Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఐక్యరాజ్యసమితి గిరిజన తెగల హక్కులు, ఉపాధి, వలసలు, విద్య, వైద్యం వంటి ఆంశాలతో తీర్మానాన్ని ఆమోదిస్తూ ప్రతి ఏటా ఆగస్టు9న ప్రపంచ గిరిజన హక్కుల దినంగా జరపాలని పిలుపునిచ్చింది. ప్ర్రపంచ వ్యాపితంగా వివిధ పేర్లతో పిలువబడుతున్న గిరిజన తెగలన్నీ ఆగస్టు 9న హక్కుల దినంగా జరుపుకుంటున్నారు. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఇప్పటికీ అధికారికంగా జరుపకపోవడం వారి నిర్లక్ష్యధోరణికి నిదర్శనం.
ఒక తెగ, కులం, జాతి అభివృద్ధి చెందిందని ఎలా పరిగణిస్తారు? ఆధునిక ప్రజలతో పోల్చుకుంటే సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ రంగాల్లో వారి అభివృద్ధి ఏస్థాయిలో ఉందనేదే అందుకు గీటురాయి. 2020 ఐక్యరాజ్యసమితి నివేదికలో భారతదేశంలో గిరిజన తెగల అభివృద్ధి గతంలో ఎన్నడూ లేనివిధంగా దిగువ స్థాయికి దిగజారిందని స్పష్టంగా పేర్కొన్నది. మరి అధికారంలోకి వచ్చి ఏడున్నరేండ్ల కాలం గడిచినా గిరిజన అభివృద్ధికి ఏం చేసిందో బీజేపీ చెప్పాలి.
అసలు కేంద్ర ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధి కోసం ఇప్పటి వరకు ప్రణాళికే రూపొందించకపోవడం బాధాకరం. కేంద్ర బడ్జెట్లో గిరిజన జనాభా నిష్పత్తి ప్రకారం కేటాయించే నిధులను కూడా గిరిజనుల అభివృద్ధికి ఖర్చు చేయడంలేదు. వేల సంవత్సరాలుగా అణచివేత, దోపిడీకి గురైన గిరిజనులను అభివృద్ధిలోకి తీసుకురావడం కోసం భారతారాజ్యాంగంలో రిజర్వేషన్లు, కొన్ని ప్రత్యేక సదుపాయాలను కల్పించారు. వాటిని సైతం కాలరాసేందుకు ఈ ప్రభుత్వం పూనుకున్నది. దేశంలో ఉన్న 5వ, 6వ షెడ్యూల్ ప్రాంతాల్లో గిరిజనులకు కల్పించిన స్వయంపాలన అధికారాలను కత్తిరిస్తున్నది. 1/70, పెసా చట్టాలకు తూట్లుపొడుస్తూ గిరిజన ప్రాంతాల్లో ఉన్న విలువైన ఖనిజ సంపదను అంబానీ, ఆదానీలకు కట్టబెడుతున్నది. దేశవ్యాపితంగా 10లక్షల గిరిజన కుటుంబాలకు అటవీ హక్కుల గుర్తింపు చట్టం 2006 ప్రకారం హక్కులు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నా కేంద్రం పట్టించుకోవడంలేదు. ఫలితంగా 2019లో సుప్రీంకోర్టు వీరందరికీ హక్కులు ఇస్తారా ఆక్రమణ దారులుగా ముద్రవేసి ఖాళీ చేయించమంటారా అని కేంద్రానికి చివాట్లు పెట్టినా అమలు చేయించడంలో విఫలం అయింది. సర్థార్ సరోవర్ డ్యాం, పోలవరం, పటేల్ విగ్రహం వంటి అనేక భారీ ప్రాజెక్టులు, రహదారుల్లో లక్షలాది మంది గిరిజనులు నిర్వాసితులుగా మారుతున్నారు. 2013 పునరావాస చట్టం ప్రకారం నష్టపరిహారం కూడా ఇవ్వకుండా బలవంతంగా రాష్ట్ర ప్రభుత్వాలు వెల్లగొడుతున్నాయి. వామపక్షాల వత్తిడితో వచ్చిన గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నీరు కార్చేందుకు సిద్ధపడింది. ప్రతి ఏటా కేంద్ర బడ్జెట్లో ఈ పథకానికి లక్ష కోట్లు కేటాయిస్తున్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 30శాతం నిధులకు కోతపెట్టింది. 2017 నుంచి 60 వేల కోట్లు మాత్రమే కేటాయిస్తుంది. కోట్లాదిమంది దళితులు, గిరిజనులు, బలహీనవర్గాలు, పేదలు ఆధారపడి జీవిస్తున్న ఈ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు కుట్రపన్నుతున్నది. కూలీల పనిదినాలను తగ్గించడంతోపాటు రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా ఎస్సీ, ఎస్టీ కులాలను వేరు చేస్తూ పనులు చూపాలని రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు పరిశ్రమలను ఏర్పాటు చేయాలని హామీ ఉన్నా ఆచరణకు నోచుకోలేదు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేట్‌పరం చేస్తూ రిజర్వేషన్స్‌ను చాపకింద నీరులా నిర్వీర్యం చేస్తున్నది. గతంలో ఎన్నడూ లేనివిధంగా బీజేపీ, సంఫ్‌ు పరివార్ సంస్థలు గిరిజన తెగల సంస్కృతి, భాషా, సాంప్రదాయాలపై దాడి చేస్తున్నాయి. ఆహార అలవాట్లు మార్చుకోవాలని గిరిజనులపై దాడులు చేస్తూ హత్యలు చేస్తున్నారు. ఆధిపత్య సంస్కృతిని గిరిజన తెగలపై బలవంతంగా రుద్దుతున్నారు. దళితులు, గిరిజనులు పోరాడి సాధించుకున్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నీరుగార్చేందుకూ సవరణలకు సిద్ధపడింది. దేశవ్యాపితంగా జరిగిన ఆందోళనల ఫలితంగా వెనక్కి తగ్గింది.
ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే గిరిజన సమస్యలు పరిష్కారం అవుతాయని అనేక ఆశలు పెట్టుకున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అటువంటి భ్రమలనే కల్పించింది. ఆ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో గిరిజనులకు 16 రకాల వాగ్దానాలు చేసింది. ముఖ్యంగా అధికారంలోకి రాగానే రాష్ట్రంలో గిరిజనుల జనాభా నిష్పత్తి ప్రకారం 6శాతం నుంచి10శాతానికి రిజర్వేషన్ పెంచుతామని హామీ ఇచ్చారు. ఒక సభలో ముఖ్యమంత్రే 12శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికి వరకు ఆ హామీ నెరవేరలేదు. ఫలితంగా గత ఏడున్నర ఏండ్లుగా విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో గిరిజనులకు తీవ్ర నష్టం జరుగుతున్నది. తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసినా వాటిని రెవెన్యూ గ్రామాలుగా గుర్తించకపోవడం, అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇవ్వకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర బడ్జెట్లో గిరిజనుల జనాభా నిష్పత్తి ప్రకారం గత ఏడేండ్ల కాలంలో 50వేల కోట్లు కేటాయించగా 34వేల కోట్లు ఖర్చు చేసినట్లు అధికారిక లెక్కలు ఉన్నాయి. సుమారు 16వేల కోట్ల రూపాయలను గిరిజనుల అభివృద్ధికి ఖర్చు చేయకుండా దారి మళ్ళించింది. ఏజన్సీ ప్రాంతంలో గిరిజనులకు రాజ్యాంగం కల్పించిన 100శాతం ఉద్యోగంలో రిజర్వేషన్ జీఓ 3ను సుప్రీంకోర్టు కొట్టివేసి ఏడాది గడుస్తున్నా రివ్యూ పిటీషన్ వేయలేదు. దీనితో గిరిజనులకు దక్కాల్సిన ఉద్యోగ అవకాశాల్లో తీవ్ర నష్టం జరుగుతుంది. 1/70 చట్టం, పెసా చట్టాల అమలు విషయంలో దాటవేత వైఖరి మూలంగా కోట్లాది రూపాయల విలువైన గిరిజన భూములను గిరిజనేతర భస్వాములు ఆక్రమిస్తున్నారు. అటవీ భూములను సాగుచేస్తున్న గిరిజనులందరికీ అటవీ హక్కుల గుర్తింపు చట్టం 2006 ప్రకారం హక్కులు కల్పిస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వం 2014 ఎన్నికల్లో వాగ్దానం చేసింది. 13 లక్షల ఎకరాల అటవీ భూముల్లో గిరిజనులు ఇతర పేదలు సాగులో ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో లక్షా 86 వేల వ్యక్తిగత కుటుంబాలు దరఖాస్తు చేస్తే కేవలం 83వేల మంది దరఖాస్తులకు 3లక్షల ఎకరాలపై హక్కులు ఇచ్చి లక్షకు పైచిలుకు దరఖాస్తులను కారణాలు చూపకుండా తిరస్కరించారు. పైగా అటవీ భూములు సాగుచేస్తున్న గిరిజనులపై దాడులు చేస్తూ అక్రమ కేసులు పెడుతున్నారు. మైదాన ప్రాంతంలో 25లక్షల మంది గిరిజనులున్నారు. వీరి అభివృద్ధికి ఉమ్మడి రాష్ట్రంలో 2009లో ప్రత్యేక ఐటిడిఎను హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేశారు. కొత్త రాష్ట్రం వచ్చిన తరువాత మూలనపడేసింది. రాష్ట్రంలో గిరిజనుల అభివృద్ధికి సూచనలు సలహాలు ఇస్తున్న గిరిజన సలహామండలి సమావేశాలు ఏడాదికి రెండుసార్లు జరగాల్సి ఉండగా ఏడేండ్లలో మూడుసార్లు మాత్రమే జరిపింది. గిరిజన విద్య, ఆరోగ్యం వంటి కీలక రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన రాష్ట్ర ప్రభుత్వం గత పాలకులు చేసిన నిర్లక్ష్యాన్నే కొనసాగిస్తోంది. తరతరాలుగా గిరిజనులకు సంక్రమించిన హక్కులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిప్పుల కుంపటిలో పడేస్తున్నాయి.
- ఆర్. శ్రీరాంనాయక్
సెల్:9440532410