Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హలో... మహాలక్ష్మీ... డాబా మీద ఆరేసిన బట్టలన్నీ తీసేరు, ఎండబెట్టిన వడియాలను కూడా తీసి, ఇంట్లో పడేరు... వర్షం ఎప్పుడు పడుతుందో, ఏమో ? ఎవరికి తెలుసు...' ప్రభాస్ నటించిన వర్షం సినిమాలో సుప్రసిద్ధ హాస్యనటుడు ధర్మవరపు సుబ్రమణ్యం తన భార్యతో ఫోన్లో మాట్లాడే మాటలివి. ఇక్కడ గమ్మత్తేమిటంటే ఆ సినిమాలో ఆయన పాత్ర వాతావరణ శాఖ అధికారి. అందుకే తన భార్య ఫోన్ చేసి ఈ రోజు వర్షం వస్తుందా..? రాదా...? అని అడిగితే... ఆయన పై విధంగా సమాధానమిస్తారు. ఆ సినిమాలోని కామెడీ ట్రాక్ మాదిరిగానే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఎప్పుడు, ఎక్కడ, ఎంత సేపు వర్షం కురుస్తుందో ఎవరికీ తెలియదు...? ఈ ఊళ్లో వాన పడుతుందని తెలిసి... పక్క ఊర్లో వాకబు చేస్తే 'ఇక్కడ మస్తు ఎండగొడుతున్నది...' అనే సమాధానం వినాల్సి వస్తున్నది. హైదరాబాద్లోని కూకట్పల్లిలో భారీ వర్షం కురిసి... రహదారులన్నీ జలమయమైతే, అదే నగరంలోని వనస్థలిపురంలో అలాంటి వాతావరణమే లేకపోగా, పిల్లకాయలు రోడ్డుపై క్రికెట్ ఆడుతూ కనిపిస్తుంటారు. కాకపోతే ఇక్కడో సారూప్యత మాత్రం కనబడుతున్నది. వాన ఏ ప్రాంతంలో కురిసినా, ఎప్పుడు కురిసినా... ఆకాశానికి చిల్లు పడ్డట్టుగా, పై నుంచి మోటరేసి పెద్ద పైపు ద్వారా నీటిని కిందికి అదే పనిగా కొట్టినట్టుగా వర్షం దంచికొట్టటం పరిపాటిగా మారింది. 'నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు... అలా కన్ఫ్యూజ్ చేస్తే ఎక్కువగా కొట్టేస్తాను... ఒక్కసారి కమిటయ్యానంటే నా మాట నేనే వినను...' అన్నట్టుగా వరుణుడు కసిగా, అంతకుమించిన కక్షతో కురవటం రివాజైంది. ఇది భౌగోళికంగా వచ్చిన మార్పని అనుకోవాలా..? లేక మానవాళి స్వయంకృతాపరాధంగా భావించాలా...?
-బి.వి.యన్.పద్మరాజు