Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారత ప్రజాస్వామ్యం పెగాసస్ పగడనీడకు చేరింది. భారత రాజ్యాంగం దేశాన్ని సర్వసత్తాక సార్వభౌమ, ప్రజాస్వామ్య దేశమని ఘోషిస్తుంది. ఈ సర్వసత్తాక స్వభావానికి నిదర్శనాలే చట్టసభలు, న్యాయవ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థలు. మన దేశానికి అంటే 138 కోట్ల మంది ప్రజల బాగోగులు శాంతి భద్రతలు నిర్ణయించుకునేది ఈ ప్రజలెన్నుకున్న ప్రభుత్వమే తప్ప పరాయి దేశాలు కాదన్నది సార్వభౌమత్వం సారాంశం. ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలు ప్రజల అవసరాలు తీర్చటానికి పాటుపడటమే ప్రజాస్వామ్యం. ఈ వ్యవస్థలు రాజ్యాంగ బద్ధంగా పని చేస్తున్నాయా లేదా పర్యవేక్షించి పహరా కాయాల్సింది న్యాయవ్యవస్థ. దేశంలో రూపొందే చట్టాలు, వాటి అమలు ప్రజాహితంగా ఉన్నాయా లేదా అన్నది పరిశీలించి విశ్లేషించి వ్యాఖ్యానించి ప్రత్యామ్నాయాలు చర్చకు పెట్టాల్సిన నైతిక బాధ్యతను నెత్తికెత్తుకున్నది మీడియా రంగం. ఏ దేశంలోనైనా ఈ వ్యవస్థల ఆరోగ్యమే ఆయా దేశాల్లోని ప్రజాస్వామ్య వ్యవస్థ ఆరోగ్యాన్ని ప్రతిబింబిస్తుంది.
గత ఏడేండ్లుగా దేశంలో రాజ్యాంగాన్ని పేడపురుగులా లోపల నుండి తొలిచేస్తున్న సంఘటనలు కోకొల్లలు. రాజ్యాంగాన్ని కాపాడతామంటూ ప్రమాణ స్వీకారం చేసిన మోడీ ప్రభుత్వం అదే రాజ్యాంగాన్ని పునాదులతో సహా పెకలించి వేసే నిర్ణయాలు, చట్టాలు చేయటంలో రికార్డు సృష్టించింది. బీజేపీ ప్రభుత్వంలో ఛిన్నాభిన్నమవుతున్న రాజ్యాంగ వ్యవస్థల గురించి పౌరసమాజం కోడై కూస్తోంది. దీనికి మీడియాలో ఒక భాగం, న్యాయవ్యవస్థలో కొంత భాగం, కార్యనిర్వాహక వ్యవస్థలో ఓ చిన్న భాగం తమ గొంతును కూడా అరువిస్తోంది. దాంతో ఈ పౌర సమాజంపై బాధ్యతాయుతంగా వ్యవహరించే పరిమిత సంఖ్యలో ఉన్న న్యాయమూర్తులు, కార్యనిర్వాహకాధికారులు, పాత్రికేయుల గొంతు పిసికే కార్యక్రమానికి కేంద్రం తెరతీసింది. ఇందులో భాగంగానే కేంద్రం పెగాసస్ అనే వెయి తలల విషనాగును ప్రజాస్వామ్య సరస్సులోకి వదిలింది.
టొరంటో విశ్వవిద్యాలయానికి చెందిన సిటిజెన్ లాబ్ 2016 నుంచి పెగాసస్ టెక్నాలజీ వివిధ దేశాలపై నిర్మిస్తున్న విషవలయాన్ని అధ్యయనం చేయటం ప్రారంభించింది. మూడు దశలుగా నివేదికలు రూపొందించింది. ఈ నివేదికలు ప్రజాస్వామ్యవాదులెవ్వరూ అంగీకరించలేని కఠోర వాస్తవాలను వెల్లడించాయి. ఈ వివరాలను క్లుప్తంగా పరిశీలిద్దాం.
