Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆర్యా,
(ఈ పిలుపు మీకు బాగా ఇష్టం కదా!)
నమస్కారములు!
ముందుగా మీకు ధన్యవాదాలు. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తైన ఈ శుభతరుణంలో, స్వాతంత్య్ర దినోత్సవంనాడు ప్రధాని చేసే ప్రసంగంలో ఏయే అంకాలు ప్రస్తావించాలో, మీతో పంచుకోవాలని కోరారు. ఇది చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాను. ఎందుకంటే మనది ప్రజాస్వామ్య దేశమే అయినా గతంలో ఏ ప్రధానీ ఈ విధంగా అడిగిన దాఖలాలు లేవు. ఇందుకు మీకు మరోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
మీ ప్రసంగంలో అన్నింటికన్నా ముందుగా పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదల విషయాన్ని ప్రస్తావించాలని కోరుతున్నాను. గత సంవత్సరము నుండి ఇప్పటి వరకు ఒకపక్క కరోనా దెబ్బ, మరో పక్క పెట్రోధరల దెబ్బ, మాలాంటి వారికి గోడదెబ్బ, చెంపదెబ్బలా తగులుతుంటే తట్టుకోలేకపోతున్నాము. అసలు ధరను మించి పన్నులు ఎక్కువగా ఉన్నాయని, ముడి చమురు ధర తగ్గినా, మనదేశంలో ధరలు తగ్గటం లేదని, పైగా అలా తగ్గినప్పుడు మీరు పన్నులు పెంచుతున్నారని మీ వ్యతిరేకులు ప్రచారం చేస్తూంటారు! పెంచిన పన్నుల వల్ల మన ఖజానాకు ఎంత వచ్చిందీ, ఆ డబ్బును మన దేశం కోసం ఎలా వినియోగించాలో మీ ప్రసంగంలో ప్రస్తావించాలని కోరుతున్నాను! అసలు ఒకే దేశం! ఒకే పన్ను అన్న విధానం తెచ్చిన మీరు, పెట్రో ధరలను జీఎస్టీ కిందికి ఎందుకు తేలేదన్న తలతిక్క ప్రశ్నకు, రాష్ట్రాలు అంగీకరించటం లేదని, మీ నాయకత్వంలో కేంద్ర మంత్రులు తడుముకోకుండా జవాబు చెబుతుంటారు. రోడ్డు, రవాణా, విద్య, వ్యవసాయం, విద్యుత్ లాంటి రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని అంశాలపై ఎడాపెడా చట్టాలు చేస్తున్నప్పుడు, పెట్రో ధరల విషయంలో మాత్రమే రాష్ట్రాల అభ్యంతరాలను పట్టించుకోవటం ఎందుకో మీ ప్రసంగంలో ఉంటే బాగుంటుందని ఆశపడుతున్నాను.
మీ ప్రసంగంలో రైతుల చట్టాలు, వాటిపై రైతులు చేస్తున్న సుదీర్ఘ పోరాటం గురించి తప్పక ఉండాలని కోరుతున్నాను. మీరు ఆందోళన జీవులుగా పేరుపెట్టిన రైతులు నిజానికి అన్నదాతలు! కరోనా రక్కసి కోరలకు అన్ని రంగాలు బలైనప్పుడు ఒక్క వ్యవసాయరంగమే నిలదొక్కుకుని అభివృద్ధి సాధించిన విషయం మీకు తెలియంది కాదు. మీరు కొత్తగా చేసిన రైతు చట్టాలు మార్చాలని కోరుతున్న రైతులు, ఈ దేశపు బిడ్డలే గాని పాకిస్థాన్, చైనా నుండి వచ్చినవారు కాదు! గత 10నెలలుగా మీరు ఏ విదేశీ యాత్ర చేసినట్టు నాకు గుర్తుకు లేదు. మరి రైతులతో మాట్లాడటానికి మీకు వీలు ఎందుకు దొరకటం లేదో నాకు అర్థం కావటం లేదు! మీరు నెమళ్ళతో గడిపే సమయాన్ని, సినీ నటుడు అక్షరుకుమార్‌కి ఇచ్చిన సమయంలో కొంతైనా రైతులకు ఇచ్చి ఉంటే ఎంత బాగుండు అన్పిస్తున్నది. ఎక్కడో దక్షిణాదిన ఒక తెలుగు సాఫ్ట్వేర్ ఇంజనీర్, రైతులకు వాతావరణ రిపోర్టును ఇస్తున్న విషయం మీ ప్రసంగంలో ప్రస్తావించారు. కాని 10నెలలు ఎండకు, వానకు, చలికి ఎదురొడ్డి నిలబడ్డ రైతులతో చర్చించటానికి మీరేమి ప్రయత్నం చేశారో నాలాంటి వాళ్ళకు తెలియదు! అందుకే ఈ విషయం పంద్రాగస్టు ప్రసంగంలో తప్పక చేర్చాలని కోరుతున్నాను.
