Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారతదేశ చరిత్రలో స్వాతంత్య్రపోరాటం ఒక వీరగాథ. ఈ వీరగాథకు తాము మాత్రమే గుత్తాధిపతులమని కాంగ్రెసు చెప్పుకోజాలదు. కాంగ్రెసుతోనూ, దాని వ్యూహరచనతోనూ అసంతృప్తి చెందిన కమ్యునిస్టులు, రకరకాల సోషలిస్టులు కాంగ్రెసుతో సమానంగా కృతనిశ్చయంతో, బలిదానాలతో పోరాడారు. అయితే, ఆనాడు వెల్లివిరిసిన దేశభక్తికి ఒకే ఒక్క మినహాయింపు ఉన్నది. అది ఆర్ఎస్ఎస్. ఆర్ఎస్ఎస్ దేశ స్వాతంత్య్రం కోసం జరిగిన పోరాటంలో పాల్గొనలేదు.
ఆర్ఎస్ఎస్కు ద్వితీయ సర్ సంఫ్ుచాలక్గా ఉన్న ఎం.ఎస్ గోల్వాల్కర్ 'ది బంచ్ ఆఫ్ థాట్స్' అనే పుస్తకంలో స్వాతంత్య్ర పోరాటాన్ని ఒక 'ప్రాంతీయ జాతీయవాదం'గా కొట్టిపారేశాడు. స్వాతంత్య్రం కోసం చేస్తున్న ఈ పోరాటాలు ''సానుకూల, స్ఫూర్తిదాయకమైన సిసలైన హిందూ జాతీయతత్త్వాన్ని నిరాకరిస్తున్నాయి.'' ఈ పోరాటాల్లో కేవలం బ్రిటిష్ వ్యతిరేకత మాత్రమే ఉన్నది'' అన్నాడు. ఈ అవగాహనతోనే 1925లో స్థాపించబడిన ఆర్ఎస్ఎస్ దేశస్వాతంత్య్ర పోరాటానికి ఆమడదూరంలో ఉన్నది. దూరంగా ఉండటమే కాదు, స్వాతంత్య్ర పోరాటయోధుల వెన్నుపోటు పొడవటానికి సిద్ధపడింది. ఆర్ఎస్ఎస్ ప్రచురించిన కె.బి. హెగ్డేవార్ జీవితచరిత్రలో ఈ విషయం గురించి స్పష్టంగా పేర్కొనటం చూడవచ్చు. ''1930లో గాంధీ ఉప్పు సత్యాగ్రహం ప్రారంభించినప్పుడు, ఈ సత్యాగ్రహంలో సంఫ్‌ు పాల్గొనవద్దని అన్ని చోట్లకు కబురు పెట్టాడు.'' ఒక డాక్టర్‌కు, హెగ్డేవార్కి మధ్య జరిగిన సంభాషణను ఉటంకిస్తూ.. ఆ సత్యాగ్రహంలో పాల్గొనాలని కోరుకున్న డాక్టరును నిరుత్సాహపరిచినట్టు గోల్వాల్కర్ పేర్కొన్నాడు.
'క్విట్ ఇండియా' పోరాట సందర్భంలోనూ ఆర్ఎస్ఎస్ది ఇదే తీరు. బ్రిటిష్ ప్రభుత్వపు అధికారిక పత్రాలలో రాసుకున్న నోట్ ప్రకారం ''హౌం డిపార్టుమెంటు సెక్రటరీని ఆర్ఎస్ఎస్ నాయకులు కలుసుకుని, అధిక సంఖ్యలో 'పౌరరక్షకులు'గా చేరటానికి తమ సభ్యులను ప్రోత్సహిస్తామని సెక్రటరీకి హామీ ఇచ్చారు.'' దేశ ''అంతర్గత భద్రత'' కోసం ఒక ప్రత్యేక చర్యగా' బ్రిటిష్ ప్రభుత్వం ఈ పౌర రక్షకులను ఏర్పాటు చేసింది.'' ముఖ్యంగా 1942 ఆగస్టులో చెలరేగిన అల్లర్లలో భాగస్వాములు కాకుండా నిరోధించటానికి, 'చట్టానికి గట్టిగా లోబడి ఉండటంగా' ఈ సహాయాన్ని ప్రభుత్వం అంగీకరించింది.''
