Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జాతీయ విద్యా విధానం 2020 అమల్లోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా జూలై 29న ప్రధాని నరేంద్ర మోడీ చేసిన హిందీ ప్రసంగంలో పేర్కొన్న విషయాలు ఆర్భాటానికి ఎక్కువ ఆచరణకు తక్కువగా ఉన్నాయి. ''జాతీయ విద్య నిజమైన అర్థంలో సార్ధకం కావాలంటే... అది జాతీయ పరిస్థితులకు అద్దం పట్టాలని మహాత్మా గాంధీ అంటూ వుండే వారు. జాతిపిత దూరదృష్టితో చేసిన ఆలోచనను నెరవేర్చేందుకే మాతృభాషలో విద్యా బోధన అంశాన్ని నూతన విద్యా విధానంలో చేర్చాము. దీనివల్ల దేశంలోని పేద, మధ్యతరగతి, గ్రామీణ, దళిత, ఆదివాసీ, వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుంది. 8 రాష్ట్రాల్లోని 14 ఇంజనీరింగ్ కళాశాలలు... హిందీ, తమిళం, తెలుగు, మరాఠీ, బంగ్లా మాధ్యమాల్లో బోధనను ప్రారంభించడం నాకెంతో ఆనందం కలిగించింది. భావి అవసరాలకు, కృత్రిమ మేథ ఆధార ఆర్థిక వ్యవస్థకు అనుగుణంగా యువతను తీర్చి దిద్దేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుంది. భవిష్యత్తులో మనం ఏ ఉన్నత శిఖరాలను చేరుకుంటామన్నది... ఇప్పుడు మన యువతకు ఎలాంటి విద్యను అందిస్తున్నామన్న దానిపై ఆధారపడి ఉంటుంది. జాతి నిర్మాణ మహాయజ్ఞంలో ఎన్ఈపీ స్థానం సమున్నతమైనది. దేశ యువతకు స్వేచ్ఛ కావాలి. దేశం పూర్తిగా వారితోనే ఉందన్న భరోసా కొత్త విద్యా విధానం వారికి కల్పిస్తోంది'' అని ప్రధాని తన ప్రసంగంలో పేర్కొన్నారు. అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ (ఏబీసీ), నేషనల్ డిజిటల్ ఎడ్యుకేషన్ ఆర్కిటెక్చర్, విద్యా ప్రకాష్, నిష్ట, సఫల్ కార్యక్రమాలను కూడా ఆ సందర్భంగా ప్రధాని ప్రారంభించినట్లు ప్రకటించారు.
ప్రధాని ప్రారంభించిన విద్యా కార్యక్రమాల్లో భాషకు సంబంధిన రెండు విషయాలు విస్తుగొలుపుతున్నాయి. ''జాతిపిత దూర దృష్టితో చేసిన ఆలోచనను నెరవేర్చేందుకే మాతృభాషలో విద్యా బోధన అంశాన్ని నూతన విద్యా విధానంలో చేర్చాం'' అని చెప్పడం వింతగా ఉంది. ఇప్పటిదాకా విద్యా బోధన మాతృభాషలో లేదని ప్రధాని అభిప్రాయమా? ప్రభుత్వ పాఠశాలల్లో మాతృభాషలోనే విద్యా బోధన జరుగుతుందనే విషయం ఆయనకు తెలియదా? లేక ఇంగ్లీష్ మీడియం మాత్రమే ఉండే ప్రయివేట్ కార్పొరేట్ పాఠశాలల గురించి చెప్పినట్లు అనుకోవాలా? ఒకవేళ అదే అనుకున్నా ప్రధాని చెప్పినా ప్రయివేట్ స్కూళ్ళు ఖాతరు చేయవనే విషయం అందరికీ తెలిసిందే. ''మాతృభాషలో విద్యా బోధన వల్ల దేశంలోని