Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారత జాతీయోద్యమం నుండి మన దేశ కార్మికోద్యమాన్ని విడదీసి చూడలేం. అవి సమాంతరంగా సాగిన ఉద్యమాలు కావు. తల్లివేరు చుట్టూ అల్లుకున్న పిల్లవేర్లలో కార్మికోద్యమం కీలకమైంది. మనదేశంలో కార్మికుల ప్రవేశం ఒక చారిత్రక ఘటన. సామ్రాజ్య పెట్టుబడితో ప్రత్యక్షంగా తలపడేశక్తి ఆవిర్భావమే ఆ చారిత్రాత్మక సన్నివేశం. 1853లో మనదేశంలో రైల్వేలను తమ అవసరాల కోసమే ప్రవేశపెట్టింది బ్రిటీష్ ప్రబుత్వం. దానిపై మార్క్స్ ''ఇనుము, బొగ్గు నిల్వలు పుష్కలంగా ఉన్న భారతదేశంలో రైల్వేలను ప్రవేశపెడితే ఆ దేశ అభివృద్ధిని ఏశక్తీ ఆపజాలదు. రైల్వేలకు అవసరమైన పరిశ్రమలే గాక దాంతో సంబంధం లేని పరిశ్రమలు కూడా అభివృద్ధి అవుతాయి. ఆ విధంగా భారతదేశంలో ఆధునిక పరిశ్రమల అభివృద్ధికి రైల్వేలు మార్గం చూపుతాయి'' అన్నాడు. మార్క్స్ అంచనా ఎంత సరైందో తదనంతర పరిణామాలు రుజువు చేశాయి. అప్పటికే అంకురించిన బొగ్గుగనులు, టీ తోటలు, జ్యూట్ పరిశ్రమలు తూర్పు, ఈశాన్య ప్రాంతమంతా విస్తరించాయి. అప్పటిదాకా ఇంగ్లీషు వారికి కమిషన్ ఏజెంట్లుగా పనిచేసినవారు, ఏ ప్రాంతంలో ఎటువంటి బట్టలు వినియోగిస్తారో, ఎటువంటి పత్తి పండుతుందో తెల్సినవారు (వీరినే జగత్ సేట్లు అంటారు) బాగా పత్తి ఉత్పత్తి జరిగే బొంబాయి, ప్రెసిడెన్సీ నుండి బట్టల పరిశ్రమలోకి ప్రవేశించారు. ఆ విధంగా భారతీయ పెట్టుబడి బొంబాయి చుట్టూ కేంద్రీకరించబడింది. కలకత్తా కేంద్రంగా బ్రిటీషు పెట్టుబడి కేంద్రీకరించింది. క్రమంగా కార్మికుల సంఖ్య పెరిగింది. సంఖ్య పెరిగిన తర్వాత కార్మికులు ఆగుతారా? నికృష్టవేతనాల సమస్యమీద, వేతనాల్లో కోతల మీద, దారుణ పని పరిస్థితుల మీద కలిసికట్టుగా పోరాడేవారు. 1891లో మొదటి ఫ్యాక్టరీ కమిషన్ సిఫార్సేమంటే.. ''9-14ఏండ్ల పిల్లలకు 9గంటలే పనిదినం ఉండాలని, మహిళా కార్మికులతో 11 గంటలకు మించి పనిచేయించరాదని, వారానికి ఒకరోజు వీక్లీ ఆఫ్ ఉండాలని, అరగంట లంచ్‌బ్రేక్ ఉండాలని'' చెప్పింది. పురుషుల పని గంటల గురించి ఏమీ మాట్లాడలేదు ఆ ఫ్యాక్టరీ కమిషన్. పరిస్థితులు ఎంత దారుణంగా ఉండేవో ఇంతకంటే ఏమికావాలి? ఈ స్థితిపై మెల్లిగా పోరాటాలారంభించారు నాటి కార్మికులు.
భారతావని పోరుగడ్డే!
