Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాష్ట్ర ప్రభుత్వం 'దళిత బంధు' పథకం ప్రకటించింది. హుజురాబాద్ నియోజకవర్గం పైలెట్ ప్రాజెక్టుగా నిర్ణయించింది. పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నది. దీనితో దళిత కుటుంబాలు ధనవంతులై పోతారన్నంతగా ఈ ప్రచారం సాగుతున్నది. మరోవైపు బీజేపీ నాయకత్వం మూడో కాలుమీద లేస్తున్నది. కేసీఆర్ ఫామ్హౌజ్నూ, ప్రగతి భవన్‌నూ లక్ష నాగళ్ళతో దున్నిస్తానని బండి సంజరు రెచ్చిపోతున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్‌రెడ్డి కూడా తీవ్రంగానే దాడి చేస్తున్నారు. 'దళిత బంధు'ను సమర్థిస్తున్నామంటూనే దాడిని ఉధృతం చేస్తున్నారు. ఇంతకూ... 'దళిత బంధు' దళితుల బంధువేనా? బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఎందుకు ఇంతగా విరుచుకుపడుతున్నారు? ఈ పథకంతో దళితుల సాధికారత సాధ్యమవుతుందా!
'దళిత బంధు' గురించి పరిశీలించేముందు మరికొన్ని అంశాలు చూడాలి. సాధికారత విషయంలోగానీ, ఆర్థిక, సామాజిక సమస్యల పరిష్కారంలోగానీ ఇప్పటికే ప్రపంచంలో అనేక అనుభవాలున్నాయి. మనదేశంలో కూడా ఉన్నాయి. ఉచిత విద్యా, వైద్య సౌకర్యాలు కుటుంబాల ఆర్థిక భారం బాగా తగ్గిస్తాయి. స్వంత ఇల్లు మరో పెద్ద ఆర్థిక భారంనుంచి బయట పడేస్తుంది. వ్యవసాయ రంగంలో భూమి, పారిశ్రామిక, సేవారంగాలలో తగిన ఉద్యోగం జీవితానికి భరోసా ఇస్తాయి. సాగునీరు సౌకర్యం, రుణ సౌకర్యం, గిట్టుబాటు ధర రైతు జీవితంలో వెలుగు నింపుతాయి. చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహం ఉపాధి అవకాశాలు పెంచుతుంది. ఇవన్నీ ఎవరైనా అంగీకరించక తప్పని నిజాలు. అందుకే రాజకీయ పార్టీలు చేసే ఎన్నికల వాగ్దానాలన్నీ వీటిచుట్టే తిరుగుతుంటాయి. ఈ మౌలిక సమస్యలు పరిష్కరించటంలో పాలకులు విఫలమైనపుడు సంక్షేమ పథకాలు అనివార్యమవుతాయి. పేద, మధ్యతరగతి ప్రజలకు కనీస ఊరటనిస్తాయి. ఆర్థిక వ్యవస్థ వెనువెంటనే కుప్పగూలకుండా కాపాడుతాయి. అందుకే, నిన్నటిదాకా సబ్సిడీలను వ్యతిరేకించిన అమెరికా, బ్రిటన్ లాంటి పాశ్చాత్యదేశాల పాలకులే ఉద్దీపన పథకాలు ప్రకటిస్తున్నారు. ప్రజల ఎకౌంట్లల్లో నేరుగా డబ్బు వేస్తున్నారు. అమెరికాలో బైడెన్‌తో సహా ఈ పనే చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 'దళిత బంధు' పథకాన్ని కూడా పరిశీలించాలి.
