Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గత గురువారం నాడు ఇటీవల పరమపదించిన ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉపాధ్యాయ సంఘనాయకులు రంజాన్సార్ సంతాప కార్యక్రమానికి హాజరయ్యాను. అక్కడ ఇష్టాగోష్టిగా మాట్లాడుతున్న సందర్భంలో ప్రస్తుతం యాక్టివ్‌గా పనిచేస్తున్న ఉపాధ్యాయ నాయకులొకరొచ్చి... ''పినరయి విజయన్‌కు మరీ అంత నిజాయితీ అవసరమా? ఇప్పటిదాకా కోవిడ్ కట్టడి చేసిన రాష్ట్రమని గొప్పగా చెపుతుంటిమి. ఇప్పుడేమో దేశంలో నమోదయ్యే కేసుల్లో సగం కేసులు కేరళలోనే ఉన్నాయని వార్తలు వస్తుంటే ఇబ్బంది అనిపిస్తుండె. మన వ్యతిరేకులు మీ కేరళ మోడల్ ఫెయిల్ అంటున్నారు. దేశంలో థర్డ్ వేవ్‌కు మీ కేరళే కారణమవుతున్నది అంటున్నారు. ఏమిచెప్పాలో తెలియట్లేదాయె...'' అంటూ, ''కేసీఆర్‌ను- జగన్‌ను చూసైనా మనం కేసులు దాచుకోవటం నేర్చుకోవాలండీ'' అన్నాడు. ''మోడీ పార్లమెంటులో చెప్పలే, ఈ దేశంలో ఆక్సిజన్ అందక ఒక్క కరోనా రోగి కూడా చనిపోలేదని. అంత పెద్ద అబద్దాలు చెప్పక పోయినా, కనీసం మనమీదకు రాకుండా అయినా చూసుకోవాలి కదా!'' అని ఇంకొక భాద్యుడు అన్నారు. వారు చెప్పిన చివరి మాటతో ఏకీభవించకపోయినా, చాలా మంది కమ్యూనిస్టు అభిమానులు, ప్రజాస్వామిక- అభ్యుదయ వాదులు, ప్రస్తుతం కేరళ కరోనా కేసులపై జరుగుతున్న ప్రచారం చూసి, ఆందోళన చెందుతున్న మాట వాస్తవం.
వాస్తవంగా కేరళలో జరుగుతున్నదేమిటో తెల్సుకుంటే ఎవరూ ఆందోళన చెందక పోగా, మరింత విశ్వాసం పొందుతారు. ముందుగా ఒక విషయం పరిశీలిద్దాం. 26.07.2021న ప్రముఖ ఆంగ్ల దినపత్రిక దిహిందూలో ఒక ఆసక్తికరమైన వార్త వచ్చింది. 2020 ఏప్రిల్ నుండి 2021 మే1 వరకూ వివిధ రాష్ట్రాలలో జరిగిన సాధారణ మరణాలెన్ని? కోవిడ్ మరణాలెన్ని? అనే వివరాలతో కూడినదే ఆ వార్త. వాళ్ళు దానిని ఆధార సహితంగానే ప్రచురించారు. సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్‌లో నమోదైన మరణాల వివరాలను, ఆయా ప్రభుత్వాలు వారి రాష్ట్రాలలో నమోదు చేసిన మరణాల రికార్డును, ఆధారం చేసుకొనే వారు ఆ వార్తను ప్రచురించారు. దాని ప్రకారం పైన పేర్కొన్న కాలంలో బీజేపీ పాలిత రాష్ట్రమైన కర్నాటకలో కోవిడ్ మరణాలు 29,090 అయితే, సాధారణ మరణాలు 1,25,732. అంటే కోవిడ్ మరణాల కంటే సాధారణ మరణాలు 4.5రెట్లు ఎక్కువ. అదే పార్టీ పాలించే హర్యానాలో కోవిడ్ మరణాలు 8,303అయితే, సాధారణ మరణాలు 60,397. అంటే 7.5రెట్లు ఎక్కువ. మరో రాష్ట్రం మధ్యప్రదేశ్‌లో కోవిడ్ మరణాలు 8068 అయితే, సాధారణ మరణాలు 1,92,004. అంటే 24రెట్లు సాధారణ మరణాలు ఎక్కువ. తృణమూల్ పాలనలో ఉన్న పశ్చిమ బెంగాల్లో కోవిడ్ మరణాలు 10,787 అయితే సాధారణ మరణాలు 1,20,227. అంటే 11రెట్లు సాధారణ మరణాలు ఎక్కువగా