పెగాసస్ ఓ సాఫ్ట్వేర్ ఆధారిత ఆయుధం. దీన్ని ఇజ్రాయిల్‌కు చెందిన ఎన్ఎస్ఓ కంపెనీ తయారు చేసింది. ఇప్పటికీ సుమారు 45 దేశాల్లో దీన్ని వినియోగిస్తున్నారు. ఎన్ఎస్ఓ 2018లో విడుదల చేసిన బహిరంగ ప్రకటన ప్రకారం ఈ సాఫ్ట్వేర్ ఆయుధాన్ని కంపెనీ నేరుగా ప్రభుత్వాలకే అమ్ముతోంది. ప్రభుత్వాలతో అమ్మకపు ఒప్పందాలు లేకుండా, ఆ ఒప్పందాలను కంపెనీ బోర్డు ఆమోదించకుండా ఏ దేశంలోనూ ఈ ఆయుధాన్ని ఉపయోగించలేదు. ఎన్ఎస్ఓ ప్రకటనలో మరో కీలకమైన అంశం కూడా ఉంది. ఈ సాఫ్ట్వేర్ ఆయుధాన్ని కీలకమైన నేరాలకు సంబంధించిన దర్యాప్తు కోసం వాడటానికి మాత్రమే ఇతర దేశాలకు అమ్ముతున్నారు. కానీ వాస్తవం ఏమిటి?
ఇప్పటివరకు ఈ సాఫ్ట్వేర్ ఆయుధాన్ని 45 దేశాలు కొనుగోలు చేశాయి. లేదా ఉపయోగించటానికి కావల్సిన లైసెన్స్ పొందాయి. ఇందులో ఆరు దేశాల్లో ప్రభుత్వాలు ప్రజాస్వామ్యాన్ని, మానహక్కులను అణచివేయటానికి ఈ ఆయుధాన్ని ఉపయోగించాయి. ఆ సాఫ్ట్వేర్ ఆయుధం ఎంపిక చేసిన ఫోన్లలో చొరబడిన తర్వాత సేకరించిన సమాచారం వివిధ దేశాల్లోని 237 సర్వర్లలో దాస్తున్నారు. అన్నింటికంటే ముఖ్యమైన విషయం మరోటి ఉంది. సుమారు పది దేశాల్లో ఉన్న నిఘా సంస్థలు ఇతర దేశాల్లో జరుగుతున్న పరిణామాలు లేదా రహస్య సమాచారం సేకరించటానికి ఈ ఆయుధాన్ని ఉపయోగిస్తున్నాయి. అంటే ఉదాహరణకు సౌదీ అరేబియాలో ఉండి భారతదేశంలో నిఘా పెట్టవచ్చు. భారతదేశంలో ఉండి శ్రీలంకలో నిఘా పెట్టవచ్చు. సిటిజన్ లాబ్ నివేదిక ప్రకారం గల్ఫ్ దేశాల్లోని పెగాసస్ ఆధారిత కేంద్రాలు కెనడా, అమెరికా, ఫ్రాన్స్, గ్రీస్లపై నిఘా పెట్టి సమాచారాన్ని పోగేస్తున్నాయి. ఇది పూర్తిగా సార్వభౌమత్వానికి వ్యతిరేకం. అంతర్జాతీయ ప్రమాణాలు, ఐక్యరాజ్యసమితి పునాది సూత్రాలకు విరుద్ధమైన చర్య. మెక్సికో మొదలు భారతదేశం వరకూ ఈ ఆయుధం బారిన పడిన బృందాలు ఒకేతీరున ఉన్నాయి. విలేకరులు, పౌర మేథావులు, అవినీతి వ్యతిరేక ఉద్యమకారులు, మానవహక్కుల కార్యకర్తలు, ప్రతిపక్ష నాయకులు. సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, ప్రధాన న్యాయమూర్తి కార్యాలయంలోని వ్యక్తిగత సిబ్బంది, సిబిఐ డైరెక్టర్, ఎన్నికల సంఘం కమిషనర్ వంటి వాళ్లను కూడా ఈ నిఘా పరిధిలోకి తెచ్చి బీజేపీ ప్రభుత్వం జాబితాను నవీనీకరించింది.
