Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఫ్‌ు అధినేత మోహన్ భగవత్, ఆరెస్సెస్ అనుబంధ సంస్థ అయిన 'రాష్ట్రీయ ముస్లిం మంచ్' నిర్వహించిన (ఖ్వాజా ఇఫ్తార్ అహమ్మద్ రచించిన ''ద మీటింగ్ ఆఫ్ మైండ్స్:ఏ బ్రిడ్జింగ్ ఇనీషియేటివ్'') పుస్తకావిష్కరణ సభలో మాట్లాడుతూ ''చర్చలు మాత్రమే సమస్యలకు పరిష్కారమనీ, ముస్లింలకు భారతదేశంలో స్థానంలేదనే వారు హిందువులు కారనీ, గోరక్షణ పేరుతో మైనారిటీలను హత్యలు చేసేవారు హిందూ మతానికి వ్యతిరేకమని'' అన్నాడు. భవిష్యత్తులో ఇస్లాం మతం గురించి భయపడుతున్న వారికి ఉపశమనంగా, ఇస్లాం మతానికి ఏ ప్రమాదమూ ఉండదనీ, 40 వేల సంవత్సరాల నుండి భారతీయు లందరిదీ ఒకే డీఎన్ఏ అనే వాస్తవాన్ని గ్రహించి, భారతదేశాన్ని 'విశ్వగురువు' ను చేయడంలో ముస్లింలు ఆరెస్సెస్‌కు సహకరించాలని కోరాడు. హిందూ, ముస్లింల మధ్య అపనమ్మకాలు లేకుండా నిష్కపటంగా ఉండాలని కోరాడు. కానీ ముస్లింలు, భారతదేశాన్ని తమ మాతభూమిగా గుర్తించి, దాని సంస్కృతీ, సంప్రదాయాలను అంగీకరించి, అందరికీ చెందిన ఉమ్మడి పూర్వీకులను గౌరవిస్తేనే, చర్చల ద్వారా మత సామరస్యం సాధ్యమవుతుందనీ, ఎవరి భారతీయత గుర్తించబడాలన్నా, ఈ మూడు కనీస అవసరాలు తీరాల్సిందేనని మోహన్ భగవత్ అన్నాడు. ఈ మొత్తం ఉపఖండాన్ని తన పితృభూమిగా పరిగణించే వ్యక్తిని హిందువుగా నిర్వచించే వీడీ సావర్కర్ విశ్వాసాల సమాహారమే భారతీయత, హైందవీకరణలను మిళితం చేసే ఈ ప్రయత్నం. మూడు నిబంధనలైన ఒకే దేశం, ఒకే జాతి, ఒకే సంస్కృతి హిందూ జాతికి చిహ్నంగా ఉంటాయి. ఈ మూడింటి పైనే హిందూత్వ ఆధారపడి ఉంటుంది.
ముస్లింలు, భారతదేశంలోకి దూకుడుగా ప్రవేశించినప్పటికీ, శాంతియుతంగానే జీవిస్తున్నారన్న వాస్తవాన్ని ప్రజలు తెలుసుకోవాలని మోహన్ భగవత్ అంటాడు. 711 సీఈలో రాజా దాహీర్ నుండి సింధ్, ముల్తాన్‌లను అదుపులోకి తీసుకున్న మహమ్మద్ గజనీ, మహమ్మద్ ఘోరీ, మహమ్మద్ ఖాసీం లాంటి దురాక్రమణ దారుల దాడుల కంటే ముందే ముస్లింలు ఉపఖండంలోకి ప్రవేశించారనే విషయాన్ని మోహన్ భగవత్ తెలుసుకొని ఉండాల్సింది. 630 సీఈలో ఇస్లామీకరణ స్వీకరించిన అరబ్బు వ్యాపారులు కొంకణ్, గుజరాత్, మలబార్ లాంటి కోస్తా ప్రాంతాలకు (వారికి ఇస్లాం కాలానికి ముందే భారతదేశంతో ఉన్న వాణిజ్య సంబంధాల కొనసాగింపుగా) రావడం ప్రారంభించిన ఫలితంగా భారతదేశంలో ఇస్లాం సంస్కృతి, ఇస్లాం మతం వ్యాప్తి చెందింది. నేడున్న భారతీయ ముస్లింలంతా ఇస్లాం మతంలోకి మారిన స్థానికుల వారసులే. ఆ విధంగా వారు భారతదేశాన్ని మాతృభూమిగా పరిగణిస్తూ, దాని సంస్కృతి, సాంప్రదాయాలను, భిన్నత్వాన్ని గౌరవించారు. దేశ విభజన