రాష్ట్ర ప్రభుత్వం కేజీ టు పీజీ ఉచిత విద్య వాగ్దానం చేసింది. అమలును మాత్రం మరచింది. గురుకుల విద్యాలయాలను చూపించి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నది. గురుకుల విద్యాలయాల సంఖ్య పెంచటం మంచిదే. కానీ దీనితో కేజీ టు పీజీ ఉచిత విద్య రాదు కదా! మారుమూల గ్రామాలలో వైద్యం కూడా అందని ద్రాక్షపండే. ప్రయివేటు వైద్యం మీదనే ఎక్కువగా ఆధారపడవల్సి వస్తున్నది. బస్తీ దవాఖానాల గురించీ, గ్రామీణ వైద్యం గురించీ అట్టహాసంగా ప్రచారాలు చేసి అరకొర చర్యలతో చేతులు దులుపుకున్నది. ఈ రెండూ అమలైతే దళితులతోపాటు, పేదలంతా లాభపడతారు. కానీ ఈ పని చేయలేదు. ఇవి చేస్తే కార్పొరేట్ విద్యా, వైద్య సంస్థలకు లాభాలు తగ్గుతాయి కదా! వారికి చీమకుట్టకుండా చూసుకోవటమే పాలకుల ప్రథమ ప్రాధాన్యతగా ఉన్నది. దళితులకు మూడెకరాల సాగుభూమి వాగ్దానం కూడా ప్రభుత్వం చేసిందే. మళ్ళీ ఆమాట మాట్లాడటానికి సిద్ధంగా లేదు. రైతుల దగ్గర కొనుగోలు చేసి ఇస్తామని మొదట ప్రకటించింది. రైతులు అమ్మేందుకు సిద్ధంగా లేరని ఇప్పుడు తప్పించుకుంటున్నది. ఎవరైనా అమ్మినా ధరలు పెరిగాయని ముఖం చాటేస్తున్నది. దళితులకు భూమి ఇచ్చే చిత్తశుద్ది ప్రభుత్వానికి ఉంటే అమలు చేసేందుకు మార్గం ఉన్నది. భూమి సీలింగ్ చట్టాలు అమలు చేస్తే కావాల్సినంత భూమి దొరుకుతుందని కమ్యూనిస్టులు ముందే చెప్పారు. కేరళ, బెంగాల్, త్రిపుర లాంటి రాష్ట్రాల్లో తాము అధికారంలో ఉన్నప్పుడు అమలు చేసి చూపించారు. కమ్యూనిస్టులే కాదు, కాశ్మీర్ ప్రాంతంలో షేక్ అబ్దుల్లా నాయకత్వంలో నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వం కూడా ఇదే చేసింది. కాశ్మీర్ ప్రజల్లో దాని ప్రభావం ఇప్పటికీ కనిపిస్తున్నది. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం భూస్వాముల భూములు ముట్టుకోవడానికి సిద్ధంగా లేదు. దళితులకు పంచిన అసైన్డ్ భూములు కూడా వెనక్కు తీసుకుంటున్నది. గత ఎన్నికల సందర్భంగా పోడు భూముల సమస్య తానే స్వయంగా పరిష్కరిస్తానన్న ముఖ్యమంత్రి ఇప్పుడు మాట్లాడడం లేదు. ఇది గిరిజనుల జీవన్మరణ సమస్య. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి శాసనసభా సమావేశంలోనే ఆనాటికి ప్రభుత్వం శాఖల్లో ఉన్న లక్ష ఏడు వేల ఖాళీ పోస్టులు ఏడాదిలో భర్తీచేస్తానన్నారు ముఖ్యమంత్రి. ఏడేండ్లయినా సగం కూడా భర్తీ చేయకపోగా, ఖాళీ పోస్టుల సంఖ్య ఇప్పుడు లక్షా తొంబై ఒక్క వేలకు చేరింది. ఎన్నికలకు ముందు కాంట్రాక్ట్ ఉద్యోగుల వ్యవస్థను రద్దు చేస్తామన్నారు. ఇప్పుడు కాంట్రాక్ట్ పేరుతో 50,400 మందితోనూ, ఔట్సోర్సింగ్ పేరుతో 58,128 మందితోనూ పనియిచేస్తున్నారు. వీరందరినీ రెగ్యులరైజ్ చేసి, మిగిలిన ఖాళీలన్నీ భర్తీ చేయాలికదా! దీని వల్ల నిరుద్యోగులకు ఊరట లభించడంతో పాటు, చదువుకున్న