Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశానికి జీవనాడిగా ఉన్న విద్యుత్ రంగాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకు అప్పగించబోతున్నది. మానవాళి జీవన గమనాన్నే శాసిస్తున్న విద్యుత్ వనరులపై ప్రయివేటు ఆధిపత్యం పెరిగే విధంగా విద్యుత్ (సవరణ) బిల్లు 2021ని తీసుకువచ్చింది. ఈ బిల్లును పార్లమెంట్లో ఆమోదింపజేసుకొని చట్టం చేయడానికి మోడీ ప్రభుత్వం ఉవిళ్ళూరుతున్నది. దేశ సంపదను, రాష్ట్రాల హక్కులను, ఉద్యోగుల భవిష్యత్‌ను హరిస్తూ తీసుకువస్తున్న ఈ బిల్లును దేశంలోని కార్మికవర్గం తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి. ఆగస్టు 10న దేశవ్యాప్తంగా నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ Ê ఇంజనీర్స్ (చీజజ్పజుజు) ఆధ్వర్యంలో 'సమ్మె''కు పిలుపునిచ్చాయి. విద్యుత్ ఉద్యోగుల ఈ సమ్మె పోరాటానికి తెలంగాణ రాష్ట్రంలోని కార్మికవర్గంతో పాటు రైతాంగం, పేదలు, మధ్యతరగతి, విద్యుత్ వినియోగ దారులంతా అండగా నిలబడాలి.
భారతదేశ అభివృద్ధి, ఆర్థిక వ్యవస్థ పురోగమనం మొత్తం విద్యుత్‌పై ఆధాపరడి ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 138 కోట్ల మందికి విద్యుత్ అవసరాలు తీర్చడం కోసం ప్రస్తుతం 3 లక్షల 71 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి స్థాపిత సామర్థ్యంతో మన దేశం ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉంది. తలసరి వినియోగం 1,181 యూనిట్లు ఉంది. అన్ని వర్గాల ప్రజలకు నిత్యావసర వస్తువుగా మారిన ''విద్యుత్''పై కార్పొరేట్ల ఆధిపత్యం కల్పించడానికి మోడీ ప్రభుత్వం కంకణం కట్టుకొన్నది. రెండవసారి మెజారిటీ ఎంపీలతో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం విద్యుత్ రంగ ప్రయివేటీకరణకు పూనుకుంటున్నది. దేశంలోని ప్రజలంతా కరోనాతో తల్లడిల్లిపోతున్న దశలో 2020 ఏప్రిల్ 17న విద్యుత్ సవరణ బిల్లు 2020 ముసాయిదాను విడుదల చేసింది. ప్రస్తుతం ఆగస్టు 13న పార్లమెంట్లో చట్టం చేయబోతున్నది. విద్యుత్ (సవరణ) బిల్లు 2021 చట్ట రూపం దాల్చితే దేశంలోని ప్రభుత్వ విద్యుత్ రంగం పూర్తిగా ధ్వంసం అవుతుంది. రాష్ట్రాల హక్కులన్నీ హరించబడి విద్యుత్ రంగం కేంద్రం చేతిలో బంధించబడుతుంది. విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ వ్యవస్థలన్నీ ప్రయివేటు వారి చేతుల్లోకి వెళ్తాయి. ఈ బిల్లును 12 రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా తీవ్రంగా వ్యతిరేకించి ప్రస్తుతం పార్లమెంట్లో చట్టం కాబోతున్న తరుణంలో మౌనం వహించడం వెనకాల ఉన్న మతలబు ఏంటో తెలియాలి. దేశవ్యాప్తంగా ఈ రంగంలోని 15లక్షలకుపైగా ఉద్యోగులు, ఇంజనీర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయినా మొండిగా ఈ బిల్లును ఆమోదింపజేసుకోడానికి కేంద్రం పట్టుదలతో ఉంది.