సమయంలో పాకిస్థాన్‌లో కాకుండా భారతదేశంలో ఉండేందుకే ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా వారి దేశభక్తిని రుజువు చేసుకున్నారు. విభజనకు ముందు, ముస్లింలకు ప్రత్యేక దేశాన్ని, మహమ్మద్ అలీ జిన్నా కోరితే, ఈ డిమాండ్‌ను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో అల్లా బక్ష్ ఒక భారీ సదస్సును నిర్వహించాడు. రాజకీయంగా మెజారిటీ హిందువులు గాంధీని అనుసరిస్తే, మరొక హిందువు, శిక్షణ పొందిన ఆరెస్సెస్ ప్రచారక్ నాథూరాం గాడ్సే గాంధీని హత్య చేశాడు. గాంధీ, నెహ్రూ, పటేల్, అబుల్ కలాం ఆజాద్‌లు ప్రాతినిధ్యం వహించిన భారత జాతీయవాదాన్ని, హిందూ మహాసభ, ఆరెస్సెస్‌లు ప్రతిపాదించిన హిందూ జాతీయవాదం, జిన్నా తదితరులు ప్రతిపాదించిన ముస్లిం జాతీయవాదాలు వ్యతిరేకించాయి.
ముస్లింలీగ్, పంజాబ్ హిందూ సభ, హిందూ మహాసభ, ఆరెస్సెస్‌లు వలసవాద వ్యతిరేక పోరాటంలో లేక సమానత్వం కోసం జరిగిన సామాజిక సంస్కరణోద్యమాలలో పాల్గొనలేదు. భారతదేశం ప్రాచీన కాలం నుంచి హిందూ దేశమనీ, భారతీయ సమాజంలో అన్ని కులాలవారు సమానంగా ఉండేవారనీ, మహిళలకు ఆ సమాజంలో గొప్ప స్థానం ఉండేదనీ, ముస్లింల దండయాత్రలతో భారతీయ సమాజం బాధలకు గురయ్యేదని ఆరెస్సెస్ శిక్షణా తరగతుల్లో యువతకు బోధించేవారు. ముస్లిం రాజులు కత్తులతో ఇస్లాం మతాన్ని వ్యాప్తి చేసి, దేవాలయాలను ధ్వంసం చేసి, ముస్లిమేతరుల పైన జిజియా పన్ను విధించి, హిందూ మహిళలను లైంగిక వేధింపులకు గురి చేసేవారని, చరిత్రను వక్రీకరించి చెప్పేవారు. కొంతమంది సుల్తానులు, మొగల్ పాలకులు దేవాలయాల విధ్వంసానికి పాల్పడ్డారనేది నిజం. వారి శత్రువుల పోషణలో ఉంటూ, రాజకీయంగా, కొన్ని అంశాలకు ప్రతీకగా ఉండి ప్రాధాన్యత ఉన్న దేవాలయాలను వారు లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ అదే సమయంలో ఔరంగజేబుతో సహా మొగల్ పాలకులు అనేక దేవాలయాలను పోషించి, అర్చకులను ఆర్థికంగా ఆదుకున్నారు. బ్రజ్ ప్రాంతంలో, వైష్ణవ నాథ సాంప్రదాయాలను పాటించే అనేక దేవాలయాలను మొఘలులు పోషించారు.
ఇది విస్మరించి ఆరెస్సెస్ నాయకులు ముస్లింలు, క్రిస్టియన్లకు వ్యతిరేకంగా ద్వేషభావాలను వ్యాప్తి చేస్తూ, భారత రాజ్యాంగం కల్పించిన సమానత్వ భావనలకు వ్యతిరేకమైన మనువాద సిద్ధాంతాన్ని కీర్తిస్తున్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక, ఆరెస్సెస్ శాఖల సంఖ్యను పెంచింది. బీజేపీ రాజకీయాలకు కీలకమైన సంస్థలుగా ఉన్న విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ లాంటి అసంఖ్యాకమైన హిందూత్వ సంస్థలకు హిందూ జాతీయవాదంలో శిక్షణ ఇస్తున్నారు.