మన ఫోన్లో చొరబడి ఈ ఆయుధం సమాచారాన్ని ఎలా చోరీ చేస్తుంది అన్నది కీలకమైన ప్రశ్న. ఎందుకంటే భారతదేశంలో పెగాసస్ ఆయుధం ఎయిర్ టెల్, ఎంటిఎన్ఎల్, హాత్వే ఓవర్ కేబుల్ నెట్వర్క్, స్టార్ బ్రాడ్ బాండ్ సర్వీసెస్, నేషనల్ ఇంటర్నెట్ బాక్‌బోన్ సెంటర్ కంపెనీలు మనందరికీ అందించే మొబైల్ సేవల్లోకి ప్రవేశించింది. ఎయిర్ టెల్ విస్తృతి దేశంలో ఏమిటన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు హాత్వే బ్రాడ్ బాండ్ సర్వీస్ కంపెనీ దాదాపు హైదరాబాద్‌తో సహా ఆరు ముఖ్యమైన నగరాల్లో 55లక్షల కుటుంబాలకు సేవలందిస్తోంది. హాత్వే కేబుల్ నెట్వర్క్కి దాదాపు 360 పట్టణాల్లో నగరాల్లో వినియోగదారులున్నారు. స్టార్ బ్రాడ్ బాండ్ సర్వీసెస్ కంపెనీ ప్రధానంగా ముంబయి, మహారాష్ట్రల్లో సేవలందిస్తోంది. కేంద్ర ప్రభుత్వంలోనూ, రాష్ట్ర ప్రభుత్వాల్లోనూ వివిధ స్థాయిల సిబ్బంది కనీసం అధికారిక లావాదేవీలు నిర్వహించేందుకైనా ఎంటిఎన్ఎల్ సిమ్ కార్డులు వాడుతున్నారు. పెగాసస్ ఆయుధం ఎంటిఎన్ఎల్ నెట్‌వర్క్‌లోకి చొరబడటం అంటే దాదాపు కేంద్ర ప్రభుత్వపు కీలక లావాదేవీలన్నింటినీ పెగాసస్ ఉపయోగించి ఏ క్షణం కావాలంటే ఆ క్షణంలో సేకరించుకోవచ్చు. ఇదీ జాతీయ భధ్రతకు నేడు ఎదురవుతున్న సంక్షోభం. సమస్య. ప్రజాస్వామిక వాదులంతా అప్రమ్తతం కావల్సిన సందర్భం.
మనం తెలియని కాల్స్, లేదా ఇంటర్నెట్లో లింకులు ఎందుకు పట్టించుకుంటామన్న సంశయం సహజం. ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ వాడని వాళ్లు తక్కువ. ఓ సారి స్మార్ట్ ఫోన్ వాడటం మొదలు పెట్టిన తర్వాత సమాజంలో వివిధ ఉద్యోగాలు, వృత్తులు, ప్రవృత్తుల్లో క్రియాశీలకంగా ఉన్న వాళ్లు ఈమెయిల్ ఖాతా మొదలు ఫేస్బుక్ ట్విట్టర్ ఖాతా వరకూ అన్నీ ఫోన్లోనే నడిపేస్తున్నాం. సిటిజన్ లాబ్స్ ఇచ్చిన ఓ ముఖ్యమైన ఉదాహరణను ఇక్కడ మనం ప్రస్తావించుకోవాలి. ఆ దేశ పౌరుల ఫోన్లల్లోకి ముఖ్యమైన రాజకీయ పరిణామం, నూతన దేశం, నూతన అధ్యక్షుడు, నూతన పాలన వంటి పదాలతో సందేశాలు (మెసేజిలు) పంపేవాళ్లు. ఆ మేసేజిలు నిజంగానే ముఖ్యమైనవని భావించి చూద్దామని ప్రయత్నం చేసిన అన్ని ఫోన్లలోనూ ఈ పెగసస్ రెక్కల గుర్రంలా వచ్చి వాలింది. వాలటమే తరువాయి ఫోన్లో ఉన్న సెట్టింగ్స్‌లో అన్ని కంట్రోల్స్, పర్మిషన్స్‌ను తన నియంత్రణలోకి తీసుకుంటుంది. దాని ఇష్టం వచ్చినప్పుడు కెమెరా తెరిచి మనమున్న చోట చుట్టూ ఏమి జరుగుతుందో ఫొటోలు తీసుకుంటుంది. వీడియోలు తీసుకుంటుంది. అలా మన ఫోన్లలో సమాచారం ఉన్నది ఉన్నట్లు, జరిగింది జరిగినట్లు పెగాసస్ సర్వర్‌కు చేరుతుంది. ఇలాంటి సందర్భాలు మనలో ఎంతమందికి ఎదురయ్యాయో ఎవరికి వారు గుర్తు తెచ్చుకోవాలి. నా ఉదాహరణే నేను చెప్తాను.