ప్రభుత్వ రంగ సంస్థలను ఆయినకాడికి అమ్ముతున్న విషయం కూడా మీ ప్రసంగంలో చేర్చాలని విజ్ఞప్తి చేస్తున్నాను. స్వాతంత్య్రం అంటే స్వేచ్ఛ. అన్ని అవరోధాలను అధిగమించి దేశం అభివృద్ధి సాధించగలినప్పుడు ఆ అభివృద్ధి ఫలాలు భారతీయులందరికీ అందినప్పుడే, ఆ స్వాతంత్య్రం సాకారమైనట్టుగా, మన పెద్దలైన స్వాతంత్య్ర సమరయోధులు (ఈ లిస్టులో మీ భావజాలానికి సంబంధించిన వారు లేరని, గిట్టని వారు అంటూనే ఉంటారు! దాన్ని మీరెప్పుడూ పట్టించుకోరనుకోండి!) భావించారు. అందుకే ప్రయివేటు వ్యక్తులు, సంస్థలుంటే వారు మాత్రమే అభివృద్ధి చెందుతారన్న ఉద్దేశ్యంతో ఎన్నో ప్రభుత్వరంగ సంస్థలు నెహ్రూ (ఈ పేరు వింటేనే మీకు కోపం వస్తుందని నాకు తెలుసు, అయినా తప్పదు) స్థాపించారు. ఉత్తరోత్తరా ప్రభుత్వ రంగ సంస్థలు, ఈ దేశాన్నికీ, దేశ ప్రజలకూ సుస్థిరమైన అభివృద్ధి అందించాయి. ఎల్ఐసీ, బ్యాంకులు, ఇస్రో, హెచ్ఎఎల్, ఉక్కు ఫ్యాక్టరీలు, బీహెచ్ఈఎల్, డీఆర్డీఓ లాంటివి లాభాలు కూడా ఆర్జిస్తున్నాయి. అయినా వీటన్నింటినీ మీ ప్రభుత్వం అగ్గువ బేరానికే అమ్ముతున్నది. లక్షలాది మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధిని కల్పిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మటానికి మీకు ఎలాంటి అధికారం ఉందో తెలపాలని కోరుతున్నాను! ఎందుకంటే ఎన్నికలకు ముందు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తామంటేనే మేము మీకు ఓట్లు వేశాము! కాని ఎన్నికల్లో గెలిస్తే ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేస్తామని ఒక్క మాటైనా చెప్పకపోతిరి! పరస్పర విరుద్ధమైన ఈ విషయాలను మీరు ప్రసంగంలో ప్రస్తావించాలని కోరుకుంటున్నాను.
'పెగాసస్' అనబడే స్పైవేర్ గురించి మీ ప్రసంగంలో అంశం ఉండాలని కోరుతున్నాను. మనదేశంలో పెగాసస్ వాలిందనేది సత్యం! పెగాసస్‌పై ఫ్రాన్స్‌తో సహా ఇజ్రాయిల్ కూడా విచారణకు ఆదేశిస్తే మీరు మాత్రం తేలిగ్గా కొట్టిపారేస్తున్నారు! స్పైవేర్ తయారు చేసిన ఎన్ఎస్ఓ సంస్థమో మేము ప్రభుత్వాలకే అమ్ముతాము అంటున్నది. దాన్ని మన ప్రభుత్వం కొన్నదా? లేదా? కొంటే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జీలపై నిఘా పెట్టవచ్చునా? మీరు కొనకపోతే మీ మంత్రులందరిపైనా, ఎన్నికల కమిషనర్‌పైనా ఎవరో నిఘా పెడితే అది దేశ భద్రతకు భంగం కాదా! స్వాతంత్య్ర దినోత్సవ వేళ మన భద్రతకూ భంగమే కదా! కనుక స్వాతంత్ర దినోత్సవ వేళ మన భద్రతకు సంబంధించిన ఈ కీలకాంశం మీ ప్రసంగంలో చేర్చుకోవాలని ఆశిస్తున్నాము.
