Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నరేంద్రమోడీ మలిదఫా పాలనలో దేశంలోని కీలక వ్యవస్థలన్నీ దీర్ఘకాలం పాటు ఎలా కల్లోలితమవుతున్నాయో గమనిస్తే ఆందోళన కలుగుతుంది. పాలన, శాసన, న్యాయవ్యవస్థలతోపాటు నాలుగో స్తంభంగా చెప్పే మీడియానూ ఇది కమ్మేస్తున్నది. పౌరపాలనకు ఆవల ఉండాల్సిన, ఇంతకాలం ఉంటూ వచ్చిన సైనిక అర్థసైనిక వ్యవస్థలను కూడా వదిలిపెట్టడం లేదు. మత ఆధ్యాత్మిక వ్యవస్థలు సరేసరి. ఏ రంగంలోనూ సత్ఫలితాలు లేకపోగా సమస్యలే తాండవిస్తున్నాయి. వాటి పరిష్కారానికి ఉద్యమించిన వివిధ తరగతుల ప్రజలనూ ప్రతిపక్షాలనూ అణచివేసేందుకు, పోలీసులు వేధించేందుకు నిఘా యంత్రాంగం ప్రయోగించబడుతున్నది. దేశంలో అత్యున్నత వ్యవస్థ అయిన పార్లమెంటు నిర్వహణ ప్రహసనంగా మార్చివేయబడింది. రాష్ట్రాలు, రాష్ట్ర ప్రభుత్వాల స్థానం విలువ, పరిధి కోతపడిపోతున్నాయి. విదేశాంగ విధానంలోనూ భారత దేశ గత వరవడికి భిన్నమైన విపరీతధోరణులు వినాశకరంగా పరిణమిస్తున్నాయి. ఇందుకు ప్రతిగా మరోవైపున ప్రతిపక్షాల పోరాటం, సంప్రదింపులు, పార్లమెంటు స్తంభన వంటివీ చూస్తున్నాం. వర్తమాన భారత దృశ్యం ఇది.
పెగాసస్ ప్రకంపన- ఇతరులూ, మనం
రాజద్రోహం కేసులతో వరుసగా కార్యకర్తలను జైళ్లపాలుచేసి వేధిస్తున్న పరిస్థితులలో స్టాన్స్టామి మరణం దేశమంతటా విషాదం, ఆగ్రహం నింపింది. అయితే పాలకులలో మాత్రం ఎలాంటి సంజాయిషీ లేకపోగా ఎదురుదాడి కొనసాగింది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే పార్లమెంటు సమావేశాలకు ఒక రోజు ముందు పెగాసస్ స్పైవేర్‌తో వందలమంది మొబైళ్లను అక్రమంగా ఆలకించారన్న ఘోరం బయిటకు వచ్చింది. ఎందుకంటే వినడానికే గాక రహస్య చిత్రాలు తీయడానికీ ఇది ఉపకరిస్తుంది. మన దేశంలో వైర్‌తో సహా ప్రపంచ వ్యాపితంగా పదిహేను దేశాల మీడియా సంస్థలు ఈ కథనాన్ని సాక్ష్యాధారాలతో సహా వెల్లడి చేశాయి. ఇజ్రాయిల్‌కు చెందిస స్పైవేర్ తయారీదారీ సంస్థ ఎన్ఎస్వో గ్రూపుచెప్పిన ప్రకారం దాన్ని ప్రభుత్వాలకే విక్రయిస్తారు. ఈ మాట మోడీ ప్రభుత్వమూ కాదనలేదు. అనధికారికంగా హ్యాకింగ్ కుదిరేపని కాదంటున్నది. మళ్లీ అదేనోటితో ఖండిస్తున్నది. రాజకీయ వేత్తలు న్యాయమూర్తులు మీడియా వ్యక్తులు, ఆఖరుకు కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు, సీబీఐ ప్యారామిలటరీ అధికారుల ఫోన్లను కూడా హ్యాక్ చేసిన ఆనవాళ్లున్నాయంటే మనం నిఘా నీడలో ఏమాత్రం భద్రత గోప్యత లేకుండా బతుకుతున్నామని తేలిపోయింది. ఈ స్పైవేర్‌ను కంప్యూటర్లలోకి కూడా పంపి దొంగసాక్ష్యాలు సృష్టించవచ్చు. దీనిపై సభాసంఘం ద్వారానూ, సుప్రీం కోర్టు ఆధ్వర్యంలోనూ దర్యాప్తు జరపాలని ప్రతిపక్షాలు, మీడియా కోరినా ప్రభుత్వం పెడచెవినిపెట్టి ఎదురుదాడి చేస్తున్నది. ఇది దేశ ప్రతిష్టకు భంగంకలిగించే కుట్ర అని ఆరోపిస్తున్నది. సంఘ పరివార్ మొత్తానికి ఈ మేరకు ఆదేశాలు జారీ అయ్యాయి. వాస్తవానికి ఈ కథనం వచ్చాక ఫ్రాన్స్ అధ్యక్షుడు మోర్కాన్ తన ఫోన్ వినడంపై విస్తుపోయి విచారణ కోరాడు. అమెరికా వంటి దేశాలు ఇజ్రాయిల్‌ను విచారణ జరపాల్సిందిగా పైపైనైనా ఒత్తిడి పెడుతున్నాయి. ఆ దేశం కూడా సమర్థించుకోలేక ఏదో పైపై విచారణలు ఉత్తర్వులతో నాటకం ఆడుతున్నది. మోడీ సర్కారు తీరు అందుకు పూర్తి భిన్నంగా ఉందంటే పెగాసస్‌ను దుర్వినియోగం చేసిన తీరే కారణం.
