Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మన దేశ స్వాతంత్రోద్యమ సమగ్ర చరిత్ర ఎందరికి తెలుసు? ప్రపంచంలోనే అతి పెద్ద ''ప్రజాస్వామ్య దేశం'' అని చెప్పుకుంటారు. వేల సంవత్సరాల నాగరిత, ప్రాచీన చరిత్ర గల ఈ దేశ ప్రజలకు, ప్రజాపోరాటాలకు గొప్ప స్థానముంది. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడ లాడించి తరిమికొట్టిన ఘన చరిత్ర మన ప్రజలది. మన జాతీయోద్యమ ప్రస్థానంలో స్త్రీల పాత్రను చర్చిద్దాం. స్వాతంత్య్ర సమరంలో స్త్రీలు అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించారు. చరిత్రను మలుపు తిప్పిన ఘటనలకు ఆద్యులయ్యారు.
బ్రిటిష్‌వాళ్ళు రాకముందు మన దేశం చిన్న చిన్న రాజ్యాలుగా, సంస్థానాలుగా ఉండేది. ఆ సంస్థానాల అధిపతులు, తమ సంస్థానాలు నిలబెట్టుకునేందుకు అనేక యుద్ధాలు, పోరాటాలు చేశారు. ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంగా చరిత్ర కెక్కిన 1857 సిపాయిల తిరుగుబాటు, రాణీ ఝాన్సీ లక్ష్మీబాయి చరిత్ర అందరికీ తెలుసు. మహారాణి వేలు నాచియార్ తమిళనాడులోని శివగంగ ఎస్టేట్ మహారాణి. బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీకి వ్యతిరేకంగా పోరాడి కంపెనీ సైన్యాలను ఓడించి తన రాజ్యాన్ని దక్కించుకున్నది. ఇది జరిగింది 1760-70 మధ్యకాలంలో. అదేకాలంలో కర్ణాటకలోని బెలగాం జిల్లా బెలవాడి మల్లమ్మ బ్రిటిష్ వారిపై కత్తి దూసింది. కర్నాటక రాష్ట్రానికే చెందిన కిట్టూరు రాణి చెన్నమ్మ 1824లో బ్రిటిష్ వారి నెదిరించి యుద్ధం చేసింది.
ఇప్పటికీ వివక్షకు గురవుతున్న ముస్లిం మహిళలు, వెలివేయ బడుతున్న దళిత స్త్రీలు, నాగరిక సమాజపు వెలుపలికి నెట్టివేయబడుతున్న గిరిజన స్త్రీలు వీరవనితలై పోరు సలిపారు. తూర్పు కనుమల్లో ప్రస్తుత జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో సంతాల్ భిల్లు జాతి ప్రజలు రాణి శిరోమణి నాయకత్వంలో పెద్ద తిరుగుబాటు చేశారు.
బేగం హజ్రత్ మహల్, ఆమెతోపాటు అనేకమంది స్త్రీల చరిత్ర ఉపేక్షించిందనే చెప్పాలి. ప్రస్తుత ఉత్తరప్రదేశ్‌లోని 'అవధ్' నవాబు వజీర్ అలీషా భార్య బేగం హజ్రత్ మహల్ 1856లో అవధ్్ ఎస్టేట్‌పై బడ్డ బ్రిటిష్ సైన్యాలకి లొంగకుండా బేగం హజ్రత్ మహల్ యుద్ధం చేసి రాజ్యాన్ని కాపాడుకుంటుంది. అయితే బ్రిటిష్ సైన్యాలు మరలా దాడి చేసి ఆ రాజ్యాన్ని హస్తగతం చేసుకుంటారు. అస్ఘరీ బేగంను 1858లో సజీవంగా పట్టుకొని కాల్చివేశారు. భగవతీ దేవి త్యాగి, హబీబా ఉరికంబాలనెక్కారు. యుక్తవయసులోనే అనేకమంది స్త్రీలు పోరాటంలో ప్రాణాలు కోల్పోయారు. అవధ్్ సంస్థానంలోనే ఉడాదేవి గొప్ప ధైర్య సాహసాలు ప్రదర్శించింది. రావిచెట్టు పైకెక్కి సైన్యానికి చిక్కకుండా 36 మంది బ్రిటిష్ సైనికులను హతమారుస్తుంది. ఉడాదేవి దళిత బిడ్డ.
