Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగు గడ్డపై జన్మించిన విప్లవ కమ్యూనిస్టు అగ్రగణ్యుల్లో లావు బాలగంగాధరరావు ఒకరు. ఆగస్టు 3, 2021 ఆయన శతజయంతి. బాల్యంలోనే అతివాద రాజకీయాలకు ఆకర్షితులై, 17ఏండ్ల వయస్సులోనే కమ్యూనిస్టు పార్టీ సభ్యుడై అంతిమ శ్వాస విడిచే వరకు ఎన్నో ఆటుపోట్లను, నిర్భంధాలను ఎదిరించి ఆరున్నర దశాబ్దాల పాటు తన విప్లవ జీవితాన్ని సాగించిన గొప్ప కమ్యూనిస్టు. తన ఆదర్శపూరితమైన, ఉత్తేజభరితమైన ఉద్యమ జీవితం ద్వారా ఎన్నో తరాల కార్యకర్తలకు మార్గదర్శకంగా నిలిచారు.
హైస్కూలులో చదివేప్పుడు 1937లో కాంగ్రెస్ సోషలిస్టుల ఆధ్వర్యంలో కమ్యూనిస్టుల చొరవతో కోస్తా ఆంధ్రా ప్రాంతంలోని కొత్తపట్నంలో నిర్వహించిన నెల రోజుల రాజకీయ పాఠశాలలో పాల్గొనడంతో ఎల్బిజి విప్లవ రాజకీయ జీవితం ప్రారంభమైంది. ఈ పాఠశాల బ్రిటిష్ పోలీసు దాడి మూలంగా 11రోజులు మాత్రమే జరిగింది. జాతీయోద్యమంలోకి విద్యార్థులు, యువకులు విరివిగా వస్తున్న కాలమది. కాంగ్రెస్ నాయకత్వం చూపిస్తున్న మెతకతనానికి విసిగి యువతరం అతివాదం వైపుకు మొగ్గుతున్నది. ఆంధ్రాలో విద్యా సంస్థల్లో డిటెన్షన్‌కు వ్యతిరేకంగా విద్యార్థి ఉద్యమం ప్రజ్వల్లిన సమయంలో కామ్రేడ్ బసవపున్నయ్య నాయకత్వాన సాగిన ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న విద్యార్థి కార్యకర్తలలో గంగాధరరావు ఒకరు. అనతి కాలంలోనే ఆయన చురుకైన విద్యార్థి నాయకునిగా ఎదిగారు. 1938లో పార్టీ సభ్యుడై, 1942లో కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తగా రంగంలోకి దిగారు.
1942లో గంగాధరరావు పూర్తికాలం కార్యకర్తగా వచ్చిన సమయం కమ్యూనిస్టులకు రాజకీయంగా చాలా గడ్డుకాలం. హిట్లర్ సోవియట్ యూనియన్‌పై దాడి చేయడంతో సామ్రాజ్య యుద్ధ స్వభావంలో వచ్చిన మార్పును దృష్టిలో ఉంచుకొని ఫాసిస్టు వ్యతిరేక పోరాటాన్ని ప్రధాన కర్తవ్యంగా కమ్యూనిస్టు పార్టీ తీసుకున్నది. ఈ నిర్ణయం కమ్యూనిస్టులను రాజకీయంగా ఒంటరిపాటుజేసింది. ఈ తరుణంలో ప్రజలతో సంబంధాలు తెగకుండా ఉండేందుకు రోజువారీ ప్రజాసమస్యలపై కృషిని, సేవా సాంస్కృతిక కార్యక్రమాలను ముమ్మరంగా నిర్వహించారు. కాంగ్రెస్ వారు ఈ కార్యక్రమాలకు కూడా అడుగడుగున ఆటంకాలు కలిగిస్తుండేవారు. దుష్ప్రచారంజేస్తుండేవారు. సభలను, కార్యక్రమాలను చెడగొట్టడానికి భౌతిక దాడులు చేస్తుండేవారు. ఆనాడు వందలాది యువకులు వలంటీరు దళాలుగా ఏర్పడి కాంగ్రెస్ గూండాల దాడులను తిప్పికొట్టి కార్యక్రమాలు నిరాటంకంగా జరిగేట్టు జూసేవారు. యువకుడైన లావుబాలగంగాధరరావు ఈ దళాలలో ఒక ముఖ్యమైన భాగస్వామి. ధృడకాయుడు, ఆజానుబాహుడైన ఆయన పార్టీని, ప్రజలను కాపాడే కృషిలో జరిగిన అనేక ఘర్షణల్లో ముందున్నారు.
