Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాడా బొటిమెనేలు గుర్తోడు అని హేళణ చేసే వాళ్ళు ఉదయం లేచినప్పటినుండి అదే బొటిమెనేలును వాడడం చూస్తున్నాం. ఎక్కడికి పోయినా తమ ఐడెంటిటీ అంటే గుర్తును చూపించడానికి ఈ బొటిమెనేలే నేడు ముఖ్యమై కూచుంది. అంతెందుకు వాట్సప్ మొదలైన మాధ్యమాల్లో నాలుగు వేళ్ళు మడచి బొటనవేలును చూపించే గుర్తుల్ని వాడుతున్నారు. టైపురైటర్లలో, ఆ తరువాత కంప్యూటర్లలో పదానికి పదానికి మధ్య ఇచ్చే స్పేస్ అంటే స్థలం ఇవ్వడానికి కూడా ఈ బొటనవేలే పనికొచ్చేది. అందుకే రాయడానికి కాదేదీ అనర్హం అని ఈసారి బొటిమెనేలు మీద రాద్దామనిపించింది.
ద్రోణుడు ఏకలవ్యుని కుడిచేతి బొటనవేలు గురుదక్షిణగా అడుగుతాడు. వెంటనే కోసిస్తాడు ఏకలవ్యుడు. ఇప్పుడు నీ ప్రియ శిష్యుడు అర్జునుడు నాకంటే మంచి విలుకాడుగా మిగులుతాడు, కానీ అంతకంటే ఎక్కువగా నా గురించి ఈ లోకం చెప్పుకుటుందని ఏకలవ్యుడు ద్రోణుడి మొహం మీదే చెబుతాడు. బొటనవేలు పవరది. అసలు విద్యే నేర్పని ఆ బొమ్మ గురువు ఈ సూర్య చంద్రులున్నంత కాలం నీ పేరు నిలిచి ఉంటుందని చెబుతాడు ఏదో ఎవ్వరికీ తెలియని విషయం చెబుతున్నట్టు. అసలు ఏకలవ్యుడికి బొటనవేలు తీసేస్తే బొమ్మ గురువుకు తలే తీసేసినట్లయింది. అయితే చివరిలో అర్జునుడికి చెబుతాడు నిన్ను పైన నిలబెట్టడం కోసం ఎన్నెన్ని చెడ్డపనులు చేశానో అని. అన్న రామారావు తీసిన, చేసిన జానపద చిత్రాలు కాని, పౌరాణిక చిత్రాలు కాని చూడండి, వాటిల్లో బొటమనేలుకు గాయం చేసుకొని వీర తిలకం దిద్దుతారు.
అసలు ఈ బొటనవేలు వెనుక పెద్ద కథే ఉంది. అన్ని కోతుల్లో ఉన్నట్టే మొదట మానవులుగా పరిణామం చెందుతున్న కోతుల జాతికి కూడ ఐదు వేళ్ళు సమానంగా ఉండేవి. నేను చెప్పింది నమ్మకపోతే డార్విన్ పరిణామ సిధ్ధాంతాన్ని చదవండి లేదా చదివినోళ్ళని అడగండి. తమ అవసరాలకు ముఖ్యంగా వస్తువులను పట్టుకోవడానికి అనుకూలంగా బొటనవేలు ఉద్భవించింది. ఇప్పటి కాలంలో దాని అవసరం ఇంకా ఎక్కువైపోయింది. ఒకవేలుతో నీవు ఇతరులను చూపిస్తే నాలుగు వేళ్ళు నీ వైపు చూపుతాయని పెద్దలు చెబుతారు. ఆ నాలుగు వేళ్ళలో మన బొటనవేలుంది. నిజంగా అది మనల్నే చూపుతుంది. ఇలా బొటమనేలుమీద, మిగతా వేళ్ళ మీదా ఎన్నైనా కథలు చెప్పుకుపోవచ్చు. కొందరు చిన్న పిల్లల్ని చూడండి నోట్లో వేలేసుకుంటారు. అది అలవాటు. అలా వేలేసుకునేవాళ్ళు ఏదో ఆలోచిస్తున్నారని మానసిక శాస్త్రజ్ఞులు చెబుతారు. ఇంతకీ చెప్పొచ్చేదేమంటే అలా వేసుకునే వాళ్ళలో ఎక్కువ భాగం బొటమనేలే వేసుకుంటారన్నది పచ్చి నిజం.
