Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆలోచన లేని వ్యక్తితో చర్చించడం అంటే, చనిపోయిన మనిషి శరీరంలోకి ఔషధాన్ని ఇంజెక్ట్ చేయడం లాంటిది.
- థామస్ పెయిన్ (1737-1809),
అమెరికన్ తత్త్వవేత్త, రాజకీయ సిద్ధాంతకర్త.
దళితుల చేతితో నీళ్ళు తాగడానికి నిరాకరించిన ఈ దేశంలోని పెద్ద మనుషులు ఈ రోజు ఒక జంతువు మూత్రం సంతోషంగా తాగుతున్నారు. దేశం ఎంత ముందుకు పోతూఉందో, ఎంత వెలిగిపోతూ ఉందో ప్రపంచం గమనిస్తూనే ఉంది. గోమూత్రం అంత పవిత్రమైనదే అయితే, దేవుళ్ళ అభిషేకాలకు ఎందుకు వాడడం లేదూ? అని నేటి యువతరం ఒక ప్రశ్నను సంధిస్తోంది. సరస్వతి శిశుమందిర్‌ల పేరుతో ఆరెస్సెస్‌వారు లక్షలాది ఆదివాసీ బాలబాలికల పసి మనసుల్ని కలుషితం చేస్తున్నారు. జరగబోయే ప్రమాదాన్ని గ్రహించి జాగ్రత్త పడాల్సి ఉంది. అయినా విద్యాలయాలపై దాడులు, యూనివర్సిటీలపై దాడులు వీరికి కొత్తకాదు. లోగడ నలంద, విక్రమశిల, తక్షశిల లాంటి విశ్వవిద్యాలయాలను ధ్వంసం చేసింది వీరి పూర్వీకులేనన్నది గమనించాలి! ఇటీవల జేఎన్‌యూపై దాడులు కూడా ఎవరు చేయించారో అందరికీ తెలిసిన విషయమే.
ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ఇలాంటి దాడుల్ని దృష్టిలో పెట్టుకుని దక్షిణాఫ్రికా నల్లజాతి తొలి అధ్యక్షుడు, జాతి వివక్షపై జీవితాంతం పోరాడిన విప్లవవీరుడు నెల్సన్ మండేలా ఇలా అన్నారు.. ''మన ప్రపంచం జాతి, మత, రంగు, లింగ బేధాలతో విభజింపబడి లేదు. కేవలం వివేకవంతులు, మూర్ఖులు అని రెండు రకాలుగా మాత్రమే విభజింపబడి ఉంది. మూర్ఖులే జాతి, మత, రంగు, లింగ బేధాలతో తమని తాము విభజించుకున్నారు.'' ప్రపంచంలో సుమారు 192 దేశాలున్నాయి. అందులో 750 కోట్ల జనాభా ఉంది. వీరికి 4200 మతాలున్నాయి. అయితే ఇందులో ఏ ఒక్క మతమూ మనుషులంతా సమానులని చెప్పలేకపోయింది. పోనీ సమానులుగా ఉంచలేకపోయింది. దానికి కారణమేమిటీ? అని ఇకనైనా మనం ఆలోచించుకోవాలి కదా? మతం అణిచివేయబడ్డ జీవి నిట్టూర్పు. హృదయం లేని ప్రపంచంలో హృదయం లాంటిదని - స్ఫూర్తి లేని ప్రపంచంలో స్ఫూర్తి లాంటిదని కొందరు అభిప్రాయ పడతారు. ఏది ఏమైనా ఒకరకంగా మతం ప్రజల పాలిట మత్తుమందు. ఆనందంగా ఉన్నామని భ్రమలు కల్పించే మతం రద్దుకావాలంటే నిజ జీవితంలో నిజమైన ఆనందం సాధించబడాలి. ఆ నిజమైన 'ఆనందం' సాధించబడాలంటే ఏం చేయాలో మార్క్సు-ఏంగిల్స్ చెప్పారు. ''మత భావనలు బలంగా కొనసాగడానికి అదృష్టం, అతీత శక్తులు, దేవుళ్ళపై నమ్మకాలకు భౌతిక పునాది ఏమిటో మనం అర్థం చేసు కోవాలి. వాటిని రూపుమాపి, భావజాల పోరాటం కూడా జోడిస్తే... అప్పుడు మనిషికి మతం అవసరం తొలగి పోతుంది. మతం అంతరించిపోతుంది'' అన్నాడు మార్క్స్. ''మతాన్ని తొలగించాలంటే మతం సృష్టించిన పరిస్థితుల్ని తొలగించాలి. సమాజంలోని దోపిడీని వ్యతిరేకించి పోరాడకుండా.. దాని ప్రతిబింబమైన మతంపై పోరాడడం వలన ఉపయోగముండదు'' అని చెప్పాడు ఏంగిల్స్.