ప్రజలతో సంబంధాలు తెగకుండా తోడ్పడిన మరో బృమాత్తర సేవా కార్యక్రమాన్ని 1943లో పార్టీ చేపట్టింది. ప్రభుత్వ నిర్లక్ష్యం మూలంగా పూడిపోయిన బందరు నీటి కాల్వ పూడిక తీసే కార్యక్రమాన్ని కమ్యూనిస్టు పార్టీ చేపట్టినప్పుడు వేలాది మంది వలంటీర్లు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది కమ్యూనిస్టులు మాత్రమే ఇటువంటి రైతు ప్రయోజన కార్యక్రమం చేయగలరన్న భావాన్ని ప్రజలలో కలిగించింది. గంగాధరరావు కార్యక్రమం జరిగిన 19 రోజులు పూర్తిగా ఉండి, అలవాటులేని పనైనా, చేతులు బొబ్బలెక్కినా అంకిత భావంతో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇటువంటి కార్యక్రమాలతో యువకుల నిస్వార్థ కృషితోనే ఆనాడు కమ్యూనిస్టులు రాజకీయ ఒంటరిపాటుతనాన్ని కొంత మేరకు అధిగమించి ప్రజలతో సంబంధాలు కొనసాగించగలిగారు.
ఆనాడు కమ్యూనిస్టు కార్యకర్తగా పనిచేయడమంటే అసమానత్యాగాలకు, ఎనలేని కష్టాలకు సిద్ధంగావాలి. దేనికి సంకోచించకుండా గంగాధరరావు 1942లో పూర్తికాలం కార్యకర్తగా రావడమేగాకుండా పార్టీ పిలుపు మేరకు తన వాటాగా వచ్చిన ఆస్తి నాలుగు ఎకరాల మాగాణిని అమ్మి పార్టీకి జమచేశారు. పార్టీపై అటు బ్రిటిష్ ప్రభుత్వం, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్బంధం ప్రయోగించినప్పుడు ఎనిమిదిన్నర సంవత్సరాలు పాటు అజ్ఞాతవాసం చేశాడు. రెండున్నర సంవత్సరాల పాటు జైలుపాలయ్యారు. కార్యకర్తలను కనిపిస్తే కాల్చివేస్తున్న ఆరోజులలో తృటిలో ప్రాణాలతో ఆయన తప్పించుకున్న సందార్భాలున్నాయి. వందలమంది ఇటువంటి కార్యకర్తల త్యాగం మూలంగానే పార్టీ ఆ రాజకీయ గడ్డుకాలం నుండి బయటపడి ప్రజా పునాది పెంచుకోగలిగింది.
పెరిగిన పార్టీ ప్రజా పునాది 1952 మద్రాసు రాష్ట్రానికి జరిగిన ఎన్నికల్లోనూ 1955లో ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన ఎన్నికల్లోనూ స్పష్టంగా వ్యక్తమయింది. 1952లో తెలంగాణ ఆంధ్రా ప్రాంతాలలో కలిపి 19 మంది పార్లమెంటు సభ్యులుగా 85మంది శాసనసభ్యులగా పార్టీ తరపున ఎన్నికయ్యారు. 1955లో ఆంధ్రా ప్రాంతానికి వేరుగా జరిగిన ఎన్నికల్లో 35శాతం ఓట్లు వచ్చినప్పటికీ అసెంబ్లీకి 40 నుండి 15కి తగ్గడంతో పార్టీ ప్రధాన నాయకత్వం నైతిక స్థైర్యం కోల్పోయి పార్టీ కార్యకర్తలను బతుకుతెరువుకోసం వ్యవసాయం, వ్యాపారాలు చేసుకోమని ప్రోత్సహిస్తూ పార్టీని నిర్వీర్యం చేస్తున్న కాలంలో గంగాధరరావు ఊగిసలాట లేకుండా పూర్తికాలం కార్యకర్తగా నిలబడ్డారు. తోటి సహచరులు స్థిరంగా ఉండేందుకు కృషి చేశారు. ఆ రకంగా ఆంధ్రాలో పార్టీని కాపాడుకునే కృషిలో సుందరయ్య, బసవపున్నయ్యలకు తోడుగా నిలబడ్డారు.
