Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ఆగస్టు 9 ఒక ముఖ్యమైన రోజు. 1942వ సంవత్సరంలో ఇదే ఆగస్టు 9న 'డు ఆర్ డై' పిలుపునందుకుని బ్రిటిష్ సామ్రాజ్యవాదులు దేశం విడిచిపోవాలని డిమాండ్ చేస్తూ 'క్విట్ ఇండియా' నినాదంతో లక్షలాది మంది ప్రజలు రోడ్లమీదకు వచ్చారు. ఈ ఏడాది ఆగస్టు 9 నాటికి దేశం 75 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి సిద్ధమవుతున్నది. కార్మికులు, రైతులు, ఇంకా అనేక ఇతర శ్రామిక ప్రజల కఠోర శ్రమ ఫలితంగా దేశం అనేక రంగాలలో అభివృద్ధిని సాధించినప్పటికీ, ఆ అభివృద్ధి ఫలాలు శ్రామిక జనులకు అందలేదు. దీనికితోడు మూడు దశాబ్దాల క్రితం అధికారికంగా ప్రారంభించిన నయా ఉదారవాద విధానాలు కష్టజీవులు పోరాటాలతో త్యాగాలతో సాధించిన కొద్దిపాటి విజయాలను సైతం లాగేసుకుంటున్నవి. ప్రభుత్వరంగ పరిశ్రమల ద్వారా మనం సాధించిన ఉత్పత్తి సామర్థ్యాన్ని, స్వావలంబనను నిర్వీర్యం చేస్తున్నవి. దేశ సంపదగా ఉన్న ప్రభుత్వరంగాన్ని, సహజవనరులను దేశానికి, విదేశాలకు చెందిన ప్రయివేటు కార్పొరేట్ల చేతిలో పెడుతున్నవి.
కేంద్రంలో మోడీ నాయకత్వాన బీజేపీ ప్రభుత్వం అధికారానికి వచ్చింది మొదలు ఈ ప్రయివేటీకరణ తతంగం మరింత ఊపందుకున్నది. ఈ ప్రక్రియ కరోనా మహమ్మారి సమయంలో తారాస్థాయికి చేరింది. కరోనా మహమ్మారిని, దానితో వచ్చిన లాక్‌డౌన్‌నూ నయాఉదారవాద ప్రక్రియను వేగవంతం చేసేందుకుగాను 'దేవుడు ఇచ్చిన' అవకాశంగా మోడీ ప్రభుత్వం భావించింది. ఈ సమయంలో కోట్లాదిమంది ప్రజలు ఉపాధి కోల్పోయి, ఆదాయాలు నష్టపోయి అంతులేని కష్టాల బారిన పడితే, మోడీ ప్రభుత్వం వారికి ఉపశమనం కలిగించడానికి ఎటువంటి ప్రయత్నమూ చేయలేదు. పైగా, దేశ, విదేశీ కార్పొరేట్ వర్గాలు దేశాన్ని దోచుకోవటానికి ప్రోత్సాహకరంగా ఉండే అనేక చర్యలు చేపట్టింది. సమృద్ధిగా మందులను, ప్రాణవాయువు అందించే పరికరాలను సమకూర్చి ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయటం పట్ల, అనేక మరణాలను, లక్షలాదిమంది ప్రజల కష్టాలను తొలగించే విధంగా వ్యాక్సిన్ ఉత్పత్తిని వేగవంతం చేయడం పట్ల మోడీ ప్రభుత్వం నేరపూరిత నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. ఈ కాలంలోనే సన్నకారు రైతాంగం పునాదిగా ఉన్న వ్యవసాయాన్ని కార్పొరేట్ రంగ వ్యవసాయంగా మార్చే వ్యవసాయ చట్టాలను చేసింది. ఈ కాలంలోనే కార్మికుల ప్రాథమిక హక్కు అయిన సంఘ హక్కును, సమిష్టిగా పోరాడే హక్కును తొలగిస్తూ లేబర్ కోడ్లను ఆమోదించింది. మొత్తం ప్రభుత్వరంగ నాశనానికి బాటలు వేసింది. నగదు బదిలీ ద్వారా, ఉచితంగా ఆహార ధాన్యాలు అందించడం ద్వారా ప్రజలకు ఉపశమనం కలిగించడానికి మూర్ఖంగా నిరాకరించిన ఈ ప్రభుత్వం, ఆశ్రిత కార్పొరేట్లకు మాత్రం భారీ ఎత్తున పన్ను రాయితీలు ఇచ్చి అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి పట్ల తనకున్న నీచమైన బానిసబుద్ధిని ప్రదర్శించింది. నయాఉదారవాద విధానం అంగీకరించనప్పటికీ, అభివృద్ధి చెందిన అనేక పెట్టుబడిదారీ దేశాలు, తమ దేశాలలో డిమాండ్ పెరిగి ఆర్థిక వ్యవస్థ ఉత్తేజపడటానికి గాను నగదుబదిలీని ఆశ్రయించాయి. ఇక్కడ మోడీ ప్రభుత్వం మాత్రం దానికి సిద్ధ పడలేదు. పైగా ఆర్థిక వ్యవస్థ సాధారణ స్థాయికి తిరిగి చేరుకున్నదని అబద్ధాలు చెప్పింది.