ఉన్నాయి. వైసీపీ పాలనలోని ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ మరణాలు 10,930 అయితే, సాధారణ మరణాలు 1,95,422. అంటే 18రెట్లు సాధారణ మరణాలు ఎక్కువ. పై రాష్ట్రాల సగటును చూస్తే కోవిడ్ మరణాలకంటే సాధారణ మరణాలు 8రెట్లు ఎక్కువ. మరి కేరళలో... పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా ఉంది. కోవిడ్ మరణాలు 9,954 అయితే సాధారణ మరణాలు 4,178. అంటే కోవిడ్ మరణాలలో సాధారణ మరణాలు సగం మాత్రమే. పై వివరాలను కాస్త ఓపికగా పరిశీలిస్తే మనకు అర్థం అయ్యేదేమిటి? బీజేపీ, కాంగ్రెస్ లేదా ప్రాంతీయ బూర్జువా పార్టీలు పాలించే రాష్ట్రాలలో, కోవిడ్ మరణాలను కోవిడ్ మరణాలుగా చెప్పలేదు. సాధారణ మరణాల్లో కలిపి చెప్పే ప్రయత్నం చేశారు. ఎందుకని అలా చెప్పారు. కోవిడ్‌ను నివారించటంలో తమ వైఫల్యాన్ని, చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకొనేందుకే అలాంటి ప్రయత్నం చేశారు. కానీ దానికి భిన్నంగా కేరళ, ఉన్న విషయాన్ని ఉన్నట్లు నిజాయితీగా నివేదించింది. వాస్తవాలే వివరించాలి. వాస్తవాల ఆధారంగానే పనిచేయాలి. దాని ప్రకారమే కరోనాను కట్టడి చేయాలని నిర్ణయించుకొంది.
ఇక పై వార్తలోనే కనపడే మరొక అంశం, అన్ని రాష్ట్రాలకంటే కేరళలో కరోనా మరణాల సంఖ్య తక్కువ. సాధారణ మరణాల సంఖ్య కూడా తక్కువే.
ఇక రెండో విషయం, కేరళలో కేసులెందుకు అంత ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఉన్నదున్నట్లు చెపుతున్నది కాబట్టే కేసులెక్కువ కనపడుతున్నాయి. మిగిలిన రాష్ట్రాలు చేయని రెండు పనులు కేరళ చేస్తున్నది కాబట్టే, అక్కడ కేసులెక్కువ కనపడుతున్నాయి. తన ప్రజలను కాపాడుకోవాలని తాపత్రయ పడుతున్నది కాబట్టే కేసులెక్కువ కనపడుతున్నాయి. ఎలాగో పరిశీలిద్దాం.
మొదటిది ఎక్కువ టెస్టులు చేయటం. రెండవది ఆ పరీక్షలు కరోనా రోగులను పట్టుకొనే లక్ష్యంతో చేయటం. దేశంలో సగటున లక్షమందికి 1,338 టెస్టులు చేస్తే, కేరళలో అంతకు రెండు రెట్లు ఎక్కువగా 3,411 టెస్టులు చేసింది. ఇప్పుడు 9కోట్లు జనాభా ఉన్న బెంగాల్లో రోజుకు 50,000 టెస్టులు చేస్తుంటే, అందులో 3వ వంతు అంటే, కేవలం 3.5కోట్లు జనాభా ఉన్న కేరళలో, రోజుకు సరాసరిన లక్షన్నర టెస్టులు చేస్తున్నారు. ఆ టెస్టులు కూడా చేశామని అన్సించుకోవటానికి చేసేవికాదు. కరోనాను వేటాడుతున్నారు. మోడీ ప్రభుత్వమే నియమించిన కోవిడ్ వర్కింగ్ గ్రూప్ చెప్పిన ప్రకారం, కేరళలో కోవిడ్ వచ్చిన ప్రతి ఐదుగురిలో నలుగురిని పట్టుకొంటున్నారు. అదే మధ్యప్రదేశ్‌లో 35మందికి కోవిడ్ వస్తే ఒక్కరిని మాత్రమే పట్టుకొంటున్నారు. దేశంలో సగటున 30మందిలో ఒకరిని మాత్రమే పట్టుకొంటున్నారు. కోవిడ్ కాంటాక్టుల లింకు ప్రకారం వెంటపడి మరీ వేట కొనసాగిస్తున్న రాష్ట్రం కేరళ.
