Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సోషలిస్టు పంథాను ఎంచుకున్న క్యూబాను అస్థిరపర్చటానికి అమెరికా మరోసారి తన సామ్రాజ్యవాద జోక్యానికి పాల్పడుతోంది. క్యూబా ప్రజలు, ప్రభుత్వం, కమ్యూనిస్టు పార్టీ ఈ ప్రయత్నాలను తిప్పి కొట్టాయి. జూలై 26వ తేదీన మంకాడా గారిసన్‌పై కాస్ట్రో దళాల దాడికి 68వ వార్షికోత్సవం. ఈ సందర్భంగా యావత్ ప్రపంచం క్యూబాకు సంఘీభావంగా నిలిచింది. భారతదేశంలో కూడా జాతీయ క్యూబా సంఘీభావకమిటీ, దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థి యువజన, మహిళా, కార్మికసంఘాలు, నిజాయితీతో పని చేసే పాత్రికేయులు క్యూబాకు సంఘీభావంగా నిలిచారు.
క్యూబా వ్యతిరేకత పెంచటంలో పావులుగా మారిన సామాజిక మాధ్యమాలు
అమెరికా ప్రభుత్వాలు 1960 దశకం నుండీ క్యూబాపై ఆర్థిక, వాణిజ్య, ద్రవ్య సంబంధమైన ఆంక్షలు విధిస్తూ వచ్చాయి. క్యూబాలాగా మరే దేశమూ ఇంత దీర్ఘకాలం ఇంత కఠినమైన ఆంక్షలకు బలికాలేదు. ఈ ఆంక్షల కారణంగా క్యూబా ప్రజలు చెప్పనలవి కాని కష్టనష్టాలకు గురయ్యారు. అమెరికా ఆంక్షలకు వ్యతిరేకంగా క్యూబా ప్రజలు స్వయంప్రతిపత్తి, స్వావలంబన, సార్వభౌమత్వాలను కాపాడుకుంటూ వస్తున్నారు. ఇప్పటి వరకూ అమలు జరుగుతున్న ఆంక్షలకు అదనంగా ట్రంప్ ప్రభుత్వం మరో 244 ఆంక్షలు విధించింది. కోవిడ్ మహమ్మారి కూడా ఈ ఆంక్షలు సడలించాలన్న ఇంగితాన్ని అమెరికాకు కలిగించలేకపోయింది.
క్యూబా ఆర్థిక వ్యవస్థ కోవిడ్ మహమ్మారి ధాటికి కుదేలైంది. ప్రత్యేకించి క్యూబాకు ఆదాయవనరుగా ఉన్న పర్యాటక రంగం తీవ్రంగా దెబ్బతిన్నది. ఇన్ని ఆంక్షలు, ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ మొత్తం లాటిన్ అమెరికాలోవాక్సిన్ తయారు చేయగలిగిన ఏకైక దేశంగా ఉంది క్యూబా. అబ్దాలా, సోబెరానా వాక్సిన్లను క్యూబా ఈ ప్రతికూల పరిస్థితుల్లో సైతం అభివృద్ధి చేసింది. ఇదిలా ఉండగా దేశంలో కుదేలవుతున్న ఆర్థిక పరిస్థితిని నిరసిస్తూ కొందరు క్యూబా ప్రజలు తమ అసంతృప్తి అన్ని రకరకాలుగా వ్యక్తం చేయసాగారు. జూలై 11న వివిధ నగరాల్లో ఆహార కొరతకు నిరసన వ్యక్తం చేస్తూ కొందరు క్యూబా ప్రజలు ప్రదర్శనలు చేశారు. ప్రత్యేకించి మతాన్జాస్లో పేట్రేగుతున్న కోవిడ్ పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిరసనలను ఓ మేరకు అర్థం చేసుకోవచ్చు. అందుకే క్యూబా ప్రభుత్వం నిరసనకారులతో ప్రత్యక్షంగా చర్చలకు వెళ్లింది. ఏకంగా దేశాధ్యక్షుడే చర్చలకు వెళ్లారు. హావానా, ఇతర నగరాల్లో వందలమంది తాము ఎదుర్కుంటున్న వాస్తవిక సమస్యల గురించి అధ్యక్షునికి వివరించారు. కానీ జూలై 11న దేశవ్యాప్తంగా జరిగిన నిరసనలు భిన్నమైనవి. క్యూబా ప్రభుత్వాన్ని అస్తిరపర్చే లక్ష్యంతో సాగిన నిరసన ప్రదర్శనలు ఇవి. ఈ నిరసనలకు అమెరికా అధ్యక్ష భవనం వెన్నుదన్నుగా ఉందని చెప్పటానికి వెనకాడాల్సిన పనిలేదు. క్యూబా సోషలిస్టు ప్రభుత్వాన్ని అస్థిరపర్చేందుకు ప్రాణాలు తీసే కోవిడ్‌ను కూడా పావుగా వాడుకోగలమని అమెరికా మరోసారి చాటి చెప్పింది.