నా ఫోన్లో ఉన్న జీ మెయిల్ ఖాతాలో నాకు పరిచయం లేని ఖాతాల నుండి వచ్చిన మెయిల్స్‌ను చూడకుండా ఉండటానికి నా రోజువారీ పని ఆటంకం లేకుండా సాగటానికి వాటిని స్పామ్‌గా గుర్తించే ఏర్పాటు చేసుకున్నాను. దాంట్లో నెలకు వందల మెయిల్స్ చేరతాయి. అందులో ఓ మేసిజి ఇది. కేంద్ర ప్రభుత్వంలో వివిధ విభాగాల నుండి నేరుగా ప్రధాని కార్యాలయం నుండి లేదా జిఓవి.ఇన్ అనే మెయిల్ పేజీ నుండి మెయిల్ వచ్చినట్లు కనిపిస్తుంది. ఇందులో ప్రధాని పని తీరుపై పోలింగ్ అన్నట్లు కనిపిస్తుంది. లేదా మరో ఆసక్తికరమైన విషయమో లేక మనకు సంబంధించిన విషయమో అన్నట్లు కనిపిస్తుంది. దాన్ని తెరిచి చూశానంటే నా ఫోన్లో ఉన్న సమాచారం, నెంబర్లు, మెసేజిలు, వాట్సప్ సందేశాలు, వాయిస్ కాల్ లిస్టు, వాట్సప్ వాయిస్ కాల్ లిస్టు అన్నీ నా ఫోన్ నుండి కాపీ అయి పెగసస్ సర్వర్‌కు చేరతాయి. టాగో దేశంలో ఉన్నట్లు మన దేశంలో కూడా ఈ మధ్య కాలంలో ప్రభుత్వం నుండే మెయిల్ వస్తుందా అన్నట్లు కనిపించే మెయిల్స్ మనందరికీ వస్తున్నాయి. వాటి పర్యవసానాలు ఏమిటన్నది తాజా వివాదం తర్వాతగానీ మనకు అర్థంగాదు.
చివరిగా మరో విషయం. కేంద్ర ప్రభుత్వం నిజంగా ఉగ్రవాద చర్యలను ముందుగానే కనిపెట్టడానికి 2016లోనే ఈ రెక్కల గుర్రాన్ని కొని తెచ్చుకున్నా, అరువు తెచ్చుకున్నదని సిటిజన్ లాబ్ నివేదిక చెప్తోంది. రెక్కల గుర్రం ఆ లక్ష్యానికే తెచ్చుకున్నప్పుడు 2019 ఎన్నికలకు ముందు కాశ్మీర్ సరిహద్దు జిల్లాల్లో సైనిక వాహనాలపై జరిగిన బాంబుదాడి గురించి కేంద్రానికి ఎందుకు తెలియలేదు? జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంపై జరిగిన ముసుగుదాడికి వాట్సప్‌లోనే వ్యూహరచన సాగినా కేంద్రానికి ఎందుకు తెలియలేదు? సుప్రీం కోర్టు న్యాయమూర్తి, సిబిఐ డైరక్టర్, ఎన్నికల సంఘం కమిషనర్, అంతర్జాతీయ గుర్తింపు పొందిన మీడియా సంస్థల ప్రతినిధులు, వ్యాఖ్యాతలు, విశ్లేషకులను బీజేపీ ప్రభుత్వం ఉగ్రవాదులుగా భావిస్తోందా? లేని పక్షంలో వాళ్ల ఫోన్లలోకి రెక్కల గుర్రాన్ని ఎందుకు పంపినట్లు? ఇలాంటి అనేక ప్రశ్నలు సంయుక్త పార్లమెంటరీ సంఘం దర్యాప్తు జరిపే వరకూ శేష ప్రశ్నలే. బృందావనవాసులకు దాహం తీర్చే యమునా నదిలో కాళీయుడనే విషనాగు ఆక్రమించుకుని నీళ్లను విషతుల్యం చేసిందట. బృందాన వాసులంతా కృష్ణుడి దగ్గరెళ్లి మొత్తుకు న్నారట. దాంతో యమునానదిని విషపూరిత కాళీయుడి బారి నుండి కాపాడటానికి కృష్ణుడు చేసిన న్యాటమే కాళీయ మర్దనం అని మనం చదువుకున్నాం. ఇప్పుడు భారత ప్రజాస్వామ్యాన్ని పెగాసస్ అనే కాళీయుడు విషపూరితం చేస్తున్నాడు. ప్రజాస్వామిక వాదులు, రాజ్యాంగ బద్దమైన పాలన కావాలను కునేవారంతా ఆధునిక కాళీయమర్దరానికి సిద్ధం కాకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోలేం.
- కొండూరి వీరయ్య
సెల్: 8971794037