మొన్న మా ఇంట్లో పనిచేసే చెన్నమ్మ తనకొచ్చే పింఛను వేయి రూపాయలు రెండు నెల్లుగా రావడం లేదు చూడండి సారూ అని పేపర్లు తెచ్చింది. కథేమిటంటే ఆమె బొటనవేలు గుర్తు స్కానింగులో పోవడం లేదట. చూపుడు వేలూ అంతే. దీనికంతటికీ కారణం వేళ్ళ గీతలు అరిగిపోవడం అదీ ఈ కరోన పుణ్యమే. పాపం తాను పనిచేసే ఇళ్ళలో ప్రతి ఒక్కరూ ముందుగా చేతులకు సానిటైజరు వేసి మరీ పని చేయించుకుంటారు, మంచిదే. అయితే ఇలా వేళ్ళ గుర్తులు అరిగిపోవడం మాత్రం వాస్తవం. ఈ సాకుతో ఎంతమందికి ఎన్ని చెల్లింపులు ఆపేస్తున్నారో ఆరా తీయాలనిపించింది. ఏదో ఒక మార్గాంతరం చూడాలి మరి. అంతెందుకు నావరకు నాకు నా డ్రయివింగు లైసెన్సు పొడిగింపునకూ ఇదే సమస్య అడ్డు తగిలింది. ఎలాగో నాలుగైదు సార్లు చేస్తే ఒక్క వేలు గుర్తులు సరిపోబట్టి బండి వేసుకొని తిరుగుతున్నాను. లేకపోతే అంతే. రోజూ సైకిలుపై తిరగవలసి వచ్చేది. అప్పుడు ఆరోగ్యం బాగుపడుతుంది. బొటనవేలుకు ధన్యవాదాలు చెప్పుకొని సైకిలుపై దూసుకుపోవాలి.
ఈ వేలిగుర్తులు చెరిపేసుకోవడం అంత ఆషామాషీ కాదు. అమెరికాలో చానా ఏండ్ల క్రితం జరిగిన ఓ విషయం. ఒకరిని గన్నుతో పేల్చి చంపిన వ్యక్తి వేలి గుర్తులు దానిపై దొరికాయి. అతడికి జీవితాన్ని మార్చే ఐడియా వచ్చింది, అదేమంటే పెట్రోలు వేసుకొని అర చేతులు కాల్చుకున్నాడు. పోలీసులు చక్కగా వచ్చి అతణ్ణి అరెస్టు చేసి జైలు గదిలో మంచి ఆహారం అందించారు కొన్ని నెలల పాటు. ఇదేదో బాగుందనుకున్నాడు సదరు హంతకుడు. శరీరం పెరిగి బాగా నిగనిగలాడసాగాడు. చేతుల గాయాలూ తగ్గిపోయాయి. అప్పుడు జరిగిన అసలు కథ తెలుసుకోవాలి. వేలి గుర్తులు తీశారు కొత్తగా. గన్ను మీద ఉన్న గుర్తులతో మస్తుగా సరిపోయాయి. మేకలకు, గొర్రెలకు, ఆవులు, గేదెలకు ఎలాగైతే కొమ్ములు రకరకాలుగా ఉంటాయో మనుషుల చేతి గుర్తులు అలాగే ఉంటాయి. అవి మారవు.
చదువుకొని ఎంపీలుగా పార్లమెంటులో కూచున్న వాళ్ళు కూడా బీమా, బ్యాంకులు, వైజాగ్ స్టీలు మొదలైన పెద్ద పెద్ద బిల్లులు పెట్టినప్పుడు కూడా ఎలాంటి ప్రశ్నలు వేయకుండా బొటిమెనేలు గుర్తువేసే వాళ్ళలా చేతులు ఊపుతున్నారు. పాత రోజుల్లో కనీసం ఈ బిల్లు నాకిష్టం లేదు, ఇది ప్రజలకు నష్టమని చెప్పి మరీ దానికి మద్దతుగానే ఓటేసేవారు. అలా నోరు తెరవడం ఇప్పుడు ఆగిపోయింది. బిల్లుపై తీర్మానం పూర్తి చదవకుండానే దాన్ని ఆమోదింపజేస్తున్నారు. రాయడానికి, చదవడానికి వచ్చినోళ్ళను చదవనివ్వడంలేదు, మాట్లాడనివ్వడంలేదు. ఇలాంటి సమయంలో కొందరు మాత్రమే ప్రజల వైపు నిలబడు గున్నారు పిడికిలి బిగించి. అలా బిగించాలంటే కూడా ఈ బొటిమెనేలు ఎంతో ముఖ్యం మరి. అసలు కొన్ని పార్టీల్లో ప్రజలెన్నుకున్న వాళ్ళు మీరు చేస్తున్నదేమి అని సామాన్యంగా అడగరు, అడిగినా నోరెత్తనివ్వరని చెప్పుకున్నాం. ఆలాంటి పార్టీలకు బొటమనేలు గుర్తు ఇచ్చి పోటీ చేయమనాలి. ఇక్కడ బొటమనేలు గుర్తోళ్ళను నేనేమీ తక్కువ చేయడంలేదు. కనీసం ఆ గుర్తు చూసైనా ఎదురు మాట్లాడడం నేర్చుకుంటారేమోనన్న చిన్న ఆశ, అంతే. అసలు బొటిమెనేలు గుర్తు వేసేవాళ్ళే బాగా ఆలోచిస్తున్నారిప్పుడు. పూర్వం ఏమీ చదవని ముఖ్యమంత్రులు తమ మంచి మనసుతో ప్రజలకు కొన్ని మంచి పనులు చేసిపోవడం మనం గుర్తు చేసుకోవాలి. ఇదంతా ఎందుకు అంటే సదూకున్నోళ్ళకు కాస్త సురుకంటిద్దామనే నా ప్రయత్నం.
- జె. రఘుబాబు
సెల్:9849753298