విద్యుత్ (సవరణ) బిల్లు 2021ని ఎందుకు వ్యతిరేకించాలి! :
కొత్త విద్యుత్ చట్టం వస్తే క్రాస్ సబ్సిడీ పోతుంది. తద్వారా 100, 200 యూనిట్లలోపు ఉన్న మన రాష్ట్రంలోని 59 లక్షల మంది విద్యుత్ వినియోగదారులు వారి ఛార్జీలలో పొందుతున్న రాయితీ పోతుంది. విద్యుత్ ఉత్పత్తి, పంపిణీకి అయిన ఖర్చు ప్రకారం టారీఫ్‌ను చెల్లించవలసి ఉంటుంది. ఉదా: యూనిట్‌కు రూ.6కు పైగా భరించాల్సి వస్తుంది. ఫలితంగా పేద, మధ్యతరగతి ప్రజలకు కరెంటు బిల్లులు గుదిబండగా మారతాయి. అలాగే మన రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాలకు చెందిన క్షౌర శాలలకు, లాండ్రీ షాపులకు (250 యూనిట్ల) ఇస్తున్న విద్యుత్తు రాయితీ ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది. రాష్ట్రంలో 25 లక్షల రైతుల వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు పెడతారు. ఉచిత కరెంటు ఉండదు. రైతులు ముందుగా కరెంటు బిల్లులు చెల్లించి, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీ కొరకు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వ్యవసాయదారులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతారు. విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ వ్యవస్థలోకి ప్రయివేటు సంస్థలు, ఫ్రాంచైజీలు, సబ్ లైసెన్స్‌దారుల ప్రవేశం వల్ల మన రాష్ట్రంలోని 50వేల మంది ఉద్యోగులు, ఇంజనీర్లు, 23,600 మంది ఆర్టిజెన్లు, 6,500మంది పీస్ రేటు వర్కర్స్, అన్మెన్ వర్కర్స్ ఉద్యోగ భద్రత ప్రమాదంలో పడుతుంది. గతంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ రంగంలో సంస్కరణలకు ప్రయత్నిస్తే ఉద్యోగులు తీవ్రంగా ప్రతిఘటించి విజయం సాధించిన అనుభవం ఉంది. వారి స్ఫూర్తితో దేశవ్యాప్త ఉద్యమానికి విద్యుత్ ఉద్యోగులు సిద్ధపడుతున్నారు.
ఈ కొత్త విద్యుత్ చట్టం ప్రకారం ఇతర దేశాల నుండి విద్యుత్ కొనుగోలు చేయడం, ఎగుమతి చేయడం కూడా కేంద్రం చేస్తుంది. ఇతర దేశాల్లోని విద్యుత్ తక్కువ రేటుకే సరఫరా చేస్తామంటే కొనుగోలు చేయవలసి ఉంటుంది. మన స్థానిక విద్యుత్ ఉత్పత్తి సంస్థలు మూతపడే ప్రమాదం కూడా ఉంది. అందులో పనిచేసే సిబ్బంది ఉద్యో గాలు కోల్పోతారు. ముఖ్యంగా రాష్ట్రాల రెగ్యులేటరీ కమిషన్లు కూడా కేంద్రం ఏర్పాటు చేస్తుంది. ఇంత ప్రమాదకరమైన బిల్లును తీసుకు రావడం వల్ల అంబానీ, ఆదానీ తదితరులకు చెందిన బడా కార్పొరేట్ సంస్థలు మాత్రమే లబ్ది పొందుతాయి.
విద్యుత్ రంగంలో ప్రయివేటు సంస్థల వైఫల్యం :
ప్రభుత్వరంగంలో అభివృద్ధి చేసి పట్టణాలతో పాటు పల్లెలకు విద్యుత్ కాంతులు అందించారు. ఇందులో ఉద్యోగుల కఠోరశ్రమ ఉంది. దేశవ్యాప్తంగా విద్యుత్ ఉత్పత్తి, సరఫరా వ్యవస్థలు బలోపేతం అయిన దశలో ప్రయివేటు సంస్థల కన్ను ఈ రంగంపై పడింది. 1991లో పివి.నర్సింహారావు ప్రభుత్వం ప్రయివేటీకరణకు పునాదులు వేసింది. ప్రపంచ బ్యాంకు షరతులకు లొంగడం వల్ల 1998 ప్రాంతంలో విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ చట్టం వచ్చింది. టారీఫ్‌ల నిర్ణయం కోసం రెగ్యులేటరీ కమిషన్లు ఏర్పడ్డాయి. దీని ఫలితంగా కేంద్ర, రాష్ట్ర ఉమ్మడి జాబితా నుండి తొలగించబడింది. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో విద్యుత్ బోర్డులను విభజించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎసిఎస్ఈబిని ముక్కలు చేశారు. జెన్కో, ట్రాన్స్‌కో, డిస్కాంలు ఏర్పడ్డాయి. కంపెనీల హౌదా కల్పించారు. ప్రయివేటు రంగానికి ఉత్పత్తి, పంపిణీలో భాగస్వామ్యం కల్పించారు. ఈ చర్యల వల్ల విద్యుత్ వినియోగదారులపై భారం పడగా, ఉద్యోగుల భద్రత ప్రమాదంలో పడింది. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్య పెరిగింది.