గంగాధరరావు 1946-51 వరకు జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కూడా ప్రత్యక్షంగా పాల్గొని ముఖ్య బాధ్యతలను నిర్వహించారు. జపాన్ చొరబాటును ప్రతిఘటించడానికి సంసిద్ధం కావడంలో భాగంగా గంగాధరరావు అంతకు ముందే సైనిక శిక్షణ పొందివున్నారు. ఈ మిలటరీ శిక్షణను, ఆయన రాజకీయ సామర్థ్యాన్ని పోరాటానికి వినియోగించే ఉద్దేశ్యంతో ఆయనను 1950లో అమ్రాబాద్ అటవీప్రాంతానికి రీజియన్ కార్యదర్శి బాధ్యతలు నిర్వహించడానికి పార్టీ నిర్ణయించింది. దళాలకు మిలటరీ శిక్షణ ఇచ్చేందుకు వచ్చిన మేజర్ విజరుపాల్సింగ్తో కలిసి అమ్రాబాద్ అటవీ ప్రాంతానికి చెన్నన్న, కొండన్న అన్న మారుపేర్లలో వెళ్ళి తమ బాధ్యతలను అత్యంత క్లిష్టమైన, కష్టమైన పరిస్థితితుల్లో జయప్రదంగా నిర్వహించారు. ఈ కాలంలో ప్రమాదవశాత్తు తుపాకిగుళ్ళు తగిలి గంగాధరరావు తీవ్రం గాయపడ్డారు.
తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ప్రారంభమై 1964లో సీపీఐ(ఎం) ఏర్పడేనాటి వరకు పార్టీలో జరిగిన తీవ్ర సైద్ధాంతిక చర్చలలో గంగాధరరావు ఎప్పుడూ రివిజనిజానికి వ్యతిరేకంగా విప్లవ వర్గపోరాట వైఖరులతోనే నిలబడ్డారు. ఊగిసలాటలు ప్రదర్శించడాన్ని ఎప్పుడూ ఇష్టపడేవారు కాదు. పార్టీలో ఉగ్రవాద పెడధోరణి తలెత్తినప్పుడు కూడా గట్టిగా ప్రతిఘటించారు. ఆంధ్రలో అందులో గుంటూరు జిల్లాలో ప్రత్యేకంగా ఈ ధోరణి పెద్ద ప్రభావం కలిగించింది. ముఖ్యనాయకులు తప్పుడు ధోరణితో ఉన్నా, ఊగిసలాడుతున్నా గంగాధరరావు ఉగ్రవాద ప్రభావం నుండి పార్టీని రక్షించుకునే కృషి జేశారు. సిద్ధాంత విషయాలలో నాన్చుడు ధోరణి ఏనాడూ గంగాధరరావు ప్రదర్శించేవారు కాదు. పార్టీ విప్లవ స్వభావాన్ని నిలబెట్టేందుకు నిలబడేవారు.