ఇకపోతే ఝాన్సీ రాణి లక్ష్మీబారు చరిత్ర అందరికీ తెలిసిందే. ఆమె అసలు పేరు మణి కర్ణిక. అప్పటి బ్రాహ్మణ సంప్రదాయాల ప్రకారం ఎనిమిది సంవత్సరాల వయసుకే వివాహం చేశారు. ఒక బిడ్డ పుట్టి చనిపోయాడు. పిల్లలు లేకపోవడంతో ఒక పిల్లవాడిని దత్తత తీసుకుంటారు. వారసత్వాన్ని అంగీకరించని బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ ఝాన్సీని స్వాధీనపరచమని వత్తిడి చేస్తుంది. 'నేను ఝాన్సీని వదలను' అని యుద్ధం ప్రకటిస్తుంది. ఆధునిక భారత చరిత్రలో అసమాన ధైర్యసాహసా లకు లక్ష్మీబారు చిహ్నంగా నిలుస్తుంది.
లక్ష్మీబారుతోపాటు మరణించిన మరో గొప్ప వీరవనిత జల్కారీబారు. ఈమె దళిత మహిళ. చిన్న వయసులోనే కట్టెలకోసం తండ్రితోపాటు అడవికి వెళ్ళి పులి బారిన పడి తిరగబడి పులిని చంపిన ధైర్యశాలి అని చెపుతారు. యుద్ధ విద్యలు నేర్చుకుంటుంది. భర్త ఝాన్సీ రాజ్యంలో సైనికుడు. ఆమె రూపురేఖలు లక్ష్మీబారుని పోలివుంటాయట. లక్ష్మీబారుని కోటలోనుంచి తప్పించే నిమిత్తం బ్రిటిష్ వారిని పక్కదారి పట్టించేందుకు ఈమె కోట దాటి బయటకు వస్తుంది. యుద్ధంలో మరణిస్తుంది.
బెంగాల్ ప్రొవిన్స్‌ను ఒక కుదుపు కుదిపిన సంఘటనలు చిట్టగాంగ్ విప్లవకారుల కార్యక్రమాలు. మాస్టర్ సూర్యసేన్ నాయకత్వంలో తూర్పు బెంగాల్‌లోని (ప్రస్తుతం బంగ్లాదేశ్) చిట్టగాంగ్‌ను కేంద్రంగా తీసుకొని బ్రిటిష్వాళ్ళను దేశంనుండి తరిమికొట్టాలన్న లక్ష్యంతో పని చేశారు. బ్రిటిష్ అధికారులపై టెర్రరిస్టు దాడులు చేసేవారు. వారిలో ప్రీతిలత ఒడేదార్, కల్పనాదత్తు ప్రముఖులు. ప్రీతిలత ఢాకా యూనివర్సిటీలో ఫిలాసఫి చదివింది. బ్రిటిష్ అధికారులు ఉండే పహర్తల యూరోపియన్ క్లబ్బుపై దాడిచేశారు. క్లబ్ బయట కుక్కలకు, భారతీయులకు ప్రవేశం లేదు అని రాసిపెట్టిన బోర్డులు వారిలో ఆవేశాన్ని రగిలించాయి. ఈ దాడిలో కొంతమంది యూరోపియన్లు గాయపడ్డారు. ప్రీతిలత కూడా గాయపడ్డది. బ్రిటిష్ కుక్కలకు పట్టుపడరాదని నిర్ణయించుకొని సైనైడ్ మింగి చనిపోయింది. అదే దాడిలో కల్పనాదత్తు కూడా పాల్గొన్నది. ఆమెను అరెస్టు చేసి జైలులో పెట్టారు. చిట్టగాంగ్ విప్లవకారుల దళంలో మహిళలను చేర్చుకోరాదని మొదట నిర్ణయించుకున్నారు. కాని ఈ ఇరువురు విప్లవకారిణిల పట్టుదల ఆ నిర్ఱయాన్ని మార్చుకునేలా చేసింది, చరిత్రను సృష్టించింది.