సుప్రీంలోనే అమీతుమీ
కర్నాటక ప్రభుత్వం కూల్చివేతకు ముందు మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య పీఏ ఫోన్ వింటారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఫోన్ పట్టుకుంటారు. బిఎస్ఎఫ్ డైరెక్టర్ కెకెశర్మ సంఘ పరివార్ సభకు హాజరైనా సరే నిజంగా విధేయుడో కాదో తేల్చుకోవడానికి హ్యాకింగ్ చేసి ఆ పైన బెంగాల్ ఎన్నికలకు పరిశీలకుడుగా పంపుతారు. దేశమంతటిపై నిఘా వేసే సీబీఐ అధినేతలు ఆలోక్‌వర్మ, రాకేశ్ ఆస్తానాలపైనా నిఘా వేస్తారు. సిజెఐ రమణ అభ్యంతరాల కారణంగా సీబీఐ అధినేతను చేయలేకపోయిన రాకేశ్ ఆస్తానాను ఆ నిబంధనలకు భిన్నంగా ఇప్పుడు పొడగింపు ఇచ్చి ఢిల్లీ కమిషనర్‌గా డిఐజి హోదాగల పదవిలో పంపుతారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తులపైనా నిఘావేస్తారు. కేంద్ర మంత్రివర్గంలో ప్రమోషన్ ఇవ్వదలిచిన వారి విధేయతను పరీక్షించడానికి పెగాసస్ వాడతారు. జాతీయ మీడియాలో కీలక పాత్రధారులనూ అందులోనూ తమ కంటిలో నలుసులా ఉన్న వైర్ జర్నలిస్టులను వేటాడటానికి నిఘా వేస్తారు. గతంలో ముఖ్యమంత్రి రామకృష్ణహెగ్గే వంటివారు కేవలం ఫోన్ ట్యాపింగ్ వల్లనే రాజీనామా చేయవలసి వచ్చిన సందర్భాలకు ఇది పూర్తి విరుద్ధం. ఇవన్నీ ఉదహరించడమెందుకంటే అన్ని వ్యవస్థలనూ గుప్పిట్లో పెట్టుకోవడానికి ఎంత దారుణమైన కుట్రలు జరిగాయో తెలియడానికి. అందుకే పార్లమెంటు సమావేశాలు మొదలైన నాటి నుంచి ఇదే సమస్య స్తంభింపచేస్తున్నది. ఏదైనా చర్య తీసుకునే వరకూ వెనక్కు తగ్గే అవకాశం కూడా లేదు. ఇదే అదునుగా తీసుకుని కొన్ని బిల్లులను ఆమోదింపచేసుకున్నా దీనికి ముగింపు తెలియక కేంద్రం తలపట్టుకుంటున్నది. 12 ప్రతిపక్షాలు రాష్ట్రపతికి కూడా లేఖ రాశాయి. సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిటాస్ సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో దర్యాప్తు కోసం పిటిషన్ వేశారు. ఎన్రామ్, శశికుమార్‌లు కూడా కోర్టుకు వెళ్లగా వచ్చేవారం విచారణకు స్వీకరిస్తామని సిజెఐ రమణ ప్రకటించారు. ఈ విధంగా సభలో చర్చను దాటవేసినా సుప్రీంకోర్టులో మాత్రం అన్ని విషయాలు బయిటకు వస్తాయని ఆశించవచ్చు. ఈ లోగా మరెన్ని కొత్త సంగతులు వెలుగు చూస్తాయో చెప్పలేం. గతంలో సోషల్‌మీడియా నిర్వహణ సంస్థలైన వాట్సప్, ఫెస్బుక్ వంటివి డేటాను వినియోగించడం ద్వారా గోప్యతకు భంగం కలిగిస్తున్నాయనే ఫిర్యాదులు వచ్చినప్పుడు కేంద్రం వాటిపై కేసులు వేసింది. ఇప్పుడు తనే రహస్యంగా డేటా తెప్పించి దోషిగా బోనులో నిలబడింది. అటూ ఇటూ అడకత్తెరలో చిక్కింది దేశపౌరులే.