''బ్రిటిష్ పాలనకు భారతీయుల ప్రతిఘటన బ్రిటిష్ పాలనంత పాతదే'' (ఇఎంఎస్). వేలు తంపి దలావ, పజస్సీ రాజా కేరళలో తిరగబడినట్టుగానే చిన్నవి పెద్దవి అనేక తిరుగుబాట్లు జరుగుతూనే ఉన్నాయి. అప్పటికి వందేండ్లుగా ప్రజల్లో రగులుకుంటున్న అసంతృప్తి 1857లో జరిగిన ''ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం''గా మార్క్స్ పిలిచిన ''సిపాయిల తిరుగుబాటు''లో కనపడుతుంది. ప్రధానంగా ఇది ఉత్తర భారతదేశంలో రెండేండ్లపాటు జరిగింది. మధురై విశ్వవిద్యాలయ పరిశోధక విద్యార్థి రాజయ్యన్ అధ్యయనంలో మద్రాస్ ఆర్కీవ్స్‌లో శోధించి 1800-1801 మధ్య యావత్ దక్షిణ భారతదేశమే గాక మహారాష్ట్ర ప్రాంతంలో కూడ కలిపి జరిగిన తిరుగుబాట్లను ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామంగా పేర్కొన్నాడు. 18వ శతాబ్దం మధ్యలో టిప్పుసుల్తాన్, 1770-1820 మధ్య జరిగిన సన్యాసి-ఫకీర్ తిరుగుబాట్లు, 1855లో సంతాల్ తెగ తిరుగుబాట్లు, 1875-1900 మధ్య బిర్సా ముండా నాయకత్వంలో జరిగిన తిరుగుబాట్లు, 1859-60లో బెంగాల్లో నీలిమందు రైతుల తిరుగుబాట్లు వంటి వెన్నో జరిగాయి. 18, 19వ శతాబ్దంలో జరిగిన వీటన్నింటినీ రక్తపుటేరుల్లో ముంచి అణిచివేసింది బ్రిటిష్ ప్రభుత్వం. 20వ శతాబ్ది ప్రారంభంలోనే అల్లూరి సీతారామరాజు, కొమరం భీంల నాయకత్వంలో జరిగిన కోయ, గొండు ప్రజల తిరుగుబాట్లనూ అణిచివేసిన తీరు తెలుగు వారందరికీ తెల్సిన విషయమే. భారతావని తిరుగుబాట్లకు పురిటిగడ్డ. అందుకే అది పోరుగడ్డ.
భారతదేశ ప్రత్యేకతలతో కార్మికవర్గ ఆవిర్భావం
కార్మికవర్గం మిగిలిన అన్ని వర్గాల్లాంటిది కాదు. అది సంఘటితమైనదే కాక ఆధునికమైనది. ఈ సాంప్రదాయక అవగాహనకు భిన్నంగా భారతదేశంలో కార్మికవర్గం ఆవిర్భవించింది. ఒక శతాబ్దకాలం మన దేశం బ్రిటన్ పరిశ్రమలకు ముడిసరుకు సరఫరా దారుగా ఉండింది. ఆ తర్వాత బ్రిటిష్ సరుకులకు మార్కెట్‌గా మారి సాంప్రదాయక చేతివృత్తులు నాశనమైపోయాయి. అగ్గిపెట్టేలో 20 గజాల చీర పెట్టగలిగిన శక్తి ఉన్న నేత కార్మికులు, ఢాకాలోని మజ్లిన్స్ తయారు చేసే కార్మికులు మొదలైనవారు వృత్తులు దెబ్బతిని మళ్ళీ వ్యవసాయంలోకి చేరారు. దాదాపు రెండు తరాల తర్వాత మళ్ళీ ఫ్యాక్టరీల్లోకి కార్మికులుగా వచ్చారు. వారితో పాటు కులం, కుల ఆచారాలు, మూఢ విశ్వాసాలు, మత నమ్మకాలు మోసుకునే కార్మికవర్గం రూపొందింది. ఆ తర్వాత పాలకులు పెంచి పోషించడంతో నేటికీ కార్మికోద్యమ నిర్మాణంలో, కార్మిద్యోమ ఐక్యత సాధించడంలో ఇదొక అడ్డంకిగానే ఉంది.
