Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలు గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. అవి పాలకుల లేదా రాజకీయ పార్టీల జేబు సంస్థలుగా మారిపోయాయి. బడా పెట్టుబడిదారుల చేతుల్లో బందీ అయ్యి ప్రజల హక్కులు కాలరాయబడుతున్నా, వాటి తాలూకు ఆనవాళ్లు కూడా కనపడకుండా ప్రధాన మీడియా పనిచేస్తున్నది. ఈ దశలో సామాన్యునికి అందుబాటులోకి వచ్చిన సౌకర్యం సోషల్ మీడియా. తమ అభిప్రాయాలకు విమర్శలకు ఈ సామాజిక మాధ్యమం ప్రధాన ఆయుధమైంది. ఇంటర్నెట్ అందరికీ అందుబాటులోకి రావడంతో ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలు సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యక్తీకరణలో ప్రభుత్వాల, రాజకీయ నాయకుల ప్రజా వ్యతిరేక విధానాలు బట్టబయలు కావడం మొదలైంది. సోషల్ మీడియా ప్రజా భిప్రాయాలకు వేదికగా నిలబడింది. ప్రజల చైతన్య శీలతకు సహజంగానే వ్యతిరేకి అయిన పాలకవర్గం, తమ గుట్టంతా ప్రచారం కావడంతో తమ ఆధీనంలోలేని సోషల్ మీడియాపై కన్నేసింది. ద్వేషంతో దోషాన్వేషణ మొదలు పెట్టింది. ఎలాగైనా కట్టడి చేయాలన్న ఉద్దేశంతో కొత్త ఐటి నియమాలను తీసుకొచ్చింది. సోషల్ మీడియా సంస్థలకు ముకుతాడు వేసి తద్వారా ప్రజల నోటికి తాళం వేయజూస్తున్నది. ప్రభుత్వం సూచించిన నిబంధనలన్నీ సామాజిక మీడియా సంస్థలు పాటించాలనీ, లేనట్లయితే వాటికి లభించే సేఫ్ హార్బర్ రక్షణలు వర్తించవని హెచ్చరించింది. సేఫ్ హార్బర్ రక్షణలు అంటే ప్రభుత్వం తాను చెప్పిన నియమాలను అనుసరించకపోతే ఈ సామాజిక సంస్థలను బ్యాన్ చేయలేవూ, బ్లాక్ చేయలేవు. కానీ, వాటికి లభించే రక్షణలు అంటే ఇప్పటి వరకు ఉన్న నియమాల ప్రకారం ఎవరైనా తప్పుడు సమాచారం పెడితే వారి మీద క్రిమినల్ కేసు పెట్టవచ్చు. కానీ మధ్యవర్తిగా ఉన్నటువంటి మీడియా సంస్థల మీద కేసులు పెట్టలేరు. మీడియాలో వచ్చే మెసేజ్‌లకు, ఆ సంస్థలకు సంబంధం ఉండదు. వాటి పని ఏమైనా ఒక చోటి నుంచి మరొక చోటికి చేర్చడమే. కొత్త నియమాల ప్రకారం ఈ రక్షణలు ఉండవు. కాబట్టి ఆ మీడియా సంస్థల మీద కూడా కేసులు పెట్టే అవకాశం ఉంటుంది. అప్పుడు ఈ సంస్థలు చాలా ఇబ్బందులు పడవలసిన పరిస్థితి ఉంటుంది. ప్రతి రోజూ అనేక వేల కేసులు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఎందుకంటే ప్రతి మెసేజ్‌ను ట్రేస్ చేసేందుకు ఐటీ శాఖకు అధికారం ఉంటుంది. సోషల్ మీడియా బాధ్యతగా ఉండాలని నియంత్రణలో ఉండాలని చెప్పి తమకు వ్యతిరేకంగా వచ్చే వార్తలను సోషల్ మీడియాలో రాకుండా చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం పెగాసస్ వంటి వాటిని అడ్డం పెట్టుకొని బెదిరిస్తుంది. ఐటి రూల్స్ అమల్లోకి వస్తే ఏం మాట్లాడితే ఏ కేసు తమ మీద పడుతుందోనని భయపడుతున్నారు నెటిజన్లు. ఈ నిబంధనలు తీసుకురావడానికి ఇంతగా ప్రభుత్వం ఎందుకు ప్రయత్నిస్తున్నదో కొన్ని ఉదాహరణలు చూస్తే అర్థమవు తుంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ తన కార్యకర్తలకు పార్టీ తరపున నిర్వహించాల్సిన కార్యక్రమాల గురించి అంతర్గత సూచనలు ఇచ్చే ఒక టూల్ కిట్ విడుదల చేసింది. దీనికి బీజేపీ నాయకుడు ఒకరు కొంత విషయం జతపరిచి ట్విట్టర్లో పెట్టి దేశ సమగ్రతకు వ్యతిరేకంగా కాంగ్రెస్ టూల్ కిట్ తయారు చేసిందని ఆరోపించారు. దానిమీద కాంగ్రెస్ పార్టీ కేసు పెట్టడం జరిగింది.ఈ క్రమంలో ట్విట్టర్ సంస్థ బీజేపీ నాయకుని ట్విట్టర్ మీద మానిపులేటెడ్ అని పెట్టేసరికి ప్రభుత్వం జీర్ణించుకోలేక పోయింది. అలాగే తాము చెప్పిన వారి ఎకౌంట్లను బ్లాక్ చేయాలని కోరింది. కానీ దానికి ట్విట్టర్ అంగీకరించకపోవడం కేంద్రానికి నచ్చలేదు.