పేద, మధ్యతరగతి, గ్రామీణ, దళిత, ఆదివాసీ, వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుంది'' అని ప్రధాని అనడం మరీ వింతగా ఉంది. ఇప్పుడు ఆ వర్గాల వారే మాతృభాష మాధ్యమం గల పాఠశాలల్లో చదువుతూ నష్టపోతున్నామని బాధ పడుతున్నారు. సంపన్నులు, అగ్రకులాలు, పట్టణాల్లోని విద్యార్థులు దర్జాగా ప్రయివేట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్సులో చదువుతున్నారు. ఈనాటి మార్కెట్ ఆధారిత ఆర్థిక వ్యవస్థలో ఇంగ్లీషులో నైపుణ్యాలు ఉన్నవారికే ఉద్యోగాలు వస్తున్నాయనే విషయమూ తెలిసిందే. అందుకు విరుద్దంగా యువత భవిష్యత్ కోసమే ప్రాంతీయ భాషల్లో విద్యా బోధన చేయబోతున్నట్టు చెప్పడం అసంబద్ధంగా ఉన్నది. ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలు, సంపన్నులు, ఉద్యోగులు, ఉపాధ్యాయుల పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుతుండగా బడుగు బలహీన వర్గాల ఉద్ధరణకే మాతృభాషకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పడం సమంజసంగా లేదు. ఇక, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యారంగంలో తెచ్చిపెడుతున్న అనవసర పథకాల్లో ప్రాంతీయ భాషల్లో సాంకేతిక విద్య ఒకటి. 8 రాష్ట్రాల్లోని 14 ఇంజనీరింగ్ కళాశాలలు హిందీ, తమిళం, తెలుగు, మరాఠీ, బంగ్లా మాధ్యమాల్లో బోధనను ప్రారంభించడం తనకెంతో ఆనందం కలిగించినట్లు మోడీ మురిసిపోవడం ఎవరికీ నచ్చలేదు. ఆ ప్రకటన చేసిన జులై 29 సాయంత్రం ట్విట్టర్లో వచ్చిన లైక్లు 709, రీట్వీట్లు 298 మాత్రమే. ఇంజనీరింగ్ విద్య ప్రాంతీయ భాషల్లో కావాలని ఎవరు అడిగారు? ఆ కాలేజీల్లో పని చేసే ఫ్యాకల్టీ కూడా ప్రధాని ప్రకటనను స్వాగతించలేదు. ఈ చర్యతో దేశ విద్యారంగంలో కొంత ప్రాచుర్యంలో ఉన్న ఇంజనీరింగ్ విద్య కూడా దెబ్బతినే పరిస్థితి ఉత్పన్నమవుతుంది. బీటెక్ చేసిన వారిలో కూడా ఉద్యోగాలు పొందేవారి సంఖ్య ఆయేటికాయేడు తగ్గిపోతోంది. భారతదేశంలో ప్రతి ఏటా 15లక్షల మంది ఇంజనీరింగ్ కోర్స్ పూర్తి చేస్తున్నా వారిలో 20శాతం మంది మాత్రమే ఇంజనీర్ ఉద్యోగాలకు అర్హత సాధించగలుగుతున్నారని 'ఎంప్లాయబిలిటీ సర్వే 2019' లో పేర్కొనబడింది. ఉదారవాద సంస్కరణలతో అవసరానికి మించి ఇంజనీరింగ్ కాలేజీలు నెలకొల్పడం, నాణ్యమైన టీచింగ్ ఫ్యాకల్టీ లేకపోవడం, కరిక్యులం అప్డేట్ కాకపోవడంతో పాటు విద్యార్థులకు ఇంగ్లీష్ పరిజ్ఞానం, కమ్యూనికేటివ్ స్కిల్స్ లేకపోవడం ముఖ్యమైన లోపాలుగా గుర్తించడం జరిగింది. కార్పొరేట్ సంస్థలు, మల్టీ నేషనల్ కంపెనీలు, విదేశాల్లో ఉద్యోగాలకు అవసరమైన ఐటీ, కంప్యూటర్ సబ్జెక్టుల్లో బీటెక్ చేసిన