Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుదూర ప్రయాణమూ కావచ్చు, దగ్గరి ప్రయాణమూ కావచ్చు. సమయానికి బస్టాండ్కో, రైల్వేస్టేషన్‌కో చేరుకుంటేగానీ సుఖమైన ప్రయాణం సాగదు. బస్టాండ్ వెళ్లాక అనువైన సీటు దొరికుతుందో, లేదోనన్న ఆందోళన ఎక్కువగా ఉంటుంది. వెనుక సీటు కాకుండా మధ్యలో సైడ్ సీటు అయితే సుఖనిద్రపోవచ్చు. ప్రాణం హాయిగా ఉంటుంది. ఆ సీటును దక్కించుకునేందుకు ఉరికి ఉరికి దస్తీ వేస్తాం. దస్తీ లేదంటే బ్యాగ్, అదీ కాకపోతే న్యూస్ పేపర్‌ను ఆ సీటుపై విసిరి సీటు రిజర్వు చేసుకుంటాం. ఒక్కొక్కసారి సీటు విషయంలో మూడో ప్రపంచ యుద్ధమే జరుగుతుంది. లేదంటే ముందే బస్కెక్కిన వారికి దస్తీ ఇచ్చి ఖాళీ సీటు మీద పెట్టాలని అడుగుతారు. ఏదోలా అష్టకష్టాలుపడి సీటును సాధిస్తారు. బస్సుల్లోనూ, రైల్లలోనూ ప్రయాణించే ప్రతి మనిషికీ ఎదురయ్యే ఘటనలివి. ఈ ఆరాటంలో చెయ్యికి దెబ్బలు తగులుతాయి. దస్తీవేసే సమయంలో బస్సుపై నుంచి జారి కిందపడిపోతారు. ఏం జరిగినా అంతిమంగా సీట్లో దస్తీ వేయడమే లక్ష్యం. సరిగ్గా ప్రస్తుతం రాజకీయాల్లో నియోజకవర్గాల్లో దస్తీలాట మొదలైంది. ఏ పార్టీలో చేరాలి. ఏ పార్టీ అయితే సీటు ఈజీగా దొరుకుంది. సామాజిక సమీకరణాలు ఏమిటీ, ఏ సామాజిక తరగతి ఎక్కువ ఉంది. ఖర్చెంత అవుతుంది. ఎంత ఉంది.. ఇత్యాది విషయాలపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఏ పార్టీలో దస్తీ వేస్తే ఖచ్చితంగా సీటు దొరుకుతుందనే ఆలోచనలో ఉన్నారు. ఇన్నాళ్లు నిమ్మలంగా ఉన్నా నాయకులు మెల్లగా నియోజకవర్గంలో దస్తీ వేసేందుకు పావులు కదుపుతున్నారు. అధినాయకుల దృష్టిలో పడేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. అందుకోసం నాయకుల చుట్టు ప్రదక్షిణలు, భజనలు, కీర్తనలు, గజమాలలతో సన్మానాలు మొదలు పెట్టారు. రాజకీయ పరుగుపందెంలో ఆ సీటు ఎవర్ని వరిస్తుందో, ఏమోగానీ ఆశావాహులు మాత్రం సీట్లలో దస్తీ వేసేందుకు చేయని ప్రయత్నం లేదు. ఈమాత్రం ప్రజా సేవలో నిమగమై ఉంటే ఈ ఖర్మ తప్పేది కదా..?!
- గుడిగ రఘు