ముఖ్యంగా 1857 తిరుగుబాటు తదనంతర కాలంలో హిందువుల్ని, ముస్లింలను ఐక్యంగా ఉండనిస్తే ఈ భూమ్మీద తమకు నూకలు చెల్లిపోతాయని బ్రిటిష్ ప్రభుత్వం ప్రధాన గుణపాఠం తీసుకుంది. మతం ఆధారంగా బెంగాల్ విభజనకు 1905లో తెరతీశారు. దానికి ప్రతిగా రేగిన ఉద్యమం బెంగాల్‌కే పరిమితం కాలేదు. హిందువులు, ముస్లింలు సమైక్యంగా ఉద్యమించారు. తిలక్ స్వదేశీ ఉద్యమానికి పిలుపునిచ్చారు. అనేక మంది బెంగాలీ మేథావులు కార్మికుల్ని కూడ ఉద్యమంలోకి తెస్తేనే దానికి మిలిటెంట్ స్వభావం వస్తుందని భావించి కార్మికుల డిమాండ్లకు అండగా నిలిచారు. క్రమంగా కాంగ్రెస్ జాతీయ నాయకత్వం దాదాభారు నౌరోజి, సురేంద్రనాద్ బెనర్జీ వంటి వారి చేతుల్లో నుండి లాల్, బాల్, పాల్ (లాలాలజపతిరారు, బలగంగాధర తిలక్, బిపిన్ చంద్రపాల్)ల నాయకత్వంలోకి మారింది. బ్రిటిష్ ప్రభుత్వానికి మహజర్లు సమర్పిస్తూ, విజ్ఞప్తులు చేసే స్థానంలో ''స్వరాజ్యం నా జన్మహక్కు'' అనే నినాదం మార్మోగింది. తిలక్ ప్రారంభించిన స్వదేశీ ఉద్యమంలో కేవలం దేశీయ పెట్టుబడిదార్లే కాకుండా యావత్ భారత సమాజం స్పందించింది. బ్రిటన్ వస్తువుల్ని బహిష్కరించారు. బొంబాయి కార్మికవర్గానికి తిలక్ తిరుగులేని నాయకుడుగా ఆక్రమంలోనే రూపొందారు. అందుకే 1908లో తిలక్‌ని అరెస్టుచేసి రాజద్రోహంపై బొంబాయి హైకోర్టులో విచారణ జరిగినన్ని రోజులూ బొంబాయిలోని వివిధ పారిశ్రామిక వాడలు ఆందోళనలతో హౌరెత్తాయి. పోలీసు కాల్పుల్లో అనేక మంది కార్మికులు రక్తతర్పణ గావించి, ఆ రాజకీయ సమ్మెలో అమరులైనారు. బుడి బుడి నడకల కార్మికోద్యమం ఆనాటి స్వతంత్ర పోరాట యోధుల కోసం రక్తమోడిన చారిత్రక ఘటన అది. దాని కొనసాగింపుగానే (మొదటి ప్రపంచ యుద్ధానంతరం ఏర్పడ్డ) ఐ.ఎల్.ఓ.కి బొంబాయి కార్మికులు తమ ప్రతినిధిగా తిలక్ ఉండాలని నిర్ణయించింది. కాని దేశంలో కేంద్ర కార్మిక సంఘం లేని కారణాన సర్కారువారి పాటే నెగ్గింది. అసలు కారణాలకు ఈ కొసరు కారణంతోడై దేశవ్యాపిత కార్మిక సంఘం ఏఐటీయూసీ పుట్టుకకు దారితీసింది.