ఒక అంచనా ప్రకారం ఈ కాలంలో 23 కోట్ల మంది ప్రజానీకం కనీస వేతనస్థాయి నుంచి దిగువకుపడి, పేదరికంలో కూరుకుపోయారు. 2020 ఏప్రిల్ నెలలో ప్రతిగంటకు ఒక లక్షా 70 వేల మంది ప్రజలు తమ ఉపాధిని కోల్పోయారు. ఆకలి, పేదరికం పెరిగిపోయాయి. పోషకాహార లోటు పెరిగింది. ముఖ్యంగా చిన్నపిల్లలలో ఈలోటు తారాస్థాయిలో ఉంది. గత ఏడాది కాలంలో దారిద్య రేఖకు దిగువన బ్రతికీడుస్తున్న పేదల సంఖ్య 6 కోట్ల నుంచి 13.4కోట్లకు పెరిగిందని ఫ్యూ రీసెర్చ్ సెంటర్ అంచనా వేసింది. 59.3శాతం మంది మధ్యతరగతి ప్రజలు పేదరికంలోకి దిగజారారు.
మరోవైపున ఈ లాక్డౌన్ కాలంలోనే భారతదేశపు శతకోటీశ్వరులు సంపద 35శాతం పెరిగింది. దేశవ్యాపితంగా లాక్‌డౌన్‌ను ప్రకటించిన మార్చి 2020 నుంచి దేశంలో అత్యంత ధనవంతులుగా పైనున్న 100మంది శతకోటీశ్వరుల సంపద రూ.13లక్షలు కోట్లు పెరిగింది. కరోనా కాలంలో మనదేశంలోని 11 మంది బిలియనీర్లకు పెరిగిన సంపదతో ఏకంగా 10ఏండ్ల పాటు గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నడపవచ్చు. మహమ్మారి కాలంలో పెరిగిన 11మంది బిలియనీర్ల సంపదపై ఒక శాతం పన్నువేసినట్టయితే మన ప్రజలకు మందులను చౌకగా అందుబాటులో ఉంచే జన ఔషధీ పథకానికి నిధుల కేటాయింపును 140 రెట్లు పెంచవచ్చు.
భౌగోళికంగా నయా ఉదారవాద విధానాలను అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి శాసిస్తున్నది. అందులో భాగంగానే మన దేశంలో కూడా నయా ఉదారవాద విధానాలు అమలు చేయబడుతున్నాయి. ఈ విధానాల ప్రధాన ఉద్దేశం పెట్టుబడిదారీవర్గం కార్మికులపై ఎటువంటి అడ్డు అదుపులేని దోపిడీ సాగించటం, గరిష్ఠ స్థాయిలో లాభాలు తోడుకోవడం, ప్రభుత్వరంగ ఆస్థులను, సర్వీసులను, సహజ వనరులను హౌల్ సేల్‌గా ప్రయివేటీకరణ చేయడం ద్వారా తమకు బదలాయించుకోవటం. నయా ఉదారవాద విధానాల అమలు మొదలయినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ధనికుల మీద పన్నులు తగ్గుతూ వస్తున్నాయి. కార్మికుల మీద, వారి సమిష్టి శక్తికి కారణమైన కార్మిక సంఘాల మీద దాడులు పెరుగుతున్నాయి.
