Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఘన విజయం సాధించిన మేటి క్రికెటర్ మిథాలీ రాజ్‌ను మీ అభిమాన మగ క్రికెటర్ ఎవరని ఒక మగ పత్రకారుడు ప్రశ్నించారు. మీ అభిమాన ఆడ క్రికెటర్ ఎవరని మగ క్రికెటర్లను అడగగలరా? అని రాజ్ సమాధాన ప్రశ్న సంధించారు. క్రీడ ఏదైనా మగాళ్లకే మన్నన. మగువలను పట్టించుకోరు. నటీమణుల ప్రతిభతోనే ఎక్కువ సినిమాలు బాగా అడుతాయి. అయినా పేరు హీరోదే. హీరోయిన్‌కు రాదు. అమెరికన్ నాట్యనటుడు ఫ్రెడ్ ఆస్టెయిర్ చేసిన భంగిమలన్నీ అమెరికన్ నాట్యనటి జింగర్ రోజర్స్ ఎత్తు మడిమల చెప్పులతో వెనక్కు వంగి కూడా చేశారు. పేరు ఫ్రెడ్ కే, జింగర్కు రాలేదు. నేటి ఒలింపిక్స్‌లో ప్రథమ శ్రేణి క్రీడాకారిణుల నైపుణ్యతలూ ఇలాంటివే. మగ ఆటగాళ్లు ఆడిన ఆటలు, క్రీడలు, కొన్ని ఎక్కువగానే, క్రీడాకారిణులూ ఆడారు. అది కూడా తమ క్రీడా దుస్తుల విషయంలో తీవ్ర పురుష (పోలీసు) పర్యవేక్షణలలో బూతులు వింటూ, తిట్లు తింటూ, ఆంక్షలకు గురవుతూ, జరిమానాలు చెల్లిస్తూ ఆడారు. ఆడవాళ్ళ రెచ్చగొట్టే దుస్తులే అత్యాచారాలకు కారణమని మగాళ్ళ అభాండం. చిన్నారులనూ చిదిమేస్తున్నారు. ముసలోళ్ళనూ మానభంగం చేస్తున్నారు. అంగాలే ఎదగని పసిపిల్లల గౌన్లు, ముడతల ఒంటిని కప్పిన కంపు కోకలు కూడా మగాళ్లను ఆకర్షిస్తాయా? రెచ్చగొడతాయా? అత్యాచారం పశుప్రవృత్తి అనటం పొరపాటు. లైంగికక్రియల్లో పశుపక్ష్యాదులు రుతుక్రమ నియమాలను పాటిస్తాయి. కనీసం వీటిని అనుసరించినా మనిషితత్వం ఉన్నట్లే. మానవత్వం తర్వాతి మాట.
గ్రేట్ బ్రిటన్ క్రీడాకారిణి ఒలీవియా బ్రీన్ బ్రీఫ్ (చిన్న నిక్కరు) చాలా పొట్టిదని, తగనిదని ఒక పురుష సంస్కార మహిళ వ్యాఖ్యానించడం విడ్డూరం. ఆమె బ్రీఫ్ పరుగు పందెం కోసం ప్రత్యేకంగా తయారుచేయబడింది. నార్వే మహిళా హ్యాండ్ బాల్ టీం తొడల క్రిందకు ఉన్న నిక్కర్లు చాల పొడవుగా ఉన్నాయని మరో నింద. పొట్టిగా ఉన్నా పొడవుగా ఉన్నా తప్పే. పొట్టి పొడుగులు క్రీడాకారిణుల సౌకర్యం కోసమే కదా. బ్రిటిష్ ఈతకారిణి నల్లజాతి అలిస్ డియరింగ్ పొడవు జుట్టు కట్టడికి ప్రత్యేక టోపీ పెట్టుకున్నారు. అంతర్జాతీయ ఈత సమాఖ్య ఆ టోపీని అంగీకరించలేదు. టోపీ-తల సహజంగా ఉండాలని అడ్డుపెట్టారు. ఇది నల్లజాతి మహిళపై శ్వేతజాతి వివక్ష. నార్వే మహిళా బీచ్ హ్యాండ్ బాల్ టీం పొడవు నిక్కర్లు వేసుకుందని ఐరోపా హ్యాండ్ బాల్ సమాఖ్య జరిమానా విధించింది. టోక్యో ఒలింపిక్స్‌లో జర్మన్ మహిళా జిమ్నాస్టిక్స్ పూర్తి పొడవు పాంట్లు వేసుకోవడాన్నీ అభ్యంతరపెట్టారు. ఇవి బయటపడ్డ ఘటనలు. చెప్పలేనివి ఎన్నో! శతాబ్దం నుండి మహిళలు ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నా లింగ వివక్షత పోకపోగా పెరిగింది. వాళ్ళు ఏ బట్టలు ధరించాలో పురుషాధిక్య క్రీడా సమాఖ్యలు నిర్దేశిస్తున్నాయి. ఇటీవల పెరిగిన ప్రపంచ మితవాద పాలనలు ఇందుకు కారణమా? ఈ నియంత్రణలు, నిషేధాలు మగ ఆటగాళ్లకు లేవు. ఈ ఏడు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటి కొన్ని మార్గదర్శకాలు జారీచేసింది. మాధ్యమాలు మహిళలను లైంగికంగా చూపరాదు. వారి సమగ్రతను కాపాడాలి. ఆడుతున్నప్పుడు అసందర్భ సమయాల్లో వారి శరీర భాగాలు కనిపిస్తున్న చిత్రాలను ప్రదర్శించరాదు. అయినా మృగదృష్టిలో ఈ సూచనలు పనిచేయలేదు. కంతలను మూయగుట్టే నియమాలు కుట్ర కళ్ళను మూయగలవా?
ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో స్త్రీల దుస్తులను మగాళ్లు పరిశీలిస్తూ ఉంటారు. కఠినంగా నియంత్రిస్తారు. ఈ నియంత్రణకు క్రీడాకారిణులూ మినహాయింపు కాదు. ఆడువారు ఆటల్లో పాల్గొనడమే ప్రపంచవ్యాపితంగా స్త్రీద్వేష తుపాకి కింద ఉంటుంది. టోక్యో ఒలింపిక్స్‌లో అమెరికా మహిళా సాసర్ టీం స్వీడన్ టీంతో ఓడింది. అమెరికా క్రీడాకారిణులను అల్లరిమూకలు బూతులు తిడుతుంటే అమెరికా పూర్వ అధ్యక్షుడు ట్రంప్ ప్రోత్సహించారు. అమెరికా ఆటగత్తెలు అతి వాగుడుకాయలు. వీళ్ళ ఓటమికి అమెరికన్లు సంతోషిస్తున్నారని వ్యాఖ్యానించారు. వోకిజం (ఔశీసవఱరఎ) అని అతి గుడ్డిగా తిట్టారు. ''అమెరికా ముందు, అమెరికా ఘనతను తిరిగితెద్దాం'' అన్న ఈయన ఎన్నికల నినాదాలు ఏమయ్యాయో? గెలిచిన స్వీడిష్ మహిళల స్వేచ్ఛ గురించి ఈయనకు తెలియదా?
కొన్ని అధికారవాద, సంప్రదాయవాద దేశాలు మహిళలను ఆటలు చూడటానికి కూడా అనుమతించవు. చాలా దేశాలు క్రీడాకారిణుల పై కఠిన వినమ్రత సూత్రాలు రుద్దుతాయి. లైంగిక అసమానత, స్త్రీ వ్యతిరేక తాత్వికతలను, బహిరంగ ప్రదేశాలలో శరీరాన్ని పూర్తిగా కప్పుకోవాలి, ముక్కు, మూతి, ముఖాన్ని కప్పుకోవాలి వంటి ఆంక్షలను అమలుచేస్తాయి. ఈ కట్టుబాట్లతో స్త్రీలు ఉన్నత స్థాయి క్రీడలలో పాల్గొనటం కష్టం, అసాధ్యం. మహిళల శరీరాలు మగవారిని ఆకట్టుకుంటాయని, లైంగిక చర్యలకు ప్రేరేపిస్తాయని మగవాదుల అభిప్రాయం. వీరి దృష్టిలో బిడ్డకు పాలిచ్చే తల్లి పాలిండ్లతో సహా ఆడువారి ప్రతి భంగిమ, ప్రతి అంగం- నవ్వు, భుజాలు, వెంట్రుకలు, మణికట్లు, మడిమలు- అన్నీ పురుష లైంగిక ఆకలిని రెచ్చగొట్టేవే.
ఇంటా, బయటా, పనిలో, ప్రయాణంలో, ఆటలలో అనుకూలమైన, సౌకర్యమైన నచ్చిన దుస్తులు ధరించే స్వేచ్ఛ మహిళలకు ఉండాలి. దుస్తుల రూపం మృగాల దుష్టదృష్టికి దూరంగా ఉండాలి. మగాళ్లు ఆటలతో సహా ప్రతి ప్రక్రియలో మహిళల పనితనాన్ని చూడాలి. బట్టల వెనుక దాగిన అంగాలను, అందాలను కాదు. రాజ్యాంగాలు ప్రసాదించిన మహిళా సమానతను మన్నించాలి.
- సంగిరెడ్డి హనుమంతరెడ్డి
సెల్: 9490204545