జాతీయోద్యమంలో అప్పటికే కాకలుతీరిన నేతలెందరో ఏఐటీయూసీకి సారథ్యం వహించారు. లాలా లజపతిరారు, చిత్తరంజన్‌దాస్‌లు అధ్యక్షులుగా పనిచేయగా నెహ్రూ, సుభాస్ చంద్రబోస్, వి.వి.గిరిలు వివిధ మహాసభల్లో అధ్యక్ష స్థానంలో ఉన్నారు. 1922లో గయలో జరిగిన కాంగ్రెస్ మహాసభలో సి.ఆర్.దాస్ అధ్యక్షోపన్యాసం చేస్తూ ''కార్మికుల్ని, రైతుల్ని మన వెనక సమీకరించడంలో మనం ఇప్పటికే బాగా ఆలస్యం చేశాం. మనం కనుక ఆ పని వెంటనే చేయకపోతే మనం ఆశించే పద్ధతుల్లో శాంతియుత స్వరాజ్యం వైపు కాకుండా వర్గపోరాట సిద్ధాంతంపై ఆధారపడ్డ యుద్ధాలు జరగవచ్చు'' అన్నారు. (భారత స్వాతంత్ర పోరాటం-పేజీ 366, ఇ.ఎం.ఎస్)
అదే విధంగా గాంధీజీ స్థాపించిన మజూర్ మహాజన్, ''వర్గపోరాటం'' పొడకూడ పడకుండా ధర్మకర్తృత్వ సిద్ధాంతంపై ఆధారపడిన సంఘం. ఈ సందర్భంగా ఒక విషయం గమనార్హం. 1917లో ఏర్పడ్డ తొలి కార్మికవర్గ రాజ్యం ప్రభావంగాని, 1920లో ఏర్పడ్డ ఏఐటీయూసీ వల్లగాని కార్మికులు ప్రభావితం కాకుండా, వర్గపోరాట పంథా పట్టకుండా నాటి కాంగ్రెస్ జాతీయ నాయకత్వం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుందోననేందుకు ఇవి నిదర్శనాలు.
''ఏమైనా వీరంతా జాతీయ వాదులు. సామ్రాజ్యవాద వ్యతిరేకులు. కార్మికోద్యమాన్ని సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటంతో అనుసంధానించే ప్రయత్నం చేశారు'' అని ఇఎంఎస్ రాశారు.
దేశం కోసమే
జీతభత్యాల కోసం, తన పని పరిస్థితుల మెరుగుదల కోసమే భారత కార్మికవర్గం పరిమితమై బతికినట్టు చరిత్రలో లేదు. సహాయ నిరాకరణోద్యమైనా, శాసనోల్లంఘనైనా, బాలగంగాధర తిలక్‌ను అరెస్టు చేసినప్పుడైనా, రాయల్ ఇండియన్ నెవీ తిరుగుబాటుకు మద్దతుగానైనా, సంఘటిత కార్మికోద్యమంగా రూపుదిద్దుకున్న తర్వాతైనా, మొట్టమొదటి కార్మికులుగా విడివిడిగానైనా జాతీయోద్యమంలో మమేకమై నడిచింది భారత కార్మికోద్యమం.
చేస్తున్న పనికి వచ్చే ప్రతిఫలం తమ జీవితాల్ని మెరుగుజేసుకునేందుకు సరిపోకపోతే జట్టు కట్టి, పనులు బంద్ పెట్టడం (దీన్నే నేడు 'సమ్మె' అంటున్నాం) సహజం. సుకోమల్సేన్ రాసిన 'భారత కార్మికోద్యమ చరిత్ర'లో 1823లో కలకత్తాలో పల్లకీలు మోసే వారి సమ్మె మొట్టమొదటి సమ్మె అన్నారు. ఆ తర్వాత నీటి రవాణా కార్మికులు 1853లో చేసిన సమ్మె ఉన్నాయి. (అప్పటికి ఈస్ట్ఇండియా కంపెనీకి కలకత్తానే రాజధాని) 1853లో బ్రిటిష్‌వాడు మనదేశంలో రైల్వేలు ప్రవేశపెడితే 1862లో, అంటే తొమ్మిదేండ్లలోపే 8 గంటల పని దినం కోసం సమ్మె చేయడం, అదీ చికాగో ఘటనకు 24 సంవత్సరాల ముందే జరగడం కీలక ఘటనే కదా! మేడే అండ్ 8 అవర్స్ వర్క్ ఇన్ ఇండియా నుండి 'స్వదేశీ' ఉద్యమంలో దేశం అట్టడుకుతున్న వేళ 1906లో బెంగాల్ రైల్వే కార్మికుల సమ్మె, దాని డిమాండ్లు కీలకం. జీతాల పెంపుతో పాటు 'నేటివ్' (స్థానికుడు) అనే