ఆయనకు నిర్మాణ దక్షుడిగా మంచి పేరుంది. సుదీర్ఘకాలం పాటు గుంటూరు జిల్లా పార్టీ కార్యదర్శిగా, రాష్ట్ర కార్యదర్శిగా, పోలిట్‌బ్యూరో సభ్యులుగా బాధ్యతలు నిర్వహించారు. ఇరవై సంవత్సరాలపాటు కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్నారు. ఆయనకు కార్యకర్తలను గుర్తించడం, శిక్షణనివ్వడం, అభివృద్ధి చేయడం, తగిన పనులను అప్పగించి ప్రోత్సహించడంలో ప్రత్యేక నైపుణ్యం, ఆసక్తి ఉండేది. విద్యార్థి, యువజన కార్యకర్తలకు వర్గ దృష్టిని అందించి, కార్మిక కర్షక పోరాటాలు జరుగుతున్నప్పుడు వాటిలో వారు ప్రత్యక్షంగా పాల్గొనేట్టుగా చేసేవారు. నిర్మాణ సమస్యలను ఎంతో సమయస్ఫూర్తితో, ఒపికగా పరిష్కరించేవారు. సమస్యల మూలాన్ని పసిగట్టడంలో. వర్గ దృష్టితో సమస్యను పరిశీలించడంలో ఆయనలో గొప్ప నైపుణ్యం ఉండేది. అందుకే ఆయన సూచనలు, సలహాలపై అందరికీ ఎంతో విశ్వాసం ఉండేది.
రాజకీయ నిర్మాణ కృషితోపాటు ఆయనకు అత్యంత ఆసక్తిగల పని వ్యవసాయ కార్మికులలో పనిచేయడం. ఈ రంగంలోనే ఆయన ఎక్కువకాలం పనిచేశారు. రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘ కార్యదర్శి, అధ్యక్ష బాధ్యుల్లో సుదీర్ఘ కాలం ఉన్నారు. రాష్ట్రవ్యాపితంగా పెద్ద ప్రభావం చూపించిన అనేక 'కూలి' పోరాటాలకు ఆయన ప్రత్యక్షంగా నాయకత్వం వహించి నడుపడం జరిగింది. 1981లో అఖిల భారత సంఘం ఏర్పడిన తర్వాత ఆ బాధ్యతల్లోను చాలా కాలం పనిజేశారు. వ్యవసాయ కార్మికుల దుర్భర పరిస్థితులను అధ్యయనం చేయడంలో, డిమాండ్లు రూపొందించడంలో, ఉద్యమాలను నడపడంలో చురుకైన పాత్ర నిర్వహించారు.
జీవిత ఆఖరు ఘట్టంలో కూడా ఒకవైపు వయస్సు మీదపుడుతున్నా మరోవైపు వ్యాధి కృంగదీస్తున్నా, వెనకంజవేయకుండా సుందరయ్య విజ్ఞాన కేంద్రాన్ని హైదరాబాదులో నిర్మించి దాని కార్యకలాపాలను పర్యవేక్షించడానికి చివరి వరకు కృషిజేశారు. అది నేడు విజ్ఞాన, సాహిత్య, సాంస్కృతిక, పరిశోథన, సంఘసేవ, సంస్కరణ కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా మారి ఎనలేని సేవలను అందించేదిగా అభివృద్ధి అయింది. ఈ ఒరవడిలోనే ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలలో అన్ని జిల్లా కేంద్రాలలో విజ్ఞానకేంద్రాలు ఆవిర్భవించడానికి స్ఫూర్తిగా నిలిచింది.
ఆయన జీవితం నుండి నేటితరం కార్యకర్తలు, ఉద్యమకారులు, ప్రజా సేవకులు నేర్చుకోవాల్సిన విషయాలు అనేకం ఉన్నాయి. త్యాగం, పట్టుదల, దోపిడీ పీడనల పట్ల ద్వేషం, ప్రజల పట్ల ప్రేమ, వర్గ పోరాటం, మార్క్సిజం - లెనినిజం పట్ల మొక్కవోని విశ్వాసం నేటితరం కమ్యూనిస్టులు ఆయన జీవితం నుండి సొంతం చేసుకోవాలి. ఇదే గంగాధరరావులాంటి మేటి విప్లవకారునికి మనం అర్పించగల నిజమైన నివాళి.
- బి.వి.రాఘవులు