కార్మికుల వేతనాల మీద, వారి పని నిబంధనల మీద, కార్మిక సంఘాల మీద దాడులు జరిపినప్పటికీ, ప్రస్తుత వ్యవస్థీకృత సంక్షోభం నుంచి ప్రపంచం బయటపడలేకుండా ఉంది. నయా ఉదారవాద విధానాల దివాలా కోరుతనాన్ని ఇది తెలియజేస్తున్నది. వాస్తవానికి ఈ విధానాల మూలంగా భారీగా సంపద పెరిగినప్పటికీ ప్రజల ప్రాథమిక అవసరాలు, ఆశలు తీర్చటంలో పెట్టుబడిదారీ విధానం యొక్క అసమర్థత మరింత ఎక్కువగా గ్రహింపునకు వస్తున్నది.
అయినా, ప్రపంచవ్యాప్తంగా అప్రతిష్ట పాలైన ఈ నయా ఉదారవాద విధానాలనే మోడీ ప్రభుత్వం మూర్ఖంగా అనుసరిస్తున్నది. ఈ విధానాల అమలుపట్ల వచ్చే వ్యతిరేకతను అధికారమదంతో, నిరంకుశ చర్యలతో అణచివేయాలని చూస్తున్నది. దుర్మార్గమైన రాజద్రోహ చట్టం, ఉపా మొదలైన చట్టాలను ఉపయోగించి అసమ్మతిని వినిపించే గొంతుకలను నొక్కి వేయటం, ఎస్సెన్షియల్ డిఫెన్స్ సర్వీసెస్ ఆర్డినెన్స్‌ను ఉపయోగించి సమ్మెలను నిషేధించడం వలసపాలన కాలం నాటి రోజులను గుర్తుకు తెస్తున్నది. ప్రభుత్వాన్ని, దాని అధినేతలను దేశంతో సమానం చేసి వారిని వ్యతిరేకించినవారిని పాలనా యంత్రాంగంలోని వివిధ విభాగాల ద్వారా భయపెడుతున్నారు. జర్నలిస్టులను, మేథావులను, ప్రజాకార్యకర్తలను జైళ్లలోకి తోసి, బెయిల్ నిరాకరిస్తున్నారు.
'విజయమో లేక మరణమో' అన్నట్టుగా ఇంగ్లీష్ వారిని 'క్విట్ ఇండియా' అని నినదిస్తూ దేశ స్వాతంత్రం కోసం పోరాడిన ప్రజల ఆశలపై బీజేపీ ప్రభుత్వం నీళ్లు చల్లుతున్నది. ఆర్థిక దోపిడీలేని, సామాజిక అణచివేతలేని స్వతంత్ర భారతదేశాన్ని గురించి ప్రజలు కలగన్నారు. ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా లాంటి మభ్యపుచ్ఛే నినాదాలతో మోడీ ప్రభుత్వం దేశాన్ని, దేశ ప్రజలను ఆశ్రిత దేశ, విదేశ గుత్తపెట్టుబడిదారుల చేతుల్లో పెడుతున్నది. మన కార్మికులను తిరిగి వలసపాలన కాలం నాటి బానిసత్వ పరిస్థితుల్లోకి నెడుతున్నది.
దేశ ఆర్థిక వ్యవస్థను, మన స్వావలంబను నాశనం చేసే ఈ దుర్మార్గపు విధానాలనుంచి, ప్రజలపై రుద్దిన దురవస్థల నుంచి దేశాన్ని కాపాడుకోవడానికి దేశ ప్రజలు ఐక్యతతో ముందుకు రావటం అనివార్యం అయింది. ఈ విధ్వంసం నుంచి దేశాన్ని రక్షించుకోవటానికి జరిగే పోరాటంలో సంపద సృష్టికర్తలైన కార్మికులు, రైతులు కీలకమైన పాత్ర పోషించవలసిన ఉంది.
విక్టిమైజేషన్, వేధింపులను ఎదుర్కొంటూ కార్మికవర్గం ఈ నయా ఉదారవాద విధానాలకు, వాటివల్ల కలిగిన దుష్ప్రభావాలకు వ్యతిరేకంగా గత మూడు దశాబ్దాలుగా నిరంతరం పోరాడింది. 20 దేశవ్యాపిత సార్వత్రిక సమ్మెలు, అసంఖ్యాక మైన రంగాలవారీ సమ్మెలు ఈ కాలంలో జరిగాయి. ఈ సమ్మెలలో దాదాపు అన్ని రంగాలకు చెందిన కార్మికులు పాల్గొన్నారు. అనేక అడ్డంకులను, బీజేపీ ప్రభుత్వం, గొడీ మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఎదుర్కొంటూ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతాంగం, వ్యవసాయ కార్మికులు సంవత్సరకాలంగా వీరోచితంగా పోరాడుతున్నారు. కార్మికుల ఐక్య వేదిక, రైతుల సంయుక్త వేదిక తమ పోరాట కార్యక్రమాలను ఏకకాలంలో కొనసాగిస్తూ, పోరాటంలో ఒకరికొకరు సంఘీభావం, భౌతిక మద్దతు తెలియ చేసుకుంటున్నారు.
