సాధించాలనీ, ఈ హక్కు అమలు రక్షణను వ్యతిరేకించే ప్రభుత్వానికి, రాజకీయ పార్టీలకు, మతాలకు, మతాంధతతో ఉన్న కుటుంబాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టే సమయం ఆసన్నమైంది.
అనువాదం: బోడపట్ల రవీందర్
- హర్ష మందిర్
సెల్: 9848412451