Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశంలోని చేనేత కార్మికులను గౌరవించటానికి, భారతదేశం యొక్క చేనేత పరిశ్రమను అభివద్ధి పరుచటానికి ఏటా ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటాం. బ్రిటిష్ ప్రభుత్వ బెంగాల్ విభజనకు నిరసనగా 1905లో కలకత్తా టౌన్ హాల్లో ఈ రోజు ప్రారంభించిన స్వదేశీ ఉద్యమానికి గుర్తుగా ఆగస్టు 7 తేదీని జాతీయ చేనేత దినోత్సవంగా ఎంచు కోవడం జరిగింది. ఈ ఉద్యమం దేశీయ ఉత్పత్తులు, ఉత్పత్తి ప్రక్రియలను పునరుద్ధరించడం లక్ష్యంగా పెట్టుకుంది. మనం కూడా వీలైనంత వరకు చేనేత బట్టలను ఉపోయోగించాలి. అగ్గి పెట్టెలో ఇమిడే చీరను నేసి ప్రపంచానికి చేనేత కళావైభవాన్ని చాటి చెప్పిన ఘనత మన నేతన్నలది. చేనేత రంగంలో అంతటి ఖ్యాతి గడించిన వాళ్లు నేడు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. గిట్టుబాటు లేక బతుకు చిరిగిన వస్త్రమైంది. మగ్గాలు మరణశయ్యపై ఉన్నాయి. ప్రభుత్వం కరుణించి తమ జీవితాల్లో వెలుగులు నింపాలని వారు వేడుకుంటున్నారు. మానవాళికి వస్త్రాన్ని అందించి నాగరికతను నేర్పిన చేనేత రంగం కష్టాలు కన్నీళ్ల కలబోత అయింది. దేశంలో వ్యవసాయ రంగం తర్వాత రెండోస్థానాన్ని ఆక్రమించిన చేనేత రంగంలో కనీస వేతనాలు లేవు. ఈ రంగంలో కాలానుగుణంగా మార్పులు వస్తున్నా కార్మికుల ఆకలి తీరడం లేదు. ప్రపంచానికి మన చేనేత కళావైభవాన్ని చాటిచెప్పిన నేతన్నలు అర్థాకలితో అలమటి స్తున్నారు. చేనేత స్థానంలో మరమగ్గాలు, ఆధునిక మగ్గాలు వచ్చినా.. శ్రమించే చేతులకు మిగిలేది శూన్యం.
కరోనా సమయంలో గడ్డు కాలం...
ఇప్పటికే దారుణ పరిస్థితుల్లో ఉన్న వత్తులను లాక్డౌన్ మరింత ప్రమాదంలోకి తోసింది. చేనేత, మరనేత రంగాలు ఇప్పుడు ఇదే ఇబ్బందుల్లో ఉన్నాయి. లాక్డౌన్ వల్ల బట్టల వ్యాపారం పూర్తిగా ఆగిపోయింది. లాక్డౌన్ తరువాత కూడా పాత వేగంతో ముందుకెళుతున్న జాడ లేదు. దీని ప్రభావం నేత కార్మికులపై తీవ్రంగా ఉంది. ప్రస్తుతం నేత కార్మికులుగా పిలుస్తున్న వారిలో రెండు రకాలు ఉంటారు. ఒకరు చేతితో మగ్గంపై నేసే చేనేత కార్మికులు. రెండోవారు, మర మగ్గాల మీద నేతనేసేవారు. వీరినే మరనేత కార్మికులు అంటున్నారు. లాక్డౌన్ ఇప్పుడు ఇద్దర్నీ ఇబ్బంది పెడుతోంది. పెళ్లిళ్ల సీజన్లు, రెగ్యులర్గా వచ్చే ఆర్డర్లు అన్నీ పోయాయి. ఒక అంచనా ప్రకారం ఒక్క తెలంగాణలోనే చేనేత కార్మికుల దగ్గర వంద కోట్ల రూపాయల విలువైన వస్త్రాలు ఉండిపోయాయి. తెలంగాణలో సగటున నెలకు 40-50 కోట్ల రూపాయల విలువైన చేనేత వస్త్రాలు ఉత్పత్తి అవుతాయి. వాటిలో సగం పట్టు చీరలే. ఇప్పటి వరకూ నేత కార్మికులు తమ దగ్గర ముడి సరుకు ఉన్నంత వరకూ పనిచేశారు. లాక్డౌన్ వల్ల మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్నాటకల నుంచి వచ్చే ముడిసరుకు ఆగిపోయింది. దీంతో పని ఆపేయాల్సి వచ్చింది. మిగతా వారిలా కాకుండా, పని ఆగిపోతే ఉత్పత్తి ఆగిపోతుంది. ఉత్పత్తి, కొనుగోలు లేకపోతే వీరికి రోజు గడవడమే ఇబ్బంది అయిపోతుంది.
1924లో గాంధీ ఒక చోట మాట్లాడుతూ.. ''దేశంలో మన వస్త్ర అవసరాలన్నిటినీ మిల్లు ద్వారా తయారైన వస్త్రాల ద్వారా కాకుండా చేతితో వడికే నూలు పరిశ్రమ నుంచి, చేనేత పరిశ్రమ నుంచీ భర్తీ చేసుకోవాలి'' అని ప్రభోధించారు. అయితే, స్వాతంత్య్రానంతరం భారత ప్రభుత్వాలు చేపట్టిన విధానాలు పెట్టుబడిదారీ కేంద్రంగా ఉండటంతో చేనేత పరిశ్రమ అట్టడుగు నేత కార్మికుల చేతిలో నుంచి సంపన్న వర్గాల కనుసన్నలలో నడిచే స్థితికి నెట్టబడింది. ఇదే సమయంలో మన దేశ ప్రభుత్వాలు భారతీయ చరిత్ర, వారసత్వం, సంస్కృతిలో చేనేత పరిశ్రమ గొప్పతనం చాటుతూనే చేనేత పరిశ్రమ అభివృద్ధి, కార్మికుల ప్రయోజనాలు కాపాడటంలో విఫలమవు తున్నాయి. వినియోగదారుల అభిరుచులకు తగిన రీతిలో వస్త్రోత్పత్తులు చేయడంలో నేతన్నలు నైపుణ్యాలు పెంచుకోవాలని చెబుతూనే విదేశీ అతిధులకు బహుమతులుగా చేనేత వస్త్రాలను అందించడం ప్రభుత్వాల ద్వంద వైఖరికి నిదర్శనం. నేతన్నను అదుకొని ప్రభుత్వాలే, నేరుగా చేనేత వస్త్రాలు కోనుగోలు చేసి, వారి అభివృద్ధికి కృషి చేయాలి.
చేనేత వస్త్రాల్ని దరిద్దాం... నేతన్నకు అండగా ఉందాం...
- జాజుల దినేష్
సెల్:9666238266