సుభాష్ చంద్రబోస్ ఇచ్చిన ఉత్తేజంతో విప్లవ కార్యక్రమాల్లో పాల్గొన్న మరో యువతి దీనాదాస్. 1932లో ఆమె కలకత్తా విశ్వవిద్యాలయంలో చదివారు. అప్పటి బెంగాల్ గవర్నర్ స్టాన్లీ జాక్సన్‌పై తూటాలు పేల్చారు. అయితే ఆయన బతికి బయటపడ్డారనుకోండి. ఆరోజు ఆమె కలకత్తా యూనివర్సిటీలో డిగ్రీ పుచ్చుకునే రోజు. గవర్నర్ నుండి డిగ్రీ తీసుకోవలసిన రోజునే గవర్నర్‌పై తుపాకి ఎక్కుపెట్టిన విప్లవకారిణి దీనాదాస్. ప్రీతిలత, దీనాదాస్ లిద్దరికీ వారి మరణానంతరం 2012లో కలకత్తా యూనివర్సిటీ డిగ్రీలు ప్రదానం చేసింది.
స్వాతంత్రోద్యమాన్ని మలుపు తిప్పిన ఘటనల్లో కార్మిక రైతాంగ పోరాటాలు, అన్నిటినీ మించిన రాయల్ ఇండియన్ నేవీ పోరాటం ప్రముఖమైనది. జమీందారీ విధానాలకు, నైజాం వంటి సంస్థానాల పాలనకు వ్యతిరేకంగా రైతాంగం లక్షల సంఖ్యలో పాల్గొన్నారు. స్త్రీలు, పురుషులు, పిల్లలు అశేష త్యాగాలు చేశారు. ఈ పోరాటాలలో పాల్గొన్న స్త్రీలు పోరాట స్వభావాన్నే మార్చివేశారు. కారల్ మార్క్స్ సామాజిక విప్లవాలలో స్త్రీల భాగస్వామ్యం గురించి చెప్పిన మాటలు కార్మిక రైతాంగ పోరాటాలకు, ఇంకా చెప్పాలంటే మొత్తం స్వాతంత్య్ర ఉద్యమంలో స్త్రీల పాత్రకు సరిగ్గా సరిపోతుంది. జమీందారి వ్యతిరేక పోరాటాల్లో గుండె నిచ్చిన గున్నమ్మ, బావిరెడ్డి వియ్యమ్మ, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి ఆద్యురాలైన వీరనారి ఐలమ్మలు రైతాంగ పోరాటాల చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తారు. ఆంధ్రప్రాంతంలో జమీందారి వ్యవస్థను బ్రిటిష్ ప్రభుత్వమే స్థిరపర్చింది. రైతాంగం నుండి విపరీతంగా శిస్తులు వసూలు చేసేవారు. శిస్తు కట్టలేని రైతుల భూములు ఆక్రమించేవారు. కొన్ని సందర్భాలలో చిత్రహింసలు కూడా పెట్టేవారు. అడవుల్లో కట్టెలు కొట్టుకోవడానికి, పశువులను మేపుకోవడానికి హక్కులేదు. నదీప్రాంతాల్లో రెల్లుగడ్డి కోసుకోనిచ్చేవారు కాదు. సహజంగానే రైతాంగం తిరగబడింది. శ్రీకాకుళం జిల్లా మందసా ప్రాంతంలో అడవిలో కట్టెలు కొట్టుకోబోతే బ్రిటిష్ పోలీసులు అడ్డుకున్నారు. తుపాకులతో బెదిరించారు. ఆ పోరాటంలో నిండు గర్భవతిగానున్న సాసునూరు గున్నమ్మ పొట్టలోనుంచి తుపాకి గుండ్లు దూసుకుపోయాయి. మానికొండ సూర్యావతి, చండ్ర సావిత్రీదేవి, మోటూరు ఉదయం వంటి నేతలు మహిళా ఉద్యమాన్ని నిర్మించడంతోపాటు రైతాంగ ఉద్యమాల్లోనూ పాల్గొన్నారు.
తెలుగు రాష్ట్రాలలో బహుశా వీరగున్నమ్మ ప్రాణత్యాగమే రైతాంగ పోరాటాలకు స్ఫూర్తినిచ్చింది. ఇది జరిగింది 1940 ఏప్రిల్ 1. ఆ తరువాత చెప్పుకోదగ్గది చల్లపల్లి జమీందారి వ్యతిరేక పోరాటం. 1946 ఏప్రిల్ 10న గాజుల్లంక వద్ద కృష్ణానది ఒడ్డునున్న లంక గ్రామాల్లో జమీందారు ఆంక్షలను ధిక్కరించి బావిరెడ్డి వియ్యమ్మతోపాటు రైతులు రెల్లుగడ్డి కోశారు. వియ్యమ్మతోపాటు మరో ముగ్గురు రైతులను జమీందారు గూండాలు కాల్చి చంపారు. ఈ పోరాటంలో గుత్తికొండ సీతమ్మ వంటి స్త్రీమూర్తులు జైళ్ళకు వెళ్ళారు. అరెస్టులు, పోలీసు లాకప్పులు లెక్క చేయలేదు. స్త్రీలు కొరియర్లుగా కూడా పనిచేశారు.