ప్రజల్లో ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకత ఏ మోతాదులో ఉందో తెలుసుకోవటానికి జూలై 11 నిరసనలను అమెరికా ఓ సందర్భంగా వాడుకోవటానికి సిద్ధపడింది. ఈ నిరసనలు దేశవ్యాప్త తిరుగుబాటు రూపం తీసుకుంటాయా లేదా అన్నది అమెరికా పరిశీలిస్తున్న కోణం. యథా ప్రకారం తప్పుడు వార్తల ఆధారంగా కథనాలు తయారయ్యాయి. బ్యూనస్ ఎయిర్స్లో అమెరికా ఫుట్ బాల్ కప్ ఉత్సవాలను, ఈజిప్ట్‌లో పదేళ్లనాటి నిరసనలను క్యూబాలో జరుగుతున్న నిరసనలుగా ప్రచారం చేస్తూ అమెరికా నుండి తప్పుడు వార్తా స్రవంతి మొదలైంది. కాసులకు లొంగిపోయిన కాకారాయుళ్లు సోషలిస్టు ప్రభుత్వంపట్ల ప్రజాగ్రహంగా దీన్ని రంగుమార్చి వాట్సప్ యూనివర్సిటీ సిలబస్ చేశారు. క్యూబా ప్రజలు ఎప్పటిలాగానే అర్థవంతంగా స్పందించారు. సోషలిస్టు ప్రభుత్వానికి మద్దతుగా వేలాదిమంది వీధుల్లోకి వచ్చారు. హింసాత్మక చర్యలకు సిద్ధపడాలన్న అమెరికా పిలుపుకు స్పందించిన చెదురుమదురు నిరసనకారులను కట్టడి చేశారు. ప్రజాతంత్ర పద్థతిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చన్న విషయాన్ని స్పష్టం చేశారు. అమెరికా సరిహద్దులోని మియామి కేంద్రంగా ఉన్న మాఫియా వికృత వ్యూహం విఫలమైంది. నిరసనకారులపై క్యూబా ప్రభుత్వం అణచివేతకు పాల్పడుతుందని దీన్ని అంతర్జాతీయ మానవహక్కుల సమస్య చేసి అమెరికా సైనిక జోక్యానికి రంగం సిద్ధం చేయవచ్చన్నది ఈ వికృత వ్యూహం. వీరి అంచనాలకు భిన్నంగా క్యూబా ప్రభుత్వం నిరసనకారులతో శాంతియుత చర్చలకు ఆహ్వానం పలికింది.
అమెరికా జోక్యం
లాటిన్ అమెరికా దేశాల అంతర్గత వ్యవహారంలో అమెరికా జోక్యానికి సుదీర్ఘ చరిత్రే ఉంది. స్పెయిన్ వలసలుగా ఉన్న లాటిన్ అమెరికా దేశాలను, అవి స్వాతంత్య్రం పొందిన నాటి నుండీ అమెరికా తన పెరటిదొడ్డిగా భావిస్తూ వచ్చింది. ప్యూర్టోరికో, ఫిలిప్పీన్స్‌ల తర్వాత స్పెయిన్ వలస పాలన నుండి 1898లో స్వాతంత్య్రం పొందిన చివరి దేశం క్యూబా. స్వతంత్ర దేశంగా క్యూబా అవతరించిన వెంటనే ఈ చిన్న దీవిని కబ్జా చేయటానికి అమెరికా చేయని ప్రయత్నం లేదు. అమెరికా, స్పెయిన్లకు జరిగిన యుద్ధంలో స్పెయిన్‌ని ఓడించి క్యూబాపై అమెరికా తన అధికారాన్ని ఖాయం చేసుకుంది. అమెరికా తరపున నియంతగా పాలిస్తున్న బాటిస్టా కబంధ హస్తాల నుండి క్యూబాను విముక్తి చేయటానికి కాస్ట్రో నాయకత్వంలో 1953 జూలై 26న శాంటియాగో డి క్యూబా నగరంలోని మంకాడా కారాగారంపై దాడి జరిగింది. ఈ తొలి ప్రయత్నంలో కాస్ట్రో దళాలు విజయం సాధించలేకపోయాయి. అయితే మంకాడా కారాగారంపై జరిగిన దాడి క్యూబా
కార్మికవర్గ చైతన్యాన్ని పతాక స్థాయికి చేర్చింది. 1959లో బాటిస్టాకు వ్యతిరేకంగా సాగిన విప్లవంలో కార్మికవర్గం విముక్తి శక్తుల పక్షాన నిలిచింది.
