Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారత పారిశ్రామికరంగ చరిత్రలో ఇంతకన్నా చౌక బేరం ఎవరికన్నా దక్కి ఉంటుందా అన్నది నిర్ధారించుకోవటానికి రెండు వందల ఏండకల చరిత్రను మదించాలేమో. గతవారం జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ ఇచ్చిన మౌఖిక తీర్పు సారాంశం ఇది. భారతదేశంలో తొలిసారి కలర్ టీవీ తయారు చేసిన కంపెనీ వీడియోకాన్. కంపెనీ అధినేత వేణుగోపాల్ ధూత్. ఆయన వారసుడు రాజీవ్ చంద్రశేఖర్. ఆధునిక పెట్టుబడిదారీ విధానం లక్షణాలకనుగుణంగా ఈ కుటుంబం నుండి ఇద్దరు ప్రముఖులు రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. 2015 నాటి ఫోర్బ్స్ పత్రిక అధ్యయనం ప్రకారం వేణుగోపాల్ ధూత్ కుటుంబం భారతదేశంలోని ప్రధమ 100 సంపన్నుల్లో 81వ స్థానంలో నిలిచాడు. నాటికి ఐసిఐసిసి బ్యాంకులో కీలక పాత్ర పోషిస్తున్న చందనా కొచ్చార్ ఆమె భర్తలతో కలిసి మనీ లాండరింగ్ ఆరోపణల్లో 2018 నుంచి 2021 మార్చిలో బెయిల్ వచ్చే వరకూ జైల్లో ఉన్నాడు. ఇది చరిత్ర. ఇక వర్తమానానికి వద్దాం.
పెరిగిపోతున్న పారిశ్రామిక సంస్థల పారుబకాయిలు, బ్యాంకు రుణాల ఎగవేతలతో భారత బ్యాంకింగ్ వ్యవస్థ పెనుసవాలు ఎదుర్కొంటోందని మాజీ రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురాంరాజన్ 2015లో ప్రధానమంత్రి కార్యాలయానికి ఓ పత్రం సమర్పించాడు. అందులో ఏయే కంపెనీల యజమానులు ఏ విధంగా ఎంతెంత మొత్తాల్లో బ్యాంకులను మోసంచేసి సభ్య సమాజంలో గౌరవసత్కారాలందుకుంటున్నారో వివరంగా ప్రస్తావించాడు. ఆ సమయంలోనే ప్రకృతి సహకరించక సేద్యం కలిసిరాక కోట్లమంది రైతులు తమకు బ్యాంకులు ఇచ్చిన పంటరుణాలు మాఫీ చేయాలని ఉద్యమాలు ప్రారంభించారు. దీంతో మొత్తం ఆర్థిక వ్యవస్థకు పునాదులుగా ఉన్న ఆర్థికశాఖ, ఇండియన్ బ్యాంకర్ల సంఘం, వివిధ విశ్వవిద్యాలయాల్లో మేధావులుగా చలామణి అవుతున్న ఆర్థిక సంస్కరణల సమర్ధకులు కొండెక్కి కేకలేయటం మొదలు పెట్టారు. ఈ మొత్తం వ్యవహారం మీద అపరనీతిమంతుడుగా భక్తజనంచే కీర్తించబడుతున్న ప్రధాని మోడీ ఏ పరిష్కారం చూపనున్నారా అని దేశమంతా ఒళ్లంతా కళ్లు చేసుకుని చూసింది. ఓ రోజు సాయంత్రం దేశంలో జరుగుతున్న ఆర్థిక అరాచకాలకు బ్యాంకుల బయట దాచుకున్న నల్లధనమే కారణమని ఓ గంటసేపు డివి సుబ్బారావు సత్యహరిశ్చంద్ర నాటకంలో ఏకబిగిన పద్యాలు వల్లించినట్లు టీవీ ద్వారా దేశానుద్దేశించి మాట్లాడి అందరి జేబుల్లో ఉన్న సొమ్మంతా బ్యాంకుల్లో జమ చేయాలని నోట్ల రద్దు కార్యక్రమానికి నడుం కట్టారు ప్రధాని. ఆ నిర్ణయాన్ని సమర్థిస్తూ నాటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇచ్చిన ఇంటర్వూలు ఇంకా ఇంటర్నెట్లో అందుబాటులోనే ఉన్నాయి. ప్రధాని తీసుకున్న నిర్ణయం రిజర్వుబ్యాంకు కూడా తెలీదని, స్వయంగా ఆర్థిక మంత్రిగా ఉన్న తనకే తెలీదని అంత సీక్రెట్ ఏజెంట్ జేమ్స్‌బాండ్ తరహాలో ప్రధాని పని చేశారని చప్పట్టు కొట్టాడు. నాటి నుంచి ప్రధాని దేశాన్ని ఉద్దేశించి మాట్లాడబోతున్నాడంటే జనం గుండె చిక్కబట్టుకుని కూర్చోవటం అలవాటు చేసుకున్నారు.