రైతాంగ పోరాటాల్లో మణికిరీటం లాంటిది తెలంగాణ సాయుధ పోరాటం. విసునూరు దేశ్‌ముఖ్ రామచంద్రారెడ్డిపై తిరుగుబాటు బావుటా ఎగరేసింది ఐలమ్మ. ఐలమ్మ కుటుంబం కులవృత్తి చేసుకుంటూనే కొంత భూమిని కౌలుకు తీసుకొని సాగు చేసుకునేవారు. భూమిని గుంజుకోవడానికి దేశ్‌ముఖ్ గూండాలు ప్రయత్నించారు. 1945నుండి ఈ రగడ సాగుతూనే ఉంది. ఐలమ్మ భర్త, కొడుకులను కూడా జైలులో పెట్టారు. అయినా పట్టువదలని ఐలమ్మ ఆంధ్రమహాసభ నాయకులైన బి.ఎన్.రెడ్డి తదితరుల సహాయంతో భూమిని దక్కించుకుంది. ఐలమ్మ పోరాటం మరెందరికో స్ఫూర్తి నిచ్చింది. 1946 జూలై 4న దొడ్డి కొమరయ్య హత్యతో తెలంగాణ మొత్తం అగ్గి రాజుకుంది. ఆరేండ్లపాటు సాగిన పోరాటంలో జమీందారులు, జాగీర్దారులు, దేశ్‌ముఖ్‌లు ఊళ్ళను వదిలి పారిపోయారు. నైజాం రాచరికం పోయి ప్రజా ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. లక్షల ఎకరాల భూమిపై రైతాంగానికి హక్కులు వచ్చాయి. మూడువేల గ్రామాల్లో గ్రామ స్వరాజ్యాలు ఏర్పడ్డాయి. ఈ పోరాటంలో మహిళల ధైర్యసాహసాలు, త్యాగాలు సామాన్యమైనవి కాదు. మహిళలు గెరిల్లా దళాల్లో నాయకులుగా, సభ్యులుగా ఉన్నారు. ఆయుధ శిక్షణ తీసుకున్నారు. తుపాకి భుజాన వేసుకుని వందల గ్రామాల్లో ప్రజలను చైతన్యపరచి పోరాటాల్లోకి కదిలించారు. పుచ్చలపల్లి సుందరయ్య రాసిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం - గుణపాఠాలు అనే గ్రంథంలో స్త్రీల పాత్రను ప్రత్యేకించి చెప్పారు. వారిలో మల్లు స్వరాజ్యం, మంత్రాల రాములమ్మ, సత్యవతి, సుగుణ, పద్మ, వంటి నేతలెందరో ఉన్నారు. మల్లు స్వరాజ్యం 12 సంవత్సరాల వయసులో స్వగ్రామంలో బతుకమ్మ పాటలతో కూలీలను ఉత్సాహపరచి వ్యవసాయ కార్మిక సమ్మె నడిపారు. అది మొదలు ఆసాంతం పోరాటంలో ఉన్నారు. ఈనాటికీ ప్రజా ఉద్యమాల్లో కొనసాగుతున్నారు. రాజక్క పేరుతో ప్రత్యేకించి కోయ ప్రజల్లో పనిచేశారు.
పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్న స్త్రీలే కాకుండా పరోక్షంగా అజ్ఞాతంగా ఉండి, అండగా నిలబడ్డ తల్లులు, సోదరీమణులు మరెందరో ఉన్నారు. దేశం నేడు స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఆ త్యాగఫలాలను కాపాడటం మనందరి విధి. చరిత్ర కర్ధం అంత:పుర కాంతలు, మహారాజుల ప్రేమ పురాణాలు కాదు దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా ప్రజలు సాగించే పోరాటాలే అసలు సిసలు చరిత్ర. ప్రజలే చరిత్ర నిర్మాతలు. ఆ చరిత్రలో అలిఖితంగా, అజ్ఞాతంగా ఉన్న ఎందరో స్త్రీ మూర్తులు, వీరవనితల జీవితాలే మన బంగారు జీవితాలకు పునాదులవుతాయి.
- ఎస్. పుణ్యవతి