ముస్లిం మత పెద్దలతో చర్చలు జరిపి ఒక నూతన ఆవిష్కరణకు తెర తీయడం చాలా ముఖ్యమైన విషయమే. కానీ ముస్లిం వ్యతిరేక భావోద్వేగాలను ప్రచారం చేయడం, ప్రోత్సహించే సమయంలో అది సాధ్యమా? ఉదా:- కరోనా వైరస్‌ను వ్యాప్తి చేశారని తబ్లిగీ జమాత్పైన ఆరోపణలు చేశారు. ముస్లింలకు వ్యతిరేకంగా ఈ ప్రచారం జరిగినప్పుడు మోహన్ భగవత్ సిద్ధాంతం ఎటువంటి పాత్రను పోషించింది? ఆయన సమర్థించిన పౌరసత్వ సవరణ చట్టం, ఎన్నార్సీ లాంటి అనవసర చర్యలు భారతీయ ముస్లింలలో ఒక అభద్రతను సృష్టించాయి. ముస్లింలు భారతదేశం విడిచి వెళ్ళాలని అనేవారు హిందువులు కారని భగవత్ పేర్కొన్న మరుసటిరోజే పౌరసత్వానికి సంబంధించిన ప్రభుత్వ చర్యలను నిరసించిన వారిని కాల్చివేయాలని సూచించిన వారికి పదోన్నతులు కల్పించారు. మత ఘర్షణలకు సంబంధించి ముస్లింలు వేల కోట్ల విలువైన ఆస్తులను కోల్పోతున్నా, విధ్వంసకారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయరు. విధ్వంసం సృష్టించి, హింసకు పాల్పడి, గ్యాంగ్ రేప్‌లు చేసిన వారు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. కానీ రాజ్యాంగం కల్పించిన నిరసన తెలిపే హక్కును వినియోగించుకుంటే జరిమానాలు విధిస్తారు, పోలీసుల కాల్పుల్లో చంపుతారు. ఇలాంటి తరుణంలో చర్చలు సాధ్యమేనా? మహాత్మా గాంధీ 'హింద్ స్వరాజ్'లో మత ఘర్షణల గురించి ఈ విధంగా పేర్కొన్నాడు.
''హిందువులు, ముస్లింల పాలనలో, ముస్లింలు, హిందువుల పాలనలో అభివృద్ధి చెందారు. ఒకరినొకరు పోట్లాడు కోవడం ఆత్మహత్యా సదృశ్యమని భావించి, శాంతియుతంగా సహజీవనం చేయాలని నిర్ణయించారు. ఆంగ్లేయుల రాకతో మళ్ళీ అల్లర్లు మొదలయ్యాయి. ప్రజలు మతాన్ని మార్చుకోవడం తోనే శత్రువులుగా మారిపోతారా? ముస్లింల దేవుడు, హిందువుల దేవుడు ఒకరికొకరు భిన్నమైనవారా? మతాలనేవి భిన్నమైన మార్గాల ద్వారా ఒకే గమ్యానికి చేరే విశ్వాసాలు''. ఈ రోజు మనం ఎక్కడున్నాం? హింసకు మూలకారణాలను వదిలేసి మోహన్ భగవత్ మాట్లాడుతున్నాడు.
టోనీ జోసెఫ్ పరిశోధనా వ్యాసాలు, విభిన్న వంశపారంపర్యాలు, వలస చరిత్రల ద్వారా పొందిన సంస్కృతి, సాంప్రదాయాలు, అలవాట్లున్న భారతీయులు విభిన్న వనరుల ద్వారా నాగరికతలు కలిగి ఉన్నారని రుజువు చేశాయి. 2000 బీసీఈ తరువాత ఆర్యులు, ఆస్ట్రోఆసియాటిక్, టిబెట్-బర్మా భాషలు మాట్లాడే వారు, ఆ తరువాత గ్రీకులు, యూదులు, హన్లు, శాకాలు, పారశీలు, సిరియన్లు, పోర్చుగీసు వారు, బ్రిటిష్ వారు, సిద్దీలు వచ్చి ఉపఖండంలో తమ తమ గుర్తులను వదిలి వెళ్ళారు. ఇదీ వాస్తవ పరిస్థితి. భారతదేశం హిందువుల దేశం, లేదా ముస్లింల దేశం అని మాట్లాడే అవకాశమే లేదు. ఈ దేశం, ఇక్కడ నివసించే వారందరిదీ.
- బోడపట్ల రవీందర్
సెల్: 9848412451