పై లెక్క ప్రకారం మనకు ఏమి అర్థం అవుతున్నది. దేశంలో సగటున 100మందికి కరోనా సోకితే, వారిలో 95మంది లెక్కలోకి రావటం లేదు. అదే కేరళలో 100మందికి 80మంది లెక్కలోకి వస్తున్నారు. మరి కేరళలో కేసులెక్కువ కనపడకుండా ఎలా ఉంటాయి.
ఇక మూడవ అంశం, కేంద్ర ప్రభుత్వ సంస్థ ఐసియంఆర్, ఇటీవలే నాలుగవ విడత సీరలాజికల్ సర్వే నిర్వహించింది. ఆ సర్వే ప్రకారం దేశంలో సరాసరి 68శాతం మందికి యాంటీబాడీస్ ఉంటే, కేరళలో కేవలం 42.3శాతం మందికి మాత్రమే యాంటీ బాడీస్ ఉన్నాయి. యాంటీ బాడీస్ ఉన్న వారికి కరోనా సోకదు. యాంటీ బాడీస్ రెండు రకాలుగా తయారవుతాయి. ఒకటి కరోనా జబ్బుసోకి కోలుకొన్న వారికి వస్తాయి. రెండు వ్యాక్సిన్ రెండు డోసులు వేయించుకొన్న వారికీ ఈ యాంటీబాడీస్ వస్తాయి. కేరళలో 37శాతం మందికి మొదటిడోస్, 20శాతం మందికి రెండు డోసులు వేశారు. ఇది దేశంలో అన్ని రాష్ట్రాలకంటే ఎక్కువ. మోడీ స్వంత రాష్ట్రం గుజరాత్ కూడా 16శాతం మందికి మాత్రమే వ్యాక్సిన్ వేశారు. జాతీయ సగటు కూడా 10శాతమే ఉంది. అనేక విమర్శల అనంతరం వ్యాక్సిన్ అందించే బాధ్యత నెత్తినెత్తుకొన్న కేంద్రం దానిని సరిగా అందించడం లేదు. అందుకే కేరళ ఇంకా మరింత మందికి వ్యాక్సిన్ ఇవ్వలేక పోతున్నది. మొదటి విడత, రెండవ విడతలో కరోనా సోకిన వారు బాగా తక్కువ ఉండటం వలన ఇప్పటికీ యాంటీబాడీస్ ఉన్న వారి సంఖ్య తక్కువగా ఉన్నది. అవి లేవు కాబట్టి ఇప్పుడు కరోనా సోకే వారి సంఖ్య సహజంగానే పెరుగుతుంది. కేసులు పెరగటానికి ఇది మరొక కారణం.
ఈ నేపధ్యం నుండి కేరళను మనం పరిశీలించాలి. దీనితో పాటు కేరళలో జనసాంద్రత చాలా ఎక్కువ. దేశంలో సగటున ఒక చదరపు కి.మీ వైశాల్యంలో 382మంది ప్రజలు నివసిస్తుంటే, అది కేరళలో 868గా ఉంది. కేరళలో పబ్లిక్ మూవ్బులిటీ కూడా ఎక్కువ. ఆ రాష్ట్ర ప్రజలు ప్రపంచ వ్యాపితంగా ఉంటారు. దేశంలో కూడా దాదాపు అన్ని రాష్ట్రాలలో, ఆయా రాష్ట్రాల ప్రధాన నగరాలలో, పట్టణాలలో కూడా ఉంటారు. ఎక్కడ కరోనా సోకినా, ఆదుకోవడానికి మన ప్రభుత్వం ఉంది అనే విశ్వాసంతో ఆ ప్రజలు రాష్ట్రానికి తరలి వస్తున్నారు. ఆ ప్రభుత్వం వాళ్ళను కన్నతల్లి లాగా అక్కున చేర్చుకొంటున్నది. 97.5శాతం మంది కరోనా సోకిన ప్రజలు ప్రభుత్వ వైద్యాన్నే వినియోగించుకొంటున్నారు.