ఢిల్లీలో జరిగిన షహీన్‌బాగ్ అల్లర్ల సందర్భంగా జరిగిన హింస ప్రభుత్వానికి మాయని మచ్చగా మిగిలిపోయింది. దీనిలో బీజేపీ నాయకులు కొంతమంది రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని, దాడులకు తెగబడ్డారని దీంతో ఢిల్లీలో అల్లర్లు జరిగాయని కేంద్ర ప్రభుత్వం మీద సోషల్ మీడియా వేదికగా విపరీతమైన చర్చ నడిచింది. టీవీలు, పత్రికలు చెప్పని, చూపించని విషయాలు సోషల్ మీడియాలో విరివిగా ప్రచారం జరిగాయి. ఈ సోషల్ మీడియా ప్రచారం కేంద్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది.
మరొక సంఘటన ఢిల్లీలో జరుగుతున్న రైతాంగ పోరాటం. ఈ ఉద్యమాన్ని అణిచే ప్రయత్నంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో ప్రభుత్వ ప్రతిష్ట మసకబారింది. అదే విధంగా ప్రపంచాన్ని కుదిపేసిన కోవిడ్ నియంత్రణలో ప్రభుత్వ వైఫల్యాలనూ సోషల్ మీడియా దుమ్మెత్తిపోయడాన్ని కేంద్రం సహించలేకపోతోంది. స్మశానల్లో శవాల గుట్టలనూ, నదుల్లో తేలుతున్న శవాలనూ, ఆసుపత్రుల ముందు బారులు తీరిన అంబులెన్సులనూ, ఆక్సిజన్ లేక అల్లాడిన ప్రాణాలనూ ప్రపంచ మీడియాకు పరిచయం చేసింది ఈ సోషల్ మీడియానేనని, ప్రపంచ దేశాల ముందు తమ పరువు పోవడానికి కూడా కారణం అయ్యిందని కేంద్రం భావించింది. పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలను నియంత్రించలేని ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ లీటర్ పెట్రోల్ రేటు ఒక బారెల్ రేటుకు సమానంగా మారిందని సోషల్ మీడియాలో మోడీ ప్రభుత్వాన్ని సామాన్యులు సైతం పెద్ద ఎత్తున విమర్శించారు. ఇది కూడా సోషల్ మీడియాకు ఉచ్చు బిగించటానికి కారణమైంది.
ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకంపై సోషల్ మీడియా నిప్పులు కురిపించింది. ఇలా ప్రజల స్వేచ్చాయుత భావ ప్రకటనకు గొంతుకైన సోషల్ మీడియాను ఎలాగైనా నియంత్రించాలని, లేకపోతే అది తమ ఉనికికే ప్రమాదం తీసుకొస్తుందని గ్రహించినందుకే ప్రభుత్వం ఈ మార్గదర్శకాలు తెచ్చిందని యిట్టే అవగతమవుతుంది. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం.ప్రజల మనోభావాలను తొక్కి పెట్టడం పాలకవర్గాల నిరంకుశత్వానికి నిదర్శనం. ప్రజలను శత్రువులుగా భావించి వారి నోళ్ళు మూయించి తమ నోరు మాత్రమే మాట్లాడేలా నిబంధనలు రూపొందించుకొని ప్రజల హక్కులకు నీళ్ళొదిలి, వేలేత్తిన చేతులకు సంకెళ్ళు బిగించడమంటే సామాజిక మాధ్యమాలకు ఉరితాళ్ళు తగిలించటమే.
- ఎన్. శ్రీనివాస్
సెల్ : 9676407140