ఢిల్లీ, ఒడిస్సా రాష్ట్రాలలో లైసెన్సులు పొందిన ప్రయివేటు సంస్థలు ఒడిస్సాలో నిర్వహణ చేయలేక చేతులెత్తేశారు. ఇందులో అమెరికా ఎలక్ట్రికల్ సంస్థ కూడా ఉండడం గమనార్హం. అంతకు ముందే మహారాష్ట్రలో ఎన్రాన్ సంస్థ నిర్వాకం చూశాం. 'ఫ్రాంజైజీ'లు ఏర్పాటు చేసుకొనే వెసులుబాటు వల్ల వివిధ రాష్ట్రాలలో అనేక పట్టణాలలో విద్యుత్ పంపిణీ కోసం సంస్థలు అనుమతి పొందివున్నాయి. బీహార్, గయా, సమిస్టిపూర్, బాగల్పూర్, మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్, సాగర్, ఉజ్జయినీ, మహారాష్ట్రలోని ఔరంగాబాద్, నాగ్‌పూర్, జల్గావ్, బీవాండి, ఝార్ఖండ్ రాష్ట్రంలో రాంచి, జంషెడ్పూర్ ప్రాంతాలలో నిర్వహణ సాధ్యంకాక ఒప్పందం నుండి వైదొలిగాయి. అంటే ప్రయివేటు సంస్థలు లాభాల కోసం తప్ప ప్రజా ప్రయోజనాలు వారికి ముఖ్యం కాదు. లాభాలు వచ్చే నగరాలకే పరిమితం అయ్యి గ్రామీణ ప్రాంతాలను పట్టించుకోరు అనేది కూడా ఆచరణలో చూస్తున్నాం. విద్యుత్ రంగంలో సంస్కరణల వల్ల అవినీతి, అప్పుల భారం పెరిగింది. ఉద్యోగుల ప్రాణాలకు భద్రత లేదు. నిత్యం ప్రమాదాలలో చనిపోతున్నారు. ఇటీవల శ్రీశైలం జలవిద్యుత్ ప్రాజెక్ట్‌లో జరిగిన ప్రమాదం వల్ల 9 మంది ప్రాణాలు కోల్పోయారు. విద్యుత్ రంగం ప్రయివేటీకరణ అయితే ఇవన్నీ నిత్యకృత్య మవుతాయి.
2000లో ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెరుగుదలకు వ్యతిరేకంగా సమరశీల పోరాటం తర్వాత ఛార్జీలు పెంచడానికి పాలకవర్గాలు సాహసించడం లేదు. అదే స్ఫూర్తితో ఆత్మనిర్భర్ భారత్ పేరిట తీసుకువస్తున్న విద్యుత్ సవరణ చట్టం 2021ని తీవ్రంగా ప్రతిఘటించాలి. అలాగే 4 లేబర్ కోడ్లు, 3 వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతాంగానికి, శ్రామిక వర్గానికి అండగా నిలబడాలి. ప్రభుత్వరంగ సంస్థలను కాపాడుకోవాలి. విద్యుత్ ఉద్యోగులు 2021 ఆగస్టు 10న చేపట్టిన సమ్మె లేదా వర్క్ బారుకాట్ పోరాటానికి అండగా నిలుద్దాం.
- భూపాల్
సెల్:9490098034