Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'గీకే వారి గోకే సబ్బు... ధర తక్కువ, దురదెక్కువ...' చిన్నప్పుడు బళ్లో ఆటలాడుకునేటప్పుడు అప్పటి దూరదర్శన్‌లో వచ్చే వాణిజ్య ప్రకటనలను కొంత మంది స్నేహితులు అనుకరిస్తూ తోటి విద్యార్థులను నవ్వించేవారు. ఆ క్రమంలో ఈ 'గీకే వారి గోకే సబ్బు...' యమ ఫేమస్ అయ్యింది. ఇప్పుడు హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామా చేసి... తనంతట తాను గీక్కున్నారు. ఆయన గీక్కోవటంతో క్షేత్రస్థాయిలోని వివిధ పార్టీల శాసనసభ్యులను ప్రజలు గోకటం మొదలెట్టారు. 'ఈటల మాదిరిగానే మీరు కూడా మీమీ పదవులకు రాజీనామా చేయండి... అప్పుడు హుజూరాబాద్ కోసం ప్రకటించినట్టుగానే మా ప్రాంతాలకు కూడా దళిత బంధు, గిరిజన బంధు, బీసీ బంధు, మైనారిటీ బంధు అంటూ రకరకాల పథకాలను సీఎం కేసీఆర్ ప్రకటిస్తారు. మాక్కూడా ఒక్కో కుటుంబానికి ఐదు లచ్చలో, పది లచ్చలో వస్తాయి... పనిలో పనిగా మా ప్రాంత నాయకులకు కూడా ఎమ్మెల్సీ పదవులో, కార్పొరేషన్ చైర్మెన్ పదవులో వస్తాయి...' అంటూ జనం ఒత్తిడి చేయటం మొదలు పెట్టారు. ఇక నిరుద్యోగులతోపాటు కరోనాతో ఉపాధి, కొలువులు కోల్పోయిన వారు సైతం 'పనిలో పనిగా ఎలక్షన్లు వస్తే ఓ రెణ్నెల్లపాటు కొద్దో గొప్పో పని దొరుకుద్ది... గోడల మీద వాల్ రైటింగులు, బ్యానర్లు, కటౌట్లు కట్టటం, బహిరంగ సభలకు ఏర్పాట్లు చేయటం, కార్యకర్తలు, నాయకులకు భోజన ఏర్పాట్లు చేయటం, ర్యాలీలు, ప్రదర్శనలో పాల్గొనటం ద్వారా నాలుగు డబ్బులు సంపాదించుకోవచ్చు... మూడు పూటలా తిండి కూడా దొరుకుద్ది...' అంటూ తమ గోసను వినిపిస్తున్నారంట. రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొన్నది. దీంతో అక్కడి ఎమ్మెల్యేలు ఏం చేయాలో పాలుపోక తలలు పట్టుకుంటున్నారు. నియోజకవర్గాలకు వెళితే... జనం ఎక్కడ ఇలాంటి విషయాలను అడుగుతారోనని ముఖం చాటేస్తున్నారు. 'సార్... మీరు కూడా రాజీనామా చేయండి...' అంటూ ఒకటే ఫోన్ కాల్స్ వస్తున్నాయంటూ వివిధ పార్టీల నాయకులు చెబుతున్నారు. ఇలా హుజూరాబాద్‌లో ఒక ఎమ్మెల్యే గీక్కున్నదానికి... ఇప్పుడు అనేక మంది ఎమ్మెల్యేలు తల గోక్కోవాల్సి వస్తున్నది. కానీ ఒక్క విషయం... ఈ ఎలక్షన్ల సబ్బుకు దురదతోపాటు 'ధర' కూడా ఎక్కువేనండోరు...
-బి.వి.యన్.పద్మరాజు