దళితులు పెద్ద సంఖ్యలో లబ్ది పొందుతారు. డబుల్బెడ్రూం ఇండ్ల కోసం ఎదురుచూస్తున్న పేదల్లో దళితులు గణనీయంగా ఉన్నారు. సొంత స్థలం ఉన్నవారికి ఐదులక్షలు ఇస్తామని కూడా అన్నారు. ఇప్పుడు దాని ఊసులేదు. అయినా ఇలాంటి శాశ్వత పరిష్కారాల గురించి ఓట్లు అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడుతున్నారు. అందుకే సీపీఐ(ఎం) నిర్ధిష్ట సూచనలు చేసింది. దళితుల్లో అత్యధిక శాతం వ్యవసాయ కార్మికులు, రోజువారీ వేతన కార్మికులు, అసంఘటిత కార్మికులు, పారిశుధ్య, స్కీమ్ వర్కర్లున్నారు. ఆయా గ్రామాల్లో ఇతరులకున్న సౌకర్యాలు కూడా దళిత నివాస ప్రాంతాల్లో లేవు. కుల వివక్ష ఇప్పటికీ తీవ్రంగా ఉన్నది. రాజకీయ రిజర్వేషన్లున్నా, అన్ని స్థాయిల్లో తగినంత గౌరవం లభించడం లేదు. కాబట్టి దళితుల సాధికారతకు ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక అంశాల్లో తక్షణ, దీర్ఘకాలిక చర్యలు ప్రతిపాదించింది. రానున్న కాలంలో వీటికోసం పోరాడుతుంది.
ఇప్పుడు 'దళిత బంధు' పథకం ఇలాంటి చర్యలతో పోల్చితే పరిమితమైనదే. తక్కువ మందికి మాత్రమే ఉపయోగం. లబ్దిదారులందరూ జీవితంలో స్థిరపడతారని గ్యారంటీగా చెప్పలేం. డబ్బుమాత్రమే ఇచ్చి, వాటి వినియోగం మీద తగిన పర్యవేక్షణా, ప్రభుత్వం నుంచి ప్రణాళికాబద్దమైన సహకారం లేకపోతే నిధులు అనుత్పాదకంగా ఖర్చయిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. చిన్న పరిశ్రమలు, వ్యాపారాలు పెట్టుకున్నప్పటికీ, నిరంతరం ప్రభుత్వం అండ ఉంటే తప్ప నిలదొక్కుకోవడం అంత సులభం కాదు. ఎన్ని పరిమితులున్నప్పటికీ, ఏ మేరకు ఉపయోగపడినా అది మంచిదే. ఆ మేరకు కొందరైనా దళితులు లబ్దిపొందుతారు. ఇంత ప్రణాళికాబద్ధంగా, నిజంగా, చిత్తశుద్ధితో అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదా అన్నదే ప్రశ్న. అంత చిత్తశుద్ధి పాలకులకు ఉంటే, ఇన్ని పరిమితుల్లో కూడా ప్రభుత్వం చేయగల్గిన పనులు కొన్ని ఉన్నాయి. సీపీఐ(ఎం) ప్రతిపాదించిన చర్యల్లో ప్రభుత్వం మీద ఆర్థిక భారం పెద్దగా పడనివి కూడా ఉన్నాయి. వీటికి తోడు దళిత చదువుకున్న యువతకు నైపుణ్యం పెంచి ఉపాధి చూపించవచ్చు. అనేక పరిశ్రమలకు, సంస్థలకు అవసరమైన నైపుణ్యం గల కార్మికులు దొరకడం లేదని యాజమాన్య సంఘాలు చెబుతున్నాయి. మరో వైపు పెద్దఎత్తున నిరుద్యోగులున్నారని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. ప్రభుత్వం చెబుతున్న తొమ్మిది లక్షల దళితుల కుటుంబాల్లో చదువుకున్న నిరుద్యోగ యువత లెక్కలు తీయొచ్చు. వ్యవసాయం, ఇతర వృత్తుల్లో ఉన్నవారు పోగా, సగం కుటుంబాల్లో నైనా ఇలాంటి యువత ఉంటారు. వీరికి నైపుణ్యం అందించి, ఉద్యోగం గ్యారంటీ చేస్తే దళితుల కుటుంబాల్లో ఇది పెద్ద ఆధారం అవుతుంది. సుమారు ఐదు లక్షల దళిత కుటుంబాలకు ఉపయోపడుతుంది.