నోట్ల రద్దుతోపాటే దివాళా చట్టాన్ని కూడా రూపొందించి ఆగమేఘాల మీద అమలుకు ఆదేశాలిచ్చారు. ఈ చట్టం సారాంశం లక్ష్యం ఏమిటి? దేశవ్యాప్తంగా పలు పారిశ్రామిక సంస్థలు దాదాపు పాతిక లక్షల కోట్ల వరకు బ్యాంకు రుణాలు తీసుకుని ఎగ్గొట్టారు. అదేమంటే దివాళా తీశామని పరిస్థితులు కలిసిరాక వాయిదాలు కట్టలేకపోతున్నామని ఏవేవో కబుర్లుచెపుతున్నారు కాబట్టి బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన కంపెనీల నుండి సొమ్ములు వసూలు చేయటం ఈ చట్టం లక్ష్యమని ప్రకటించారు. పోనీలే అని దేశం ఎదురుచూస్తోంది. ఇప్పటికి ఐదేండ్లు దాటిపోయింది. ఎన్ని కంపెనీల నుండి ఎంత పారుబకాయిలు వసూలు చేసారో దేశం తెలుసుకుందామని దేశం, కనీసం ఆ మొత్తం ఎంతో తెలిస్తే మరోసారి సోషల్ మీడియాలో మోడీ భజన చేయవచ్చని చిడతలు, తాళాలు, తంబురాలు పట్టుకుని భక్త జనం ఎదురు చూస్తున్నారు. ఏ రాష్ట్రంలో ఎంత శాతం వ్యాక్సిన్ వృధా అవుతుందో మిల్లీ గ్రాముల్లో సహా లెక్కలు తీయగలిగిన ప్రభుత్వానికి ఎన్ని కంపెనీలు దివాళా చట్టం ద్వారా ఎంత బకాయి కట్టడానికి దరఖాస్తులు చేసుకున్నాయో మాత్రం తెలీడం లేదట. ఇప్పుడు మనం చర్చించుకుంటున్న వేణుగోపాల్ ధూత్ దేశంలోని ఏ బ్యాంకునూ వదలకుండా అన్ని బ్యాంకుల నుండి 46వేల కోట్ల రూపాయల అప్పు తీసుకున్నారు. పదమూడు కంపెనీలు పెట్టారు. ఆశ్చర్యం ఏమిటంటే ఈ కంపెనీల్లో డైరెక్టర్లుగా ఉన్న వారికి చాలామందికి కంపెనీ తమదేనని తెలీదట. అందులో వేణుగోపాల్ ధూత్ ఇంట్లో వంటపని, తోటపని చేసేవాళ్లూ ఉన్నారు. డ్రైవర్లు, వాచ్మన్లూ ఉన్నారని తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణలో తేలిందట. సుమారు 30వేలమందికి ప్రత్యక్షంగా ఈ పరిశ్రమల్లో ఉద్యోగాలిచ్చాడు. దేశవ్యాప్తంగా 15వేల షోరూంలు నడుపు తున్నారు. ఇవన్నీ మనం చెపుతున్న లెక్కలు కాదు. దేశంలోని బ్యాంకులన్నీ దివాళా చట్టం అమలు చేయటంలో భాగంగా ఓ కమిటీగా ఏర్పడి వీడియోకాన్ గ్రూపు కంపెనీలకు ఎవరెంత రుణమిచ్చారో పట్టికలు పట్టుకొచ్చారు. తీరా బ్యాంకర్లందరూ ఒక చోట సమావేశమైతే గానీ వేణుగోపాలుడు దేశానికి 46వేల కోట్లకు సున్నం పూశాడన్నవిషయం తెలీలేదు. ఎట్టకేలకు బ్యాంకర్లందరూ కూడబలుక్కుని ఓ మధవర్తిని పెట్టుకుని మూడు సంవత్సరాలు చర్చలు జరిపారు. 