ఆ మహానుభావుల అభిప్రాయాలు మనకు శిరోధార్యమే. కాని స్వాతంత్య్రానంతరం ఈ దేశంలో యేం జరుగుతూ వస్తోందో మనకు తెలుసు. మనిషికి మతం అవసరం లేని పరిస్థితిని ప్రభుత్వాలు గాని, రాజకీయ పార్టీలు గాని, సామాన్య పౌరులుగానీ కల్పించే ప్రయత్నం చేస్తున్నాయా? / చేస్తున్నారా? ఒకసారి ఆలోచించండి! 'మతం సృష్టించిన పరిస్థితుల్ని తొలగించాలి' అని అన్నాడు ఏంగిల్స్. మరి ఈ దేశంలో వామపక్షాలైనా ఆ పని తగినంత చేస్తున్నాయా..? ఇక్కడ ప్రత్యేకించి వామపక్షాల గురించే మాట్లాడడమెందుకంటే.. చేయాల్సింది వారే కాబట్టి. బూర్జువా రాజకీయ పార్టీలు ఇలాంటి విషయాలు పట్టించుకోవు. వారు నోట్లు పంచి ఓట్లు దండుకునే పనిలో తీరిక లేకుండా ఉంటారు. అధికారం చేజిక్కించుకోవడానికి దిగజారిన రాజకీయాలు చేస్తూ ఊపిరి సలపనంత బిజీగా ఉంటారు. వారితో ప్రజా చైతన్య కార్యక్రమాలు జరుగుతాయని ఊహించలేం.
బూర్జువా నాయకుల ప్రకటనలు - పనితీరు ఏవిధంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. అయినా ఇక్కడ కొన్ని విషయాలు గుర్తుచేస్తున్నాను. 2019లో రామమందిరం కట్టలేకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నాడు సాక్షి మహరాజ్. రామమందిరం కట్టిందీ లేదు. ఆయన రాజకీయాలు వదిలి వెళ్ళిందీ లేదు. 2018లోపు గంగానదిని శుభ్రం చేయించలేక పోతే జల సమాధి చేసుకుంటానన్నది - ఉమాభారతి. గంగానదిని శుభ్రం చేయించిందీ లేదు. ఆమె తనను తాను జల సమాధి చేసుకున్నదీ లేదు. వందరోజుల్లో నల్లధనం వెలికితీయలేకపోతే నన్ను ఉరితీయండి! అని అన్నాడు ఈ దేశ ప్రధాని. ఆ ప్రధాని పీఠంమ్మీద ఇప్పటికి 7-8ఏండ్లుగా కూర్చున్నా, ఆ పనిచేయలేక - నిస్సహాయుడిగా మిగిలిపోయాడు. పైగా ప్రతి భారతీయుడి అకౌంట్ల్లో పదిహేను లక్షలు వేస్తానన్న ఆ పెద్ద మనిషి నిజాయితీని.. ఏమని పిలుద్దాం? బీజేపీ పాలిత రాష్ట్రాల్లో హత్యలు / లైంగిక దాడులు / కిడ్నాపులు / దళితులపై దాడులు అత్యధిక సంఖ్యలో ఉన్నాయి. వాటికి బాధ్యులైనవారు, దేశ ప్రజలనుద్దేశించి వివరణలు ఇవ్వాలి కదా? మరి ఏమైందీ?
దేశంలో పన్ను చెల్లింపుదారుల డబ్బును వివిధ బ్యాంకుల్లోంచి దోచుకుని పారిపోయిన భారతీయ వ్యాపారవేత్తలు ముఖ్యంగా ఇరవై ఎనిమిది మంది ఉన్నారు. వీరిలో ఎవరూ ముస్లింలు లేరు, దళితుల్లేరు, బహుజనుల్లేరు. పోనీ నక్సలైట్లో, అర్బన్ నక్సల్సో ఉన్నారా అంటే వాళ్ళు కూడా లేరు. కేవలం గుజరాత్‌కు చెందినవారే ఉన్నారు. వారంతా కలిసి దోచుకున్నది పదిలక్షలు కాదు. పదిలక్షల కోట్లు 'మాత్రమే'? మరి ఈ దేశ కాపలాదారు ఏమయ్యాడూ? దేశీయ సంస్థల్ని ప్రయివేటు వారికి అమ్ముకుంటూ దేశమంతా తిరుగుతున్నాడా? పెంచిన గడ్డానికో మాస్క్ తగిలించుకుని, ఎలక్షన్ ర్యాలీలు తీస్తూ, కుంభమేళాలు జరిపిస్తూ కరోనా వ్యాప్తిలో తలమునకలై ఉన్నాడా? ఏం చేస్తున్నట్టూ? ప్రతి ఎకౌంట్లో పదిహేను లక్షలు వేయడం తర్వాతి మాట. ముందు సగటు మనిషి ఎకౌంట్లో మూడు నాలుగు వేలు కూడా లేకుండా చేయడానికి పథకాలు రచిస్తున్నాడా? మిగతా పాలకులు ఏమయ్యారూ? దేశం చుట్టూ ఉన్న మూడు సముద్రాల్లో ఈ దేశాన్ని ఏ సముద్రంలో ముంచబోతున్నారూ?