వి.డి. సావర్కర్ నాయకత్వంలో స్వాతంత్య పోరాటంలో పాల్గొన్నామని ఆర్ఎస్ఎస్ చెప్పుకునేది కూడా వొట్టి బూటకమే. తొలి రోజులలో తాను స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నదానికి పశ్చాత్తాపం వెలిబుచ్చటమే గాక, స్వాతంత్య్ర పోరాటంలో ఇక ముందెప్పుడూ పాల్గొననని బ్రిటిష్ వారికి హామీ ఇచ్చినట్టు స్పష్టమైన ఆధారాలున్నాయి. ఈ హామీని తదనంతరకాలంలో నిలబెట్టుకున్నాడు కూడా. బ్రిటిషువారికి రాసిన సుదీర్ఘమైన లేఖలో 'దయామయులైన బ్రిటీషు ప్రభుత్వమూ వారికి తాను దారి తప్పిన కొడుకు'నని చెప్పుకున్నాడు. ''చివరిగా ఒక మాట. 1911లో మీకు నేను అందచేసిన క్షమాభిక్ష ప్రసాదించమని కోరుకున్న అర్జీని దయతో పరిశీలించి, దాని ఆమోదం కొరకు భారత ప్రభుత్వం ముందుకు పంపినట్టయితే, మీకు మరోసారి విన్నవించదలచుకున్నది.(ఏమిటంటే) పరిపరి విధాల దయచూపి, కృపతోనన్ను విడుదల చేసినట్టయితే, చట్టానికి లోబడి నడుచుకోవటాన్ని గట్టిగా సమర్థించేవాడిగాను, ఇంగ్లీషు ప్రభుత్వం పట్ల విశ్వాసపాత్రుడుగాను ఉండటంలో నన్ను మించి మరొకరు ఉండబోరు. పైగా చట్టానికి లోబడి నేను మారటాన్ని చూసి, నన్ను తమ మార్గదర్శిగా ఎంచుకున్న భారతదేశంలోనూ, విదేశాలలోనూ ఉన్న దారితప్పిన యువకులు సరియైన త్రోవలోకి రాగలరు.'' ఇదీ ఆర్ఎస్ఎస్కీ, దానికి అసలుసిసలైన రూపంగా చెప్పుకుంటున్న 'వీర' సావర్కర్‌కి స్వాతంత్య్ర సమరం పట్ల ఉన్న వైఖరి.
స్వాతంత్రోద్యమంలో కమ్యూనిస్టుల ఘనమైన పాత్ర చూస్తే 1920లో కమ్యూనిస్టుపార్టీ ఆవిర్భవించిన తొలి రోజునుండి కమ్యూనిస్టుల పట్ల బ్రిటిషు వారి వైఖరి స్పష్టంగా ఉంది. ''భారతదేశంలో కమ్యూనిజం విస్తరణను ఏదో ఒక 'ప్రత్యేక కోణం' నుంచి చూసే సమస్య కాదు. దానిని ముఖాముఖి నేరుగా ఎదుర్కోవాలి. అత్యంత నిర్దయతో అణిచివేయాలి.'' కమ్యూనిస్టు పార్టీ ఏర్పడిన మొదటి దశాబ్దంలోనే దానికి వ్యతిరేకంగా మూడు కుట్రకేసులు బనాయించారు బ్రిటిషువాళ్ళు. అయినా కమ్యూనిస్టు పార్టీని, దాని ఆలోచనలను బ్రిటిషు వారు అణగద్రొక్క లేకపోయారు.
సామ్యవాదం, కమ్యునిజం భావాలతో ఉత్తేజితుడైన భగత్‌సింగ్, బ్రిటిషువారిని అధికారం నుంచి కూలద్రోయటం ఒక్కటే సరిపోదని, ''సమాజం యావత్తును సామ్యవాద సిద్ధాంత పునాదులపై మార్పు సాధించే పని మొదలుపెట్టటానికి రాజకీయ విప్లవం పునాది కావాలి'' అన్నాడు.
భగత్‌సింగ్ మతోన్మాద శక్తులను ఖండించి, వర్గ ఐక్యతను ఉద్భోధించాడు. ''ప్రజలు తమలో తాము ఘర్షణ పడకుండా ఉండాలంటే వర్గచైతన్యం కావాలి. తమ నిజమైన శత్రువు పెట్టుబడిదారీ విధానమని పేదలకు, కార్మికులకు, రైతులకు స్పష్టంగా తెలియాలి. ''ఏ కులమైనా, ఏ రంగైనా, ఏ మతమైనా పేదల సమస్యలు ఒకే రకమైనవి.'' మతోన్మాదం, మతఘర్షణలు పెరగటానికి మూలకారణం ఆర్థిక అంశాలే''నని భగత్‌సింగ్ స్పష్టంగా గుర్తించాడు.