46వేల కోట్ల రూపాయల్లో ఎంత చెల్లించగలరు, ఎంతకాలంలోగా చెల్లించగలరు అన్నది తేల్చటానికి. ఎంత కట్టగలరో తెలియాలంటే ఈ యాభైఏండ్లలో దేశ విదేశాల్లో సంపాదించిన స్థిర చరాస్తుల వివరాలు కూడా ఈ మధ్యవర్తుల ద్వారా సేకరించారట. దఫ దఫాలుగా ముసాయిదా ఒప్పందాలు సిద్ధం చేసుకుని చర్చించిన తర్వాత చివరకు డిశంబరు 2020లో తాను మొత్తం పదేండ్ల వ్యవధిలో 31,289 కోట్ల రూపాయలు చెల్లించగలనని వేణుగోపాల్ ధూత్ రాతపూర్వకంగా బ్యాంకర్లకు తెలియచేశాడు. ఈ విషయంపై బ్యాంకర్లు జుట్లు ముడేసుకుని తేల్చుకునేలోగా కేంద్ర ప్రభుత్వం నుండి ఓ ఆదేశం వచ్చింది. ఈ అప్పు సంగతి తేల్చటం మీ వల్ల కాదు కాబట్టి జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు అప్పగిస్తే వాళ్లే తేలుస్తారన్నది సదరు ఆదేశం సారాంశం. సరేనని అందరూ గత ఆర్నెల్లుగా ఎవరి లాయర్లను వాళ్ల ఖర్చుతో పెట్టుకుని (బ్యాంకులకు ఇదో అదనపు ఖర్చు) ట్రిబ్యునల్ చుట్టూ తిరిగారు. వేణుగోపాల్ ధూత్ చెల్లిస్తానన్న మొత్తానికి సంబంధించి చెల్లింపు కాల వ్యవధి కుదించాలనీ, తదనుగుణంగా ఏ సంవత్సరం ఎంత చెల్లిస్తారో చెప్పాలన్నది బ్యాంకర్లు వాదన. కానీ కేంద్రం జోక్యం జరిగింది కనుక అందరూ నోరుమూసుకుని కూర్చున్నారు. మొత్తం వీడియోకాన్ గ్రూప్ కంపెనీ ఆస్తులు అప్పులు వాల్చుకుని ఉన్నఫళంగా బ్యాంకులకు ఎంత జమ చేయగలరు అన్న అంశం ఎజెండాలోకి వచ్చింది. అటుదిరిగి ఇటు దిరిగి వ్యవహారం వేదాంత కంపెనీ యజమాని అగర్వాల్ దగ్గరకు చేరింది. వీడియో కాన్ సంస్థను తాను స్వాధీనం చేసుకోవటానికి సిద్ధమేనని ఓ అఫిడవిట్ దాఖలు చేశాడు. వాదోపవాదాలు, ఆస్తుల పత్రాలు, వాటి విలువలు పరిశీలించిన మీదట కోర్టువారు తీర్పిచ్చారు. వేదాంత గ్రూపులో భాగంగా ఉన్న ట్విన్ స్టార్ టెక్నాలజీస్ అనే కంపెనీకి వీడియోకాన్ ఆస్తులన్నీ అప్పగించాలని, దానికి బదులుగా ట్విన్ స్టార్ కంపెనీ 2,962 కోట్ల రూపాయలు చెల్లించాలన్నది ఈ తీర్పు సారాంశం. అది కూడా మొదటి మూడునెల్లల్లో 900 కోట్లు చెల్లించాలని, మిగిలింది వాయిదాల పద్ధతిలో చెల్లించే వెసులుబాటు ఉంటుందని సదరు ట్రిబ్యునల్ న్యాయమూర్తులు ఆదేశించారు. ఇంతకన్నా చౌకబేరం భారత ఆర్థిక చరిత్రలో లేదు. ప్రపంచ ఆర్థిక చరిత్రలో వెతికితే కనిపించవచచ్చు.