ఏమైనప్పటికీ, మోడీ ప్రభుత్వం నయా ఉదారవాద విధానాల పధం నుండి వైదొలగటానికి మొండిగా నిరాకరించడంతో ఈ విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాన్ని వ్యతిరేకత తెలపటం, ప్రతిఘటన చూపటం స్థాయి నుంచి మరింత హెచ్చు స్థాయికి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. ఇదే పిలుపును సీఐటీయూ16వ మహాసభ ఇచ్చింది. ఈ రెండు రకాల పోరాటాలను విడివిడిగానూ, ఉమ్మడిగాను ఉధృతంగా నడపాల్సివుంది. ప్రభుత్వం ప్రజావ్యతిరేక, దేశవ్యతిరేక విధానాలను సవాల్ చేస్తూ కార్మికవర్గం చేస్తున్న పోరాటంలో కార్మికులు, రైతులు, ఇతర శ్రామిక తరగతుల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనేటట్టు చేయటం ద్వారా దుర్భేద్యమైన, దృఢతరమైన పోరాటంగా మార్చాలి.
రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘంలతో కలసి ఆగస్టు 9, 2021 'సేవ్ ఇండియా' రోజుగా జరపాలని సీఐటీయూ నిర్ణయించింది. వినాశనకర ప్రభావాన్ని చూపే నయా ఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా దేశాన్ని కాపాడుకోవడానికి తీవ్రతరం చేయనున్న పోరాటాలను ప్రతిఫలించే విధంగా 'సేవ్ ఇండియా'ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలి. ప్రచారంలో లేవనెత్తిన డిమాండ్లు కేవలం కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలకు సంబంధించినవి మాత్రమే కావు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, ఉపాధి కోల్పోవడం, కరోనా మహమ్మారి మూలంగా మరణించిన కుటుంబాలకు నష్టపరిహారం, అందరికి వ్యాక్సినేషన్ వంటి అన్ని తరగతులకు చెందిన ప్రజల ప్రధాన సమస్యలు చార్టర్ ఆఫ్ డిమాండ్స్‌లో ఉన్నాయి. పక్షం రోజులు నడిపే ఈ సుదీర్ఘ ప్రచారం ఆగస్టు 9న జిల్లా, మండల స్థాయిలలో జరిగే భారీ ప్రదర్శనలతో ముగుస్తుంది. కార్మికుల, రైతులతో కూడిన ఈ సంయుక్త కార్యాచరణ ప్రధాన ఉద్దేశ్యం తమ ఉమ్మడి సమస్యలపై అత్యంత క్రింది స్థాయిలో ఐక్య కార్యాచరణను పెంపొందించడం, వారి మధ్య ఐక్యతను బలోపేతంచేయటం. సమాజంలో అత్యధిక శాతంగా ఉన్న కార్మికులు, రైతులు ప్రజావ్యతిరేక, దేశవ్యతిరేక విధానాలపై కలసికట్టుగా పోరాడుతున్నారనే సందేశం ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు చేరవేయ గలగాలి. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న నయాఉదార విధానాలకు ప్రత్యామ్నాయ విధానాలను ప్రజలముందు పెట్టాలి. బీజేపీ విచ్చిన్నకర ఎజెండాకు వ్యతిరేకంగా ప్రజలను ఏకం చేయటమే లక్ష్యంగా ముందుకు సాగాలి. స్వాతంత్య్ర పోరాటస్ఫూర్తితో, పీడించుకుతినే నయా ఉదారవాద విధానాల నుంచి, బీజేపీ విచ్చిన్న, విద్రోహకర కుతంత్రాల నుంచి దేశాన్ని కాపాడటంలో ఈ ఆగస్టు 9 మరో మైలురాయిగా నిలవాలి.
- డా|| కె. హేమలత