ఆరోజులలో కమ్యూనిస్టు పార్టీ సరిగ్గా ఇదే చెప్పింది. శైశవ దశలో ఉన్న కమ్యూనిస్టు పార్టీ తన కార్యక్రమంలో చేపట్టవలసిన పోరాట కార్యాచరణ ముసాయిదాలో ఇలా పేర్కొన్నది.. ''విభిన్న జాతులు, మతాల విశ్వాసాలను ఒకదానికి పోటీగా మరొక దానిని నిలబెట్టి, ప్రజల మధ్య ఘర్షణను రెచ్చగొట్టాలని చూసే బ్రిటిషు ప్రభుత్వం యొక్క, స్వదేశీ దోపిడీ దారుల యొక్క జిత్తులమారి ఎత్తుగడల మోసంలో భారతదేశ కార్మికులు, రైతులు పడవద్దని భారత కమ్యూనిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ''అంటరాని వారితో సహా శ్రమజీవులందరూ ఐక్యంగా దేశీయ, బ్రిటిషు దోపిడీ దార్లపై పోరాడా''లని కమ్యూనిస్టుపార్టీ పిలుపునిచ్చింది. 'లింగ, మత, జాతి సంబంధంగా పౌరులందరికీ పూర్తి సమానత్వం ఉండాలని', 'రాజ్యం నుంచి మతం పూర్తిగా వేరు పడి ఉండాలని' ఈ కార్యాచరణ ముసాయిదా నొక్కి చెప్పింది. ఏఐటీయూసీ, ఎఐకెఎస్, ఎఐఎస్ఎఫ్, పీడబ్ల్యూఏ లాంటి వర్గ, ప్రజా సంఘాలను ఏర్పాటు చేయటంలోనూ, వాటిని పటిష్టపరచటంలోనూ, ఈ సంఘాల ద్వారా ప్రజలను సమీకరించటంలోనూ కమ్యూనిస్టుపార్టీ చురుకైన పాత్ర నిర్వహించింది.
వలసపాలనకు అంతం పలకాలంనే డిమాండ్‌తో పాటు, ప్రజాస్వామిక హక్కుల విస్తరణ, సంఘటితపడి ఆందోళనలుచేసే హక్కు అమలు చేయటంద్వారా నిజమైన ప్రజాస్వామ్యం కోసం కమ్యూనిస్టుపార్టీ డిమాండ్ చేసింది. 8గంటల పనిదినం, స్త్రీ పురుషులకు సమానహక్కులు, సమానవేతనం, ఉచితవిద్యకోసం, అస్పస్యత నిర్మూలన, పెత్తందారీ, జమీందారీ ప్రత్యేకహక్కుల రద్దు, దోపిడీల నిర్మూనలను కమ్యూనిస్టుపార్టీ డిమాండ్ చేసింది. ఈ డిమాండ్లను లేవనెత్తి, ప్రజలను సమీకరించటం ద్వారా ప్రజల అభీష్టాలకు నిర్దుష్ట రూపం ఇవ్వటంతో స్వాతంత్య్ర పోరాటంలో ప్రజలు భాగస్వాములు అయ్యారు.
వలస వ్యతిరేక పోరాటంలో కమ్యూనిస్టుల భాగస్వామ్యం ఆ పార్టీ మొదటి మహాసభలో పాల్గొన్న ప్రతినిధులకూర్పులో కనపడుతుంది. 70శాతం మంది ప్రతినిధులు ఒకసారి లేక అంతకుమించి జైలు జీవితాన్ని అనుభవించినవారు. వీరందరి జైలు జీవితం కూడితే అది 411 సంవత్సరాలు ఉంటుంది. జీవితంలో సగభాగం జైలు గోడల మధ్య గడిపారు. ప్రతినిధులలో 53శాతంకి అండర్ గ్రౌండ్ జీవితం అనుభవముంది. వీరందరి మొత్తం అజ్ఞాత జీవితం 54ఏండ్లు.
అయితే, హిందూ, ముస్లిం మతోన్మాదులిద్దరూ ప్రజల మతవిశ్వాసాల ఆధారంగా హిందూ రాజ్యం, ముస్లిం రాజ్యంగా వేరుపడాలని భావించారు. ఈ కారణం చేతనే సావర్కర్ గానీ, జిన్నాగానీ ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రచారం చేయటంలో ఒకరికి ఒకరు సమస్య కాలేదు. అంతేకాదు, ముస్లింలీగ్ ప్రభుత్వాలలో హిందూ మహాసభ నాయకులు భాగస్వాములుగా ఉండటానికి ఎటువంటి అభ్యతరమూ లేకపోయింది. ఈ రెండు మతోన్మాద శక్తులను కమ్యూనిస్టుపార్టీ నిర్ద్వంద్వంగా వ్యతిరేకించి, వలసపాలనకు వ్యతిరేకంగా జరిగేపోరాటంలో ప్రజలను కూడగట్టడానికి పని చేసింది. దేశంలో భిన్నజాతులు, మతసముదాయాలు, కులాలు ఉన్న విషయాన్ని కమ్యూనిస్టుపార్టీ గుర్తించి, అన్ని తరగతులప్రజల మధ్య సామరస్య సంబంధాల కోసం కృషి చేసింది.