1959 విప్లవం విజయం సాధించటం క్యూబా చరిత్రలో నూతన అధ్యాయానికి నాంది పలికింది. ఇటువంటి చిన్న దేశంలో విజయవంతమైన ఈ విప్లవం లాగా ప్రపంచాన్ని ప్రభావితం చేసిన మరో సంఘటన 20వ శతాబ్ది ప్రపంచ చరిత్రలోనే లేదంటే అతిశయోక్తి కాదు. మూడో ప్రపంచ దేశాల్లో సాగిన వలస వ్యతిరేక ఉద్యమాల నుండి, 1968లోలాటిన్ అమెరికాను ఆవహించిన రాడికల్ రాజకీయాలనుండి, వామపక్ష రాజకీయాల నుండి క్యూబాను వేరు చేయలేం. ఇటువంటి రాజకీయాల కొనసాగింపులో భాగంగానే తాజాగా పెరులో పెడ్రో కాస్టిల్లో దేశాధ్యక్షునిగా ఎన్నికయ్యాడు.
లాటిన్ అమెరికాను వామపక్ష రాజకీయాలకు ప్రయోగశాలగా మార్చటంలో క్యూబా కీలక పాత్రధారిగా ఉండటమే అమెరికా ప్రభుత్వం, దానికి అండగా ఉన్న యజమానులు సోషలిస్టు ప్రభుత్వాన్ని కూలదోయాలని కక్ష కట్టడానికి కారణం. క్యూబా భూభాగమైన గౌంటనామో కేంద్రంగా అమెరికా అక్రమ చర్యలకు పాల్పడుతోంది. ఈ ప్రాంతాన్ని సైనిక స్థావరంగా మార్చుకుంది. వేలాదిమంది హైతీవాసులు, క్యూబా పౌరులు, తాజాగా ముస్లింలను ఖైదు చేసింది ఇక్కడే. ఈ దుశ్చర్య అమెరికా రాజ్యాంగానికి కూడా విరుద్ధమైనది. గత ఆరు దశాబ్దాలుగా అమెరికా క్యూబాపై ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక అమానవీయ చర్యలకు పాల్పడుతోంది. ఉదాహరణకు 2014లో యుఎస్ ఎయిడ్ సంస్థ కూబ్యా పాప్ సంగీత బృందాలకు ఆర్థిక సహాయం చేసి వాళ్ల ద్వారా యువతలో అశాంతి రాజేయటానికి ప్రయత్నం చేసింది. 1962 నాటి పిగ్స్ జలసంధి దాడియత్నం లాగానే ఇప్పటి వరకూ క్యూబాపై ఆధిపత్యం సాగించేందుకు అమెరికా చేసిన అన్ని ప్రయత్నాలూ విఫలమయ్యాయి.
ఈ మధ్యకాలంలో హైతీ అధ్యక్షుడిని హత్య చేసిన కొలంబియా సైనికుడికి తామే శిక్షణ ఇచ్చామని అమెరికా రక్షణ శాఖ ప్రకటించింది. కానీ ఈ వాస్తవాన్ని ప్రజలకు చేరవేయటానికి కాకారాయుళ్లు ఎన్నడూ ప్రయత్నం చేయలేదు. అన్నింటికీ మించి క్యూబాలో కోవిడ్ పీడిత ప్రజలకు ఆహారం, ఇతర సరుకులు అందచేసే సాకుతో క్యూబాలో ఓ ప్రత్యేక ప్రాంతంలో అమెరికా ప్రవేశానికి అవకాశాలు కల్పించాలని అధ్యక్షుడు జో బైడెన్ ప్రతిపాదించాడు. ఇంతకన్నా దగా ఏముంటుంది? క్యూబాకు అందే అన్ని రకాల సహాయ సహకారాలపై ఆంక్షలు విధించి ప్రజల కడుపుకొట్టిన అమెరికా నేడు మానవతా కోణంలో జోక్యం చేసుకోవటానికి ప్రత్యేక అవకాశాలు కోరుతోంది. క్యూబా ప్రజలు సోషలిజమే తమ భవిష్యత్తు అని నమ్మినందుకు గాను వాళ్ల ప్రాణాలతో చెలగాటమాడటానికి అమెరికా చేతుల్లో కోవిడ్ కూడా పావుగా మారింది. అమెరికాకు ఏ మాత్రం మానవత్వం ఉన్నా క్యూబాపై ఆంక్షలు రద్దు చేసి తన మానవత్వాన్ని నిరూపించుకోవాలి. ఓ చిన్న ఉదాహరణగా చెప్పాలంటే కోవిడ్ మహమ్మారి కాలంలో క్యూబాలోని ఆసుపత్రులకు స్విట్జర్లాండ్ ఉచితంగా ఇస్తామన్న వెంటిలేటర్లు కూడా రానీయకుండా అమెరికా ఆంక్షలు అడ్డుపడ్డాయి. అటువంటి అమెరికా మానవతా కారణాల గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించటమే. ఐక్యరాజ్యసమతిలో 184 దేశాలు ఆమోదించిన తీర్మానాన్ని అంగీకరించటానికి సిద్ధంగా లేని అమెరికా... క్యూబా ప్రభుత్వం ప్రజల డిమాండ్లకు స్పందించాలని చెప్పటం దాని గురివింద నైజానికి పరాకాష్ట.