వీడియోకాన్ కంపెనీల గ్రూపే 31,289కోట్ల రూపాయలు చెల్లించటానికి సిద్ధంగా ఉన్నామని వాంగ్మూలం ఇచ్చిన తర్వాత ఈ మొత్తాన్ని కాదని 2,962 కోట్లు చెల్లిస్తే చాలునని తీర్మానించింది ఎవరు? బ్యాంకులా? కేంద్ర ఆర్థిక శాఖ? మరో అదృశ్య రాజ్యాంగేతర శక్తి ఎవరన్నా ఉన్నారా దీని వెనక ఈ విధంగా పద్దులు కొట్టేసుకుంటూ పోతే మొదట్లో చెప్పుకున్నట్లు బ్యాంకులకు ముట్టాల్సిన పాతిక లక్షల కోట్ల రూపాయల్లో పదిశాతం కూడా తిరిగి వచ్చే దాఖలాలు కనిపించటం లేదు. అలాకాకుండా మిగిలిన కంపెనీల నుండి దివాళా చట్టం ద్వారా నిఖార్సుగా వసూలు చేస్తున్నామని ప్రకటించే దమ్ము ప్రభుత్వానికి ఉంటే మరి కేవలం వీడియోకాన్ సంస్థకు మాత్రమే ఈ బంపర్ ఆఫర్ ఎందుకు ఇచ్చారో కూడా దేశాన్ని ఉద్దేశించి ప్రధాని మాట్లాడతారా? ఇదీ దివాళా చట్టం అసలు రూపం. వీడియోకాన్ సంస్థ గత నాలుగు దశాబ్దాల్లో 46 వేల కోట్ల బ్యాంకు రుణాలు తీసుకుంది. 40ఏండ్ల తర్వాత బ్యాంకులకు దివాళా చట్టం ద్వారా తిరిగి జమవుతున్న మొత్తం 2,962 కోట్లు. ఇక మీదట ఆయా బ్యాంకు ఖాతా పుస్తకాల్లో పారుబకాయిల పద్దు నుంచి ఈ 46వేల కోట్ల రూపాలు మాయమవుతాయి. దాంతో బ్యాంకుల వార్షిక నివేదికలు మరింతగా మెరుస్తూ మనముందుకొస్తాయి. ఈ 46 వేల కోట్ల రూపాయలు ఎవరివి? ఎక్కడి నుండి ఏయే మార్గాల్లో ఎక్కడికి చేరాయి అన్నవి ఇక్కడ ప్రశ్నలు.
కొసమెరుపు : వీడియోకాన్ సంస్థల భాగస్వామి రాజీవ్ చంద్రశేఖర్ ప్రస్తుతం రిపబ్లిక్ టీవీ యజమాని.
- కొండూరి వీరయ్య
సెల్:8971794037