న్యాయ వ్యవస్థకూ సెగ, రాష్ట్రాలపై దాడి
ఏపీకి సంబంధించిన చాలా అంశాల్లో కేంద్రం శూన్యహస్తం చూపింది. విశాఖ ఉక్కును వందశాతం ప్రయివేటీకరిస్తానని హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ వేసింది. సహకార రంగంలో రాష్ట్రాల హక్కులను హరిస్తూ అమిత్‌షాకు ఆ శాఖను కట్టుబెట్టిన ప్రధాని నిర్వాకం కూడా మరో సందర్భంలో కోర్టులో సవాలు చేయబడింది. కోర్టులు కూడా అనేక ఒత్తిళ్లకు గురయ్యాయి. హైకోర్టు న్యాయమూర్తుల నియామకంలో ఆలస్యం గురించి సుప్రీం అడిగితే కేంద్రం ఏకపక్షంగా జవాబిచ్చింది. జార్ఖండ్‌లో ధన్‌బాద్ జిల్లా అదనపు మెజిస్ట్రిట్ గనుల మాఫియాచేతిలో హత్యకు గురైన వార్త దేశాన్ని కలవరపర్చింది. పోలీసులు ఆ కేసులో సరిగ్గా స్పందించకపోవడం హైకోర్టు ఆగ్రహానికి కారణమైంది. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకుని న్యాయమూర్తులకు రక్షణ గురించి గట్టిగా స్పందించింది. గతంలో జస్టిస్ లోదా వంటివారి మృతిపై నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులే మీడియాముందు మాట్లాడితే స్పందనలేని పరిస్థితికి ఇది భిన్నం. పశ్చిమ బెంగాల్లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని అక్కడి బార్‌కౌన్సిల్ బహిష్కరిస్తున్నది. ఏపీలోనూ ప్రభుత్వానికి ప్రధాన ప్రతిపక్షానికి మధ్యన రాజకీయ వివాదాలకు హైకోర్టు కేంద్రమవుతున్నది. న్యాయమూర్తులపై అసభ్య పోస్టులు పెట్టినందుకు ఏపీలో సీబీఐ ఇప్పటికి ముగ్గురిని అరెస్టు చేసింది. మహారాష్ట్రలో మాజీ పోలీసు కమిషనర్, మాజీ హొంమంత్రితో సహా చాలామందిపై కేసులు నడుస్తున్నాయి. పాలనానిర్వహణ అంశాలలో మరీ ఎక్కువగా జోక్యం చేసుకోవడంలో సంయమనం అవసరమనే భావన కూడా ఇటీవల సుప్రీం కోర్టునుంచే వచ్చింది.
ఈ పూర్వరంగంలో మతసమస్యలు రగిలించే రాజకీయం ముదురుతున్నది. ఏపీ మతమార్పిళ్ల మయమై పోయిందనీ ఆలయాలకు రక్షణ లేదనీ బీజేపీ ఆలయాల యాత్ర ప్రారంభించింది. 1766-99 మధ్యనే బ్రిటిష్‌వారిపై పోరాడి ప్రాణాలర్పించిన టిప్పుసుల్తాన్ విగ్రహస్థాపనను కూడా వివాదంగా మార్చింది. యూపీ ఎన్నికలు దగ్గరపడే కొద్ది అయోధ్య రామాలయం ఎజెండాగా మారిపోతుంటే బీఎస్పీ కూడా మేమే ముందుకట్టిస్తామంటున్నది. సున్నితమైన ఉమ్మడి సివిల్‌కోడ్ వంటి అంశం కూడా తీసుకోవాలనే ఉద్దేశాన్ని ఒక హైకోర్టు వ్యక్తం చేసింది. విద్యా విధానంలో ఏకపక్ష మార్పులు తెచ్చి శాస్త్రీయ సిలబస్‌కు ఎసరుపెట్టి హిందూత్వ కోణంలోనే చరిత్రను బోధించాలని కేంద్రం ఉవ్విళ్లూరుతున్నది. తెలుగురాష్ట్రాల జల వివాదాలు అంతిమంగా రెండు రాష్ట్రాల నదులపై పెత్తనం కేంద్రం చేతిలో పెట్టాయి. అసోంలోని బీజేపీ ప్రభుత్వం, మిజోరాంలో వారి అనుకూల ప్రభుత్వం రాష్ట్రాల సరిహద్దుల గురించి దేశాలను మించి పోట్లాడుకుంటున్నాయి. పెగాసస్ ఉదంతంపై మమతా ప్రభుత్వం సుప్రీం మాజీ న్యాయమూర్తి మదన్‌లోకూర్ ఆధ్వర్యంలో తనే విచారణకు నియమించి కేంద్రాన్ని సవాలు చేసింది. ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబాన్లకు వదలివెళ్లిపోయిన అమెరికా పాకిస్థాన్‌ను కలుపుకొని క్వాడ్2 ఏర్పాటు చేయడం చైనాపైనే కేంద్రీకరించిన మోడీ విదేశాంగ విధానాన్ని అపహాస్యం చేస్తున్నది.