వారికి కూడా ఇంగ్లీష్ మీద పట్టు లేకపోవడం పెద్ద లోపంగా ఉంది. సాంకేతిక విద్యలో కొత్తగా ప్రవేశిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, మెషీన్ లెర్నియింగ్ మున్నగువాటికి ఇంగ్లీష్ పరిజ్ఞానం అనివార్యం. ఈ నేపథ్యంలో తెలుగు, తమిళం తదితర ప్రాంతీయ భాషల్లో బీటెక్ కోర్సులు చదివిన యువకులు ఏమి చేయాలి? పకోడీలు అమ్ముకుని బతకాలా? తమిళనాడులో పదేండ్ల క్రితం నుండే తమిళ మీడియంలో ఇంజనీరింగ్ విద్య అమల్లో ఉంది. కానీ రెండు శాతం మంది కూడా ఆ కోర్సు తీసుకోవడం లేదని తెలుస్తోంది. ఇంజనీరింగ్ విద్య మాతృభాషలో చదివితే ఉద్యోగాలు రావనే విషయం తల్లిదండ్రులకు, విద్యార్థులకు తెలుసు. ఆ విషయం కేంద్ర ప్రభుత్వానికి తెలియదా? ప్రాంతీయ భాషల్లో బీటెక్ కోర్సులు చేసిన వారికి ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందనే భరోసా కూడా ప్రధాని ఇవ్వలేదు. అరవై ఏండ్లుగా అపసవ్య విధానాలతో అల్లాడుతున్న భారత విద్యా వ్యవస్థలో ఎందుకీ అనవసర ప్రయోగాలు?
భారతీయ సంస్కృతికి పట్టం కట్టాలనే పేరుతో విద్యారంగంలో భారతీయ భాషలకు పెద్ద పీట వేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. ప్రాధమిక విద్య మాతృభాషలో ఉండాలనడం వరకూ అర్థం చేసుకోవచ్చు. దానిని కూడా పిల్లల భవిష్యత్తు దృష్ట్యా తల్లిదండ్రులు ఆదరించడం లేదనుకోండి. ఇంక ఉన్నత సాంకేతిక విద్యలు మాతృభాషల్లో / ప్రాంతీయ భాషల్లో నేర్పాలనేది పాలకుల స్వీయమానసిక ధోరణి తప్ప ఆచరణయోగ్యమైంది కాదు. కాకపోయినా ఈ ప్రాజెక్ట్ కూడా ఫీజు రీయింబర్సుమెంటు పథకం అమల్లో వున్న తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ కళాశాలల కంటే ప్రయివేట్ కార్పొరేట్ కాలేజీలకే ఎక్కువగా ఉపయోగపడే అవకాశం ఉంది. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ఈ విద్యా సంవత్సరం నుండే అనుమతించినందున ఇప్పటికే కొన్ని కార్పొరేట్ కాలేజీలు తెలుగు మీడియంలో సివిల్, మెకానికల్ వంటి ఐదు సాంప్రదాయక బీటెక్ కోర్సులను ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ కోర్సులకు ఇప్పటికింకా ఎవరూ అప్లయి చేయకపోయినా ఇంగ్లీష్ మీడియంలో సీట్లు లభించని వారిలో ఏదోవిధంగా ఇంజనీర్ కావాలనుకునే వారు తెలుగు మీడియం బీటెక్ కోర్సుల్లో నమోదయ్యే అవకాశం ఉంటుంది. ప్రాంతీయ భాషల్లో పుస్తకాలు రాలేదు, శిక్షణ పొందిన అధ్యాపకులు లేరు. అయినా ప్రాంతీయ భాషల్లో ఇంజనీరింగ్ విద్య ప్రారంభమైనట్లు చెప్పడంలోనే కేంద్ర ప్రభుత్వ అత్యుత్సాహం వ్యక్తమవుతోంది.
- ఎన్. నారాయణ
సెల్: 9490300577