ఇక కేసులు వచ్చిన వాళ్ళకు వైద్యం చేయటంలో దేశంలో అన్ని రాష్ట్రాలకంటే కేరళ మెరుగ్గా ఉంది. పరిస్థితి ఆందోళన కరంగా ఉందికదా! దీనిని మీరెలా ఎదుర్కొంటారు. అని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖా మంత్రి వీణాజార్జిని, ఇండియా టుడే ఛానల్ కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్‌దీప్ సర్దేశారు ప్రశ్నించాడు. మా ప్రజలను కంటికి రెప్పలాగా కాపాడుకొంటాం. ఇప్పటి లెక్కలే చూడండి. వారిష్టం వచ్చినట్లు చెప్పే లెక్కల ప్రకారమే దేశంలో కరోనా మరణాలరేటు మొత్తం కేసులలో 1.5శాతం ఉంది. మా దగ్గర అది కేవలం 0.5శాతం మాత్రమే. చాలా చక్కటి ఆరోగ్య వ్యవస్థ మా దగ్గర ఉంది. దానిని వినియోగించే యంత్రాంగమూ మాకుంది. మేము ఆ ఏర్పాట్లు చేసుకొన్నాం. కాబట్టే ప్రజలు తెలియకనో, వైద్యం అందకనో ప్రాణాలు కోల్పోకూడదనే టార్గెట్ టెస్టులు చేస్తున్నాం. ఇతర కొన్ని రాష్ట్రాలలాగా, ఆ బాధ్యత మాకు లేదనుకొంటే మేము కూడా టెస్టులు తక్కువ చేసే వాళ్ళం. లేదా వాళ్ళ లాగానే జబ్బుకు గురికాని ప్రాంతాలను ఎంచుకొని చేసేవాళ్ళం. లేదా తప్పుడు లెక్కలు చెప్పేవాళ్ళం. మేమా పని చేయదల్చుకోలేదు. మాకు అనుకూలమైనా, ప్రతికూలమైనా ప్రచారం ముఖ్యం కాదు. ప్రజలు ముఖ్యం. వాళ్ళ ప్రాణాలు నిలబెట్టడం, ఆరోగ్యంగా ఉంచటం ముఖ్యం. ఆ భాధ్యతతోనే మేము పనిచేస్తున్నాం. 1,21,453 బెడ్లు ఏర్పాటు చేశాం. భర్తీ అయినవి కాక 70,587 ఖాళీగా ఉన్నాయి. అందులో 24,317 ఆక్సిజన్ బెడ్లు ఉన్నాయి. వీటిలో 45.7శాతం వేకెన్సీ ఉంది. 7,680 ఐసీయూ బెడ్లు ఉన్నాయి. వీటిలో 42.5శాతం వేకెన్సీ ఉంది. 2625 వెంటిలేటర్స్ ఉన్నాయి. వీటిలో 41.4శాతం వేకెన్సీ ఉంది. అవసరం పడితే ఇంకా ఎన్ని బెడ్లు అయినా ఏర్పాటు చేస్తాం. ఇప్పటివరకూ మా రాష్ట్రంలో ఆక్సిజన్ అందకనో, ఐసీయూ, వెంటిలేటర్ సౌకర్యం కల్పించకనో ఒక్కరంటే ఒక్కరు కూడా మరణించలేదు. మేము చాలా ముందు చూపుతోనే ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేశాం. మా అవసరాలకు మించి ఉత్పత్తి చేస్తున్నాం. కర్నాటక, తమిళనాడు, గోవా రాష్ట్రాలకు కూడా సరఫరా చేస్తున్నాం. పరిస్థితి మా కంట్రోల్లోనే ఉంటుంది. అని ధైర్యంగా, అత్యంత విశ్వాసంతో చెప్పారావిడ.
దేశంలోనే కేసులు పెరుగుతున్నాయి. అందులో భాగంగా కేరళలోనూ పెరుగుతున్నాయి. మిగిలిన రాష్ట్రాలలో కేరళలాగా టెస్టులు చేయటం లేదు. ప్రజలను వాళ్ళ మానానికి వాళ్ళను వదిలేస్తున్నారు. కేరళ ప్రజలను కాపాడే లక్ష్యంతో టెస్టులు ఎక్కువ చేస్తున్నది. అందుకే కేరళను అభిమానించేవారెవరైనా ఆందోళన చెందాల్సిందీ, ఆవేదన చెందాల్సిందీ ఏమీ లేదు. అక్కడున్నది ప్రజలకోసం పనిచేసే ప్రభుత్వం. వాళ్ళ ప్రధమ ప్రాధాన్యత ప్రజలే. ఇప్పటికీ కేరళ ఈ దేశానికి మోడలే. కేసులు గుర్తించటంలో మోడల్. టార్గెట్ టెస్టుల్లో మోడల్. మరణాలు తగ్గించడంలో మోడల్. వైద్యం అందించడంలో మోడల్. ఆక్సిజన్ ఉత్పత్తిలో మోడల్. కరోనా ప్యాకేజీ ఇవ్వడంలో మోడల్. అన్నిటికీ మించి నిజాయితీగా వ్యవహరించడంలో మోడల్.
- పోతినేని సుదర్శన్‌రావు