ఆ ఎన్నికలే తొలిసూచనా?
రెండోసారి గెలిచిన మోడీకి తిరుగులేదనే వాతావరణం చెదిరిపోతుంటే పార్లమెంటుకు సమాంతరంగా జంతర్ మంతర్ దగ్గర రైతుపార్లమెంటు జరిగింది. ముఖ్యమంత్రులను మార్చేయడం ద్వారా రాష్ట్రాలలో పట్టునిల్పుకోవడానికి బీజేపీ తంటాలు పడుతున్నది. గత నెలలో ఉత్తరాఖండ్‌లో వరుసగా మార్చింది గాక ఈ మధ్య కర్నాటకలో యెడ్యూరప్పను దింపి బసవరాజు బొమ్మైని ప్రతిష్టించినా తగాదాలు తగ్గుతున్నది లేదు. ప్రతిపక్షాల చీలికే తమకు వరప్రసాదంగా ఉన్న స్థితిమారి పార్లమెంటును ఒక్కుమ్మడిగా స్తంభింపచేయడం మరోవైపు చూస్తున్నాం. వామపక్షేతర పార్టీలను ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌కిశోర్ అదేపనిగా సమావేశపరుస్తున్నారు. బెంగాల్లో మూడోసారిగెలిచిన మమతాబెనర్జీ ప్రధాని పదవిపై ఆశపడుతున్నారనే వార్తల మధ్య ఆమె తరపునే ఆయన పనిచేస్తున్నారనే భావన చాలామందిలో ఉంది. చాలామంది ప్రాంతీయపార్టీల నేతలు బీజేపీకి అనుకూలంగావున్న పరిస్థితిలో సీనియర్ ముఖ్యమంత్రిగా ఆమె ఆశపెంచుకుటున్నారు. గాంధీ కుటుంబ ముఖ్యులతోనే ప్రశాంత్‌కిశోర్ చర్చలు జరిపారు. పికె కాంగ్రెెస్‌లో చేరతారనీ కాయకల్ప చికిత్సకు ఫార్ములా ఇస్తారనీ కథనాలు వస్తుంటే వారు అంతర్గత ఆలోచన జరుపుతున్నట్టు చెబుతున్నారు. ఏమైనా ఈ ప్రతిపక్ష ఐక్యత అంత తేలిగ్గా జరిగేది కాదనీ కాంగ్రెస్ ఎలా కోలుకోవాలో తాను చెప్పలేననీ ప్రశాంత్ కిశోర్ బిబిసికి చెప్పారు. కాకుంటే మోడీకి ప్రత్యామ్నాయం లేదనే అభిప్రాయం మాత్రం సరైంది కాదని దక్షిణ తూర్పుభారతాల్లో బీజేపీకి వచ్చిన స్థానాలు చాలా తక్కువని ఆయన వివరణ. విధానపరమైన అంశాలు, రాజకీయ స్పష్టతలేని ఈ సంప్రదింపులతో పెద్దగా ఒరిగేది ఉండదని గతంలో చాలాసార్లు వెల్లడైంది. ఉత్తర భారతాన యూపీలో ఎస్పీ, బీఎస్పీలు తాము కలవడానికి గానీ కాంగ్రెస్‌ను కలుపుకోవడానికి గానీ ఇప్పటికి సిద్ధంగా లేవు. 2022మార్చి మే మధ్య గడువు ముగిసే యూపీ పంజాబ్ ఉత్తరాఖండ్ గోవా తదితర రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికల సంఘం సన్నాహాలు ప్రారంభించింది. యూపీ బీజేపీకి మనుగడకోసం పోరాటమే అవుతుంది. ఈ ఎన్నికల తర్వాతనే దేశ రాజకీయ గమనం సూచనప్రాయంగా తెలుస్తుంది.
- తెలకపల్లి రవి