భారతదేశం అనేక జాతులుగల దేశమని. ఈ జాతులన్నీ స్వేచ్చగా అభివృద్ధి చెందగల పరిస్థితులు ఏర్పరచ కలిగినప్పుడే దేశం సమైక్యంగా ఉండగలదని ప్రజలలో ప్రచారం నిర్వహించటం ద్వారా కమ్యూనిస్టుపార్టీ దేశరాజకీయాలకు ఎనలేని సేవ చేసింది. సామ్రాజ్యవాదం, భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా. ప్రజాస్వామ్యం కోసం జరిగే పోరాటాలలో భాగంగా భారతదేశంలోని జాతుల సమస్యను కమ్యూనిస్టులు పరిశీలించారు. శ్రామిక ప్రజల ప్రయోజనాలను సమర్థిస్తూ, నిజమైన ప్రజాస్వామ్య పతాకాన్ని చేతపట్టి కమ్యూనిస్టు పార్టీ ప్రజల వద్దకు వెళ్ళేది. ప్రజా ఉద్యమాల వెల్లువలో పూర్తిగా నిమగమై పనిచేసేది.
కార్మికుల, కర్షకుల పోరాటాలలో, హిందూ ముస్లింల మధ్య ఐక్యతా సాధనలో, అంటరానితనాన్ని నిర్మూలించి, శ్రమజీవుల మధ్య సౌహర్థతను సాధించటంలో కమ్యూనిస్టు పార్టీ పూర్తిగా నిమగమై ఉంటే, సామ్రాజ్యవాదంతో రాజీపడటంలోనూ, ప్రజా ఉద్యమాలను విచ్చిన్నం చేయటంలోనూ, మతమారణ హౌమాలు సృష్టించటంలోనూ, దేశాన్ని విభజించే మార్గంలోనూ మతోన్మాద శక్తులుండేవి. దేశవిభజనానంతరం పంజాబ్, బెంగాలులలో జరిగిన మత మారణ హౌమాల నుంచి ప్రజలను కాపాడటంలో కమ్యూనిస్టు పార్టీ సభ్యులు అసాధారణమైన ధీరత్వాన్ని చూపారు. అల్లర్లను తిప్పికొట్టే వీరోచిత ప్రదర్శనలకు నాయకత్వం వహించారు.
మతోన్మాద శక్తులు దేశ విభజనకు తీరికలేకుండా పనిచేస్తుంటే, కమ్యూనిస్టులు దేశ సమైక్యతకోసం నిలబడ్డారు. జాతీయ పతాకాన్ని, రాజ్యాంగాన్ని అవమాననించటంలోనూ, భారత న్యాయస్మృతిగా మనుస్మృతిని అమలు చేయాలని డిమాండ్ చేయటంలోనూ, మతశక్తులు చురుకుగా పనిచేస్తుంటే, భూస్వామ్య వ్యవస్థ నిర్మూలనకు, స్త్రీపురుషుల మధ్య సమానత్వ సాధనకు, కులవివక్షతల నిర్మూలనకు, మతం, మతవిశ్వాసాలు, తెగలు, జాతుల సంబంధం లేకుండా అందరి సమానత్వం కోసం కమ్యూనిస్టులు పనిచేశారు. మతోన్మాదులు హిట్లర్, ముసోలినీ వంటి నియంతలను స్తుతిస్తుండగా, ప్రజాస్వామ్య హక్కుల విస్తారం కోసం, కార్మికులు, రైతులు, ఇతర శ్రామిక ప్రజలకు మరిన్ని హక్కులను పొందుపరచటం ద్వారా భారతరాజ్యాంగాన్ని బలోపేతం చేయటానికి కమ్యూనిస్టులు కృషిచేశారు.
ఒక్కమాటలో చెప్పాలంటే, మనదేశ శ్రేయస్సు, సమైక్యతలకోసం ప్రాణాలర్పించి నిజమైన దేశభక్తులుగా కమ్యూనిస్టులు నిలబడగా, దేశాన్ని విడగొట్టిన దేశద్రోహులుగా, దేశాన్ని అధిక సంఖ్యాకుల, నిరంకుశాధికారాల, నియంతృత్వ దేశంగా మార్చాలని మతోన్మాద శక్తులు కోరుకున్నాయి. మనదేశం యొక్క నిజమైన ప్రగతి, కమ్యూనిస్టుల దృక్పధంలోను, వారు చూపే బాటలోను ఉన్నది. తిరోగమన మతోన్మాద, హిందూత్వ శక్తుల చేతిలో దేశానికి భవిష్యత్తు లేదు.
- ఆర్. అరుణ్ కుమార్