చిత్తశుద్ధి ఉంటే, ప్రతిపక్షాలు కూడా శాశ్వత పరిష్కారాల కోసం ప్రజలను సమీకరించి పోరాడాలి. కేసీఆర్ ఫామ్హౌజ్నూ, ప్రగతిభవన్‌నూ లక్ష నాగండ్లతో దున్నిస్తానన్న బీజేపీ నేతలు భూస్వాముల, ఫామ్‌హౌస్ యజమానుల భూములను దున్నడానికి సిద్ధపడాలి. భూమి తమ గుప్పెట్లో పెట్టుకుని అనుభవిస్తున్న వీరంతా బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ వంటి పార్టీల నీడలోనే సేదదీరుతున్నారు. వీరి భూములు దున్నడానికి ఈ పార్టీల నాయకులు సిద్ధమేనా? అదే జరిగితే ఒక్కొక్క దళిత కుటుంబానికి ఒక్క ఎకరం దక్కినా సుమారు ఇరవై లక్షలు అందినట్టే కదా! 'దళిత బంధు'ను మించి ఉపయోపడే పథకం కదా! పేదలను సమీకరించి దున్నించడానికి వీరు సిద్ధంగా లేరు. పైగా ఇట్లా దున్నడానికి కమ్యూనిస్టులు సిద్ధపడితే.... వీరంతా ఏకమై కమ్యూనిస్టులను అడ్డుకుంటారు. ఇప్పుడు కేవలం సంచలన వార్తల కోసం లక్ష నాగండ్లతో దున్నిస్తాననటమే తప్ప నిజంగా భూమి పంచేందుకు సిద్ధంగా లేరు బీజేపీ నేతలు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నది. వారికి చిత్తశుద్ధి ఉంటే దేశమంతా భూమి పంచవచ్చు. కేంద్ర ప్రభుత్వశాఖల్లో ఆరు లక్షలకు పైగా ఖాళీ పోస్టులున్నాయి. వాటినీ భర్తీ చేయడం లేదు. ప్రయివేటు విశ్వవిద్యాలయాలను ప్రోత్సహిస్తున్న కేంద్రం దళితుల, గిరిజనుల రిజర్వేషన్ల మీద దాడి చేస్తున్నది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దళితుల మీద, మహిళల మీద జరిగినన్ని దాడులు చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. ఇవేవీ తెలంగాణలోని బీజేపీ నాయకత్వానికి పట్టవు. ఇక్కడ ఏదో ఒకటి చేసి అధికారం సంపాదించాలన్నదే వారి ప్రయత్నం. ప్రజల సమస్యలు పట్టవు. దళితబంధు పథకం అమలు జరిగితే బీజేపీ, కాంగ్రెస్‌ల రాజకీయ ప్రయోజనాల మీద నీళ్ళు చల్లినట్టవుతుందనేది వారి భయం. హుజారాబాద్ ఉప ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే బీజేపీ విరుచుకుపడుతున్నది. నిజానికి ఇప్పుడు చూడవల్సింది రాజకీయ ప్రయోజనాలు కాదు, తెలంగాణ ప్రజల ప్రయోజనాలకోసం కోట్లాడాలి. 'దళిత బంధు'తో సహా తెలంగాణ ప్రజలకు ఉపయోగపడే ఏ పథకాన్నైనా సమర్థించాలి. శాశ్వత పరిష్కారాల కోసం పోరాటం కొనసాగించాలి. వామపక్షాలు చేస్తున్నది అదే.
- ఎస్. వీరయ్య