దేశాన్ని ముంచిన వ్యాపారవేత్తల పేర్లు: 1. విజమాల్యా 2. మెహుల్ చోక్సీ 3. నీరవ్ మోడి 4. నిషన్ మోడి 5. పుష్పేష్ బైద్య 6. ఆశిష్ 7. సన్నీ కల్రా 8. ఆర్తి కల్రా 9. సంజరు కల్రా 10. వర్షా కల్రా 11. సుధీర్ కల్రా 12. జతిన్ మెహతా 13. ఉమేష్ పరిఖ్ 14. కమలేశ్ పరిఖ్ 15. నిలేశ్ పరిఖ్ 16. వినయ మిట్టల్ 17. ఏకలవ్యా గార్గ్ 18. చేతన్ లాల్ 19. నితిన్లాల్ 20. దీప్తి బెన్ చేతన్ 21. సవియా సేట్ 22. రాజీవ్ గోయెల్ 23. అల్క గోయెల్ 24. లలిత్ మోడి 25. రితేష్ జైన్ 26. హితేశ్ పటేల్ 27. మయూరి బెన్ 28. ఆశిష్ భారు.. పారిపోయే దొంగల్ని చౌకీదార్ నిలదీయలేదంటే, పట్టుకోలేదంటే, విజిలేసి, నలుగుర్ని కేకేసి గోల గోల చేయలేదంటే ఏమిటి అర్థం? చౌకీదార్ దొంగలతో లాలూచీ పడ్డాడని కదా అర్థం? ఇక్కడ ఒక్క చౌకీదారంటే చౌకీదారనే కాదు. ఆ స్థానంలో ఉన్న వ్యవస్థలు / ప్రభుత్వాధి నేతలు అందరికందరూ ధోషులేనన్నది ఈ దేశ ప్రజల తీర్పు. అయితే దానికి కారణం చౌకీదార్ - అతని టీమ్ మాత్రమే కాదు. అనాలోచితంగానో, డబ్బుకు ఆశపడో అనర్హులను / అసమర్థులను ఎన్నుకున్న తప్పు ఎవరిదీ? మనది కాదా? ఎవరికి వారు ఆలోచించాలి!
ఈ దేశ ప్రజలుగా మనం చేస్తున్న దుర్మార్గమైన పని ఏమిటంటే అవివేకుల్నీ, అవినీతిపరుల్నీ పలుమార్లు గెలిపిస్తాం. తీవ్రవాద ఆరోపణులున్నవారినీ గెలిపిస్తాం. ఇళ్ళలో దూరి దౌర్జన్యాలు చేసే గూండాలను గెలిపిస్తాం. అసెంబ్లీలో కూర్చుని నీలిచిత్రాలు చూసే హీనుల్నీ గెలిపిస్తాం. ఇక రేపిస్ట్లనైతే చాలా ఘనంగా గెలిపిస్తాం. ఇలాంటి పనికిమాలిన వాళ్ళని గెలిపించి - ఆపైన లబోదిబోమంటుంటాం. ఇవన్నీ అవసరమా? విద్యావంతులకు, వివేకవంతులకు, సమర్థులకు, నీతినిజాయితీ, నిబద్దతా గల యువతీ యువకులకు దేశంలో కొదవ లేదు. దేశాన్ని కాపాడుకోవడానికి వీళ్ళంతా బయటికి రావాలి. ధైర్యంగా ప్రస్థుత పరిస్థితుల్ని ఎదుర్కోవాలి! జనం వారికి అండగా నిలబడి గెలిపించాలి. దేశం బాగుపడాలంటే అదొక్కటే మార్గం.
అయినా తరతరాలుగా మెదళ్ళలో కులమతాల, వర్గ వర్ణాల, లింగ రంగు బేధాల మకిలి పేరుకు పోయి ఉంటే - వివేకం, సమానత్వం ఎలా సాధ్యం? సైన్సు గాడ్జెట్లు వాడుతున్నాం కదా? ఇక ఆధునికులమై పోయినట్టే అని అనుకుంటే అది బుద్ధితక్కువే అవుతుంది. పైగా ప్రతి పనికిమాలిన వాడూ మనోభావాల గూర్చి మాట్లాడటం ఫ్యాషనైపోయింది. ఏదో ఇతరులెవ్వరికీ మనోభావాలు ఉండవన్నట్టు - అందువల్ల కొంచెం ఇంగిత జ్ఞానాన్ని ఉపయోగించి - హేతుబద్దంగా ఆలోచించడం ప్రారంభిస్తే, వైజ్ఞానిక స్పృహ అంటే ఏమిటో తెలుస్తుంది. అది తెలిసిన వారిని మనో భావాలు బాధించవు. ప్రతి విషయాన్నీ మనోబలంతో విశ్లేషించుకో గలిగే స్థోమత వస్తుంది. స్థాయి పెరుగుతుంది.
వ్యాసకర్త: సుప్రసిద్ద సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త.
- డాక్టర్ దేవరాజు మహారాజు