కరోనాకు సంబంధించిన విషయం కూడా మీ ప్రసంగంలో చేర్చాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పటిదాకా 4లక్షల 23వేల మంది చనిపోయారని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. దానికి పదిరెట్లు వాస్తవ సంఖ్య ఉంటుందని డబ్ల్యూహెచ్ఓ చెబుతున్నది. అది పట్టించుకోక పోయినా 4 లక్షల మంది మాత్రం ఎలా చనిపోయారు? కరోనా అంటేనే ఊపిరితిత్తుల వ్యాధి అని అందరికీ అర్థమైపోయింది! మరి లక్షలాది మందిలో కొన్ని వేల మందికి ఆక్సిజన్ సకాలంలో అందక చనిపోయినట్టు వార్తలు వస్తుంటే మీరు అప్పుడే వాటిని ఖండించలేదు! అనేక దేశాలు ఆఖరికి మనం రోజూ తిట్టుకునే చైనా కూడా ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు సప్లయి చేస్తే ఎందుకు తీసుకున్నారు. ఆక్సిజన్ దొరికితే 75ఏండ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా శవగంగా ప్రవాహం ఎందుకు సంభవించింది? పార్లమెంటులో ఆక్సిజన్ లేక ఎవరూ చనిపోలేదనే ప్రకటన సత్యమా? ఈ అంశాలు కూడా మీ ప్రసంగంలో చేర్చుతారని ఆశిస్తున్నాను.
కరోనా కరాళ నృత్యం చేస్తున్న సమయంలో మన ఆర్థిక మంత్రి నిర్మలమ్మగారు 20లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించినప్పుడు, ఈ దేశంలో మీ పాలన నడుస్తున్న సమయంలో మేము బతికి ఉండటము మా భాగ్యమని ఎంతో మందిమి మురిసిపోయాము. కాని ఏడాది గడుస్తున్నా ఆ 20లక్షల కోట్లలో 20రూపాయలు కూడా మాకు అందలేదు! ఎంత తలబద్దలు కొట్టుకున్నా అంత పెద్ద మొత్తం ఏమైందో మాకు తెలియటం లేదు. అందుకే ఈ అంశం కూడా మీ ప్రసంగంలో చేర్చి ఆ డబ్బుంతా ఏమైందో తెలపాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను.
ఇంకా అనేక విషయాలు మీ ప్రసంగంలో చేర్చవలసినవి ఉన్నవి. కాని నాలాంటి వారెందరో మీకు, వెబ్సైటులోనో, ట్విటర్‌లోనో ఎన్నో అంశాలు చెబుతుంటారు. వారు చెప్పినవి కూడా చేర్చుకోవాలి కదా! అందుకే నేను ఆపివేస్తున్నాను.
అయితే ఒక్క మనవి. నేను మీకు మనవి చేసిన అంశాలపై మీరు, మీ ప్రభుత్వం చేసిన కృషీ, ప్రయత్నమూ దేశ ప్రజలకు తెలియచేయండి! చనిపోయిన నెహ్రూనో, ఓడిపోయిన కాంగ్రెస్ మీదో నెపం నెట్టాలని చూడొద్దని కోరుతున్నాను. కాంగ్రెస్‌పార్టీ తప్పులకే ఆ పార్టీని ఓడించి మీకు పట్టం కట్టిన విషయం మీకు బాగా తెలుసు. సెలవు.
స్వాతంత్య్రదినోత్సవ శుభాకాంక్షలతో..
మీపాలనలో నిత్య ఆందోళనా జీవి.
- ఉషాకిరణ్