అమెరికా జోక్యానికి వ్యతిరేకంగా క్యూబా అధ్యక్షుడు మిగుయెల్ డియాజ్ కానెల్ తన విప్లవ కర్తవ్యాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. ఏ రూపంలోనూ బయటి శక్తుల జోక్యానికి అవకాశం ఇచ్చేది లేదని స్పష్టం చేస్తున్నాడు. జూలై 17, 2021న హవానాలో జరిగిన ఓ సభలో మాట్లాడుతూ కానెల్ ''గత కొద్ది వారాలుగా అమెరికా నుంచి ఆర్థిక సహకారం పొందిన కొన్ని మీడియా సంస్థలు ప్రజలకు మత్తుమందు పంచటంలో మునిగిపోయాయి. ఫ్లోరిడాలోని రాజకీయ యంత్రాంగం వీరికి వత్తాసుగా ఉంది. వాళ్ల లక్ష్యం ఒక్కటే. క్యూబాలో అస్థిరత సృష్టించటం. ఇటువంటి ప్రయత్నానికి కోవిడ్ నేపథ్యాన్ని సాధనంగా వాడుకుంటున్నారు. ఇప్పటివరకూ సాగుతున్న ఆంక్షలకు అదనంగా ట్రంప్ ప్రభుత్వం విధించిన 243 ఆంక్షలను ఈ ప్రభుత్వం అమలు చేస్తోంది. తాజాగా క్యూబా ప్రజలపై సాంప్రదాయేతర యద్ధ వ్యూహానికి అమెరికా తెరతీసింది. తిరుగుబాటు రెచ్చగొట్టడానికి బాహాటంగానే ప్రయత్నం జరుగుతోంది. పోలీసులపై దాడులకు ప్రేరేపిస్తున్నారు. వెన్నుపోట్లు ప్రోత్సహిస్తున్నారు.'' అని హెచ్చరించాడు.
అమెరికా ఎన్ని ఆంక్షలు విధించినా వైద్య, విద్య, సామాజిక భద్రత, క్రీడా, సంగీతం, సాంస్కృతిక రంగాల్లో క్యూబా తన ప్రజలకు పెట్టుబడిదారీ దేశాలకు మించిన నాణ్యమైన సేవలందిస్తోంది. జూలై 11 నిరసనల తర్వాత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన క్యూబా గాయకుడు సిల్వియో రోడ్రిగుయెజ్ ''ఇన్ని ఆంక్షలున్నా మా దేశానికి కావల్సిన వాక్సిన్ మేము తయారు చేసుకోగలిగామంటే మా బతుకు మమ్ములను బతకనిస్తే మరెన్ని అద్భుతాలు సాధించగలమో వేరే చెప్పాలా?'' అని ప్రశ్నించాడు. అందుకే మెక్సికో అధ్యక్షుడు లోపేజ్ ఒబ్రడోర్ కోవిడ్ కాలంలో ప్రపంచానికి అందించిన సేవలకు గాను క్యూబాను, క్యూబా ప్రజలను ప్రపంచ మాతృమూర్తిగా ప్రకటించాలని యునెస్కో కు విజ్ఞప్తి చేశాడు. నిజమే. క్యూబా విప్లవ ప్రభుత్వం నూతన ప్రపంచ నిర్మాణానికి దారిదీపం. ఈ దీపం ఆరిపోకుండా కాపాడుకోవటం మనందరి కర్తవ్యం.
రచయిత: ప్రొఫెసర్, లాటిన్ అమెరికన్ స్టడీస్,
జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం
అనువాదం : కొండూరి వీరయ్య, 9871794037
- సోనియా సురభి గుప్త