మాట బదులు 'ఇండియన్' అనే మాట వాడాలనేది కూడ కీలక డిమాండు. నాటి జాతీయోద్యమం ఇటువంటి అంశాల్ని ప్రభావితం చేసింది. వాస్తవానికి 1929 తన లాహౌర్ సమావేశంలోనే కాంగ్రెస్ సంపూర్ణ స్వాతంత్రం డిమాండు చేసింది. కాని ప్రజల్లో వారిలో భాగంగా కార్మికుల్లో, చివరికి సైనికుల్లో సైతం ఆగ్రహౌజ్వాలలు పెల్లుబుకుతూనే ఉన్నాయి. పెసావర్ (నేడు పాకిస్థాన్‌లో ఉంది)లో ముస్లిం జనాభాపై కాల్పులు జరపమంటే నిరాకరించిన ఘార్వాలీ రెజిమెంట్ (బ్రాహ్మణ, రాజ్‌పుత్ కులాలవారు) ప్రజల్లో కలిసిపోయి, ఏప్రిల్ 25 మే 4 మధ్య బ్రిటిష్ అధికారులను తరిమేసి 'ప్రజారాజ్యం' ఏర్పాటు చేసుకున్నారు. చిట్టగాంగ్ (బంగ్లాదేశ్‌లో ఉంది)లో సూర్యసేన్ నాయకత్వంలో జరిగిన సాయుధ తిరుగుబాటు బెంగాల్ ప్రావిన్స్ మొత్తాన్ని కదిలించింది. గాంధీజీ అరెస్టు తర్వాత 1930లో షోలాపూర్ పట్టణంలో కార్మికులు, ఇతర కష్టజీవులు బ్రిటిష్ అధికారులను తరిమివేసి పట్టణం తమ చేతుల్లో ఉంచుకుని సాధారణ పౌరసేవలన్నీ చేశారు. విప్లవ ప్రభుత్వం స్థాపించుకున్నారు. చివరికి బ్రిటిష్ సైన్యం నెత్తుటి ఏర్లు పారించి దాన్ని అణిచివేసింది. వివిధ తరగతుల ప్రజలు చేసే పోరాటాలను సైన్యంతో అణిచివేస్తూ నెట్టుకొచ్చిన బ్రిటిష్ ప్రభుత్వ ఆటలు ఎంతకాలమో సాగవు కదా! దేశమంతా అల్లకల్లోలంగా ఉన్నదశలో ఆ జనంపై కాల్పులు చేస్తూ ఎంత కాలం సైన్యంలోని భారతీయులు ఉండగలరు? క్రమంగా సైన్యంలోనూ ఎప్పటినుంచో రాజుకుంటున్న అసంతృప్తి 1946లో రాయల్ ఇండియన్ నేవీలో బద్దలైంది. తమకు రక్షణగా రంగంలోకి దిగమని కాంగ్రెస్, ముస్లింలీగ్ రెంటికీ విజ్ఞప్తి చేశారు ఆ నావికులు. రెండు పార్టీలు నో అన్నాయి. తమకు మద్దతుగా హర్తళ్ నిర్వహించమన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున వల్లభారు పటేల్, సమ్మెలోని నావికులను అడ్రస్ చేస్తూ నాటి అధ్యక్షుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్‌లు మద్దతుకు తిరస్కరించారు. బొంబాయి కార్మికవర్గం స్పందించింది. 1946 ఫిబ్రవరి 21-23 మధ్య పోలీసు కాల్పుల్లో సుమారు 250మంది మరణించారు. కలకత్తా, మద్రాసు, కరాచీల్లో సంఘీభావంగా నావికులు రంగంలోకి దిగారు. కాంగ్రెస్, ముస్లింలీగ్ ఆ ఉద్యమం వెన్నుకాచుంటే పరిస్థితి మరోలా ఉండేది.
ముగింపు
కీలకాంశం ఏమంటే... దేశంలో ఆనాడు జరుగుతున్న రాజకీయ పరిణామాలకు ముఖ్యంగా దేశం కోసం, దేశ విముక్తికోసం జరిగే ఉద్యమం నుండి కార్మికవర్గం దూరంగా లేదు. దాంతో మమేకమై పోరాడింది. దేశ విముక్తితోనే తన విముక్తి కూడ ముడిపడి ఉందని మనసా, వాచా, కర్మణా నమ్మింది. నమ్మిందే చేసింది. జాతీయోద్యమ వ్యాకరణంలో కర్త మన దేశ కార్మికవర్గం, కర్మ దేశానికి స్వాతంత్రమైతే, క్రియ దాని కోసం వివిధ రూపాల్లో జరిగిన పోరాటం.
- ఆర్. సుధా భాస్కర్